ఏఐ టెక్నాలజీ మనిషిని అంతం చేస్తుందన్న అంశంపై నిపుణులకు నిజంగానే ఆందోళన ఉందా?

- రచయిత, బ్రాండన్ లివ్ సే
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
ఏఐ టెక్నాలజీ మీద పనిచేస్తున్నవారు దాని వృద్ధిలో వేగం, మానవాళిపై అది చూపించే ప్రభావం గురించి నిజంగానే భయపడుతున్నారని ఆంథ్రోపిక్ నుంచి రాజీనామా చేసిన ఏఐ రీసర్చర్ ఒకరు బీబీసీతో చెప్పారు.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను నియంత్రించలేకపోతున్నామని ఆందోళన వ్యక్తంచేస్తూ ఆంథ్రోపిక్ నుంచి జాకబ్ కాక్సన్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామా పోస్ట్ సోషల్ మీడియలో వైరల్‌గా మారింది. బీబీసీ ప్రతినిధి కుయెన్స్బర్గ్తో జాకబ్ కాక్సన్ మాట్లాడారు.
''ప్రస్తుతమున్న అభివృద్ధిస్థాయిని మనం తగ్గించకపోతే సమీప భవిష్యత్తులో మనందరం చనిపోవడానికి చాలా అవకాశం ఉందని నేను బలంగా నమ్ముతున్నా'' అని ఆయన చెప్పారు.
ఏఐ రంగంలో భద్రతపై ఆందోళనలు పెరుగుతున్న సమయంలోనే ఆయన రాజీనామా చేశారు. అభివృద్దిని నెమ్మదింపచేయాలన్న వాదనను జాకబ్ మాజీ బాస్, ఆంథ్రోపిక్ డేరియో అమోడెయ్ సమర్థిస్తున్నారు. ఆయన దీనిపై శనివారం(సెప్టెంబరు 12)ఓ వ్యాసం రాశారు.
అయితే ప్రమాదాలను ఎక్కువచేసి చూపిస్తున్నారని ఏఐ రంగ నిపుణులు కొందరంటున్నారు. రెండు అతిపెద్ద ఏఐ కంపెనీలు స్టాక్మార్కెట్లో ప్రవేశించేముందు వాటి చుట్టూ ఓ హైప్ కలిగించడానికి లేదా పోటీదారుల వేగాన్ని తగ్గించేలా నియంత్రణలు తీసుకురావడానికి ఇలా చెప్తున్నారని వాదిస్తున్నారు.

బ్రిటన్‌కు చెందిన 27ఏళ్ల కాక్సన్ ఏఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వడంపై పరిశోధనలు చేస్తుంటారు. ఎలాన్ మస్క్, ఓపెన్ ఏఐ శామ్ అల్టమాన్ సహా ఏఐ యజమానులు అమోడెయ్లాగే ఆందోళనలు వ్యక్తం చేశారని కాక్సన్ చెప్పారు.
''ఏఐ మానవాళిని స్వాధీనం చేసుకునే అవకాశాలపై జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముందని వాళ్లంతా చెప్పారు. వాళ్లంతా దీనిగురించి మాట్లాడారు. ఏఐ స్వాధీనం చేసుకోవడమంటే మనిషి అంతర్థానమే''అని కాక్సన్ అన్నారు.
అత్యంత కష్టమైన విషయం అలాంటి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడమేనని కాక్సన్ అన్నారు.
‘ఇప్పుడు జరుగుతున్నవన్నీ గతంలో ఫిక్షన్లా భావించినవే’
''మనం చెప్పగలిగే ఏ పరిస్థితి అయినా సైన్స్ ఫిక్షన్లా అనిపిస్తుంది. అయితే గతంలో కల్పితాలుగా అనిపించినవే ఇప్పుడు జరిగాయన్న విషయం గమనించాలి'' అని కాక్సన్ చెప్పారు.
