కిట్టీ ఓ నీల్: వినికిడి లోపం ఉన్నా నేలపై శబ్ద వేగాన్ని మించి ప్రయాణించాలనుకున్న ‘నిజజీవిత అద్భుత మహిళ’

ఫొటో సోర్స్, UPI/Bettmann Archive/Getty Images
- రచయిత, నిక్ ఎరిక్సన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అది అమెరికాలోని ఓ ఎడారి ప్రాంతం. బధిరురాలైన స్టంట్ ఉమన్ 'కిట్టీ ఓ నీల్' సత్తా ఏమిటో అక్కడ జరిగిన 'సంఘటనల ద్వారా ప్రపంచానికి తెలిసింది.
పసుపు రంగు జంప్‌సూట్ ధరించిన కిట్టీ ఓ నీల్, భూమిపై మహిళల వేగంలో అప్పటివరకు ఉన్న రికార్డులను బద్దలుకొట్టారు. వినికిడిలోపం కారణంగా ఆమెపై ఉన్న అపోహలను కూడా తుడిపేశారు.
అయితే, ఇది అసాధారణ సాహసాలు చేయడంలో కిట్టీ ఓనీల్‌కు ఉన్న ధీరత్వం, పట్టుదలను వివరించే ఓ అధ్యాయం మాత్రమే.
స్టంట్ ఉమన్‌గా కిట్టీ 1970లలో హాలీవుడ్‌లో ప్రసిద్ధి చెందారు. చెవిటివారికి సాధ్యం కావనే అభిప్రాయాలను చిన్నప్పుడే తుత్తునియలు చేస్తూ సంగీత వాద్యాలనూ నేర్చుకున్నారు.
ఆ గ్రూపులో తొలి మహిళగా…
వినికిడి సామర్థ్యం లేనప్పటికీ ఓనీల్ ఏమాత్రం రాజీపడకుండా జీవించారు. వేగం మీదున్న మోజును ఆమె విజయవంతమైన కెరీర్‌గా మలుచుకున్నారు. అప్పట్లో కొంతమంది మహిళలు మాత్రమే ప్రమాదకరమైన స్టంట్స్‌ను ప్రదర్శిస్తూ ప్రేక్షకులకు టీవీలకు అతుక్కుపోయేలా చేసేవారు. ఇలాంటి ధైర్యసాహసాలు కలిగిన వారిలో ఓనీల్ కూడా ఒకరిగా నిలిచారు.
అత్యంత కఠినమైన స్టంట్‌లను ప్రదర్శించే ‘స్టంట్స్ అన్‌లిమిటెడ్’ అనే ప్రొఫెషనల్ గ్రూప్‌లో చేరిన తొలి మహిళ ఓనీలే.
ఓనీల్ జీవితంపై సినిమా రూపొందింది. కొన్నిటీవీ కార్యక్రమాల్లో కూడా ఆమె కనిపించారు. ఆమె పేరుతో ఒక బొమ్మ (యాక్షన్ ఫిగర్) కూడా విడుదలైంది.


వినపడదు.. కానీ ఓడిపోలేదు
కిట్టీ ఓనీల్ టెక్సాస్‌లోని కార్పస్ క్రిస్టీలో 1946లో జన్మించారు. ఐదు నెలల వయసులో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆమె టెంపరేచర్ ప్రమాదకరస్థాయికి చేరడంతో ఓనీల్ తల్లి, ఆమె శరీరంపై ఐస్ ప్యాక్స్ పెట్టారు. ఈ చర్య ఆమె ప్రాణాలు కాపాడినప్పటికీ, కిట్టీ పెద్దదవుతున్నా మాటలు రాలేదు. అనారోగ్యమే కిట్టీకి వినికిడిలోపం తీసుకొచ్చింది తల్లిదండ్రులు గ్రహించారు.
అయితే కిట్టీకి సంకేత భాష నేర్పించేందుకు ఆమె తల్లి ప్యాట్సీ ఇష్టపడలేదు. ఎందుకంటే అప్పట్లో దీనిని అనుమానంగా చూసేవారు. కానీ తన కుమార్తె ఎవరికంటేను తక్కువ కాదని, తను మాట్లాడగలదని, ఏ విషయాన్నైనా తెలియజేయగలదని ప్యాట్సీ నమ్మారు. దాంతో ప్యాట్సీ ఆమెకు లిప్- రీడింగ్ పద్ధతిని నేర్పించారు.
