రెండు బెయిల్ పిటిషన్లపై సుప్రీంకోర్టు వేర్వేరు తీర్పులు..

ఈ కేసులో నిందితులు చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టంలోని కన్ని తీవ్రవాద సంబంధిత సెక్షన్లలో ఆరోపణలు ఎదురుకుంటున్నారు. ఈ సెక్షన్ల కేసుల్లో బెయిల్‌ను పొందడం చాలా అరుదు.

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఉమాంగ్ పోద్దార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దిల్లీ అల్లర్లకు సంబంధించిన కుట్ర కేసులో, సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం సోమవారం (జనవరి 5) నిందితులు ఉమర్ ఖలీద్, షర్జీల్ఇమామ్‌ బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది.

ఈ కేసులో సమర్పించిన సాక్ష్యాలను ప్రాథమికంగా పరిశీలించినప్పుడు, అల్లర్లలో ఈ ఇద్దరూ కీలక పాత్ర పోషించినట్లు కనిపిస్తోందని కోర్టు వ్యాఖ్యానించింది. వారు ఐదేళ్లుగా జైలులో ఉన్నారు, ఇంకా విచారణ ప్రారంభంకాలేదనే కారణాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని బెయిల్ మంజూరు చేయలేమని కోర్టు స్పష్టం చేసింది.

అయితే మరుసటి రోజు జనవరి 6న మరో కేసులో సుప్రీంకోర్టులోని మరో ద్విసభ్యధర్మాసనం ఆర్థిక నేరాలకు సంబంధించిన ఒక కేసులో నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ, దర్యాప్తు సంస్థ లేదా కోర్టు సకాలంలో విచారణను పూర్తి చేయలేకపోతే, ఆ పరిస్థితిలో నిందితుడి బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకించకూడదని పునరుద్ఘాటించింది.

దిల్లీ అల్లర్ల కేసులోనే సోమవారం నాడు మరో ఐదుగురు నిందితులకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ ఐదుగురి పాత్ర పరిమితమని కోర్టు పేర్కొంది.

బెయిల్ పిటిషన్‌పై నిర్ణయం తీసుకునేటప్పుడు విచారణలో జాప్యం ఒక్కటే ప్రమాణం కాదని, ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. నిందితులపై మోపిన ఆరోపణలు ఎంత తీవ్రంగా ఉన్నాయి, నేరంలో వారి పాత్ర ఏమిటి, అలాగే వారి మీద ఉన్న సాక్ష్యాలు ప్రాథమికంగా ఎంత బలంగా ఉన్నాయో కూడా కోర్టు పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంది.

మంగళవారం మనీలాండరింగ్ కేసులో సుప్రీంకోర్టు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి వ్యక్తికి తనపై నమోదైన కేసు త్వరగా విచారణ జరిపించుకునే హక్కు ఉందని స్పష్టం చేసింది. ఆర్టికల్ 21లో 'జీవించే హక్కు'ను ప్రాథమిక హక్కుగా గుర్తించారు.

ఈ నేపథ్యంలో ఈ రెండు కేసులు ఏమిటి? బెయిల్ పిటిషన్ల తీర్పుల్లో ఏం చెప్పారు

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

దిల్లీలో 2020 ఫిబ్రవరిలో చెలరేగిన మతఘర్షణలలో 54 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వారిలో చాలామంది ముస్లింలే.

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా 2019లో జరిగిన నిరసనలలో కొందరు దిల్లీలో హింస చెలరేగేలా ముందుగానే కుట్రపన్నారని దిల్లీ పోలీసులు చెబుతున్నారు. ఈ కేసును దిల్లీ అల్లర్ల కుట్ర కేసుగా పేర్కొంటున్నారు.

ఈ కేసులో మొత్తం 20 మంది నిందితులు ఉండగా, వారిలో 18 మందిని అరెస్టు చేశారు. మిగిలిన ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ 18 మందిలో ఇప్పటికే 11 మందికి బెయిల్ లభించింది.

