చైనాలో కండోమ్‌లపై టాక్స్

చైనా, కండోమ్‌లపై పన్ను, పిల్లల సంరక్షణ, ఖర్చు తగ్గింపు, జనన రేటు, ప్రణాళిక

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చైనాలో యువ జంటలు తక్కువమంది పిల్లల్ని కంటున్నారు.. కొందరు అసలు వద్దనుకుంటున్నారు.
    • రచయిత, ఓస్మండ్ చియా, బిజినెస్ రిపోర్టర్ -
    • రచయిత, యాన్ చెన్, బీబీసీ న్యూస్ చైనా

చైనాలో జననాల రేటు పెంచే ప్రయత్నంలో భాగంగా గర్భనిరోధక సాధనాలపై పన్ను విధించింది అక్కడి ప్రభుత్వం.

చైనా ప్రజలు జనవరి 1 నుంచి గర్భనిరోధక సాధనాలపై 13 శాతం సేల్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.

అదే సమయంలో చైల్డ్ కేర్ సర్వీసెస్‌కు పన్ను మినహాయింపులు ప్రకటించారు.

గత ఏడాది చివర్లో పన్ను వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు ప్రకటించింది చైనా. 1994 నుంచి అమల్లో ఉన్న అనేక పన్ను మినహాయింపులను తొలగించింది. ఎందుకంటే ఆ కాలంలో చైనా 'వన్ చైల్డ్' రూల్ కఠినంగా అమలు చేస్తోంది. ఆ విధానం దశాబ్దాలపాటు కొనసాగింది.

చైనా ప్రభుత్వం దేశంలో జననాల రేటు పెరగాలనే ఉద్దేశంతో పన్ను విధానంలో మార్పులు చేసింది. గర్భనిరోధక వస్తువులపై పన్ను విధించింది. కానీ పిల్లల సంరక్షణ, వివాహ సేవలు, వృద్ధుల సంరక్షణ లాంటి వాటికి పన్ను మినహాయింపు ఇచ్చింది. అలాగే తల్లిదండ్రుల సెలవులు పెంచడం, నగదు సహాయం ఇవ్వడం కూడా ఈ ప్రయత్నాల్లో భాగమే.

వృద్ధులు ఎక్కువవుతుండటం, ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో యువత పెళ్లి చేసుకుని పిల్లలు కనాలని చైనా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అధికారిక గణాంకాల ప్రకారం, చైనాలో జనాభా సంఖ్య వరుసగా మూడేళ్లుగా తగ్గుతూవస్తోంది.

2024లో కేవలం 95.4 లక్షల మంది పిల్లలు మాత్రమే పుట్టారు. దశాబ్దం క్రితం చైనా ప్రజలు ఎంత మంది పిల్లలను కనవచ్చనే విషయంలో నియమాలను సడలించడం మొదలైనప్పుడు నమోదైన జననాల సంఖ్యతో పోలిస్తే ఇది దాదాపు సగమే.

కానీ కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు వంటి వాటిపై పన్ను వేయడం వల్ల అవాంఛిత గర్భాలు, హెచ్‌ఐవీ కేసులు పెరగొచ్చని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరికొందరు దీన్ని ఎగతాళి చేస్తూ, ఖరీదైన కండోమ్‌ల కంటే చాలా ఎక్కువ ఖర్చుతో పిల్లలను కనమని ఒప్పించాల్సి ఉంటుందని అంటున్నారు.

ధరలు పెరగడానికి ముందే కండోమ్‌లను నిల్వ చేసుకోవాలని ఒక రిటైలర్ అన్నప్పుడు, "నేను ఇప్పుడు జీవితకాలానికి సరిపడా కండోమ్‌లను కొంటాను" అని ఒక సోషల్ మీడియా యూజర్ సరదాగా అన్నారు.

"కండోమ్ ధరకు, పిల్లల పెంపకానికి మధ్య ఉన్న తేడాను ప్రజలు గుర్తించగలరు" అని మరొకరు రాశారు.

"చైనాలో పిల్లలను పెంచడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. స్కూల్ ఫీజులు ఎక్కువ. అలాగే ఉద్యోగం, పిల్లల సంరక్షణ రెండూ చేయడం మహిళలు ఎదుర్కొంటున్న సవాలు అని" బీజింగ్‌లోని యువా పాపులేషన్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ - 2024 నివేదిక తెలిపింది.

ఆర్థిక మాంద్యం, ప్రాపర్టీ క్రైసిస్ వల్ల పొదుపుపై ప్రభావం పడడంతో, కుటుంబాలు.. ముఖ్యంగా యువత తమ భవిష్యత్తుపై అనిశ్చితి ఉందని భావిస్తున్నారు.

"నాకు ఒక బిడ్డ ఉన్నాడు, ఇక అవసరం లేదు" అని తూర్పు ప్రావిన్స్ హెనాన్‌లో నివసించే 36 ఏళ్ల డేనియల్ లువో అన్నారు.

"ఇది సబ్‌వే చార్జీలు పెరిగినట్లే. ఒకటి లేదా రెండు యువాన్లు పెరిగినా, సబ్‌వేలో ప్రయాణించే అలవాటును ప్రజలు మార్చుకోరు. ఏదైమైనా సబ్‌వే ప్రయాణించాల్సిందే కదా?" అని లువో అన్నారు.

