దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో ‘కెప్టెన్ చేసిన పొరపాట్లు’ ఏమిటి? టీమిండియా సెమీస్‌కు చేరడం అంత తేలికేం కాదా?

కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్

ఫొటో సోర్స్, AFP via Getty Images

    • రచయిత, ప్రవీణ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 5 నిమిషాలు

నవంబర్ 10, 2022..

ఇది ఇండియా టీ20 వరల్డ్‌కప్‌లో ఈ ఆదివారానికి ముందు చివరిసారిగా ఓడిపోయిన రోజు.

దీని తరువాత టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా వరుసగా 12 మ్యాచ్‌లు గెలిచింది.

2024 టీ20 ప్రపంచకప్‌ విజయాలూ అందులో ఉన్నాయి.

కానీ ఆదివారం(22.02.2026) దక్షిణాఫ్రికా చేతిలో ఈ ఓటమి భారత్‌కు పరుగుల పరంగా టీ20 వరల్డ్ కప్‌ చరిత్రలో అతి పెద్ద ఓటమి.

అహ్మదాబాద్‌లో ఇండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన టీ20 సూపర్ 8 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 188 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కానీ ఇండియా కేవలం 18.5 ఓవర్లలో 111 పరుగులకే ఆలవుటై 76 పరుగుల తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకుంది.

పవర్‌ప్లే సమయంలోనే తమ జట్టు విజయానికి దూరమైందని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా మ్యాచ్ అనంతరం అంగీకరించాడు.

గతంలో ఇండియన్ టీమ్ ఎప్పుడూ టీ20ల్లో 50 పరుగులకు మించిన తేడాతో ఓటమిని ఎదుర్కోలేదు.

గ్రూపు దశలో టీమిండియా అన్ని మ్యాచ్‌లు గెలిచినప్పటికీ.. తాజా ఓటమి జట్టులోని లోపాలను బయటపెట్టడమే కాకుండా టోర్నీలో ముందుకు సాగడం అంత తేలిక కాదనే వాస్తవాన్ని కూడా చెబుతోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సూర్యకుమార్

ఫొటో సోర్స్, Getty Images

ఓపెనర్ల వరుస వైఫల్యాలు

18, 6, 0, 0, 31, 8, 25, 1, 0, 0. గత 10 మ్యాచ్‌లలో టీమిండియా తొలివికెట్ పోగొట్టుకునేటప్పటికి స్కోర్లు ఇవి.

అంటే ఓపెనింగ్‌లో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సంజూ శామ్సన్‌లాంటి అవకాశాలున్నా.. భారతజట్టు గత 10 మ్యాచ్‌లో కనీసం ఒక్కసారి కూడా 50 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పలేకపోయింది.

ప్రపంచ కప్‌కు ముందు, టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో మూడు సెంచరీలు చేయడంతో సంజూపై అంచనాలు పెరిగాయి. కానీ ఇషాన్ కిషన్ తిరిగి వచ్చిన తర్వాత తుదిజట్టులో సంజూ చోటు దక్కించుకోలేకపోయాడు.

భారత క్రికెట్ భవిష్యత్తుగా భావించే శుభ్‌మన్‌గిల్ కూడా 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కలేదు. కానీ సూపర్ ఎయిట్ సమీపిస్తున్న కొద్దీ భారత ఓపెనర్లపై ప్రశ్నలు తలెత్తాయి.

మూడు మ్యాచ్‌ల్లో డకౌట్ల తరువాత అభిషేక్ శర్మ దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో ఖాతాను తెరవగలిగినా 15 పరుగులకే అవుటయ్యాడు.

మరోవైపు ఓపెనర్లతోపాటు వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ కూడా ఆకట్టుకోలేకపోయాడు. గ్రూప్ దశలో తిలక్ వర్మ నాలుగు మ్యాచ్ ల్లో 120 స్ట్రైక్ రేట్ తో కేవలం 106 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

అయితే "తిలక్ వర్మ సామర్థ్యాన్ని ఎవరైనా ఎలా అనుమానిస్తారు?" అని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ శనివారం నాటి విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు.

తిలక్ వర్మ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తిలక్ వర్మ

కానీ దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో తిలక్ వర్మ రెండు బంతులు ఎదుర్కొని ఒక పరుగే చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఇన్నింగ్స్‌లో తొలి ఏడు బంతుల్లో రెండు వికెట్లు పడిపోవడంతో టీమిండియా కోలుకోలేకపోయింది.

టోర్నీ ప్రారంభంలో అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 77 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయినప్పుడే ఇండియా బ్యాటింగ్ వైఫల్యం బయటపడింది. కానీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 49 బంతుల్లో అజేయంగా 84 పరుగులు చేసి 29 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

ఈ ఇన్నింగ్స్ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా పరుగులు చేయడానికి ఇబ్బందులు పడ్డాడు. ఈ టోర్నీలో ఐదు మ్యాచ్ ల్లో 180 పరుగులు చేశాడు. కానీ అతని స్ట్రైక్ రేట్ 127 మాత్రమే. టీ20ల్లో అతని మొత్తం స్ట్రైక్ రేట్ 162 కంటే ఇది చాలా తక్కువ.

