మహిళలు పడుకుని ప్రసవించడం ఎలా మొదలైంది, క్లియోపాత్రా మోకాళ్లపై నిల్చుని ప్రసవించారా?

మహిళల ప్రసవం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, లూసీ షెరీఫ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 5 నిమిషాలు

సాధారణంగా, మహిళలు పడుకొని ప్రసవించడం ప్రమాదకరం. మరి అలా ఎందుకు చేస్తున్నారు? ఇదంతా ఒక ఫ్రెంచ్ వ్యక్తి వల్ల మొదలైంది. ఆయన ఈ పద్ధతి మహిళల కంటే పురుషులకే (వైద్యులకు) ఎక్కువ సౌకర్యవంతంగా ఉంటుందని నిర్ణయించడమే దీనికి కారణం.

వేల సంవత్సరాల పాటు ప్రపంచవ్యాప్తంగా మహిళలు నిటారుగా ఉండే స్థితిలోనే ప్రసవించేవారు, అది క్లియోపాత్రా మాదిరిగా మోకాళ్ల మీద నిలబడటం కావచ్చు, ప్రసవ పీటలను ఉపయోగించడం కావచ్చు, లేదా కాళ్ల మీద కూర్చోవడం(స్క్వాటింగ్) కూడా కావచ్చు.

నిజానికి, స్క్వాటింగ్ పద్ధతిలో ప్రసవించే సమయంలో కటి ఎముక (పెల్విక్) వ్యాసం కనీసం 2.5 సెంటీమీటర్లు పెరుగుతుంది. గురుత్వాకర్షణ శక్తి తోడవ్వడం వల్ల బిడ్డ బయటకు రావడం మరింత సులభమవుతుంది.

అయితే, ఈరోజుల్లో చాలామంది మహిళలు వెల్లకిలా పడుకొని ఎందుకు ప్రసవిస్తున్నారు?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

"ప్రసవానికి సంబంధించిన శరీర ధర్మశాస్త్రంపై అటు నిపుణుల్లోనూ, ఇటు గర్భిణుల్లోనూ ఒక రకమైన అజ్ఞానం నెలకొని ఉంది" అని యూకేలోని 'యాక్టివ్ బర్త్ సెంటర్' వ్యవస్థాపకురాలు జానెట్ బలాస్కాస్ పేర్కొన్నారు.

తల్లులు తమ ప్రసవ ప్రక్రియను తమ నియంత్రణలోకి ఎలా తెచ్చుకోవచ్చో వివరిస్తూ ఆమె అనేక పుస్తకాలు రచించారు. 1982లో బలాస్కాస్ ఒక "యాక్టివ్ బర్త్ మేనిఫెస్టో"ను ప్రచురించారు, ఇది ఆమె సంస్థకు ప్రధాన సిద్ధాంతంగా మారింది.

"వేల ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా మహిళలు నిటారుగా లేదా వంగి ఉండే భంగిమల్లోనే ప్రసవించారు. జాతి, సంస్కృతి ఏదైనా.. ఇవే భంగిమలు ఎక్కువగా కనిపిస్తాయి" అని ఆ మేనిఫెస్టో పేర్కొంది.

నేడు అభివృద్ధి చెందిన దేశాల్లో చాలామంది మహిళలు ఆసుపత్రుల్లో వెల్లకిలా పడుకొని ప్రసవించే పద్ధతికే అలవాటు పడిపోయారని బలాస్కాస్ చెప్పారు

"ఈ విధానం తర్కానికి విరుద్ధం. ఇది ప్రసవాన్ని క్లిష్టతరం చేస్తుంది. ఖర్చును పెంచుతుంది. సహజ ప్రక్రియను ఒక వైద్యపరమైన సంఘటనగా, ప్రసవ వేదన అనుభవిస్తున్న మహిళను ఒక నిస్సహాయ స్థితిలో ఉన్న రోగిగా మారుస్తుంది. మరే ఇతర జాతి కూడా ఇంత కీలక సమయంలో, ఇలాంటి ప్రతికూల భంగిమను అనుసరించదు" అని తెలిపారు.

ఇతర నిపుణులు కూడా ఈ విషయంతో ఏకీభవిస్తున్నారు.

పడుకుని ప్రసవించడం "ఆధునిక పోకడ" అని ఆస్ట్రేలియాలోని వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ మిడ్‌వైఫరీ ప్రొఫెసర్ హన్నా డాలెన్ 2013లో రాసిన వ్యాసంలో పేర్కొన్నారు.

మహిళల ప్రసవం

ఫొటో సోర్స్, Getty Images

ప్రసవం ఒక 'అనారోగ్యం'గా..

గత 300 నుంచి 400 ఏళ్ల కాలంలోనే మహిళలు ఎక్కువగా వెల్లకిలా పడుకొని ప్రసవించడం మొదలైంది. దీనికి ఫ్రాంకోయిస్ మౌరిసో అనే ఫ్రెంచ్ వ్యక్తి కారణం.