‘‘ఆమె తల్లి కిట్టీ చేతులను తన స్వరతంత్రులపై ఉంచి, నెమ్మదిగా పదాలు పలుకుతూ మళ్లీ మళ్లీ చెప్పేవారు " అని ఓనీల్‌కు సన్నిహితుడు, స్టంట్‌మ్యాన్ మైకేల్‌సన్ చెప్పారు.
కిట్టీ ఓ నీల్‌ను స్కూల్లో గేలి చేస్తుంటే,వాటిని ఎలా తిప్పికొట్టాలో ఆమె తల్లి నేర్పించారు. ప్యాట్సీ బోధించిన నైపుణ్యాలతో కిట్టీ వాటిని చేసి చూపించారు.
" సూక్ష్మమైన కంపనాల మార్పులను గుర్తించే విధంగా ఆమెకు సెల్లో, పియానోను వాయించడం నేర్పించారు" అని స్పోర్ట్స్ వెబ్‌సైట్ ఈఎస్‌పీఎన్ డిప్యూటీ ఎడిటర్ ఎరిక్కా గుడ్‌మన్-హగీ చెప్పారు.
కారు రేడియోలో వినిపించే సంగీతాన్ని కేవలం కంపనాల ఆధారంగా గుర్తించగలిగే స్థాయికి ఆమె చేరారు. ఓసారి బాటిల్స్ పాట వినిపిస్తే ఆమె దానిని గుర్తించారని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
స్టంట్స్ ప్రస్థానం ఎలా మొదలైందంటే..
కిట్టీ ఓ నీల్ 11 ఏళ్ల వయసులో ఉండగా ఆమె తండ్రి విమానప్రమాదంలో చనిపోయారు. అయితే, చిన్నప్పుడు లాన్‌మూవర్‌లో కూర్చుండగా తన తండ్రి స్పీడ్‌గా వెళ్తున్నప్పుడు కలిగిన థ్రిల్‌ను మాత్రం ఆమె ఎన్నడూ మర్చిపోలేదు. ఆమె కొంచెం పెద్దయ్యాక డైవింగ్ పోటీలను తన జీవితంలో భాగం చేసుకున్నారు. కొద్ది రోజుల్లోనే దాంట్లో ఆరితేరారు.
అయితే 1964 టోక్యో ఒలింపిక్స్ ట్రయల్స్‌కు కొద్దిరోజుల ముందు ఆమె మణికట్టు విరిగింది. స్పైనల్ మెనింజైటిస్ బారిన కూడా పడ్డారు. ఆ తర్వాత కోలుకున్నా ఆమెకు ఆ ఆటలపై ఆసక్తి తగ్గిపోయింది. అయితే 16 ఏళ్ల వయసు తల్లి కారును పల్టీలు కొట్టించిన తరువాత, కిట్టీ స్కైడైవింగ్, వాటర్‌స్కీయింగ్‌లో అడుగుపెట్టి, అప్పటిదాకా మహిళల విభాగంలో ఉన్న స్పీడు రికార్డును బద్దలు కొట్టారు.
కఠినమైన, ప్రమాదకరమైన క్రాస్-కంట్రీ రేసెస్‌లో మోటార్ బైక్స్ రైడింగ్‌లో కూడా పాల్గొన్నారామె.
ఇలా ప్రతిసారి ఏ విషయానికీ లొంగిపోకుండా తన ప్రయాణాన్ని సాగించారు కిట్టీ ఓ నీల్.

ఫొటో సోర్స్, CBS via Getty Images
'అంత సరదాగా ఏం ఉండవు'
ఓసారి ఓనీల్ నడుపుతున్న మోటార్‌బైక్ నియంత్రణ కోల్పోయి ఓ పెద్ద యాక్సిడెంట్‌కు గురయ్యారు. అప్పుడామె చేయి చక్రంలోని చువ్వల మధ్య ఇరుక్కుపోయి చేతివేళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అయినా ఓ నీల్ తన ప్రయాణం కొనసాగించాలని భావించారని గ్లవ్స్‌ను తీసి పక్కన పెట్టి, మళ్లీ ఆమె మోటార్‌సైకిల్‌ను ఎక్కారని ఆమె స్నేహితులు అప్పటి సంఘటనను గుర్తు చేసుకున్నారు. అయితే చివరకు ఆమె ఆస్పత్రికి వెళ్లేందుకు ఒప్పుకున్నారు.
