బరీడ్ అలైవ్: 61 రోజులపాటు సమాధిలో ఉండి తిరిగి వచ్చిన వ్యక్తి కథ

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డాలియా వెంచురా
- హోదా, బీబీసీ న్యూస్, వరల్డ్
"ఒకసారి ఖననం చేసిన వ్యక్తిని, నేను మళ్లీ ఖననం చేయడం ఇదే మొదటిసారి."
మైక్ మీనీ అంతిమ సంస్కారాల సమయంలో అక్కడ ఉన్న పాస్టర్ అన్న మాటలివి.
మైక్ కుమార్తె మేరీ మీనీ తన పుస్తకం 'యూ కాంట్ ఈట్ రోజెస్ మేరీ'లో ఈ విషయాన్ని ప్రస్తావించారు.
మైక్ మీనీకి 'అంతిమ సంస్కారం' ఆయన మరణించడానికి 35 ఏళ్ల ముందే జరిగింది. దానికి భారీ జనసమూహంతో పాటు అంతర్జాతీయ మీడియా కూడా హాజరైంది.
కానీ, అప్పుడు ఆయన చనిపోలేదు. జీవించే ఉన్నారు. ప్రజలు, మీడియా దృష్టిని ఆకర్షించడం కోసం దీన్నొక వింత, సాహస ప్రదర్శనగా రూపొందించారు.

అసాధారణంగా అనిపించే మైక్ కథ ఒక ఐరిష్ పబ్ నుంచి మొదలవుతుంది.
ఈ కథలోని ప్రధాన పాత్ర మైక్. ఆయన ఒక రైతు కొడుకు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత తన కుటుంబానికి అండగా ఉండటం కోసం, పని వెతుక్కుంటూ ఆయన ఇంగ్లండ్‌కు వెళ్లారు.
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ కావాలనేది ఆయన డ్రీమ్. కానీ, పరిస్థితుల ప్రభావంతో ఆయన కూలీగా పనిచేయాల్సి వచ్చింది.
రింగ్‌లో విజేతగా నిలవాలన్న ఆయన కల, ఒక ప్రమాదంలో చేయికి గాయం కావడంతో చెదిరిపోయింది. అయితే, అదే సమయంలో జరిగిన మరో సంఘటన ఆయనలో ఒక కొత్త ఆలోచనకు బీజం వేసింది.
ఓసారి ఒక సొరంగం తవ్వుతున్న సమయంలో కుప్పకూలిన మట్టి శిథిలాల మధ్య ఆయన కూరుకుపోయారు. ఆ చేదు అనుభవం నుంచే ఈ కొత్త ఆలోచన పుట్టింది.
'శవపేటికలో సజీవంగా సమాధి అయ్యి, అందులో అత్యధిక కాలం గడిపిన రికార్డును బద్దలు కొట్టడం' అన్నదే ఆయనకు వచ్చిన కొత్త ఆలోచన.
అదే కాలంలో, ఇలాంటి వింత పోటీలు అమెరికాలో ఒక ఫ్యాషన్‌గా ఉండేవి.
1966లో ఒక నావికుడు ఐర్లాండ్‌లో 10 రోజుల పాటు సజీవంగా సమాధిలో ఉన్నారు.
అలాగే అమెరికా పౌరుడు ఒకరు టెన్నెస్సీలో 45 రోజులు భూగర్భంలో గడిపారు.
అంతకన్నా ఎక్కువ రోజులు భూగర్భంలో గడిపి, ఆ రికార్డును బద్దలుకొట్టాలన్నదే మైక్ సంక్పలం.

ఫొటో సోర్స్, Getty Images
‘స్వచ్ఛంద జీవ సమాధి’ ఎందుకు?
చరిత్రలో ఒక క్రూరమైన శిక్ష అని చెప్పేదానిని, అదొక పీడకల అని చాలామంది అనుకునే పనిని చేయాలని కొంతమంది అనుకుంటుంటారు. అలాంటిదే ఈ సజీవ సమాధి.
