దిల్లీ అల్లర్ల కుట్ర కేసు: ఎఫ్‌ఐఆర్‌ను 'జోక్'గా అభివర్ణించిన ఉమర్ ఖాలిద్ న్యాయవాది, సాక్ష్యాలు సృష్టించారని వాదనలు

ఫొటో సోర్స్, Getty Images
2020 దిల్లీ అల్లర్ల కుట్ర కేసుపై గురువారం దిల్లీలోని కర్కర్‌దుమా కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో తన క్లయింట్‌కి వ్యతిరేకంగా సమర్పించిన సాక్ష్యాలు కల్పితాలని ఉమర్ ఖాలిద్ తరఫు న్యాయవాది త్రిదీప్ పైస్ వాదించారు.
దిల్లీ పోలీసులు పేర్కొన్న వివరాల ప్రకారం, పౌరసత్వ సవరణ చట్టం 2019కి వ్యతిరేకంగా నిరసనల వేళ 20 మంది దిల్లీలో అల్లర్లకు ప్లాన్ చేశారు.
దీనికి సంబంధించిన ఆధారాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. విచారణ సందర్భంగా, ఈ 20 మందిపై నిర్దిష్టంగా ఏ నేరాలపై విచారణ జరపాలనే చర్చ జరిగింది. వీరిపై టెర్రరిజం, హత్య, నేరపూరిత కుట్ర వంటి నేరారోపణలు ఉన్నాయి.
విచారణ సందర్భంగా, తనపై పోలీసులు దాఖలు చేసిన కేసును ఉమర్ ఖాలిద్ వ్యతిరేకించారు. ఖాలిద్ అరెస్టుకు సంబంధించి నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను ఒక 'జోక్'గా పేర్కొంటూ, ఆయనపై మోపిన ఆరోపణలు, సమర్పించిన ఆధారాలకు మధ్య "ఎలాంటి సంబంధం" లేదని ఆయన తరఫు న్యాయవాది త్రిదీప్ వాదించారు. అల్లర్లు జరిగిన సమయంలో ఉమర్ ఖాలిద్ నగరంలో కూడా లేరని ఆయన అన్నారు.

దర్యాప్తు సంస్థ పక్షపాతధోరణితో వ్యవహరిస్తోందని కూడా ఉమర్ ఖాలిద్ న్యాయవాది ఆరోపించారు. వారిని ఈ కేసులో ఇరికించడం కోసం ఆధారాలు కల్పించారని ఆయన అన్నారు.
పోలీసు దర్యాప్తు, సాక్షులకు సంబంధించి కోర్టు విమర్శనాత్మక వ్యాఖ్యలు చేస్తూ జారీ చేసిన ఆదేశాలను కూడా ఆయన ఎత్తిచూపారు. త్రిదీప్ ప్రకారం, ఉమర్ ఖాలిద్ కేసులోనూ ఇదే జరుగుతోంది.
ఈ కేసు తదుపరి విచారణ సెప్టెంబర్ 17న జరగనుంది.
ఈ కేసులో ఖాలిద్‌తో పాటు మరో 9 మంది నిందితులకు బెయిల్ మంజూరు చేసేందుకు ఈనెలలో దిల్లీ హైకోర్టు నిరాకరించింది. వీరిలో కొందరు ఇప్పుడు సుప్రీం కోర్టులో అప్పీల్ దాఖలు చేశారు.
హైకోర్టు బెయిల్ నిరాకరణ..
దిల్లీలో 2020లో జరిగిన అల్లర్ల కేసులో నిందితులుగా ఉన్న ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్‌తో పాటు మరో 8 మంది బెయిల్ పిటిషన్లను దిల్లీ హైకోర్టు తిరస్కరించింది.
ఒక పెద్ద కుట్రలో భాగంగా ఈ అల్లర్లు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి.
జస్టిస్ నవీన్ చావ్లా, జస్టిస్ షాలిందర్ కౌర్‌తో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది.
ఈ తీర్పుతో ఉమర్ ఖాలీద్, షర్జీల్ ఇమామ్, అతర్ ఖాన్, ఖాలీద్ సైఫీ, మహ్మద్ సలీం ఖాన్, షిఫా ఉర్ రెహ్మాన్, మీరాన్ హైదర్, గుల్‌ఫిషా ఫాతిమా, షాదాబ్ అహ్మద్‌లకు బెయిల్ లభించలేదు.