ఆరోజు ఆమెను మరో స్టంట్‌మ్యాన్ డఫ్పీ హంబెల్టన్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అయితే కేవలం ఆయన ఆమెను ఆస్పత్రిలో చేర్చడమే కాదు, ఆమె జీవితాన్ని మరో దిశలో నడిపించిన వ్యక్తి కూడా.
టెలివిజన్ కోసం స్టంట్ వర్క్ గురించి ఆయన నీల్‌కు చెప్పారు. అది తనకు సరైన పని అవుతుందని నీల్ నిర్ణయించుకున్నారు.
ఓనీల్ ఇద్దరు భర్తల్లో హంబెల్టన్ మొదటివారు.
ఓ నీల్‌కు ‘ది పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ బై నార్మన్ విన్సెంట్ పీలే’, ‘బైబిల్’ ఇష్టమైన పుస్తకాలు. వీటి స్ఫూర్తితోనే ఆమె రిస్కు తీసుకునేవారు. 1970ల ప్రారంభంలో విగ్స్ ధరించిన పురుషులే స్టంట్స్ చేసేవారు. కానీ, కొద్దిరోజుల్లోనే ఈ పద్ధతిలో మార్పు మొదలైంది.
వినికిడి లోపం తనకు ఓ అడ్డుగోడ అని, తను ఓ "నామమాత్రపు మహిళ’’ అని ఎవరైనా చెబితే వినిపించుకోకుండా ఉండటానికి కూడా ఆమెకు ఆ స్ఫూర్తి సాయపడింది. ఓనీల్ మాత్రం చెవిటి తనం తన సూపర్‌పవర్ అని చెబుతుంటారు. ఫిల్మ్ మేకింగ్ వ్యాపారం తన చుట్టూ తిరుగుతున్నప్పుడు తాను చేయాలనుకున్న పనిపై పూర్తి ధ్యాస నిలిపేలా చెవిటితనమే తనకు సాయపడిందంటారు ఆమె.

ఫొటో సోర్స్, UPI/Bettmann Archive/Getty Images
ఓనీల్ ఎలాంటి పోరాటాలు చేశారంటే..
నటి లిండా కార్టర్‌తో వండర్ ఉమన్ టీవీ సిరీస్‌లో ఓనీల్ ఎక్కువగా పని చేశారు. దాంట్లో ప్రత్యేేక కాస్ట్యూమ్స్‌తో హెలికాప్టర్ నుంచి వేలాడటం వంటి విభిన్న స్టంట్స్ చేశారు. బహుశా అవే ఆమె మోస్ట్ ఫేమస్ సంట్స్ అని చెప్పవచ్చు.
ఈ సిరీస్ క్లైమాక్స్‌లోని ఓ ఎపిసోడ్‌లో కాలిఫోర్నియాలోని 120 అడుగుల ఎత్తైన హోటల్ మీద నుంచి దూకే స్టంట్‌ను చేశారామె. పూర్తి ధ్యాస, ధైర్యం పెట్టి చేయాల్సిన ఈ స్టంట్‌లో ఆమె విజయం సాధించారు. ఇదో అద్భుత క్షణంగా నిలిచింది.
"నేను పురుషులతో పోటీ పడాలని ప్రయత్నించలేదు. నేనేంటో అదే చేయడానికి ప్రయత్నించాను అంతే" అని ఆ సమయంలో పీపుల్ మేగజైన్‌తో అన్నారు ఓనీల్
మరోసారి ఆమె చాలా ఎత్తు నుంచి దూకి మరో రికార్డు నెలకొల్పారు. ఓసారి టెలివిజన్ స్పెషల్ కోసం మంటల్లో దూకారు. మరోసారి 443 కీలోమీటర్ల వేగంతో జెట్ పవర్ బోటును నడిపారు.
"అంతెందుకు నేను ఆమెతో కలిసి నడుస్తుంటే తను ఎప్పుడూ నా కంటే ఓ పది అడుగులు ముందు ఉండేది" అని మైకేల్‌సన్ అన్నారు.ప్రతిసారి హద్దులను దాటుకుని, వేగంగా వెళ్తున్నట్లు ఆమె కనిపించేదని చెప్పారు.
క్రమంగా తన కలలు అన్నింటినీ నెరవేర్చుకునే ఒక సరైన మార్గాన్ని ఆమె కనుగొన్నారు.