జనవరి 5న మిగిలిన ఏడుగురి బెయిల్ అభ్యర్థనలను ఉన్నత న్యాయస్థానం విచారించింది.

మిగిలిన ఏడుగురు నిందితుల బెయిల్ పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. ఐదేళ్లుగా జైలులో ఉన్నప్పటికీ తమపై ఇప్పటివరకు విచారణ ప్రారంభం కాలేదని నిందితులందరూ వాదించారు. విచారణలో తీవ్రమైన జాప్యం జరిగితే బెయిల్ ఇవ్వాలన్న సుప్రీంకోర్టు గత తీర్పులను వారు ఉదహరించారు.

దిల్లీ పోలీసుల తరఫున హాజరైన న్యాయవాదులు బెయిల్ పిటిషన్లను తీవ్రంగా వ్యతిరేకించారు. దిల్లీ అల్లర్లు వ్యూహాత్మక కుట్ర ఫలితమేనని, అందులో నిందితులందరికీ పాత్ర ఉందని వాదించారు. విచారణ ఇంకా ప్రారంభం కాకపోయినా, ఆ కారణంతో మాత్రమే బెయిల్ ఇవ్వకూడదని పేర్కొన్నారు. అలాగే, విచారణలో జాప్యానికి నిందితులే కారణమని కూడా పోలీసులు తెలిపారు.

ఈ కేసులో నిందితులపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధకచట్టం (ఉపా)లోని ఉగ్రవాదానికి సంబంధించిన సెక్షన్లు నమోదు చేశారు. ఈ సెక్షన్ల కింద బెయిల్ పొందడం చాలా కష్టం.

ఈ కేసులో నిందితులు చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టంలోని కన్ని తీవ్రవాద సంబంధిత సెక్షన్లలో ఆరోపణలు ఎదురుకుంటున్నారు. ఈ సెక్షన్ల కేసుల్లో బెయిల్‌ను పొందడం చాలా అరుదు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఉపా కేసుల్లో బెయిల్ రావడం చాలా కష్టం

ఇలాంటి కేసుల్లో నిందితులపై అభియోగ పత్రం సమర్పించిన కేసు ప్రాథమికంగా నిజంగా కనిపిస్తున్నదా లేదా అన్నది కోర్టు పరిశీలించాలని ఉపా చట్టం చెబుతోంది. ఒకవేళ సాక్ష్యాలు సరైనవిగా అనిపిస్తే, బెయిల్ మంజూరు చేయకూడదని చట్టం స్పష్టం చేస్తోంది.

సుప్రీంకోర్టు 2019లో ఇచ్చిన ఒక కీలక తీర్పు తర్వాత, ఉపా కేసుల్లో బెయిల్ పొందడం మరింత కష్టతరమైంది. ఆ తీర్పులో ప్రాసిక్యూషన్ ఆధారాలను లోతుగా విశ్లేషించకూడదని పేర్కొంది.

అయితే, సుప్రీంకోర్టు మరికొన్ని కేసులలో మాత్రం ఎవరైనా వ్యక్తి చాలాకాలం జైలులో ఉంటే, వారి కేసు త్వరగా ముగిసే అవకాశం లేకపోతే, ఆర్టికల్ 21 ప్రకారం బెయిల్ ఇవ్వాల్సిందేనని చెప్పింది.

ప్రస్తుతం దిల్లీ అల్లర్ల కుట్ర కేసు అభియోగాలు మోపే దశలో ఉంది. ఏ క్రిమినల్ కేసులోనైనా పోలీసులు చార్జిషీటు దాఖలు చేస్తారు. తరువాత ఇరుపక్షాలు న్యాయస్థానం ముందు వాదనలు వినిపిస్తాయి. ఆ వాదనలు పరిగణనలోకి తీసుకున్న తరువాత ఏ సెక్షన్ల కింద విచారణ జరపాలనే విషయాన్ని కోర్టు నిర్ణయిస్తుంది. ఈ ప్రక్రియనే చార్జ్ ఫ్రేమింగ్‌గా పేర్కొంటారు.

