అన్నం కోసం ఒకప్పుడు చెత్తకుప్పల్లో వెతుక్కున్న ఆమె, తర్వాత బిలియనీర్ ఎలా అయ్యారు? మళ్లీ ఎందుకు దివాలా తీశారు?

నాస్టీ గాళ్, సోఫియా అమరుసో, అమెరికా, ఈబే, బట్టల వ్యాపారం

ఫొటో సోర్స్, MICHAEL TRAN/AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, సోఫియా అమరుసో
    • రచయిత, క్రిస్టినా జె ఒర్గాజ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 8 నిమిషాలు

ఒక దశలో ఆమె సంపదలో ప్రపంచ ప్రఖ్యాత పాప్ సింగర్ బియాన్సేను దాటేశారు. అయితే ఆ స్థాయికి చేరుకోవడానికి ముందు సోఫియా అమరుసో ఆహారం కోసం చెత్తకుప్పల్లో వెతుక్కున్న సందర్భాలు ఉన్నాయి. పుస్తకాలు దొంగతనం చేయడం, లిఫ్ట్‌ అడిగి ప్రయాణం చేయడంలాంటివి కూడా ఆమెకు తెలుసు.

ఆ తర్వాతి కథంతా సాధారణంగా ఒక వ్యక్తి ఎదుగుదల, పతనం లాగే అనిపించవచ్చు. కానీ బీబీసీ వరల్డ్ సర్వీస్ 'బిజినెస్ డైలీ' కార్యక్రమంలో సోఫియా అమరుసో ఒక విషయం చెప్పారు.

ఆమెను బిలియనీర్‌గా మార్చిన 'నాస్టీ గాళ్' అనే దుస్తుల బ్రాండ్‌ను స్థాపించడానికి గల ఏకైక కారణం ఆమెకు ఉద్యోగం చేయడం మీద ఇష్టం లేకపోవడమే.

పైకి ఎదగడానికి ఒక మార్గం ఉన్నప్పుడు ఉదయం 9 -5 ఆఫీసు పనిగంటల చక్రంలో ఇరుక్కోవడం ఆమెకు అస్సలు నచ్చలేదు.

2012 నాటికి ఆమె బ్రాండ్ అమెరికాలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రిటైల్ కంపెనీగా అవతరించిందని 'ఇంక్' (Inc.) మ్యాగజైన్ తెలిపింది. ఆమె ప్రారంభించిన నాస్టీ గాళ్ ఆదాయం 100 కోట్ల డాలర్లు ( సుమారు రూ. 956 కోట్లు) దాటింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
నాస్టీ గాళ్, సోఫియా అమరుసో, అమెరికా, ఈబే, బట్టల వ్యాపారం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2017లో నాస్టీ గాళ్ ఆస్తులను బ్రిటిష్ సంస్థ బూహూ 2 కోట్ల అమెరికన్ డాలర్లకు కొనుగోలు చేసింది.

"టీనేజర్‌గా ఉన్నప్పుడు నాకు పెట్టుబడిదారీ విధానం అసలు నచ్చేది కాదు. నేను అనార్కిస్ట్ బుక్స్ అమ్మే ప్రదర్శనలకు వెళ్లేదాన్ని. ఈ వ్యవస్థలో బతకడం నాకు ఇష్టం లేదు. వ్యాపారం ప్రారంభించాలనే బలమైన కోరిక కూడా లేదు. కేవలం ఉద్యోగం చేయకూడదు అనుకునే ప్రయత్నంలో నాకే తెలియకుండా చాలా సరదాగా ఉండే ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాను" అని ఆమె ఆ రేడియో కార్యక్రమంలో చెప్పారు.

2006లో ఆమె దగ్గర డబ్బులు లేవు. భవిష్యత్తులో ఏం చేయాలనే దానిపై స్పష్టత లేదు. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం, హెర్నియా సర్జరీకి డబ్బులు చెల్లించడం కోసం ఒక ఆర్ట్ స్కూల్ లాబీలో ఐడీ కార్డులను చెక్ చేసే ఉద్యోగంలో చేరారు.

