దిల్లీ అల్లర్ల కేసులో జైలులో ఉన్న ఉమర్ ఖలీద్‌కు న్యూయార్క్ మేయర్ రాసిన నోట్‌లో ఏముంది?

ఫొటో సోర్స్, Getty Images
చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) సెక్షన్ల కింద 2020 నుండి జైలులో ఉన్న విద్యార్థి నాయకుడు ఉమర్ ఖలీద్‌కు న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ సంఘీభావం తెలిపారు.
"మేమంతా మీతోనే ఉన్నాం" అని చేతితో రాసిన నోట్‌ను మమ్దానీ ఖలీద్‌కు పంపారు. న్యూయార్క్ నగర మేయర్‌గా గురువారం మమ్దానీ ప్రమాణస్వీకారం చేశాక, ఉమర్ ఖలీద్ భాగస్వామి బన్‌జ్యోత్స్నలహిడి ఈ నోట్‌ను సామాజిక మాధ్యమాలలో పంచుకున్నారు. దిల్లీ అల్లర్లకు సంబంధించిన కేసులో జైలులో ఉన్న ఉమర్ ఖలీద్‌కు గత ఏడాది సెప్టెంబర్‌లో దిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది.
కానీ, డిసెంబర్‌లో ఆయన సోదరి వివాహానికి హాజరు కావడానికి అనుమతి లభించింది.


ఫొటో సోర్స్, Getty Images
మమ్దానీ ఏం రాశారు?
ఉమర్ ఖలీద్ భాగస్వామి బన్‌జ్యోత్స్న లహిడీ సామాజిక మాధ్యమాలలో పంచుకున్న మమ్దానీ నోట్‌లో
"డియర్ ఉమర్, కష్టకాలంలో కూడా చేదు అనుభవాలు మనలను ఆక్రమించకూడదంటూ మీరు చెప్పిన మాటల గురించి నేను తరచుగా ఆలోచిస్తాను. మీ తల్లిదండ్రులను కలవడం నాకు సంతోషంగా ఉంది. మేమంతా మీతో ఉన్నాం." అని రాశారు.
జైల్లో ఉన్న ఉమర్ ఖలీద్ , న్యూయార్క్ నగర భారత సంతతికి చెందిన మేయర్ జోహ్రాన్ మమ్దానీ మధ్య 11,700 కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ, చేతితో రాసిన ఈ నోట్ వారి మధ్య భావోద్వేగ బంధాన్ని సృష్టించిందని బన్‌జ్యోత్స్న లహిడీ హిందూస్థాన్ టైమ్స్‌కు చెప్పారు.
"ఉమర్ తల్లిదండ్రులు అమెరికాలో మమ్దానీని, ఇంకా అనేకమందిని కలిశారు. ఆ సమయంలో మమ్దానీ ఈ నోట్ రాశారు" అని తెలిపారు.
ఉమర్ ఖలీద్ మూడు వారాల క్రితం తన సోదరి వివాహానికి హాజరు కావడానికి ఇంటికి వచ్చారు.
బెయిల్ షరతుల కారణంగా ఉమర్ ఇంటి నుంచి బయటకు వెళ్లలేకపోయారని, తన సమయమంతా ఆయన ఇంట్లోనే గడిపారని లహిడి చెప్పారు.
ఉమర్ తల్లిదండ్రులు సాహిబా ఖానుమ్ సయ్యద్ ఖాసిం రసూల్ ఇలియాస్ కిందటి డిసెంబర్‌లో తమ చిన్నకుమార్తె వివాహానికి ముందు అమెరికా వెళ్లారు. అక్కడే నివసిస్తున్న తమ పెద్ద కుమార్తెను కలిశారు. అయితే ఆమె వివాహానికి హాజరుకాలేకపోయారు.