ఈ 'సజీవ సమాధి ఆర్టిస్టుల' లక్ష్యాలు వేర్వేరుగా కనిపిస్తాయి. కొందరు కేవలం రికార్డులను బద్దలు కొట్టాలనే సంతోషం కోసం చేస్తే, మరికొందరు డబ్బు సంపాదించడం కోసం ఇలా చేస్తారు.
కొన్నిసార్లు ఏదైనా సమస్యపై ప్రజలందరి దృష్టిని ఆకర్షించడానికి కూడా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతుంటాయి.
ఉదాహరణకు, ఓడీల్ అనే వ్యక్తి తన జీవితంలో 158 సార్లు స్వచ్ఛందంగా సమాధి చేయించుకున్నారు. ఆయన తరచుగా వివిధ ప్రదేశాలను, వస్తువులను ప్రచారం చేస్తూ డబ్బు సంపాదించేవారు.
పెట్రోల్ ధరలను తగ్గించాలనే డిమాండ్‌తో చివరిసారిగా ఆయన 1971లో ఇలా సమాధిలోకి వెళ్లారు. అంటే ఆయన ఈ పని చేయడం వెనక రకరకాల ఉద్దేశాలు ఉండేవన్నమాట.
33 ఏళ్ల వయసు వచ్చేనాటికి మైక్ మీనీలో ఎటువంటి ప్రత్యేక అర్హత, విద్య లేదా ప్రతిభ లేదు. కానీ, ఇటువంటి సాహసం తన పేరును 'గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్'లో నమోదు చేయించగలదని, అలాగే ఐర్లాండ్‌లో సొంత ఇల్లు నిర్మించుకునేంత ధనవంతుడిని చేయగలదని ఆయన భావించారు.
"నిజ జీవితంలో నాకు ఎటువంటి భవిష్యత్తు లేదు. అందుకే నా సామర్థ్యాన్ని నిరూపించుకోవాలనుకున్నాను" అని మైక్ ప్రకటించారు.
ప్రపంచ ప్రసిద్ధ చాంపియన్ కావాలనే తన కలని మైక్ సజీవంగా ఉంచుకున్నారు.
బాక్సర్‌గా ఆ విజయాన్ని సాధించలేకపోయారు కాబట్టి, ఓర్పుతో కూడిన ఈ అద్భుతమైన సాహసంలో బెస్ట్‌గా నిలవాలని, దీనిద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఆయన భావించారు.

ఫొటో సోర్స్, Getty Images
కుటుంబ సభ్యులు వద్దన్నా...
మైక్ మీనీ ఉత్తర లండన్‌లో ఉండేవారు. ఆ సమయంలో అక్కడ ఆయన దేశస్థులైన ఐరిష్ ప్రజలు చాలామంది నివసించేవారు.
అక్కడ 'అడ్మిరల్ నెల్సన్' అనే ప్రసిద్ధ పబ్ ఉండేది. దానిని మైఖేల్ బటీ సూగ్రో నడిపేవారు. ఆయన అంతకు ముందు సర్కస్‌లో రెజ్లర్‌గా పని చేశారు. కుర్చీలో కూర్చున్న వ్యక్తిని తన పళ్లతో పైకి లేపడం వంటి విన్యాసాలు చేసేవారు.
సూగ్రో ఒక వ్యాపారవేత్త మాత్రమే కాకుండా, బాక్సింగ్‌ను ప్రోత్సహించేవారు. నాలుగు సంవత్సరాల తర్వాత, ఆయన మొహమ్మద్ అలీని ఒక పోటీ కోసం డబ్లిన్‌కు తీసుకురాగలిగారు.
ఓ రోజు ఇద్దరూ మద్యం తాగుతుండగా, సజీవంగా సమాధిలోకి వెళ్లిపోవాలనే తన ఆలోచన గురించి సూగ్రోకు చెప్పారు మైక్. ఈ ఐడియా సూగ్రోకు బాగా నచ్చింది.