ఆ లాబీలో కూర్చునే రోజుల్లోనే పాతకాలపు స్టైలిష్ దుస్తులను ఈబేలో అమ్మాలని సోఫియా నిర్ణయించుకున్నారు.

నాస్టీ గాళ్, సోఫియా అమరుసో, అమెరికా, ఈబే, బట్టల వ్యాపారం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నాస్టీగాళ్‌బ్రాండ్ సంచలనంగా మారి సోఫియాను మహిళా పారిశ్రామికవేత్తలకు ఆదర్శంగా నిలబెట్టింది.

అలా మొదలైంది

ఆన్‌లైన్‌లో అమ్మకాలు చేయడం ఆమెకు అదే మొదటిసారి కాదు. అంతకుముందు అమెజాన్ ద్వారా పుస్తకాలను అమ్మేవారు.

ఆమె ఎంచుకున్న రెండో ప్లాట్‌ఫామ్ ఈబే. అక్కడ ఆమె సరికొత్త శైలితో వింటేజ్ క్లాత్ స్టోర్‌ను ప్రారంభించారు.

అది వీధుల్లో ఉండే యువతను బాగా ఆకట్టుకుంది. చనిపోయిన వారి వస్తువుల నుంచి ఆమె ఈ వింటేజ్ దుస్తులను సేకరించేవారు.

ఆ పాత దుస్తులను తన స్నేహితురాళ్లతో రీ మోడలింగ్ చేయించి వాటిని చాలా స్టైలిష్‌గా మార్చవచ్చని ఆమెకు తెలుసు.

ఇదంతా గ్రహించిన తర్వాత ఇతర దుస్తుల దుకాణాలు ఏం అమ్ముతున్నాయి? ఏవి బాగా నడుస్తున్నాయి? డిజైనర్లు దేని నుంచి స్ఫూర్తి పొందుతున్నారు? వారు రన్‌వేలపై వేల డాలర్లకు వేటిని అమ్ముతున్నారు గమనించడం ప్రారంభించారు.

"ఆ దుస్తులు తక్కువ ధరకు ఎక్కడ దొరుకుతాయో నాకు తెలుసు. పైగా నాలో సృజనాత్మకత ఉంది" అని ఆమె చెప్పారు.

అలా 'నాస్టీ గాళ్' ప్రయాణం మొదలైంది. బెట్టీ డేవిస్ ఆల్బమ్ నుంచి ఆమె ఈ పేరు తీసుకున్నారు.

అయితే ఆమె దీనికోసం సొంత వెబ్‌సైట్‌ను ప్రారంభించాలనుకున్నప్పుడు, ఆ డొమైన్ అంతకుముందు ఒక పోర్న్ సైట్‌కు ఉండేదని తెలిసింది.

"ఏడాదిన్నర పాటు నేనే స్వయంగా అన్ని పనులు చేసుకున్నాను. ఫోటోలు తీయడం, వాటిని ఎడిట్ చేయడం, దుస్తులు ధరలను నిర్ణయించడం, వాటి వివరాలు రాయడం, బరువు చూడటం, కొలతలు తీయడం, పోస్ట్ చేయడం లాంటివన్నీ నేనే చేశాను. అన్ని వేలం పాటలు 9.99 డాలర్ల వద్ద మొదలయ్యేవి. నేను దాన్ని అద్భుతంగా చూపించి, మంచి యాటిట్యూడ్, స్టైల్ ఉన్న అమ్మాయికి తొడిగితే దానికి కచ్చితంగా మంచి విలువ వచ్చేది" అని ఆమె గుర్తుచేసుకున్నారు.

నాస్టీ గాళ్, సోఫియా అమరుసో, అమెరికా, ఈబే, బట్టల వ్యాపారం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నాస్టీ గాళ్‌ ప్రయాణాన్ని నెట్‌ఫ్లిక్స్ టెలివిజన్ సిరీస్‌గా రూపొందించింది.

బ్రాండ్‌తో భావోద్వేగ బంధం

ఈ బ్రాండ్ సరికొత్త ఇమేజ్ అమరుసో ఆలోచనా విధానానికి సరిగ్గా సరిపోయింది.

2014లో ప్రచురించిన తన #GIRLBOSS అనే పుస్తకంలో మహిళల కోసం ఫిలాసఫీని వివరించారు.