పడుకుని ప్రసవించే పద్ధతి గర్భిణులకు సౌకర్యవంతంగా, వారికి ప్రసవం చేసే పురుష వైద్యులకు (సర్జన్లకు) కూడా అనువుగా ఉంటుందని ఆయన వాదించారు. (అప్పటికే, ప్రసవం చేయడానికి మంత్రసానుల స్థానంలో పురుష వైద్యులను నియమించే ధోరణి మొదలైంది).

అంతేకాదు, ప్రసవాన్ని ఒక అనారోగ్యంగా చూశారు మౌరిసో.

1668లో ఆయన రాసిన 'ది డీసీజెస్ ఆఫ్ విమెన్ విత్ చైల్డ్ అండ్ ఇన్ చైల్డ్ బెడ్' అనే పుస్తకంలో, "ప్రసవం తర్వాత మహిళను మంచం మీదకు చేర్చడానికి బదులు, మంచం మీదే ప్రసవించడం అత్యంత ఉత్తమమైన, సురక్షితమైన మార్గం" అని రాశారు.

అయితే, ప్రసవ భంగిమలో వచ్చిన ఈ మార్పుకు మౌరిసోతో పాటు అదే కాలానికి చెందిన మరో ఫ్రెంచ్ వ్యక్తి.. రాజు లూయిస్ XIV కూడా కారణమని కొందరు పరిశోధకుల వాదన.

అమెరికాలోని మెక్‌డానియల్ కాలేజీలో సోషియాలజీ ప్రొఫెసర్ లారెన్ డండెస్ 1987లో ప్రచురించిన 'ది ఎవల్యూషన్ ఆఫ్ బర్తింగ్ పొజిషన్స్' పరిశోధనా పత్రంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు.

"మహిళల ప్రసవం చూడటం రాజు లూయిస్ ఇష్టపడేవారు. ప్రసవ పీటలు వాడటం వల్ల ఆయనకు ప్రసవ ప్రక్రియ సరిగ్గా కనిపించేది కాదు. అందుకే, పడుకొని ప్రసవించే పద్ధతిని లూయిస్ ప్రోత్సహించారు. రాజు తీసుకున్న ఈ నిర్ణయ ప్రభావం ఎంత అనేది కచ్చితంగా తెలియదు కానీ, రాజకుటుంబీకుల ప్రవర్తన సాధారణ ప్రజలపై కొంత ప్రభావం చూపి ఉంటుంది. లూయిస్ కోరుకున్న మార్పు, ప్రసవ భంగిమలు మారుతున్న కాలంతో సరిపోయాయి. ఇది కూడా ఒక బలమైన కారణమై ఉండవచ్చు" అని లారెన్ డండెస్ పరిశోధనా పత్రంలో రాశారు.

ఈ పద్ధతి ఎలా మొదలైనప్పటికీ, అది మహిళల ప్రసవ అనుభవాన్ని దెబ్బతీసేలా స్థిరపడిపోయింది.

"ప్రసవం అనేది ఒక వ్యవస్థీకృత ప్రక్రియగా మారిపోయింది. సహజ ప్రసవానికి ఎంతో అనుకూలమైన 'ఇంటి వద్ద ప్రసవం' వంటి ఆప్షన్లు క్రమంగా తగ్గిపోతున్నాయి" అని బలాస్కాస్ పేర్కొన్నారు.

మహిళల ప్రసవం, పద్దతులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పడుకుని ప్రసవించే ఈ పద్ధతి 1600ల కాలం నుంచి అలవాటుగా మారిపోయింది, కానీ చాలామంది మహిళలు దాన్ని అసౌకర్యంగా భావిస్తున్నారు.

సైన్స్ ఏం చెబుతోంది?

వేల ఏళ్లుగా మహిళలు నిటారుగా ఉండే భంగిమల్లోనే ప్రసవించడానికి ప్రధాన కారణం గురుత్వాకర్షణ శక్తి.

శిశువు యోని మార్గం గుండా కిందకు రావాల్సి ఉంటుంది, ఈ ప్రక్రియలో గురుత్వాకర్షణ శక్తి ఎంతో సహాయపడుతుంది. ప్రసవ సమయంలో మహిళలకు పూర్తి స్వేచ్ఛనిస్తే, వారు వెనక్కి వాలడానికి బదులు సహజంగానే ముందుకు వంగుతారని ఒక అధ్యయనంలో తేలింది. వారు కూర్చోవడం, చేతులు, మోకాళ్లపై ముందుకు వంగడం లేదా ఏదైనా తక్కువ ఎత్తున్న ఫర్నిచర్‌ను ఆసరాగా చేసుకుని ముందుకు వంగడం వంటి భంగిమలను ఎంచుకుంటారు.

