బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ 2025: అయిదుగురు నామినీలు వీరే

ఇండియన్ స్పోర్ట్స్ విమెన్ ఆఫ్ ది ఇయర్
చదివే సమయం: 7 నిమిషాలు

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ (ఐస్వోటీ, ISWOTY) ఆరవ ఎడిషన్ నామినీల పేర్లు విడుదలయ్యాయి.

ఈ ఏడాది ఈ అవార్డు కోసం క్రికెటర్లు హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, చెస్ క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్, షూటర్ సురుచి సింగ్, అథ్లెట్ జ్యోతి యర్రాజి పోటీలో నిలిచారు.

2025లో భారత క్రీడాకారిణులు అందించిన కృషికి గాను, క్రీడల్లో మహిళలందరూ సాధించిన విజయాలకు గౌరవంగా ఈ అవార్డును బీబీసీ అందిస్తోంది.

బీబీసీ ఏర్పాటుచేసిన ఓ ప్యానెల్ ఈ అవార్డు కోసం అయిదుగురు భారతీయ క్రీడాకారిణులను నామినీలుగా ఎంపిక చేసింది.

భారత్‌లోని ప్రముఖ క్రీడా జర్నలిస్టులు, నిపుణులు, రచయితలతో ఈ ప్యానెల్ ఏర్పాటైంది. బీబీసీ మొదటిసారి గ్రాండ్‌ జ్యూరీని ఏర్పాటు చేసింది. ఈ జ్యూరీ సభ్యులే విజేతలను నిర్ణయిస్తారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గ్రాండ్ జ్యూరీలో టెన్నిస్ ప్రముఖ క్రీడాకారుడు లియాండర్ పేస్, లాంగ్ జంప్ క్రీడాకారిణి అంజు బాబీ జార్జ్, పారా-అథ్లెట్ దీపా మాలిక్ ఉన్నారు. విజేతలకు ఫిబ్రవరి 16న జరిగే కార్యక్రమంలో అవార్డును అందిస్తారు.

అవార్డుల వేడుకలో 'స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు'తో పాటు మరో మూడు కేటగిరీల్లో జ్యూరీ నామినేట్ చేసిన మరో ముగ్గురు క్రీడాకారిణులను బీబీసీ అవార్డులతో సత్కరిస్తుంది.

పారా స్పోర్ట్స్‌లో అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించినందుకు 'బీబీసీ పారా స్పోర్ట్స్‌ వుమన్ ఆఫ్ ది ఇయర్' అవార్డును, యువ అథ్లెట్ సాధించిన విజయాలకు ప్రతీకగా 'బీబీసీ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్' అవార్డును, క్రీడల్లో అనుభవజ్ఞులైన క్రీడాకారిణులు చేసిన అసమాన కృషికి గుర్తుగా 'బీబీసీ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్' అవార్డును బీబీసీ అందించనుంది.

''దేశవ్యాప్తంగా క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన మహిళలకు గుర్తింపుగా ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ నిలుస్తుంది. మరే ఇతర మీడియా సంస్థ సెలబ్రేట్ చేయని విధంగా, వీరి ఘనతను ప్రపంచానికి చాటిచెప్పడంలో బీబీసీ వరల్డ్ సర్వీసు కీలక పాత్ర పోషిస్తోంది. ఈ మహిళలు కష్టపడి సాధించిన విజయాలను భారత్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు తెలియజేయడానికి మేం ఒక గొప్ప వేదికను అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది'' అని బీబీసీ వరల్డ్ సర్వీస్ ఇంటెరిమ్ గ్లోబల్ డైరెక్టర్ ఫియొనా క్రాక్ చెప్పారు.

ఈ కార్యక్రమం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ఆధ్వర్యంలో జరుగుతోంది.

