పండగ రోజుల్లో అతిగా తిన్నప్పుడు మన మెదడులో ఏం జరుగుతుంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జెసికా బ్రాడ్లీ
- హోదా, బీబీసీ ఫ్యూచర్
పండగ రోజుల్లో స్పెషల్ ఫుడ్స్ తినేటప్పుడు చాలామంది తమ డైట్ ప్లాన్‌లను పక్కన పెట్టేస్తుంటారు. పండగ సమయాల్లో కడుపు నిండా లేదా అంతకంటే కాస్త ఎక్కువే తింటారు.
ఆహారం మన మెదడు ఎన్నో ముఖ్యమైన పనులు చేసేందుకు సాయపడుతుంది.
దీనిలో మన జ్ఞాపకశక్తి, ఏకాగ్రత వంటివి ఉంటాయి.
సరైన విధంగా, సమతుల్య పద్ధతిలో తీసుకునే ఆహారం.. మన మానసిక ఆరోగ్యానికి సహాయకారిగా ఉంటుంది.
అయితే, సంక్రాంతి, దసరా, దీపావళి, ఈద్, క్రిస్మస్ వంటి పండగల సమయాల్లో ఆహారం ఎక్కువగా తినడం వల్ల మన మెదడుపై వెంటనే కలిగే ప్రభావాలు ఏంటి?

కావాల్సిన దానికంటే ఎక్కువగా తింటే ఏమవుతుంది?
మనం తినేటప్పుడు, మన శరీరం నుంచి పలు సంకేతాలు విడుదలై, అవన్ని కలిసి కడుపు నిండిందని మెదడుకు తెలియజేస్తాయి.
దీనిలో మన పేగులు, జీవక్రియలు (తిన్న ఆహారాన్ని విచ్ఛిన్నం చేసి, శక్తిని ఉత్పత్తి చేసే అణువులు) విడుదల చేసే హార్మోన్లు కూడా ఉంటాయి.
ఈ హార్మోన్లే పాంక్రియాస్ గ్రంథికి ఇన్సులిన్ విడుదల చేయాలని సంకేతాలు ఇస్తాయి. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
ఈ మొత్తం ప్రక్రియను తినడానికి సంబంధించిన 'సటైటీ కాస్కేడ్' లేదా 'సాటియేషన్ ప్యాట్రన్' అని పిలుస్తారు.
''ఈ సంకేతాలు మన పేగులలోని వివిధ భాగాల నుంచి వస్తాయి. అవి వేర్వేరు సమయాల్లో పని చేస్తాయి" అని ఇంపీరియల్ కాలేజ్ లండన్‌లోని అసిస్టెంట్ ప్రొఫెసర్, కన్సల్టెంట్ ఎండోక్రినాలజిస్ట్‌గా పనిచేసే టోనీ గోల్డ్‌స్టోన్ చెప్పారు.
గట్, పాంక్రియస్ గ్రంథి ద్వారా విడుదలయ్యే ఈ హార్మోన్ల నమూనా, వీటి నుంచి మెదడుకు వెళ్లే సంకేతాలు.. కడుపు నిండిన తర్వాత మనకు కలిగే మగతకు సంబంధించినవి కావొచ్చు. ఈ మగతను (నిద్రమత్తును) 'పోస్ట్‌ప్రాండియల్ సోమ్నోలెన్స్' అంటారు.
కానీ, కచ్చితంగా ఈ ప్రక్రియ ఎలా పనిచేస్తుందనే దానిపై ఇంకా అంతగా తెలియరాలేదని వాషింగ్టన్ డీసీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్‌లో పోస్టు డాక్టోరల్ విజిటింగ్ ఫెలో ఆరన్ హెంగిస్ట్ చెప్పారు.
మెదడు నుంచి కడుపుకు అయ్యే రక్త ప్రసరణ వల్ల ఈ ఫీలింగ్ కలుగుతుండొచ్చని చాలామంది భావిస్తున్నారు. ఈ భావనకు ''ఫుడ్ కోమా'' అనే నిక్ నేమ్ కూడా పెట్టారు.