45 రోజుల కంటే ఎక్కువ సమయం భూగర్భంలో గడిపి వరల్డ్ రికార్డు సృష్టించేందుకు ఒకరు ప్రయత్నం చేస్తున్నారని రేడియోలో విన్నప్పుడు, ఆ పని చేయబోయేది తన తండ్రేనని అని అర్ధమై తన తల్లి స్పృహ తప్పి పడిపోయారని మైక్ కూతురు మేరీ పేర్కొన్నారు.
ఈ సాహసాన్ని ఐర్లాండ్‌లో చేయాలని మైక్ భావించారు. కానీ ఆయన కుటుంబసభ్యులు అడ్డుకున్నారు. ఆయన అత్యంత దారుణమైన చావుకు గురవుతారేమోనని వారు భయపడ్డారు. క్యాథలిక్ చర్చి దీనిని అంగీకరించదని భావించారు.
కానీ, మేరీ తెలిపిన వివరాల ప్రకారం, 1968 ఫిబ్రవరి 21వ తేదీన మైక్ తాను అనుకున్నది చేసి చూపించారు.

ఫొటో సోర్స్, Getty Images
శవపేటికలో 61 రోజులు ఎలా గడిపారంటే...
సూగ్రో దీని కోసం ఒక భారీ షోను ఏర్పాటు చేశారు. శవపేటిక మూసివేసే ముందు, మైక్ తన చివరి భోజనాన్ని తన పబ్‌లోనే తినేలా సూగ్రో ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ మీడియా సమక్షంలో ఇది జరిగేలా చూశారు.
చాంపియన్ కావాలనే బలమైన కోరికతో ఉన్న మైక్, నీలం రంగు పైజామా, టైట్స్ ధరించి 1.90 మీటర్ల పొడవు, 0.78 మీటర్ల వెడల్పు ఉన్న శవపేటికలోకి వెళ్లారు.
ఆయన తనతో పాటు ఒక సిలువ (క్రాస్)ను, జపమాలను తీసుకున్నారు.
"ఇది నా భార్య, కుమార్తెలతో పాటు ఐర్లాండ్ గౌరవం కోసం చేస్తున్నాను" అని శవపేటిక మూతవేసే ముందు మైక్ అన్నారు.
శవపేటికలో సమాధి అయిన తర్వాత, పోత ఇనుముతో తయారు చేసిన ట్యూబ్‌ల ద్వారా మైక్ శ్వాస తీసుకునేవారు. ఈ ట్యూబ్‌ల సహాయంతోనే టార్చ్ వెలుతురులో చదువుకోవడానికి వార్తాపత్రికలు, పుస్తకాలు, అలాగే ఆహారం, పానీయాలు, సిగరెట్లు కూడా ఆయనకు అందించేవారు.
టీ-టోస్ట్, రోస్ట్ బీఫ్, ఆయనకు ఇష్టమైన మద్యం కూడా పంపేవారు.
శవపేటిక కింద ఉన్న ఒక గుంతలోకి తెరుచుకునే 'ట్రాప్ డోర్' టాయిలెట్‌గా ఉపయోగపడేది.
మైక్‌ను శవపేటికలో పెట్టిన చోట డొనేషన్ బాక్స్ ఉంచారు. 'మీరు డబ్బు చెల్లించి ఆయనతో మాట్లాడవచ్చు' అని చెప్పడంతో, బాక్సర్ హెన్రీ కూపర్, నటి డయానా డోర్స్ వంటి ప్రముఖులు కూడా మైక్‌తో మాట్లాడటానికి ఈ జీవ సమాధి ప్రాంతానికి వచ్చారు.
శవపేటిక లోపల అమర్చిన టెలిఫోన్ ద్వారా మైక్ బయటి ప్రపంచంతో మాట్లాడేవారు. ఈ లైన్ 'అడ్మిరల్ నెల్సన్' పబ్‌కు అనుసంధానమై ఉండేది. అక్కడ సూగ్రో ప్రతి కాల్‌కూ డబ్బు వసూలు చేసేవారు.
మీడియా కొంతకాలం పాటు మైక్ సాహసం వార్తలకు ప్రాధాన్యం ఇచ్చింది. కానీ ఆ తర్వాత జరిగిన పెద్ద అంతర్జాతీయ సంఘటనలు ఈ వార్తలను పక్కకు నెట్టేశాయి.