''పెళ్లి, వయసు, శరీరాకృతి, వైకల్యం కారణంగా మహిళలను తరచూ క్రీడల నుంచి దూరంగా ఉండాలని నిరుత్సాహపరుస్తుంటారు. 'ఎవ్రీబడీ కెన్ ప్లే' (ప్రతి ఒక్కరూ ఆడగలరు) అనేది ఈ ఏడాది ఎడిటోరియల్ థీమ్. క్రీడలు ప్రతిఒక్కరివీ అనే ఒక సాధారణ ఆలోచనను ఇది బలపరుస్తుంది. క్రీడల నిజమైన ప్రభావం వాటి ఫలితాలను బట్టి కాకుండా, ప్రతి ఒక్కరినీ కలుపుకుంటూ, వారికి అందించే అవకాశాలను బట్టి ఉంటుంది. ధైర్యంగా ఈ రంగంలోకి అడుగుపెట్టి, తమకంటూ ఒక స్థానాన్ని కోరుకున్న ప్రతి ఒక్క మహిళ ఘనతను ISWOTY వేడుకగా చేస్తోంది'' అని కలెక్టివ్ న్యూస్‌రూమ్ సీఈవో, ఎడిటర్-ఇన్-చీఫ్ రూపా ఝా చెప్పారు.

నామినీలు ఎవరంటే..

దివ్య దేశ్‌ముఖ్, చెస్
దివ్య దేశ్‌ముఖ్, చెస్

20 ఏళ్ల చెస్ క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్, జులైలో జరిగిన ఫిడే (FIDE) మహిళల ప్రపంచకప్‌లో చాంపియన్‌గా నిలిచి, ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా, అత్యంత పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించారు.

ఈ గెలుపుతో గ్రాండ్‌ మాస్టర్ హోదాను ఆమె సొంతం చేసుకున్నారు. ఫైనల్స్‌లో.. గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన తొలి భారతీయ మహిళ కోనేరు హంపీని దేశ్‌ముఖ్ ఓడించడంతో, ఒక తరం నుంచి మరో తరానికి వారసత్వ బాధ్యతలను అందజేసిన క్షణంగా ఇది నిలిచింది.

2005లో నాగ్‌పూర్‌లో జన్మించిన దేశ్‌ముఖ్, ఐదేళ్ల వయసున్నప్పటి నుంచే చెస్ ఆడటం మొదలుపెట్టారు. రెండేళ్లలోనే అండర్-7 నేషనల్ చాంపియన్‌గా అవతరించారు.

2017లో బాలికల అండర్ -12 కేటగిరీలో వరల్డ్ యూత్ చెస్ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు.

2022లో చెన్నైలో జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్టు కాస్య పతకం గెలుచుకోవడంలో ఆమె కీలక పాత్ర పోషించారు.

రెండేళ్ల తర్వాత, వ్యక్తిగత కేటగిరీలో బంగారు పతకం కైవసం చేసుకుని మరింత కీర్తిని సాధించారు. అగ్రస్థానంలో నిలిచిన జట్టులో కూడా సభ్యురాలిగా ఉన్నారు.

హర్మన్‌ ప్రీత్ కౌర్, క్రికెట్
హర్మన్‌ ప్రీత్ కౌర్, క్రికెట్

2025లో ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్‌ను తొలిసారిగా భారత జట్టు గెలుచుకుంది. ఆ జట్టుకు కెప్టెన్‌గా హర్మన్ ప్రీత్ కౌర్ వ్యవహరించారు.

సొంత గడ్డపై జరిగిన ఈ టోర్నీ సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. ఆమె 88 బంతుల్లో 89 పరుగులు చేసి జట్టును ముందుండి నడిపించారు.

అలాగే, 2017 వరల్డ్‌కప్ సెమీఫైనల్‌లోనూ ఆస్ట్రేలియాపై హర్మన్ ప్రీత్‌ కౌర్ 171 (నాట్ అవుట్) పరుగుల ఇన్నింగ్స్, మహిళల క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఒకటిగా నిలిచింది.

పంజాబ్‌లోని క్రీడాభిమానులైన దంపతులకు హర్మన్ ప్రీత్‌కౌర్ 1989లో జన్మించారు. తండ్రి ఆమె కోసం "గుడ్ బ్యాటింగ్" అని రాసి ఉన్న టీ-షర్టును కొన్నారు.