అయితే, ఎక్కువగా తిన్న తర్వాత (హెవీ మీల్ తర్వాత) రక్త ప్రసరణ లేదా ప్రవాహం తగ్గదని పరిశోధనలు చెబుతున్నాయి.
తిన్న తర్వాత కలిగే నిద్రమత్తును లేదా అలసత్వాన్ని మరింత అర్థం చేసుకునేందుకు మరిన్ని పరిశోధనలు కావాలని హెంగిస్ట్ అన్నారు.
''గట్ హార్మోన్ స్పందన అనేది పలు హార్మోన్ల కలయికగా ఉంటుంది. కానీ, కచ్చితంగా ఏ హార్మోన్ మెదడులోని ఏ కేంద్రంలో నిద్రను కలిగిస్తుందన్నది మనకు తెలియదు'' అని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
కావాల్సిన దానికంటే ఎక్కువగా తింటే ప్రమాదమా?
ఒకేసారి ఎక్కువగా తిన్నా కూడా మన మెటబాలిజంపై కాస్త తక్కువ ప్రభావమే పడుతుందని హెంగిస్ట్ తెలిపారు.
కావాల్సిన దానికన్నా ఎక్కువగా తింటే లేదా కడుపు నిండాక కూడా తిన్నప్పుడు ఏం జరుగుతుందనే దానిపై ఒక అధ్యయన ఫలితాలను 2020లో వారు ప్రచురించారు.
14 మంది ఆరోగ్యకరమైన వ్యక్తులు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు.
ఒకేసారి పెద్ద పిజ్జాను తినాలని వారికి చెప్పారు. వారికి కడుపు నిండిన తర్వాత కూడా, ఎంత వీలైతే అంత తినమని కోరారు.
రెండోసారి వారు తినగలిగినంత తినాలని చెప్పారు. ''తినగలిగినంత తినమని చెప్పిన' ప్రయోగంలో వారు అంత పెద్ద పిజ్జాను రెట్టింపు సార్లు తిన్నారు.
తిన్న తర్వాత నాలుగు గంటల పాటు హార్మోన్లలో మార్పులను, ఆకలిని, భావోద్వేగాలను, మెటబాలిక్ యాక్టివిటీ కొలిచారు.
ఎక్కువగా ఆహారం తీసుకున్న తర్వాత కూడా, వారి రక్తంలో చక్కెర స్థాయిలు మామూలు భోజనం తర్వాత ఉండే స్థాయి కంటే ఎక్కువగా పెరగలేదని పరిశోధకులు గుర్తించారు. అలాగే, వారి రక్తంలోని కొవ్వు స్థాయిలు కూడా పెరగలేదని తెలిసింది.
''వారి శరీరాలు తమ బ్లడ్ షుగర్‌ను నియంత్రించే పద్ధతి చూసి మేం చాలా ఆశ్చర్యపోయాం. రెండింతలు ఎక్కువగా ఎనర్జీ/శక్తిని తీసుకున్నా బ్లడ్ షుగర్ స్థాయిలు పెరగలేదు'' అని హెంగిస్ట్ అన్నారు.
ఈ అధ్యయనం అప్పుడప్పుడు ఎక్కువగా తినడం మీరు అనుకున్నంత ప్రమాదకరం కాదని తేల్చిందని చెప్పారు.
అయితే, ఈ అధ్యయనాన్ని కేవలం యువతపైన, ఆరోగ్యకరమైన వ్యక్తులపైనే చేశారు.
‘‘ఊబకాయం లేదా అధిక బరువు ఉన్న ప్రజలు, మహిళలపై అధ్యయనం చేయకుండా.. మొత్తం జనాభాకు ఈ అధ్యయన ఫలితాలను వర్తింపజేయలేం'' అని హెంగిస్ట్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మనం ఎక్కువగా ఎందుకు తింటాం?