ధరల పెరుగుదల గురించి తాను ఆందోళన చెందడం లేదని ఆయన చెప్పారు.

"ఒక కండోమ్‌ బాక్స్‌కి అదనంగా ఐదు యువాన్లు(సుమారు 62.5 రూపాయలు), బహుశా 10 యువాన్లు(సుమారుగా 125 రూపాయలు), లేదంటే గరిష్ఠంగా 20(సుమారుగా 250 రూపాయలు) యువాన్లు ఖర్చవుతుంది. అంటే ఏడాదికి కేవలం కొన్ని వందల యువాన్లే. ఈ ఖర్చు ఎక్కువేం కాదు" అని ఆయన చెప్పారు.

చైనా, కండోమ్‌లపై పన్ను, పిల్లల సంరక్షణ, జనన రేటు

ఫొటో సోర్స్, Getty Images

కానీ ఈ పన్నుఖర్చు ఇతరులకు సమస్య కావచ్చు. ఇది మధ్య చైనాలోని జియాన్ నగరంలో నివసించే రోజీ జావోను ఆందోళనకు గురిచేస్తుంది.

తప్పనిసరి అయిన గర్భనిరోధకాలను ఖరీదుగా మార్చడం వల్ల విద్యార్థులు లేదా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారు "రిస్క్ తీసుకోవాల్సి రావొచ్చు" అని ఆమె అంటున్నారు.

ఈ పన్ను విధానం "అత్యంత ప్రమాదకర ఫలితం" ఇవ్వవచ్చని ఆమె చెప్పారు.

పన్ను సవరణ లక్ష్యంపై పరిశీలకులలో భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు కనిపిస్తోంది. "కండోమ్‌పై పన్ను పెరగడం వల్ల జనన రేటుపై ప్రభావం పడుతుంది" అనేది ఓవర్ థింకింగ్ అని విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయానికి చెందిన జనాభా శాస్త్రవేత్త యి ఫుక్సియన్ అన్నారు.

"ప్రభుత్వం తమ వ్యక్తిగత ఎంపిక విషయంలో కలగజేసుకుంటున్నట్లు ప్రజలు భావిస్తే, పిల్లలను కనమని చైనా ప్రజలను కోరే విధానంపై ఎదురుదెబ్బ తగిలే ప్రమాదం ఉంది" అని సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌కి చెందిన హెన్‌రియెట్టా లెవిన్ అన్నారు.

ఇటీవల కొన్ని ప్రావిన్సులలోని మహిళలకు... వారి రుతు చక్రాలు, పిల్లలను కనాలనే ప్రణాళికల గురించి అడుగుతూ స్థానిక అధికారుల నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయని మీడియా నివేదికలు వచ్చాయి. యునాన్ ప్రావిన్స్‌లోని స్థానిక ఆరోగ్య బ్యూరో గర్భిణులను గుర్తించడానికి ఈ డేటా అవసరమని తెలిపింది.

చైనా, కండోమ్‌లపై పన్ను, పిల్లల సంరక్షణ, ఖర్చు తగ్గింపు, జనన రేటు, ప్రణాళిక

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2024లో జరిపిన ఒక అధ్యయనంలో పిల్లల పెంపకానికి అత్యంత ఖరీదైన దేశాలలో చైనా ఒకటి అని తేలింది.

పశ్చిమ దేశాలు, దక్షిణ కొరియా, జపాన్ వంటి దేశాలు కూడా వారి వృద్ధుల సంఖ్య పెరుగుతున్న కారణంగా జనన రేటును పెంచడానికి ఇబ్బంది పడుతున్నాయి.

జననాల రేటు తగ్గడానికి పిల్లల సంరక్షణ బాధ్యత ఎక్కువగా మహిళలపై పడటం ఒక కారణం అని పరిశోధనలు చెప్తున్నాయి. అలాగే వివాహం తగ్గడం, డేటింగ్‌కు దూరంగా ఉండడం కూడా కారణాలని హెనాన్ నుంచి వచ్చిన లువో అన్నారు.

"చైనా తీసుకున్న చర్యలు అసలు సమస్యను పరిష్కరించలేవు. ఇప్పుడు యువత పరస్పర సంబంధాల్లో నిజమైన అనుబంధాలను దూరంగా ఉంచుతున్నారు అని లువో అభిప్రాయపడ్డారు.

చైనాలో సెక్స్ టాయ్స్ అమ్మకాలు పెరుతున్నాయని ఆయన చెప్పారు.

"ఇతరులతో సంభాషించడం మరింత భారంగా మారింది, కాబట్టి ప్రజలు తమను తాము సంతృప్తి పరుచుకుంటున్నారు" అని ఆయన అభిప్రాయపడుతున్నారు.

"ఒత్తిడి ఉన్న మాట వాస్తవం. అందుకే, ఆన్‌లైన్‌లో ఉండటం సులభం, సౌకర్యంగా ఉంటుంది" అని ఆయన అన్నారు.

" నేటి యువత సమాజం నుంచి ఇరవయ్యేళ్ల క్రితం కంటే చాలా ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. భౌతికంగా వారు బాగానే ఉన్నారు, కానీ వారిపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందరూ విసిగిపోయారు" అని ఆయన చెప్పారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)