2009లో అరంగేట్రం చేసినప్పటి నుంచి భారత జట్టులో కీలక బ్యాటర్‌గా నిలుస్తూ, ఆ టీ-షర్టుపై ఉన్న మాటను హర్మన్‌ ప్రీత్‌ కౌర్ నిజం చేశారు.

2023లో టైమ్ మేగజీన్ 'టాప్ 100 ఎమర్జింగ్ లీడర్స్', బీబీసీ '100 అత్యంత స్ఫూర్తివంతమైన మహిళల' జాబితాల్లో చోటు దక్కించుకున్నారు.

2017లో భారత రెండో అత్యున్నత క్రీడా పురస్కారం 'అర్జున అవార్డు'ను కూడా అందుకున్నారు.

2026లో క్రీడల విభాగంలో మహిళల వన్డే ప్రపంచ కప్ విజేత కెప్టెన్ హర్మన్‌ ప్రీత్ కౌర్‌కు 'పద్మశ్రీ' పురస్కారం లభించింది.

స్మతి మంధాన, క్రికెటర్
స్మతి మంధాన, క్రికెటర్
ఫొటో క్యాప్షన్, స్మతి మంధాన, క్రికెటర్

భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, ఇప్పటికే ఈ క్రీడలో ఆల్-టైమ్ గ్రేట్ ప్లేయర్స్‌ సరసన స్థానం సంపాదించుకునే దిశగా దూసుకుపోతున్నారు.

29 ఏళ్ల ఈ ఎడమ చేతి వాటం కలిగిన బ్యాటర్‌, మహిళల వన్డే క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన రెండో క్రీడాకారిణిగా, ప్రస్తుత ఆటగాళ్లలో అత్యధిక పరుగులు చేసిన మూడో క్రీడాకారిణిగా గుర్తింపు పొందారు.

మహారాష్ట్రలోని సాంగ్లీ ప్రాంతంలో జన్మించిన మంధాన, జిల్లా స్థాయిలో క్రికెట్ ఆడిన తన తండ్రి, సోదరుడిని చూసి స్ఫూర్తిని పొందారు.

2013లో జోనల్ అండర్-19 టోర్నమెంట్‌లో దేశీవాళీ వన్డే మ్యాచులో డబుల్ సెంచరీ సాధించిన తొలి భారతీయ మహిళగా ఆమె రికార్డు సృష్టించారు.

గతేడాది సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాపై కేవలం 50 బంతుల్లోనే శతకం పూర్తి చేశారు. విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొడుతూ.. పురుషుల లేదా మహిళల క్రికెట్ అనే తేడా లేకుండా వన్డేల్లో టీం ఇండియా తరఫున అత్యంత వేగవంతమైన శతకాన్ని నమోదు చేశారు.

ఆమె 2018, 2021లో రెండుసార్లు 'ఐసీసీ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్'గా ఎంపికయ్యారు. అలాగే 2019లో ప్రతిష్ఠాత్మకమైన 'అర్జున అవార్డు'ను అందుకున్నారు.

సురుచి సింగ్, షూటర్
సురుచి సింగ్, షూటర్

షూటర్లు అందించడంలో మంచి రికార్డు ఉన్న ప్రాంతం హరియాణా. ఈ ప్రాంతానికి చెందిన సురుచి సింగ్ నేషనల్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో ఏడు బంగారు పతకాలు సాధించి 2024లో వార్తల్లోని వ్యక్తిగా నిలిచారు.

19 ఏళ్ల సురుచి సింగ్, ఏడాది తిరగకముందే అంతర్జాతీయ సీనియర్ విభాగంలోకి ప్రవేశించి, ప్రపంచవేదికపై తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకున్నారు.

2025లో బ్యూనస్ ఎయిర్స్(Buenos Aires), లిమా, మ్యూనిచ్‌లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ సిరీస్‌లో వ్యక్తిగత విభాగంలో బంగారు పతకాలు సాధించి, అరుదైన గోల్డెన్ ట్రెబుల్‌ను (ఒకే సిరీస్‌లో మూడు బంగారు పతకాలు గెలుపొందడం) పూర్తి చేసుకున్నారు. లిమాలో జరిగిన మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో ఆమె బంగారు పతకాన్ని దక్కించుకున్నారు.

