ముసుగు తొలగింపే మహిళా పురోగతికి మార్గమా?

హిజాబ్ ఘటనపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పూ ఇల్తిజా ముఫ్తీ ఫిర్యాదు చేశారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హిజాబ్ ఘటనపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై ఇల్తిజా ముఫ్తీ ఫిర్యాదు చేశారు
    • రచయిత, నసీరుద్దీన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఒక మహిళ పట్ల, ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఏదైనా జరిగితే ఆ చర్యను నేరంగా పరిగణిస్తారు. అందుకే దాన్ని వివాదం అని పిలవడం సరైనది కాదు.

ఇక్కడ మనం బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బహిరంగంగా ఒక మహిళతో వ్యవహరించిన తీరు, ఆ తర్వాత మరో రాష్ట్రానికి చెందిన ఒక మంత్రి చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడుతున్నాం.

ఉద్యోగ నియామక పత్రం తీసుకునేందుకు వచ్చిన ఒక మహిళ హిజాబ్‌ను నితీశ్ కుమార్ లాగినట్లు కనిపిస్తున్న ఒక వీడియో, సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను చాలామంది చూసి ఉంటారు.

ఆయనేదో అమాయకమైన పని చేసినట్లుగా, ఇది జరిగినప్పుడు ఆయనతో పాటు అక్కడున్న కొంతమంది చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు.

తర్వాత ఈ చర్యపై తీవ్ర చర్చ మొదలైంది. ఈ ఘటనపై కొందరు అనుకూలంగా, మరికొందరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
యూపీ మంత్రి సంజయ్ నిషాద్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, యూపీ మంత్రి సంజయ్ నిషాద్

ఏమిటీ ‘పురుష’ ప్రకటనలు?

ఉత్తరప్రదేశ్ మత్స్యకార శాఖ మంత్రి, నిషాద్ పార్టీ వ్యవస్థాపకులు సంజయ్ నిషాద్ చేసిన వ్యాఖ్యలు నితీశ్ కుమార్ ప్రవర్తనను మించిపోయాయి.

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో ప్రకారం, 'హిజాబ్‌ను తాకితేనే ఇంత జరిగింది... ఇంకా వేరే చోట ఎక్కడైనా తాకి ఉంటే ఏమై ఉండేదో' అని సంజయ్ నిషాద్ అంటున్నట్లు కనిపిస్తుంది. ఆయన హిజాబ్ నుంచి మహిళల శరీరం దాకా వెళ్లి పోయారు. ఆయన నవ్వితే అక్కడున్న జర్నలిస్టులు కూడా శృతి కలిపారు. ఈ రెండు మాటలతో ఆయన స్త్రీ శరీరాన్ని స్పృశించారు.

తనకు ఏ మహిళ పట్ల, లేదా మతం పట్ల ఎలాంటి ద్వేషం లేదని చెబుతూ ఆయన తన మాటలను ఉపసంహరించుకున్నప్పటికీ, ఆయన వ్యాఖ్యలు పురుషుల ప్రవర్తన తాలూకూ నిజాలను బయటపెడుతున్నాయి.

కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ, నితీశ్ కుమార్ ప్రవర్తనను సమర్థించారు.

'నితీశ్ కుమార్ ఏ తప్పూ చేయలేదు. ఆయన చేసిన పని సరైనదే' అని మీడియాతో ఆయన అన్నట్లు తెలుస్తోంది.

ఇది హిజాబ్, బురఖాకే పరిమితమా?

సోషల్ మీడియాలో ఈ ప్రవర్తనను సమర్థించే వ్యక్తులంతా ఒక విషయం అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు. ఈ అంశం కేవలం హిజాబ్ లేదా బురఖాకు సంబంధించినది కాదు.

నితీశ్ కుమార్ ప్రవర్తించిన తీరు మహిళల నిర్ణయాలు, వాళ్ల ఇష్టాఇష్టాలు, ఎంపికలు, దుస్తులు ధరించే స్వేచ్ఛ, గౌరవంగా జీవించే హక్కుతో ముడిపడి ఉంది. ఇది కేవలం బురఖా అని పిలిచే వస్త్రానికే పరిమితం కాదు.

ఇది తన శరీరంపై తనకే నియంత్రణ ఉండాలనే అంశానికి సంబంధించినది. జనాభాలోని ఓ పెద్ద వర్గం దీన్ని అనవసరంగా బురఖా, మహిళల స్వేచ్ఛకు సంబంధించిన సమస్యగా మారుస్తున్నారు.