ఒకేసారి పిజ్జాను ఎక్కువగా తినడం వల్ల బహుశా వెంటనే ఎలాంటి ప్రభావం చూపకపోవచ్చు.
కానీ, '' గంటల తరబడి తిన్నా లేదా రోజంతా తింటూనే ఉన్నా మన మెటబాలిజానికి అంతరాయం కలుగుతుంది. ఇది మన శరీరంపై ఒత్తిడిని కలిగిస్తుంది. దీనివల్ల మెదడుపై ప్రభావం పడుతుంది'' అని కొన్ని పరిశోధనలు చెప్పాయి.
ఎక్కువగా తినడంపై సుదీర్ఘ కాలఅధ్యయనాన్ని 2021లో నిర్వహించారు. హెంగిస్ట్ నిర్వహించిన పిజ్జా అధ్యయనంతో పోలిస్తే భిన్నమైన ఫలితాలు దీనిలో కనిపించాయి. ఈ అధ్యయన పేరు 'ది టెయిల్‌గేట్ స్టడీ'
అమెరికాలో క్రీడలకు ముందు ఇచ్చే పార్టీ సంప్రదాయాలకు అనుగుణంగా ఈ అధ్యయనానికి పేరు పెట్టారు. ఈ పార్టీల్లో ఎక్కువగా తినడం లేదా తాగడం చేస్తుంటారు.
18మంది అధిక బరువున్న, ఆరోగ్యంగా ఉన్న పురుషులపై పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు. వారికి ఆల్కహాల్‌తో పాటు బర్గర్లు, చిప్స్, కేకులు వంటి అధిక కొవ్వు, అధిక చక్కెర ఉన్న ఆహారాన్ని ఇచ్చారు.
మధ్యాహ్నమంతా తింటూనే ఉండాలని వారికి చెప్పారు. ఆ ఐదు గంటల్లో వీరు సగటున 5,087 కేలరీలు తీసుకున్నారు. ఆ తర్వాత వారి రక్త పరీక్షలను, లివర్ స్కాన్లను చేపట్టారు. ఈ స్కాన్లలో... బాగా తిన్న తర్వాత చాలామందికి కాలేయంలో కొవ్వు శాతం పెరిగిందని వెల్లడైంది.
నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది మెదడు తక్కువ ఆక్సీజన్ తీసుకునేలా చేసి, మెదడు కణజాలంలో వాపుకు కారణమవుతుందని పరిశోధకులు గుర్తించారు.
దీనివల్ల కాలక్రమేణా మెదడు వ్యాధులు వచ్చే ప్రమాదం పెరిగింది.
"టెయిల్‌గేట్ స్టడీ ప్రకారం.. ఆ పురుషుల మెటబాలిక్ యాక్టివిటీ అస్తవ్యస్తమైందని తేలింది. గంటల తరబడి కదలకుండా కూర్చుని తినడం, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, వాటిని జీర్ణం చేసుకునేందుకు వారి శరీరాలు బాగా కష్టపడాల్సి వచ్చింది" అని హెంగిస్ట్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఒకేసారి ఎక్కువగా తినడం వల్ల ఎందుకు ఎటువంటి ప్రభావం ఉండదు?
ఎక్కువగా తినడం వల్ల చెడు ప్రభావం పడుతుందన్న గ్యారంటీ ఏమీ లేదని పరిశోధనలు చెప్పాయి. మనం తినాలనుకున్నప్పుడు మన మెదడు, పొట్ట కమ్యూనికేట్ అయ్యేందుకు ఒకదానికొకటి ఎలా అభివృద్ధి చెందాయో ఈ అధ్యయనాలు తెలియజేశాయి.
మనకు ఆకలిగా ఉన్నప్పుడు తినాలని కోరిక పుట్టించే అంశాలు చాలా ఉంటాయని గోల్డ్‌స్టోన్ చెప్పారు.