టాప్ ఆర్డర్ వైఫల్యం భారత బ్యాటింగ్ లైనప్‌పై ఎలా ఒత్తిడి పెంచుతుందో జోరు తగ్గిన సూర్యకుమార్ బ్యాటింగే చెబుతుంది. స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో భారత బ్యాటర్లు తడబడుతున్నారు. ఇది దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో 15 వ ఓవర్లో కేశవ్ మహారాజ్ ముగ్గురు బ్యాట్స్‌మెన్లను పెవిలియన్ కు పంపినప్పుడు మరింత స్పష్టంగా కనిపించింది.

ఈ ప్రపంచకప్‌లో బ్యాటింగ్‌లో భారతజట్టు కష్టపడుతోందని టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు.

''టీమిండియా ప్రదర్శన చాలా నిరాశ కలిగించింది. దక్షిణాఫ్రికా బౌలర్లు భారత బ్యాటర్ల బలహీనతలను బయటపెట్టారు. ప్రపంచకప్ సమయంలో భారత బ్యాటింగ్ లైనప్ తన లయను అందుకోలేకపోతోందని'' ఇర్ఫాన్ ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు.

కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్

ఫొటో సోర్స్, Getty Images

కెప్టెన్ నిర్ణయాలపైనా..

దక్షిణాఫ్రికాతో ఓటమి తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నిర్ణయాలపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

వైస్‌కెప్టెన్‌గా ఉన్నప్పటికీ అక్షర్ పటేల్‌ను ఎందుకు పక్కనపెట్టారనేది ప్రశ్న వినిపిస్తోంది.

బాగా చర్చకు దారితీసిన మరో విషయం టీమిండియా ఆరుగురు బ్యాటర్లలో ఐదుగురు ఎడమచేతి వాటంవారే కావడం.

ఈ మ్యాచ్ సందర్భంగా టీమిండియా వ్యూహం పేలవంగా ఉందని వ్యాఖ్యాతలు విమర్శించారు.

దీనివల్ల ప్రత్యర్థి జట్టు బౌలర్లకు టీమిండియాను కట్టడిచేసేందుకు మంచి అవకాశం దొరికిందని, వారు తమ బౌలింగ్‌లో పెద్దగా మార్పులు చేయాల్సిన అవసరం రాలేదని నిపుణులు భావిస్తున్నారు.

జస్ప్రీత్ బుమ్రా తన మొదటి రెండు ఓవర్లలోనే రెండు వికెట్లు తీసి దక్షిణాఫ్రికాను ఒత్తిడిలోకి నెట్టినా, అతన్ని వెంటనే బౌలింగ్‌కు దింపకపోవడంపై కూడా ప్రశ్నలు తలెత్తాయి.

మ్యాచ్ అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ 'ముగ్గురు బ్యాట్స్‌మెన్లను 21 పరుగులకే అవుట్ చేసి మంచి ఆరంభం సాధించాం. కానీ వారు(దక్షిణాఫ్రికా జట్టు) 7వ ఓవర్ నుండి 15 వ ఓవర్ మధ్య బాగా బ్యాటింగ్ చేశారు'' అన్నాడు.

టీమిండియాకు సవాళ్లు

ఫొటో సోర్స్, Getty Images

సెమీస్‌ మార్గంలో సవాళ్లేంటి?

టీమిండియా సూపర్-8‌లో తదుపరి రెండు మ్యాచ్‌లను గెలవడమే కాకుండా, మంచి రన్‌రేట్‌తో గెలవాలని టీమిండియాపై ఒత్తిడి ఉంటుంది.

సూపర్-8లో దక్షిణాఫ్రికాపై ఓటమితో , సెమీఫైనల్స్‌కు చేరుకోవడానికి భారత్ ఇతర జట్లపై ఆధారపడాల్సి ఉంటుంది.

భారత్ తదుపరి రెండు మ్యాచ్‌లు వెస్టిండీస్, జింబాబ్వేతో ఉన్నాయి. ఒకవేళ భారత్ రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే 4 పాయింట్లు లభిస్తాయి.

దక్షిణాఫ్రికా కూడా తాను ఆడాల్సిన మిగిలిన రెండు మ్యాచ్ ల్లో గెలిస్తే 6 పాయింట్లు ఉంటాయి. దీంతో టీమిండియాకు సెమీఫైనల్స్ కు అర్హత సాధించడం సులభం అవుతుంది. భారత్ మరో ఓటమిని ఎదుర్కొంటే ప్రపంచకప్ నుంచి పూర్తిగా నిష్క్రమించే ప్రమాదం ఉంది.

అయితే దక్షిణాఫ్రికా కూడా ఓ మ్యాచ్ ఓడిపోతే అప్పుడు, టీమిండియా, దక్షిణాఫ్రికా ఖాతాలో నాలుగేసి పాయింట్లు ఉంటాయి. ఈ రీత్యా చూసినప్పుడు మిగిలిన రెండు జట్లలో ఏదో ఒక జట్టు కూడా నాలుగు పాయింట్లతో నిలిస్తే అప్పుడు నెట్‌ రన్‌రేటు కీలకం అవుతుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)