ఏఐ ఏజెంట్లు మెడికల్ లేబరేటరీలను హ్యాక్ చేసి తమంతట తామే ప్రాణాంతక వైరస్‌లను తయారుచేసే పరిస్థితి వచ్చే అవకాశముందని కాక్సన్ అన్నారు. ప్రపంచాన్ని నడిపించే కీలక మౌలికసదుపాయాలను ఏఐ హ్యాక్ చేయడం మరో ఉదాహరణ కావొచ్చన్నారు.
ఓపెన్ ఏఐ ఇటీవల విడుదల చేసిన ఓ రిపోర్ట్‌ను కూడా కాక్సన్ ప్రస్తావించారు. అందులో హగ్గింగ్ ఫేస్ అనే ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌పై ఓపెన్ ఏఐ సొంత సాంకేతికత వరుసగా హ్యాకింగ్ ప్రయత్నాలు చేసిందని ఆయన చెప్పారు.
''ఎవరూ ఎలాంటి ప్రోత్సాహమివ్వకుండానే అవి తమంతటతామే అలా చేశాయి. హ్యాకింగ్ చేయాలని అవే నిర్ణయించుకున్నాయి. సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందడం, అదే సమయంలో పరిస్థితులు మరింత భయంకరంగా మారడం కలిసి ఈ పరిస్థితికి దారితీశాయి'' అని కాక్సన్ చెప్పారు.
సూపర్ కంప్యూటర్లలా పనిచేసే బాట్ల సమూహం ఇంటర్నెట్ మొత్తాన్ని స్వాధీనం చేసుకునే ప్రమాదం గురించి అమోడెయ్ వ్యాఖ్యానించారు.
ఆరు నెలలు లేదా ఏడాది కాలంలో ఇది వాస్తవరూపం దాల్చవచ్చని కాక్సన్ చెప్పారు.
ఆంథ్రోపిక్, ఓపెన్ ఏఐ రికార్డుస్థాయిలో ఐపీవోలకు సిద్ధమవుతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఏఐ వల్ల కలిగే ప్రమాదాల గురించి, దానికున్న శక్తి గురించి వస్తున్న వ్యాఖ్యలు హైప్ పెంచుకోవాలన్న ఉద్దేశంతో కావొచ్చని ఏఐ నిపుణులు భావిస్తున్నారు. పోటీని అడ్డుకునేలా ప్రభుత్వ నియంత్రణలు తీసుకురావడానికి ఆంథ్రోపిక్ ప్రయత్నిస్తుందని, ఇలా జరిగితే ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్ అనే రెండు సంస్థల ఆధిపత్యం మాత్రమే మిగులుతుందని ఇతర నిపుణులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Reuters
‘ఆ భయాందోళన అర్ధరహితం’
ఏఐ ప్లాట్‌ఫామ్ హగ్గింగ్ ఫేస్ సీఈవో క్లెమెంట్ డెలాంగ్యూ కూడా కాక్సన్ అభిప్రాయాలను ప్రశ్నించారు.
'' ఏఐ వల్ల మానవాళి అంతరించిపోయే ప్రమాదం గురించి జాకబ్ కాక్సన్ను అడగడమంటే వాతావరణ మార్పుల గురించి ఏసీ మెకానిక్‌ను అడగడంలాంటిదే. అది ఆసక్తికరమైన అంశం కాదని నేననడంలేదు. కానీ విషయాలను సరైన దృష్టితో చూడాలి'' అని ఆయన వ్యాఖ్యానించారు.
ఆంథ్రోపిక్ యజమాని అమోడెయ్ రాసిన వ్యాసంపైనా డెలాంగ్యూ స్పందించారు. ఆయన సూచించిన పరిష్కారాల్లో భాగం కావడానికి సహాయం చేస్తానని డెలాంగ్యూ అన్నారు.
గతవారం ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్‌మాన్ సాచ్స్ నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో కాక్సన్ వ్యాఖ్యలపై అందరిముందు ఎన్విడియా అధినేత జెన్సెన్ హుయాంగ్ మాట్లాడినట్టు ఆ గ్రూప్‌లోని పలువురు బీబీసీతో చెప్పారు. కాక్సన్ వ్యాఖ్యలను జెన్సెన్ కొట్టిపారేశారని వాళ్లు చెప్పారు.