ఇదే కేసులో, తస్లీం అహ్మద్ బెయిల్ పిటిషన్‌ను కూడా దిల్లీ హైకోర్టులోని మరో ధర్మాసనం సెప్టెంబర్ 2న తిరస్కరించింది.
బెయిల్ నిరాకరణకు గురైన కొందరు సుప్రీంలో అప్పీల్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
దీనికి ముందు ఏం జరిగింది?
ఈ కేసులో, దిల్లీ హైకోర్టు జూలై 9న తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది.
నిందితులందరిపైనా చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం కింద ఉగ్రవాద అభియోగాలు మోపారు.
అభియోగాలు ఎదుర్కొంటున్న వారంతా 2020 ఫిబ్రవరిలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల సందర్భంగా దిల్లీలో మత కలహాలను రెచ్చగొట్టేందుకు కుట్ర పన్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు.
ఐదేళ్లుగా తమపై ఎలాంటి విచారణ జరపకుండా జైల్లోనే ఉంచారని, విచారణకు ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి తమకు బెయిల్ మంజూరు చేయాలని నిందితులు వాదిస్తున్నారు.
ఈ కేసులోనే దేవాంగన కలితా, నటాషా నర్వాల్‌కు బెయిల్ లభించింది. సమానత్వం ఆధారంగా మిగిలిన వారికి కూడా బెయిల్ ఇవ్వాలని నిందితుల తరఫు లాయర్ కోర్టును కోరారు.
సుదీర్ఘ విచారణ తర్వాత బెయిల్‌పై కోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది.
షార్జీల్ ఇమామ్, ఖాలిద్ సైఫీ వంటి కొంతమంది నిందితుల పిటిషన్లు 2022 నుంచి దిల్లీ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. ఉమర్ ఖాలిద్ సహా అనేకమంది నిందితుల పిటిషన్లు 2024 నుంచి పెండింగ్‌లో ఉన్నాయి.
జూలై 9న దిల్లీ పోలీసుల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు.
ఆయన రెండు అంశాలను కోర్టులో ప్రధానంగా ప్రస్తావించారు. మొదటిది 2020 ఫిబ్రవరిలో జరిగిన అల్లర్లు దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బ తీసే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా జరిగిన కుట్ర.
రెండోది విచారణలో ఆలస్యం జరిగితే బెయిల్ ఇవ్వవచ్చు. అయితే దేశ రాజధానిలో హింసను ప్రేరేపించడానికి జరిగిన కుట్రలాంటి కేసుల్లో అది వర్తించదని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
2020 ఫిబ్రవరిలో జరిగిన అల్లర్లు సాధారణమైనవి కావని తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
దిల్లీ అల్లర్ల కుట్ర కేసు
2020 ఫిబ్రవరిలో దిల్లీలో జరిగిన అల్లర్లలో 53 మంది మరణించారు. వారిలో ఎక్కువ మంది ముస్లింలు. అల్లర్లకు సంబంధించి పోలీసులు 758 కేసులు నమోదు చేశారు.
ఈ కేసుల్లో ఒకదాన్ని దిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం దర్యాప్తు చేస్తోంది.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా 2019 డిసెంబర్‌లో నిరసనలు ప్రారంభమైనప్పుడు కొంతమంది కార్యకర్తలు, విద్యార్థులు అల్లర్లను ప్రేరేపించడానికి కుట్ర పన్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు.
ఈ కుట్ర కేసులో 20 మంది నిందితులు. వారిలో ఆరుగురికి బెయిల్ లభించింది. 12 మంది ఇంకా జైల్లో ఉన్నారు. ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు.
నిందితుల బెయిల్ పిటిషన్‌ను ట్రయల్ కోర్ట్ తిరస్కరించింది. అంతకుముందు ఉమర్ ఖాలిద్ మరో బెయిల్ పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు కూడా తిరస్కరించింది.
పోలీసులు తమ వాదనకు అనుకూలంగా 58 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశారు. నిందితులు అల్లర్లు ప్రారంభించడానికి కుట్ర పన్నారని వీళ్లు చెప్పారు. సాక్షుల గుర్తింపును రహస్యంగా ఉంచారు.

ఫొటో సోర్స్, Getty Images
పోలీసుల వాదన
అల్లర్లు నాలుగు దశల్లో జరిగాయని పోలీసులు విచారణలో తేల్చారు. పౌరసత్వ సవరణ చట్టం 2019కి వ్యతిరేకంగా షార్జీల్ ఇమామ్, ఉమర్ ఖాలిద్ మతపరమైన వాట్సాప్ గ్రూపులను సృష్టించి విద్యార్థులను రెచ్చగొట్టడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
ప్రజలను చంపే లక్ష్యంతో వారిద్దరూ రహదారి దిగ్బంధించేందుకు ప్లాన్ చేశారని పోలీసులు ఆరోపించారు.