‘‘#GIRLBOSS అంటే తాను కోరుకున్నది సాధించే వ్యక్తి ఎందుకంటే ఆమె దాని కోసం కష్టపడతారు కాబట్టి’’ అని అమరుసో వివరించారు.

"#GIRLBOSS (మహిళా సాధికారత) సాధించిన వారు నియంత్రణను, బాధ్యతను తమ చేతుల్లోకి తీసుకుంటారు. మీరొక ఫైటర్. ఎప్పుడు ఎదురుదెబ్బ కొట్టాలో, ఎప్పుడు దెబ్బలు తినాలో మీకు తెలుసు. కొన్నిసార్లు మీరు నిబంధనలను ఉల్లంఘిస్తారు. కొన్నిసార్లు పాటిస్తారు. కానీ అది ఎప్పుడూ మీ సొంత ఆలోచన ప్రకారమే జరుగుతుంది" అని ఆమె రాశారు.

"మీరు ఎక్కడికి వెళ్లాలో మీకు తెలుసు, కానీ దారిమధ్యలో ఆనందాన్ని అనుభవించకుండా అక్కడికి చేరుకోలేరు. మీరు పర్ఫెక్ట్ గా ఉండటం కంటే నిజాయితీగా ఉండటానికే ప్రాధాన్యత ఇస్తారు. మీరు ప్రశ్నలు అడుగుతారు. మీరు జీవితాన్ని సీరియస్‌గా తీసుకుంటారు కానీ మిమ్మల్ని కాదు" అని ఆ పుస్తకంలో రాసుకొచ్చారు.

కస్టమర్లు కేవలం బట్టలకే కాకుండా బ్రాండ్‌తో పాటు అమరుసో సృష్టించిన స్టైల్‌కు పూర్తిగా కనెక్ట్ అయ్యారు.

దీని వెనుక చాలా మంది మహిళలు తమను తాము పోల్చుకునేలా ఒక బలమైన కమ్యూనిటీ ఏర్పడింది. ఒక భావోద్వేగ బంధంగా మారింది. అంతా చాలా వేగంగా పుంజుకోవడం మొదలైంది.

"చివరికి ప్రసిద్ధ నటి అన్నే హాత్వే కూడా నా దగ్గర వస్తువులను కొనుగోలు చేశారు. జర్నలిస్టులు ఫ్యాషన్ రైటర్లు కూడా నా ఉత్పత్తులు కొనేవారు" అని ఆమె చెప్పారు

"వెబ్‌సైట్‌ ప్రారంభించిన 24 గంటల్లోనే అన్నీ అమ్ముడైపోయాయి. సైట్‌లో ఏమీ మిగల్లేదు. నా దగ్గర కొన్ని ప్యాకేజీలు ఉన్నాయి. అప్పుడు నాకొకటి తెలిసింది. ఐటమ్స్ సైట్‌లో పెట్టి వాటిని వేలం వేసిన తర్వాత మరో వారం రోజులు ఆగాల్సిన అవసరం లేదని. ఇది నిరంతరం, శాశ్వతంగా కొనసాగుతుందని నాకు అర్థమైంది. అప్పుడే నేను నా తొలి ఉద్యోగిని నియమించుకున్నాను" అని అమరుసో తన బిజినెస్ తొలి రోజుల్ని గుర్తు చేసుకున్నారు.

ఆమె మొదటి సంవత్సరంలో దాదాపు 75వేల డాలర్లు, రెండో ఏడాది 2.50 లక్షల డాలర్లు, మూడో ఏడాది 11 లక్షల డాలర్లు, నాలుగో సంవత్సరం 65 లక్షల డాలర్లు సంపాదించారు. ఐదో ఏడాది ఆమె సంపాదన 3 కోట్ల డాలర్లకు ( రూ.286 కోట్లు) చేరుకుంది.

ఆ ఎదుగుదల వెనుక ఎలాంటి ఇన్వెస్టర్ల మద్దతు లేదు. వ్యాపార ప్రారంభ రోజుల్లో కూడా ఎవరూ ఆమెను పట్టించుకోలేదు.