ఏఐ మనిషిని నాశనం చేయబోతోందన్న ఆందోళన పూర్తిగా అర్ధరహితమని గతంలో జెన్సెన్ అన్నారు.
అయితే, ఆయన అలా మాట్లాడటానికి కారణం ఉండొచ్చు. ఏఐ రంగం అభివృద్ధి చెందితే ఆయనకు వ్యాపారపరంగా ప్రయోజనం ఉంటుంది. ఏఐ వ్యవస్థలకు అవసరమైన చిప్స్‌ను ఎన్విడియా తయారుచేస్తుంది. ఏఐ రంగంలో పనిచేస్తున్న ప్రస్తుత సిబ్బంది, మాజీ సిబ్బంది మానవాళి అంతంపై చేస్తున్న హెచ్చరికలు సిలికాన్ వ్యాలీలో పెరుగుతున్న వ్యతిరేకతకు జెన్సెన్ వ్యాఖ్యలు నిదర్శనం.

ఫొటో సోర్స్, Getty Images
‘ఏఐని కంట్రోల్ చేయలేకపోతున్నారా..?’
పరిశోధన, అభివృద్ధిలో వేగాన్ని తగ్గించడానికి టెక్ దిగ్గజాల మధ్య సమన్వయం కావాలి. అదే సమయంలో చైనాలో జరుగతున్న ఏఐ అభివృద్ధిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఇక్కడే మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశముందని కాక్సన్ చెప్పారు.
''నియంత్రణల గురించి మాట్లాడేటప్పుడు ఈ కంపెనీల్లో పనిచేసేవాళ్లంతా చాలా సీరియస్‌గా ఉంటారు. ఎందుకంటే వారు ఒక పోటీలో చిక్కుకుపోయారు. ఆ పోటీ నుంచి బయటకు రావడానికి వాళ్లు భయపడుతుంటారు'' అని ఆయన అన్నారు.
''వాళ్లంతా వచ్చే రెండేళ్లలో మనిషికి ఏమవుతుందనేదానిపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. తమ జీవితాల్లో ఇకపై ఏం చేయాలనేదానిపై కూడా వారు ప్లాన్ చేస్తున్నారు'' అని ఆయన తెలిపారు.
అయితే ఏఐ భవిష్యత్‌పై కొంత ఆశావాదం ఉందని కాక్సన్ బీబీసీతో చెప్పారు. వ్యాధులను నయం చేయడం, ప్రతి ఒక్కరి జీవితాన్ని మెరుగుపరచడం వంటి ఏఐ వల్ల కలిగే ప్రయోజనాలను చూడాలని తాను నిజంగా కోరుకుంటున్నానని ఆయన అన్నారు.
ఏఐపై ఆయన చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో లక్షలసార్లు షేరయ్యాయి. కాక్సన్‌తో తాను ఏకీభవిస్తున్నానని ఆంథ్రోపిక్ సైంటిస్ట్ ఎవన్ హబింగర్ 'ఎక్స్'లో రాశారు.
''ఏఐ మనుషులందరినీ చంపేయగలదని మేం నిజంగానే నమ్ముతున్నాం. వచ్చే దశాబ్దంలో ఇలా జరిగే అవకాశం పదిశాతానికిపైగా ఉందని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నా'' అని హ్యూబింగర్ చెప్పారు.
ఏఐ రంగంలో ప్రముఖులు ఈ సాంకేతిక వల్ల ఎదురయ్యే ముప్పు గురించి కొన్నేళ్లగా హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. ఓపెన్ ఏఐ, గూగుల్ డీప్‌మైండ్, ఆంథ్రోపిక్ సంస్థల అధిపతులు కూడా 2023లోనే దీని గురించి మాట్లాడారు.
ఈ హెచ్చరికలు ఇటీవలివారాల్లో మరింత తీవ్రమయ్యాయి. ఏఐ సాంకేతికను నియంత్రించడంలో కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయనే ఆధారాలు బయటకు వస్తుండడంతో ఆందోళనలు పెరిగాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