ఉమర్ ఖాలిద్ కొన్ని రహస్య సమావేశాలకు హాజరయ్యారని అక్కడ మిగతా నిందితులను ఆయుధాలు సేకరించాలని కోరినట్లు పోలీసులు చెప్పారు.
దీని తర్వాత గుల్‌ఫిషా ఫాతిమా ఇతర నిందితులు ప్రదర్శనలు నిర్వహించారు. వాళ్లు నిరసనకారులకు కర్రలు, కారంపొడి, రాళ్లను పంపిణీ చేశారనేది పోలీసుల మరో ఆరోపణ.
"నిందితులు నిరసన ప్రదర్శనలు, సమావేశాల్లో పాల్గొన్నారు. ఆయుధాలు సేకరించారు. సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఆయుధాలు కొనేందుకు డబ్బు సేకరించారు" అని పోలీసులు అభియోగాలు నమోదు చేశారు.
దీనికి మద్దతుగా సాక్షుల వాంగ్మూలాలు, షార్జీల్ ఇమామ్, ఉమర్ ఖాలిద్ చేసిన కొన్ని ప్రసంగాలు, వాట్సాప్ సంభాషణలను సమర్పించారు.
దిల్లీ అల్లర్ల లక్ష్యం భారత దేశాన్ని ప్రపంచవ్యాప్తంగా అప్రతిష్ట పాలు చేయడమేనని కోర్టులో కేసు విచారణ సమయంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు.
అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ భారతదేశాన్ని సందర్శించే సమయంలో అల్లర్లు సృష్టించేలా ప్రణాళికలు వేశారని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నిందితుల వాదనేంటి?
తాము చాలా కాలంగా జైల్లో ఉన్నామని కేసు విచారణ ఇంకా ప్రారంభం కాలేదని నిందితులు వాదించారు.
విచారణ ఆలస్యం అయ్యే పక్షంలో నిందితులకు బెయిల్ మంజూరు చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పులను వారు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
నిందితుల తరపు న్యాయవాదులు ప్రధానంగా విచారణలో జరుగుతున్న ఆలస్యాన్ని, కొందరు నిందితులకు బెయిల్ లభించడాన్ని కోర్టులో ప్రధానంగా ప్రస్తావించారు.
పోలీసులు సమర్పించిన ఆధారాలపైనా ప్రశ్నలు లేవనెత్తారు.
"వాట్సాప్ గ్రూప్‌లో చేరడం నేరం కాదు. వేరెవరో ఉమర్ ఖాలిద్‌ను ఈ గ్రూపుల్లో చేర్చారు. అతను గ్రూప్‌లో ఎలాంటి సందేశాలు పోస్ట్ చేయలేదు" అని ఉమర్ ఖాలిద్ న్యాయవాది త్రిదీప్ పైస్ వాదించారు.
ఉమర్ ఖాలిద్ నుంచి ఆయుధాలేవీ స్వాధీనం చేసుకోలేదని ఆయన ప్రసంగాల్లో అభ్యంతరకరమైనవేవీ లేవని చెప్పారు.
పోలీసుల రహస్య సాక్షుల విశ్వసనీయతపై న్యాయవాదులు ప్రశ్నలు లేవనెత్తారు. సాక్షులు ఎంత విశ్వసనీయంగా ఉన్నారో కోర్టు చూడాలని త్రిదీప్ పైస్ కోర్టును కోరారు.
దిల్లీ అల్లర్లతో గుల్‌ఫిషా ఫాతిమాకు సంబంధం ఉందని చెప్పడానికి కచ్చితమైన ఆధారాలు లేవని ఆమె తరఫు న్యాయవాది వాదించారు.
"ఆమె శాంతియుత నిరసనలో మాత్రమే పాల్గొంది. సాక్షుల వాంగ్మూలాలు నమ్మదగినవి కాదు" అని ఆయన అన్నారు.
షార్జీల్ ఇమామ్‌ను 2020 జనవరిలో అరెస్టు చేశారని, అల్లర్లు ఫిబ్రవరిలో జరిగాయని ఆయన తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
షార్జీల్ ఇమామ్ చేసిన ప్రసంగాలపై నమోదు చేసిన మరో కేసులో ఆయనకు బెయిల్ లభించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