ఉదాహరణకు.. మన భావోద్వేగాలు మారిపోతాయి. ఆకలి మనలో చికాకును పెంచుతుంది. ఎనర్జీ ఎక్కువగా ఉండే ఫుడ్‌ను తినాలనే కోరిక కూడా పుట్టొచ్చు.
''ఆకలి ఎందుకు చికాకును పెంచుతుందనే దానికి కచ్చితమైన కారణం తెలియదు. కానీ, ఆకలి అసౌకర్యవంతమైన అనుభవాన్ని, బాధాకరమైన స్థితిని కలిగిస్తుందని పలు పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే, దీన్నుంచి తప్పించుకునేందుకు ప్రజలు తింటుంటారు'' అని గోల్డ్‌స్టోన్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
మనం ఏం తింటున్నామనే దానితో సంబంధం ఉంటుందా?
ఎలుకలపై నిర్వహించిన అధ్యయనాల్లో.. దీర్ఘకాలికంగా ఎక్కువ కేలరీలున్న ఆహారం తీసుకుంటే అది జ్ఞాపకశక్తిపై, లెర్నింగ్‌పై ప్రభావం చూపుతుందని తెలిసింది.
కానీ, మనుషులపై ఈ పరిశోధన చాలా తక్కువగా జరిగిందని జర్మనీలోని ట్యూబింజెన్ యూనివర్సిటీలోని మెటబాలిక్ న్యూరోఇమేజింగ్ డిపార్ట్‌మెంట్ హెడ్, గ్రూప్ లీడర్ స్టెఫానీ కుల్మాన్ చెప్పారు.
అయితే, ఎక్కువగా స్వీట్లు, ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మన మెదడులకు ఏం జరుగుతుందనే దాన్ని ఒక అధ్యయనం వెలుగులోకి తీసుకొచ్చింది.
ఈ అధ్యయనం కేవలం ఒక్కరోజు భోజనానికే పరిమితం కాలేదు. ఐదు రోజుల పాటు ఈ అధ్యయనం చేసింది.
స్వల్ప సమయంలో చిన్న చిన్న మొత్తాల్లో ఎక్కువ ఆహారం తీసుకున్న దానికి ఈ అధ్యయన ఫలితాలను అప్లయి చేయొచ్చని కుల్మాన్ చెప్పారు.
18 మంది ఆరోగ్యకరమైన వ్యక్తులు ఎక్కువ కొవ్వున్న, ఎక్కువ చక్కెరున్న, అత్యధికంగా ప్రాసెస్ అయిన డైట్‌ను తమ సాధారణ భోజనంతో పాటు ఐదు రోజుల పాటు తీసుకున్నారు. (సగటున రోజుకు అదనంగా 1,200 కిలో కేలరీలను తీసుకున్నారు).
మరో 11 మంది తమ డైట్‌లో ఎలాంటి మార్పులు లేకుండా పరిమిత స్థాయిలో తిన్నారు.
అత్యధిక కేలరీలున్న ఆహారం తినడం వల్ల ఇన్సులిన్‌కు మెదడు స్పందించే తీరు మారిందని ఈ అధ్యయనం ఫలితాలు చూపించాయి.
ముఖ్యంగా.. దృష్టి, జ్ఞాపకశక్తి సంబంధించిన ప్రక్రియలలో స్పందనలు తగ్గించడం మెదడుకు ఒక పనిగా మారింది. అందుకే, ఇన్సులిన్ విషయంలో మన మెదడు తక్కువ సమర్థవంతంగా మారిందన్నారు.
ఇన్సులిన్ రెసిస్టెంట్ బ్రెయిన్.. మన ఆకలిని, ఆహారం తీసుకునే స్థాయిలను సరిగ్గా నియంత్రించదు. అంటే, కడుపు నిండిన తర్వాత తినడం ఆపేయి అనే సంకేతాలను ఇది సరిగ్గా తీసుకోలేదు.