కోర్టు ఒకసారి చార్జ్‌ ఫ్రేమ్ చేసిన తరువాతే విచారణ అధికారికంగా ప్రారంభమవుతుంది. ఈ కేసులో 2024 సెప్టెంబర్ నుంచి అభియోగాలపై వాదనలు కొనసాగుతున్నాయి.

ఈ కేసులో మొత్తం 20 మంది నిందితులుగా ఉంటే, అందులో 18 మందిని పోలిసులు అరెస్టు చేశారు. 18 మందిలో ఇప్పటి వరకు 11 మందికి బెయిల్ మంజూరయ్యింది.
ఫొటో క్యాప్షన్, దిల్లీ అల్లర్ల కేసులో మొత్తం 20 మందిని అరెస్ట్ చేశారు.

విచారణ ఆలస్యం కావడానికి నిందితులు కూడా కొంత కారణమన్న ప్రాసిక్యూషన్ వాదనతో కోర్టు ఏకీభవించింది. అలాగే, దిల్లీ అల్లర్లకు సంబంధించి ఏడుగురు నిందితుల పాత్రలు ఒకేలా లేవని, భిన్నంగా ఉన్నాయని కూడా కోర్టు పేర్కొంది.

దిల్లీ పోలీసుల చార్జ్‌షీట్‌ను ప్రస్తావిస్తూ, ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్ పాత్రలు ప్రాథమికంగా అత్యంత కీలకంగా కనిపిస్తున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. పోలీసుల వాదన ప్రకారం, అల్లర్ల ప్రణాళిక రూపొందించడం, జనాన్ని సమీకరించడం, అల్లర్లకు దిశానిర్దేశం చేయడంలో ఈ ఇద్దరు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.

ఈ వాదనతో కోర్టు ప్రాథమికంగా ఏకీభవిస్తున్నట్లు తెలిపింది. అయితే, ఒక సంవత్సరం తర్వాత ఈ ఇద్దరు మరొకసారి కొత్త బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేసుకోవచ్చని కూడా కోర్టు చెప్పింది.

అదే సమయంలో, మిగిలిన ఐదుగురు నిందితుల విషయంలో, వారి పాత్ర పరిమితంగా ఉందని, పెద్ద స్థాయిలో అల్లర్ల కుట్ర రూపకల్పనలో వారు పాల్గొన్నట్లు కనిపించడం లేదని అభిప్రాయపడింది.

పెద్ద పాత్ర పోషించని, స్వయంగా వనరులను సమీకరించే సామర్థ్యం లేని నిందితులను విడుదల చేయడం వల్ల పెద్ద భద్రతా ముప్పు ఉండదని కోర్టు వ్యాఖ్యానించింది. అయితే, అల్లర్లకు ప్రధాన సూత్రధారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని బయటకు రానివ్వకుండా నిరోధించడం భద్రతా పరంగా అవసరమని పేర్కొంది.

ఈ కేసులో మొత్తం 20 మంది నిందితులుగా ఉంటే, అందులో 18 మందిని పోలిసులు అరెస్టు చేశారు. 18 మందిలో ఇప్పటి వరకు 11 మందికి బెయిల్ మంజూరయ్యింది.
ఫొటో క్యాప్షన్, దిల్లీ అల్లర్లలో 54కు మందికిపైగా మరణించారు

ఈ నేపథ్యంలో, జనవరి 6న సుప్రీంకోర్టు మరో కేసులో భిన్నమైన తీర్పు ఇచ్చింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద 17 నెలలుగా జైలులో ఉన్న అరవింద్ ధామ్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

ఈ కేసులో కూడా విచారణ ఆలస్యం కావడానికి నిందితుడే కారణమని ప్రాసిక్యూషన్ వాదించింది. అయితే, కోర్టు ప్రతి వ్యక్తికీ తనపై ఉన్న కేసు త్వరగా ముగియాల్సిన ప్రాథమిక హక్కు ఉందని స్పష్టం చేసింది.