నకాబ్, హిజాబ్, బురఖా, పర్దా గురించి కూడా చర్చ జరగాలి. కానీ, ఈ సమయంలో కాదు. ఈ సమస్యతో ముడిపెట్టి మాట్లాడాల్సిందైతే అస్సలు కాదు.

కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్

కొంతమందికి ఎందుకు తప్పుగా అనిపించట్లేదు?

నిజానికి పురుషులు లేదా పితృస్వామ్య ఆలోచనలు ఉన్న ఎవరికైనా ఈ ప్రవర్తన చాలా కారణాల వల్ల తప్పుగా అనిపించడం లేదు. ఇందులో అతి పెద్ద కారణం ఏంటంటే, స్త్రీకి కూడా తమలాగే ఒక స్వతంత్ర అస్తిత్వం ఉంటుందని ఒప్పుకోకపోవడం.

ఆమె శరీరం లేదా దుస్తులు ఆడుకునే వస్తువులు కావు. మహిళ వ్యక్తిత్వంలో అవి భాగం. ఇలా చేయడం వేధింపు మాత్రమే కాదు. ఇది ఒక హింస. లైంగిక లేదా జెండర్ ఆధారిత హింస.

ఈ అంశంపై నవ్వుతూ, హాస్యాస్పదంగా మాట్లాడలేం. అందుకే, ఎప్పటిలాగే ఈ అంశం పురుష అహంకారపు ఆలోచనలను, ప్రవర్తనను బట్టబయలు చేసింది.

నితీశ్ కుమార్ ప్రవర్తన కొంతమందికి 'తండ్రిలాంటి వ్యవహారం' లేదా 'పెద్దవారి ప్రేమ'గా కనిపిస్తుంది. పురుషులు ఎప్పుడూ ఏమనుకుంటారంటే, మహిళకు 'తండ్రి లాంటి పర్యవేక్షణ', సూచనలు, సలహాలు, ఆదేశాలు, నియంత్రణ అవసరమని భావిస్తారు. తండ్రి లేదా తండ్రి లాంటి వ్యక్తులే మహిళల మేలు కోరగలరని వారి నమ్మకం. కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, అలాంటి 'తండ్రి లాంటి' మంచితనం ఆ మహిళ కోరుకుంటోందా? వద్దా? ఆ ప్రవర్తన ఆ అమ్మాయికి ఎలా అనిపిస్తోంది?

ఒక వార్త ప్రకారం, ఆ అమ్మాయి ఉద్యోగంలో చేరడానికి నిరాకరించారు.

'ముఖ్యమంత్రి కావాలనే ఇలా చేశారని నేను అనడం లేదు. కానీ జరిగింది నాకు నచ్చలేదు' అని ఆమె చెప్పారు.

అంటే, జరిగిన దానికి మహిళ స్వేచ్ఛకు సంబంధం లేదా?

ఒక మహిళ తన శరీరాన్ని సమాజంలో ఎలా ప్రదర్శించాలనేది తను ధరించే దుస్తుల ద్వారా కూడా నిర్ణయించుకుంటారు.

చాలాసార్లు దుస్తుల విషయంలో మహిళ సొంత ఇష్టమే ఉంటుంది. మరికొన్ని సార్లు సామాజిక, సాంస్కృతిక, మతపరమైన లేదా చట్టపరమైన నిబంధనలు కూడా ఇందులో పాత్ర పోషిస్తాయి.

కారణం ఏదైనా కావచ్చు, ఒక స్త్రీతో ఇలా ప్రవర్తించడం ఆమె శరీర గౌరవాన్ని ఉల్లంఘించడమే.

అయినా, ఎప్పుడు స్త్రీల దుస్తుల గురించే ఎందుకు చర్చ జరుగుతుంటుంది? పురుషుల దుస్తుల గురించి ఎవరూ ఎందుకు మాట్లాడరు లేదా విమర్శించరు?

నితీశ్ కుమార్

ఫొటో సోర్స్, Getty Images

రాజ్యాంగ గౌరవానికి విరుద్ధం

ఒక ముఖ్యమంత్రి లేదా మంత్రి వ్యాఖ్యలు, ప్రవర్తన ఎప్పుడూ వ్యక్తిగతమైనవిగా ఉండవు. వారి ఆలోచనలు, ప్రవర్తన చాలామంది ప్రజలపై ప్రభావం చూపిస్తుంది.