ఎస్ఎమ్ఐ మోటివేటర్ అని పిలిచే ఓ ప్రయోగాత్మక కారును నడపడానికి 1976లో ఆమెను ఆహ్వానించారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ శక్తితో 48,000 హార్స్‌పవర్‌తో ఈ కారు నడుస్తుంది. ఈ కారులో శబ్దవేగాన్ని అధిగమించాలని ఓనీల్ కోరుకున్నారు. అంటే కారును గంటకు 1,207 కిలోమీటర్ల వేగంతో నడపాలనుకున్నారు. కానీ, ఆర్గనైజర్స్‌తో చేసుకున్న ఒప్పందంలో మాత్రం, అప్పటివరకు మహిళల పేరుతో ఉన్న గంటకు 483 కిలోమీటర్ల వేగాన్ని మాత్రమే అధిగమించాలని ఉంది.
తన సన్నని శరీరంపై పసుపు రంగు జంప్‌సూట్ వేసుకున్న ఓనీల్, అమెరికా ఒరెగాన్‌లోని అల్వర్డ్ ఎడారిలో కారు ఎక్కారు. నీడిల్ షేప్‌లో, అల్యూమినియం వీల్స్‌తో ఉన్న ఆ కారును 988 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టించి, గతంలో మహిళల పేరు మీద ఉన్న స్పీడ్ రికార్డులను బద్దలు కొట్టారు.

ఫొటో సోర్స్, Glen Martin/The Denver Post via Getty Images
'అలాంటి వ్యక్తిని చూడలేదు'
ఓనీల్ పురుషుల పేరు మీదున్న రికార్డును కూడా చెరిపేయాలని ప్రయత్నించారు. అయితే ఆమె ప్రయత్నాన్ని స్పాన్సర్స్ అడ్డుకున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. కానీ, దీనిపై స్పందించడానికి వాళ్లు నిరాకరిస్తూ వచ్చారు. చరిత్రలో మహిళలను ఎలా వెనక్కి నెట్టారనడానికి సాక్ష్యంగా ఆ సంఘటనను ఓనీల్ గుర్తుపెట్టుకున్నారని ఆమె సన్నిహితులు చెబుతారు.
అయితే మైకేల్‌సన్ ఆమెకు డ్రాగ్ రేసింగ్‌తో మరో అవకాశాన్ని కల్పించారు. అలాగే స్పీడ్‌బోట్‌తో నీటిపై ఉన్న స్పీడ్ రికార్డులను కూడా ఆమె చెరిపేశారు.
"నా జీవితంలో అంతకుముందు ఇలా భయం లేకుండా ఉండే వ్యక్తిని కలవలేదు. ఆమెకు ఏ మాత్రం భయం ఉండేది కాదు. అయితే అది మంచి పద్ధతి కాదు" అని మైకేల్‌సన్ అన్నారు.

ఫొటో సోర్స్, Glen Martin/The Denver Post via Getty Images
‘‘ఆమె ఎన్నడూ వెనక్కి తగ్గలేదు’’
ఈ రికార్డులు బ్రేక్ చేసిన తర్వాత, ఎన్నో సినిమాలు, టెలివిజన్ సిరీస్‌ల్లో కనిపించిన తర్వాత క్రమంగా ఆమె సౌత్ డకోటాలోని ఓ చిన్న పట్టణంలో విశ్రాంతి జీవితం ప్రారంభించారు.
"వేగంపై ప్రేమను, నేలపై శబ్దవేగాన్ని దాటాలనే తన కోరికను ఎప్పుడూ అణచిపెట్టుకోలేదు’’ అంటారు మైకేల్‌సన్. తరువాత సంవత్సరాలలో కూడా ఆయనకు ఫోన్ చేసి ‘‘ఓ కారు తయారుచేద్దాం’’ అనేవారు ఓ నీల్.
ఆమె 72 ఏళ్ల వయసులో చనిపోయే సమయానికి కూడా నేలపైన అత్యంత స్పీడ్ రికార్డు ఆమె పేరుమీదనే ఉంది.
"ఆమె ఓ అద్భుత మహిళ, నిజజీవిత అద్భుత మహిళ" అన్నారు మైకేల్‌సన్.
(బీబీసీ రేడియో4లో ప్రసారమైన ‘‘కిట్టీ ఓ నీల్: హాలీవుడ్స్ రియల్ వండర్ ఉమన్’’ ఆధారంగా)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