అలాగే, మనీ లాండరింగ్ కేసు వాస్తవాలు, దిల్లీ అల్లర్ల కుట్ర కేసు వాస్తవాలు వేర్వేరని, రెండింటికీ వర్తించే చట్టాలు కూడా భిన్నమని కోర్టు పేర్కొంది.

అయితే, ఈ సందర్భంగా సుప్రీంకోర్టు 2024లో ఇచ్చిన రెండు పాత తీర్పులను ప్రస్తావించింది. 2024లో ఒక యూఏపీఏ కేసులో, నిందితుడు నాలుగేళ్లుగా జైలులో ఉన్న కారణంగా బెయిల్ మంజూరు చేస్తూ, నేరం ఎంత తీవ్రమైనదైనా, చట్టం ఎంత కఠినమైనదైనా, ఆర్టికల్ 21 ప్రకారం బెయిల్ ఇవ్వాల్సిందేనని కోర్టు చెప్పింది. అలాగే, 2024లో ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియాకు బెయిల్ ఇస్తూ, తుది తీర్పు లేకుండా ఎవ్వరినీ దీర్ఘకాలంపాటు జైలులో ఉంచడం ద్వారా శిక్షించలేమని స్పష్టం చేసింది.

కానీ, సోమవారం ఇచ్చిన ఉమర్ ఖలీద్ , షర్జీల్ ఇమామ్ కేసు తీర్పులో 2024లో ఇచ్చిన ఈ రెండు కీలక తీర్పులను సుప్రీంకోర్టు ప్రస్తావించలేదు.

ఉమర్ ఖలీద్, శర్జీల్ ఇమామ్‌

ఫొటో సోర్స్, Getty Images

న్యాయ నిపుణులు ఏమంటున్నారు?

ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌ల బెయిల్ పిటిషన్ తిరస్కరణ తర్వాత, సుప్రీంకోర్టు నిర్ణయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఏ నేరమైనా సరే సాధారణంగా బెయిల్ ఇవ్వాల్సిందేనని గతంలో సుప్రీం కోర్టులో ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించిన విషయాన్ని న్యాయకోవిదుడు గౌతమ్ భాటియా గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌ల బెయిల్ పిటిషన్లను విచారించిన ధర్మాసనం ఆ నిర్ణయంపై తప్పనిసరిగా చర్చించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.

నిర్ణీత సమయంలో విచారణ జరపడం కోర్టు బాధ్యతగా చెప్పిన గౌతమ్ భాటియా ఈ కేసులో ప్రాసిక్యూషన్ సాక్ష్యాలు స్పష్టత లేనివిగా ఉన్నాయని, ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌పై ఉగ్రవాదానికి సంబంధించిన సెక్షన్లు ఎలా వర్తింపజేయవచ్చో స్పష్టంగా నిరూపించలేకపోయారన్నారు.

ఇదే అంశంపై సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే తన వ్యాసంలో ఈ తీర్పు ప్రభావం కేవలం ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌ భవిష్యత్తుకే పరిమితం కాదని, భారతదేశంలో అసమ్మతిని ఎలా వ్యక్తపరచాలనే అంశంపై కీలక సంకేతం ఇస్తోందని రాశారు.

విచారణ లేకుండా ఐదేళ్లపాటు జైలులో ఉండటమే బెయిల్ మంజూరుకు సరిపడిన ఆధారంగా పరిగణించాల్సిన అంశం అని సంజయ్ హెగ్డే పేర్కొన్నారు.

కోర్టు తీర్పుపై ఒకవైపు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నప్పటికీ, కొందరు న్యాయవాదులు సుప్రీంకోర్టు నిర్ణయానికి మద్దతు పలికారు.

సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వే, ప్రైవేట్ టెలివిజన్ చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు.

ఉపా(యూఏపీఏ) లాంటి చట్టాల విషయంలో ''బెయిల్ రూల్'' వర్తించదని చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)