5,200 మందికి పైగా మహిళలపై జరిగిన 25 అధ్యయనాల విశ్లేషణ (2013) ప్రకారం.. మంచంపై పడుకొని కాకుండా, నిటారుగా ఉంటూ అటు ఇటు కదులుతూ ప్రసవించిన వారిలో కొన్ని ముఖ్యమైన ఫలితాలు కనిపించాయి.

వాటిలో "సిజేరియన్ ప్రసవాల ముప్పు తగ్గడం, నొప్పి నివారణ కోసం ఎపిడ్యూరల్ వాడకం తగ్గడం, శిశువులను నియోనాటల్ యూనిట్‌లో చేర్చాల్సిన అవసరం తక్కువగా ఉండటం" వంటివి ఉన్నాయి.

అయితే, హై-రిస్క్ విభాగంలోని మహిళలపై మరిన్ని అధ్యయనాలు అవసరమని, కొన్ని సందర్భాల్లో నిటారుగా ఉండే భంగిమల వల్ల రక్తస్రావం పెరిగే ప్రమాదం ఉందని కూడా ఈ విశ్లేషణ పేర్కొంది. నిటారుగా ఉండే ప్రసవ భంగిమలు ప్రసవ వేదన సమయాన్ని కూడా తగ్గిస్తాయని తేలింది.

2013లో ప్రొఫెసర్ హన్నా డాలెన్ చెప్పిన దాని ప్రకారం, నిటారుగా ఉంటూ ప్రసవించడం తల్లికి, బిడ్డకు ఇద్దరికీ ప్రయోజనకరం. తక్కువ నొప్పి, ఫోర్సెప్స్ లేదా వాక్యూమ్ వాడకం తగ్గడం వంటి ప్రయోజనాలుంటాయి. అంతేకాకుండా, గర్భాశయం వల్ల మహాధమని పీడనానికి గురికాదు. కాబట్టి, గర్భాశయంలో ఉన్న శిశువుకు ఆక్సిజన్ సరఫరా మెరుగ్గా అందుతుంది.

మహిళలు ఎంచుకునే భంగిమలపై ప్రసవం జరిగే చోటు ప్రభావం చూపుతుందో లేదో తెలుసుకోవడానికి 2011లో డాలెన్, ఆమె బృందం ప్రసవ వేదనలో ఉన్న మహిళలపై ఒక అధ్యయనం చేసింది.

వారు రెండు పరిస్థితులను పరిశీలించారు - బర్త్ స్టూల్స్, బాల్స్, బీన్ బ్యాగ్‌ల వంటి సహాయక పరికరాలు అందుబాటులో ఉన్న ప్రసూతి కేంద్రాలు, మరోవైపు మెడికల్ హాస్పిటల్ బెడ్ మాత్రమే ఆప్షన్‌గా ఉన్న డెలివరీ వార్డులు.

ప్రసూతి కేంద్రాలలో 82 శాతం మంది నిటారు భంగిమలను ఎంచుకోగా, డెలివరీ వార్డులలో 25 శాతం మంది మాత్రమే దాన్ని అనుసరించినట్లు తేలింది.

ప్రస్తుతం పాశ్చాత్య దేశాలలో 'యాక్టివ్ బర్త్' అనే అంశంపై అవగాహన పెరుగుతోందని బలాస్కాస్ చెప్పారు.

ప్రసవ సమయంలో తల్లి స్వేచ్ఛగా కదులుతూ తనకు నచ్చిన నిటారు భంగిమలను ఎంచుకోవడాన్ని 'యాక్టివ్ బర్త్' ప్రోత్సహిస్తుంది. అయినప్పటికీ సిజేరియన్ రేట్లు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని ఆమె చెప్పారు.

బ్రిటన్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ అండ్ కేర్ ఎక్సలెన్స్ (నైస్) మార్గదర్శకాలు కూడా ప్రసవ సమయంలో మహిళలు వెల్లకిలా పడుకోవడాన్ని తగ్గించాలని, వారికి సౌకర్యంగా ఉండే ఏ ఇతర భంగిమనైనా ఎంచుకునేలా ప్రోత్సహించాలని సూచిస్తున్నాయి.

మహిళలకు ఎంత అవగాహన ఉంటే, వారు తమకు సరైనది అనిపించే విధానాన్ని ఎంచుకోవడంలో అంత సౌకర్యంగా ఉంటారు.

ప్రజాదరణ పొందిన సాహిత్యం, టెలివిజన్, సినిమాల్లో ప్రసవ ప్రక్రియను తప్పుగా చూపిస్తున్నారని, ఈ విషయంలో సరైన అవగాహన కల్పించడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కెనడాలోని మెక్‌మాస్టర్ విశ్వవిద్యాలయంలో మిడ్‌వైఫరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్న ఐలీన్ హట్టన్ అభిప్రాయపడ్డారు.

గతంలో ప్రసవాలు చేసిన ఐలీన్, ప్రసవంపై అనేక పరిశోధనా పత్రాలు రాశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)