కజకిస్తాన్‌లో జరిగిన 2025 ఏషియన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో మను భాకర్, పలక్ గులియాలతో కలిసి మహిళల టీమ్ విభాగంలో ఆమె కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.

సెప్టెంబర్‌లో జరిగిన ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్‌కు చెందిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో టాప్ ర్యాంకు సాధించిన మహిళా షూటర్‌గా నిలిచారు.

జ్యోతి యర్రాజీ, అథ్లెటిక్స్
జ్యోతి యర్రాజీ, అథ్లెటిక్స్

అత్యున్నత స్థాయి అథ్లెటిక్ పోటీల్లో అరుదుగా విజయాలు సాధించిన దేశంలో, 2024 పారిస్ గేమ్స్‌లో ఒలింపిక్స్ 100 మీటర్ల హర్డిల్స్‌లో అర్హత సాధించిన తొలి భారతీయ మహిళగా యర్రాజీ నిలిచారు.

నిజానికి అడ్డంకులను అధిగమించడం 26 ఏళ్ల యర్రాజీకి కొత్త కాదు. ఆమె పేద కుటుంబం నుంచి వచ్చారు. తన తండ్రి సెక్యూరిటీ గార్డుగా, తల్లి పని మనిషిగా పనిచేశారు.

2022లో 100 మీటర్ల హర్డిల్స్‌ను కేవలం 13.23 సెకన్లలో పూర్తి చేసి, జాతీయ రికార్డును సాధించారు. చాలాసార్లు తన సొంత రికార్డులనే ఆమె బద్దలు కొట్టారు.

2022లో జరిగిన నేషనల్ గేమ్స్‌లో కూడా ఆమె అద్భుతమైన ప్రదర్శనను కనబర్చారు. స్ప్రింట్, హర్డిల్స్ విభాగాల్లో పలు బంగారు పతకాలు సాధించారు. 2022 ఏషియన్ గేమ్స్‌లో వెండి పతకాన్ని, వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు.

2023లో ఏషియన్ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ 60 మీటర్ల హర్డిల్స్‌లో బంగారు పతకాన్ని, ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో వెండి పతకాన్ని గెలుచుకోవడంతో.. ఆసియా టాప్ హర్డిలర్‌గా జ్యోతి తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు.

గుమిలో జరిగిన 2025 ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో 100 మీటర్ల హర్డిల్స్‌లో బంగారు పతకాన్ని కూడా గెలుచుకున్నారు.

2024లో ప్రతిష్టాత్మకమైన అర్జున అవార్డును ఆమె పొందారు.

పీవీ సింధు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పీవీ సింధు

భారత క్రీడారంగంలో విశేష ప్రతిభ కనబరుస్తూ అద్వితీయ విజయాలను సాధించిన మహిళా క్రీడాకారులను సత్కరించాలనే లక్ష్యంతో 2019లో బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ద ఇయర్ (ISWOTY) అవార్డును తీసుకొచ్చారు. తొలి విజేతగా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు నిలిచారు.

2020 ఎడిషన్ విజేతగా ప్రపంచ చెస్ చాంపియన్ కోనేరు హంపి నిలవగా, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను 2021, 2022 అవార్డులను గెలుచుకున్నారు. 2024లో ఈ అవార్డును షూటర్ మను భాకర్ గెలుచుకున్నారు.

ఇక,ఆయా సీజన్లలలో 'లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్' అవార్డును అథ్లెట్స్ పీటీ ఉష, అంజు బాబీ జార్జ్, వెయిట్ లిఫ్టర్ కరణం మల్లేశ్వరి, హాకీ క్రీడాకారిణి ప్రీతమ్ సివాచ్, క్రికెటర్ మిథాలీ రాజ్ అందుకున్నారు.

'బీబీసీ ఇండియన్ పారా-స్పోర్ట్స్‌వుమన్' అవార్డును టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనా పటేల్, షూటర్ అవని లేఖరా అందుకున్నారు.

'బీబీసీ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్' అవార్డును క్రికెటర్ షెఫాలీ వర్మ, షూటర్ మను భాకర్, ఆర్చర్ శీతల్ దేవి పొందారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)