వ్యాపారం పుంజుకున్న తర్వాత కీర్తి, డబ్బు ఆమె తలుపు తట్టాయి.

నాస్టీ గాళ్, సోఫియా అమరుసో, అమెరికా, ఈబే, బట్టల వ్యాపారం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఈబేలో వింటేజ్ దుస్తులను అమ్మడం ద్వారా సోఫియా అమరుసో తన వ్యాపారాన్ని ప్రారంభించారు.

అత్యంత సంతోషకరమైన సమయం

ఎలాంటి సంకోచం లేకుండా ఒక వెంచర్ క్యాపిటల్ ఫండ్ 'నాస్టీ గాళ్' ను 35 కోట్ల డాలర్ల( రూ.3,344 కోట్లు) విలువైన టెక్ కంపెనీగా అంచనా వేసింది.

ఎందుకంటే అప్పట్లో డిజిటల్ కామర్స్ బాగా పుంజుకుంటోంది.

కంపెనీ విస్తరణ కోసం కొంత వాటాకు బదులుగా వారికి 5 కోట్ల డాలర్లు (రూ.477 కోట్లు) ఇచ్చారు.

అక్కడి నుంచే విషయాలు తలకిందులు కావడం ప్రారంభమయ్యాయని అమరుసో నమ్ముతారు.

"చాలా కాలం వరకు ఆ దశ చాలా సరదాగా సాగింది. నేను కంపెనీ ఆదాయాన్ని 10 కోట్ల డాలర్ల కంటే ఎక్కువకు పెంచాను. అత్యుత్తమ ప్రతిభావంతులను నియమించుకున్నాను. ఉత్తమ క్రియేటివ్ డైరెక్టర్లతో పనిచేశాను" అని ఆమె గుర్తుచేసుకున్నారు.

"నా ఆఫీసులు అందంగా ఉండేవి. బిజినెస్‌లో క్రియేటివ్ వ్యక్తుల జాబితాలో నేను ఉన్నాను. డ్రీమ్‌వర్క్స్ యానిమేషన్ వ్యవస్థాపకుడు జెఫ్రీ కాట్జెన్‌బర్గ్‌తో మాట్లాడటానికి గూగుల్ కంపెనీ నన్ను కాన్స్ లయన్స్ (యాడ్ అండ్ మార్కెటింగ్ రంగంలో ఆస్కార్ వంటిది)కి తీసుకెళ్లింది" అని ఆమె చెప్పారు.

"నాస్టీ గాళ్ చాలామంది కెరీర్‌లో అద్భుతమైన సమయం. నాస్టీ గాళ్‌ నుంచి స్వచ్ఛందంగా లేదా అపరాధభావంతో తప్పుకున్న చాలా మంది వ్యక్తులు ఆ తర్వాత అద్భుతమైన విజయాలు సాధించారు. దానికి నేను ఎంతో గర్విస్తున్నా" అని అమరుసో అన్నారు.

నాస్టీ గాళ్, సోఫియా అమరుసో, అమెరికా, ఈబే, బట్టల వ్యాపారం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నాస్టీగాళ్ బ్రాండ్ ఏటేటా లాభాలు ఆర్జిస్తూ వేగంగా ఎదిగింది.

"కూలిపోవడం ప్రారంభమైంది"

2008 - 2011 మధ్య అమ్మకాలు 10 వేల శాతానికి పైగా పెరిగాయి. అయితే అమ్మకాలు పెరిగినంత మాత్రాన ఆదాయం వస్తున్నట్లు కాదు.

"కంపెనీ విలువను మా ఆదాయం కంటే 10 రెట్లు ఎక్కువగా అంటే రూ.3,350 కోట్లుగా అంచనా వేసినప్పుడు విషయాలు క్లిష్టంగా మారాయి. మేమేదో ఉబెర్ లాగా ఎదుగుతాం అనుకున్నారు. కానీ ఫ్యాషన్ వ్యాపారాలు ఆ విధంగా వేగంగా విస్తరించడానికి సిద్ధంగా ఉండవు" అని ఆమె రేడియో కార్యక్రమంలో చెప్పారు.