వియత్నాం యుద్ధం, మార్టిన్ లూథర్ కింగ్ హత్య తదితర ఘటనలతో మిగిలిన అన్ని విషయాలూ మరుగునపడిపోయాయి.
అయితే, సమాధి నుంచి మైక్ బయటకు వచ్చే సమయం వచ్చినప్పుడు, ఈ విషయం ప్రపంచానికంతా తెలిసేలా సూగ్రో ఏర్పాట్లు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
నీటిమూటలైన భారీ బహుమతులు...
డాన్సర్లు, సంగీతకారులు, విలేఖరుల సమక్షంలో 1968 ఏప్రిల్ 22న, అంటే సమాధి చేసిన తర్వాత 8 వారాల 5 రోజులకు మైక్ శవపేటికను బయటకు తీశారు.
ప్రజల సమక్షంలో ట్రక్కుపైకి చేర్చిన ఆ శవపేటిక మూతను తొలగించగానే, మైక్ సూర్యరశ్మి నుంచి తన కళ్లను కాపాడుకోవడానికి నల్లటి కళ్లద్దాలు ధరించి కనిపించారు.
శరీరం మురికిగా, చిందరవందరగా ఉన్నప్పటికీ మైక్ తిరుగులేని విజేతగా నిలిచారు.
"నేను ఇక్కడ మరో వంద రోజులు ఉండాలనుకుంటున్నాను" అని ఆయన ఉత్సాహంగా ప్రకటించారు.
వైద్య పరీక్షలలో మైక్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధరించారు.
మైక్ కుమార్తె మేరీ తెలిపిన వివరాల ప్రకారం, విజయం సాధిస్తే మైక్‌కు లక్ష పౌండ్ల నగదు, వరల్డ్ టూర్ వాగ్దానం చేశారు. ఆ కాలంలో ఇది చాలా పెద్ద మొత్తం.
1970లలో డబ్లిన్‌లోని సంపన్న ప్రాంతంలో మూడు అంతస్తుల ఇంటి ధర దాదాపు పన్నెండు వేల పౌండ్లు ఉండేది.
మైక్ 61 రోజుల పాటు భూగర్భంలో ఉండి పాత రికార్డులన్నీ బద్దలుకొట్టేశారు. కానీ, ఆయనకు అందుతాయనుకున్న ప్రైజ్ మనీ అందలేదు, ప్రపంచ యాత్ర చేసే అవకాశం కూడా రాలేదు. చివరకు జేబులో ఒక్క పైసా లేకుండానే ఆయన ఐర్లాండ్‌కు తిరిగి వెళ్లిపోయారు.
ఆయన సాహసాన్ని ధ్రువీకరించడానికి అక్కడ ఎటువంటి అధికారిక ప్రతినిధి లేకపోవడంతో, 'గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్' కూడా ఆయన రికార్డును అధికారికంగా గుర్తించలేదు.
'సజీవ సమాధి ఆర్టిస్టుల' విషయంలో తరచుగా ఇలాగే జరుగుతుండేది.
అయితే, అంతర్జాతీయ మీడియా సాక్ష్యంగా ఉన్నందున, ఆయన 61 రోజుల పాటు భూగర్భంలో ఉన్నారనే వాస్తవాన్ని ఎవరూ శంకించలేరు.
కేవలం కొన్ని నెలల తర్వాత అదే సంవత్సరం 1968లోనే, ఎమా స్మిత్ అనే మాజీ సన్యాసిని ఇంగ్లండ్‌లోని ఒక పార్క్‌లో స్వచ్ఛందంగా 101 రోజుల పాటు సమాధిలో ఉండి మైక్ రికార్డును అధిగమించారు.
మైక్ మరణించిన రెండు దశాబ్దాల తర్వాత, 2003లో మైక్ కథ 'బరీడ్ అలైవ్' అనే పేరుతో ఒక డాక్యుమెంటరీ రూపంలో మళ్లీ వెలుగులోకి వచ్చింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