ఉన్నత పదవుల్లోని వ్యక్తులు స్త్రీల దుస్తులపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పుడు, అది విస్తృత దృక్పథాన్ని సృష్టించడంలో సహాయపడుతుంది.

కాబట్టి, మంత్రుల అభిప్రాయాలు హాస్యాస్పదంగా ఉండకూడదు. అవి మహిళలపై వారి అభిప్రాయాలను ప్రతిబింబిస్తాయి. ప్రజల ఆలోచనను తీర్చిదిద్దుతాయి. ఇప్పటికే అలాంటి అభిప్రాయాలు, ఆలోచనా ధోరణి ఉన్నవారు బహిరంగంగా వాటిని వ్యక్తపరిచేలా చేస్తాయి.

మహిళల గురించి అలాంటి అభిప్రాయం చెప్పడం రాజ్యాంగ గౌరవానికి విరుద్ధం.

ముస్లిం మహిళ జీవితం

దీన్ని మనం మరో కోణం నుంచి చూడొచ్చు.

ముస్లిం మహిళల ఎంపికలు, స్వేచ్ఛ, హక్కులపై తరచుగా రెండు రకాల నియంత్రణలు ఉంటాయి.

ఒక వైపు కొంతమందేమో తాము ఎంత వెనుకబడి ఉన్నామో, ఎంత అణచివేతకు గురవుతున్నామో చెప్పడానికి ప్రయత్నిస్తుంటారు.

మరోవైపు, తమ సమాజం నుంచి ఒక 'మతపరమైన మహిళ'గా కనిపించేలా దుస్తులు ధరించాలనే ఒత్తిడిని కూడా ఎదుర్కొంటున్నారు. ఈ రెండు వర్గాల్లో ఇమడలేని వారు తరచుగా విమర్శల పాలవుతుంటారు.

వీరంతా భయం, అవమానం, ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా తమ దుస్తులను ఎంచుకోగలుగుతున్నారా? అనే ప్రశ్న రావాలి.

ముస్లిం మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

ఆడపిల్లల మార్గం సులభమైనదేనా?

ఇంకో విషయం. అమ్మాయిలు వృద్ధిలోకి రావాలంటే ఆ మార్గం అబ్బాయిలకు ఉన్నట్లుగా ఉండదు. వారు బయటకు వెళ్లడానికి, చదువుకోవడానికి, పని చేయడానికి, పురోగతి సాధించడానికి అనేక అడ్డంకులు ఉన్నాయి.

ముందుకు వెళ్లడానికి చాలామంది అమ్మాయిలు వివిధ మార్గాలను కనుక్కోవాల్సి వస్తుంది. అందులో ఒక మార్గం హిజాబ్ లేదా నకాబ్ ధరించడం.

చాలా మందికి మతం ఒక కారణంగా ఉండొచ్చు. కానీ అనేక మంది అమ్మాయిలకు మతం మాత్రమే కారణం కాదు. చాలా మంది అమ్మాయిలకు ఇది చదువుకోవడానికి, ముందుకు సాగడానికి, ఏదైనా చేయడానికి, ఇంటి పరిమితుల నుంచి బయటపడటానికి కూడా ఒక మార్గం. ఈ షరతు మాత్రమే చాలామందికి బయటపడే అవకాశాన్ని కల్పిస్తుంది.

కాబట్టి మనం ఒక అమ్మాయి హిజాబ్ లేదా నిఖాబ్‌ను లాగుతుంటే, మనం ఆమెను, ఆమెలాంటి చాలా మంది అమ్మాయిలను ముందుకు సాగకుండా ఆపుతున్నట్లే.

అమ్మాయిలు బలవంతంగా ఇలా చేస్తున్నారని ముఖ్యమంత్రి లేదా మంత్రి వంటి అధికార పదవుల్లో ఉన్న ఎవరైనా నమ్మితే, వారు అమ్మాయిల కోసం మెరుగైన సామాజిక-రాజకీయ వాతావరణాన్ని సృష్టించాలి. తద్వారా అమ్మాయిలు భయం లేకుండా వారి సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు.

ఇలా వారిని బహిరంగంగా బహిర్గతం చేయడం అవమానకరమైన చర్య. ఇది బెదిరింపు. దీన్నివల్ల వారు ప్రజా జీవితం నుంచి దూరమై, ఒంటరిగా మారతారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)