ఫొటో సోర్స్, Getty Images
గతంలోనూ మమ్దానీ ఏం చెప్పారంటే..
దిల్లీ అల్లర్లకు సంబంధించిన కుట్ర ఆరోపణలపై జేఎన్‌యూ మాజీ పీహెచ్‌డీ విద్యార్థి ఉమర్ ఖలీద్‌ను 2020 సెప్టెంబర్‌లో అరెస్టు చేశారు.
దిల్లీ హైకోర్టు ఒక ఎఫ్‌ఐఆర్‌లో కొన్ని అభియోగాల నుంచి నిర్దోషిగా విడుదల చేసినప్పటికీ, యుఎపిఎ కింద నమోదైన మరో కేసులో ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు.
గత ఐదు సంవత్సరాలలో ఆయన బెయిల్ దరఖాస్తులు చాలాసార్లు తిరస్కరణకు గురయ్యాయి. డిసెంబర్ 2025లో సుప్రీంకోర్టు ఈ కేసుపై తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది.
మమ్దానీ గతంలో ఖలీద్‌కు మద్దతుగా బహిరంగంగా మాట్లాడారు.
జూన్ 2023లో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు ముందు న్యూయార్క్‌లో జరిగిన 'హౌడీ డెమోక్రసీ' కార్యక్రమంలో మమ్దానీ ఖలీద్ జైలు రచనల నుంచి సారాంశాలను చదివారు.
ఆ సమయంలో, మమ్దానీ (అప్పటి న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీ సభ్యుడు) "దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో రీసర్చ్ స్కాలర్ కార్యకర్త ఉమర్ ఖలీద్ రాసిన లేఖను చదవబోతున్నాను, ఆయన మూక హత్యలు, ద్వేషానికి వ్యతిరేకంగా జరిగిన ప్రచారానికి నాయకత్వం వహించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఆయన 1,000 రోజులకు పైగా జైలులో ఉన్నారు. ఆయనపై విచారణ ఇంకా ప్రారంభం కాలేదు, అయితే ఆయన బెయిల్ పిటిషన్లను పదేపదే తిరస్కరించారు" అన్నారు.

ఫొటో సోర్స్, @RepMcGovern
డెమొక్రాట్ ఎంపీల మద్దతు
మమ్దానీతో పాటు, అమెరికాలోని డెమోక్రటిక్ పార్టీకి చెందిన చాలా మంది ఎంపీలు కూడా ఉమర్ ఖలీద్‌కు సంఘీభావం ప్రకటించారు.
అమెరికా ఎంపీలు జిమ్ మెక్‌గవర్న్, జామీ రాస్కిన్ నాయకత్వంలో ఉమర్ ఖలీద్‌కు మద్దతుగా ఒక వినతిపత్రం సమర్పించారు.
అమెరికాలోని భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రాకు రాసిన లేఖలో, ఖలీద్‌కు బెయిల్ మంజూరు చేయాలని ఈ ఎంపీలు భారత అధికారులకు విజ్ఞప్తి చేశారు. అలాగే ఉమర్ ఖలీద్‌పై విచారణ మొదలుపెట్టాలనే డిమాండ్ కూడా ఆ లేఖలో ుంది.
మెక్‌గవర్న్, రాస్కిన్‌లతో పాటు, డెమొక్రాటిక్ చట్టసభ సభ్యులు క్రిస్ వాన్ హోలెన్, పీటర్ వెల్చ్, ప్రమీలా జయపాల్, జాన్ షాకోవ్స్కీ, రషీదా త్లైబ్, లాయిడ్ డాగెట్‌లు కూడా ఈ లేఖపై సంతకాలు చేశారు.
విచారణ లేకుండా ఖలీద్‌ను నిర్బంధించడం అంతర్జాతీయ చట్ట నిబంధనలను ఉల్లంఘించడమేనని ఎంపీలు అన్నారు.
మెక్‌గవర్న్ ఈ లేఖను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఈ నెల మొదట్లో అమెరికాలో ఖలీద్ తల్లిదండ్రులను కలిశానని అమెరికా కాంగ్రెస్ సభ్యుడు చెప్పారు.
"ఇది భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే" అని అమెరికన్ ఎంపీల లేఖపై, భారత మాజీ విదేశాంగ కార్యదర్శి కన్వాల్ సిబల్ స్పందించారు.
"భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా రాజకీయ నాయకులు ఈ రకమైన జోక్యం చేసుకోవడం వల్ల ట్రంప్ విధానాల కారణంగా ఇప్పటికే తీవ్ర ఒత్తిడికి గురవుతున్న భారత్, అమెరికా సంబంధాలను మరింత దెబ్బతీస్తుంది. ఇంకా దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, అమెరికాలో రాజకీయ, చట్టపరమైన, శాంతిభద్రతలు, మత, జాతిపరమైన సమస్యల కారణంగా ఏర్పడుతున్న పరిణామాలతో దీనికి ఎలాంటి సంబంధం లేదు" అని కన్వాల్ సిబల్ ఎక్స్‌లో రాశారు.
‘‘ఈ ఎంపీలు, కాంగ్రెస్ సభ్యులు భారత్‌లోని అతివాదులు, ఉగ్రవాదులకుప్రతినిధులుగా మారే బదులు అమెరికాలోని తమ సమస్యలపై దృష్టి పెట్టాలి’’ అన్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