"కంపెనీ ప్రయోజనాలు లేదా వ్యవస్థాపకుల ప్రయోజనాలతో ఇన్వెస్టర్ల ప్రయోజనాలు ఎల్లప్పుడూ ఏకీభవించకపోవచ్చని బ్రాండ్ వ్యవస్థాపకులు గ్రహించాలి" అని అమరుసో చెప్పారు

నాస్టీగాళ్ దివాలా తీసే సమయానికి దాన్ని ఏదైనా పెద్ద సంస్థ కొనుగోలు చేసేలా చేయడానికి నెలల తరబడి ప్రయత్నాలు జరిగాయి.

"మీరు రాత్రికి రాత్రే దివాలా తీయరు. మేము మా సప్లయర్లకు డబ్బులు చెల్లించలేకపోతున్నాం. వ్యాపారాన్ని ఇలాగే కొనసాగించడం బాధ్యతారాహిత్యం కాబట్టి దాన్ని మూసివేయాలని నేను గ్రహించాను" అని ఆమె చెప్పారు.

నాస్టీ గాళ్ సంస్థాగతంగా బలోపేతం కావడానికి ముందే చాలా వేగంగా అభివృద్ధి చెందింది.

2014లో సంస్థ ఆదాయం దాదాపు 85 లక్షల డాలర్లకు పడిపోయింది. అమరుసో జనవరి 2015లో సీఈఓ పదవి నుంచి తప్పుకున్నారు.

ఆ బాధ్యతలను షెరీ వాటర్‌సన్‌కు అప్పగించారు. ఆమె ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు.

ఆ తర్వాత ఉద్యోగులను తీసివేయడం మొదలైంది. "అంతా కూలిపోవడం ప్రారంభమైంది" అని ఆమె చెప్పారు.

నాస్టీ గాళ్, సోఫియా అమరుసో, అమెరికా, ఈబే, బట్టల వ్యాపారం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నాస్టీగాళ్ స్టోర్ దగ్గర కస్టమర్లు

'కేవలం లోగోను మాత్రమే కొనుగోలు చేశారు'

2017లో ఫిబ్రవరిలో మాంచెస్టర్‌కు చెందిన ఫాస్ట్ ఫ్యాషన్ గ్రూప్ 'బూహూ' నాస్టీ గాళ్‌ను 2 కోట్ల డాలర్ల (రూ.191 కోట్లు) కు కొనుగోలు చేసింది. కానీ అక్కడ చేతులు మారింది కేవలం మేధో సంపత్తి, నాస్టీ గాళ్ పేరు, లోగో, వెబ్‌సైట్ లింక్‌లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, బ్రాండ్ ఇమేజ్, కస్టమర్ డేటాబేస్ మాత్రమే..

అది కంపెనీని, సిబ్బందిని, ఆపరేషన్లు, బాకీ ఉన్న రిటర్న్‌లు, స్టోర్ క్రెడిట్‌లను నిర్వహించే చట్టపరమైన బాధ్యతను తీసుకోలేదు. బూహూ కొనుగోలు చేసింది కేవలం ఒక ఆడియన్స్‌ని మాత్రమే.

ప్రస్తుతం అమరుసోకి 42 ఏళ్లు. నాస్టీగాళ్ తర్వాత అమరుసో 'గర్ల్‌బాస్ మీడియా' అనే మీడియా కంపెనీని ప్రారంభించారు.

ఇందులో ఒక పుస్తకం, 22 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లు ఉన్న ఒక పాడ్‌కాస్ట్ ఉన్నాయి. ఆ కంపెనీని కూడా ఆమె ఆమ్మేశారు.

2023 నుంచి ఆమె ప్యారిస్ హిల్టన్ వంటి ప్రముఖుల మద్దతు ఉన్న 'ట్రస్ట్ ఫండ్' అనే చిన్న వెంచర్ క్యాపిటల్ ఫండ్‌ను నడుపుతున్నారు.

ఆమె ఫిలాసఫీ ఇప్పటికీ ఆమె ప్రాజెక్ట్‌లలో ప్రతిబింబిస్తూనే ఉంది. అదేంటంటే

"అమ్మాయిలు ప్రపంచాన్ని శాసిస్తున్నారు"

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)