''మన శరీరాలు ఏదైనా పనిచేయడాని కంటే ముందే మన మెదడుల్లో మార్పు వస్తుందని ఈ అధ్యయనంలో వెల్లడైన కీలక విషయాల్లో ఒకటి'' అని కుల్మాన్ చెప్పారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారందరూ ఒకే బరువుతో ఉన్నారు.
'' మేం వారి మెదడులను చూసినప్పుడు, ఎన్నో ఏళ్లుగా ఊబకాయం లేదా అధిక బరువుతో బాధపడుతున్న వారి మెదడులతో పోలి ఉన్నట్లు కనిపించింది'' అని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ఊబకాయం ఉన్న వ్యక్తుల్లో హైపోథాలమస్, బ్రెయిన్ రివార్డు సిస్టమ్‌కు అంతరాయం కలుగుతుందని అధ్యయనంలో తెలిసింది.
బ్రెయిన్ రివార్డు సిస్టమ్ అనేది మెదడులోని వివిధ భాగాలకు చెందిన నెట్‌వర్క్. మనలోని సంతృప్తి, సంతోషకరమైన అనుభవాలకు చెందిన సంకేతాలను ఇది సృష్టిస్తుంది. ఇది మనం తీసుకునే ఆహారాన్ని నియంత్రిస్తుంది.
ఈ అధ్యయనం ఇప్పటికే ఉన్న పరిశోధనను మరింత విస్తరించిందని, మన గట్, బ్రెయిన్ ఎలా కమ్యూనికేట్ చేసుకుంటున్నాయో చూపించిందని కుల్మాన్ చెప్పారు. ఊబకాయం ఉన్న వ్యక్తుల్లో ఈ వ్యవస్థ భిన్నంగా ఉందన్నారు.
కుల్మాన్ అధ్యయనంలో పాల్గొన్న వారిని ఐదు రోజుల తర్వాత సాధారణ డైట్‌కు వచ్చేయాలని కోరారు.
ఆ తర్వాత వారానికి ఫాలోఅప్ పరీక్షలు నిర్వహించారు. అత్యధిక కేలరీలున్న ఆహారాన్ని తీసుకున్న తర్వాత ఆ వ్యక్తుల జ్ఞాపకశక్తి, జ్ఞానానికి సంబంధించిన మెదడులోని ప్రాంతాలు అంతకుముందు కంటే తక్కువగా స్పందిస్తున్నాయని తేలింది.

ఫొటో సోర్స్, Getty Images
పండగ సమయాల్లో ఎక్కువగా తినడం ఫర్వాలేదా?
స్వీట్లు, శాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ఎక్కువ కాలం తీసుకోవడం మన మెదడుకు అంత మంచిది కాదు.
ఒక్కసారి అత్యధికంగా ఆహారాన్ని తీసుకోవడం వల్ల మన శరీరంపై చూపే ప్రభావాలపై తక్కువ పరిశోధనలు ఉన్నప్పటికీ, ప్రస్తుతం పరిశోధనలు మాత్రం మీ మెదడుకు అంత ప్రమాదకరం కాదని సూచిస్తున్నాయి.
''ఒక అధ్యయనం ప్రకారం ఎప్పుడో ఒకసారి ఎక్కువగా తినడం మీరు అనుకున్నంత ప్రమాదకరం కాదు'' అని హెంగిస్ట్ అన్నారు.
అప్పుడప్పుడు ఎక్కువగా తినడం ఓకే కానీ, అంతకుమించి తింటే, మీ శరీరంపై ఒత్తిడి పెరుగుతుందన్నారు.
కుల్మాన్ రీసెర్చ్ ప్రకారం.. ఐదు రోజుల పాటు ఇలానే తింటూ ఉంటే.. మన మెదడుపై దీర్ఘకాలిక ప్రభావాలు పడతాయని తేలింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














