హ్యాంగోవర్‌ తగ్గాలంటే ఏం చేయాలి? మద్యం తాగే ముందు ఏం తింటే హ్యాంగోవర్ ఉండదు?

పార్టీ, మద్యం, హ్యాంగోవర్, నివారణ

ఫొటో సోర్స్, Olga Ihnatsyeva via Getty Images

    • రచయిత, ది ఫుడ్ చైన
    • హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్

ఒక్కోసారి పార్టీలో మద్యంతాగి చాలా సరదాగా గడిపిన తర్వాత, మరుసటిరోజు ఉదయం విపరీతమైన తలనొప్పితో మేల్కొని, నిన్న రాత్రి ఏం జరిగిందో గుర్తుతెచ్చకునే ప్రయత్నం చేస్తారు.

జ్ఞాపకశక్తి కోల్పోవడం, తలనొప్పి, నీరసం, వికారం, విపరీతమైన ఆకలి.. ఈ లక్షణాలన్నీ కలిపితే, భయంకరమైన కొత్త వ్యాధిలా అనిపించవచ్చు.

కానీ, ఇది హ్యాంగోవర్. ఎవరికైనా చిరాకు తెప్పిస్తుంది.

దీనికి చాలారకాల నివారణలు ఉన్నాయని చెబుతున్నారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ పరిస్థితి నివారించడానికి, దీన్నుంచి బయటపడడానికి కొన్ని మార్గాలున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
శరీరం, ఆల్కహాల్‌, విషపూరిత బయోప్రొడక్ట్‌లు, విచ్ఛిన్నం, రక్తప్రవాహం

ఫొటో సోర్స్, kieferpix via Getty Images

జీరో ఆల్కహాల్

మీ హ్యాంగోవర్‌కు కారణం జీర్ణంకాని ఆల్కహాల్ కాదు, మీ శరీరం దానికి స్పందిస్తున్న ప్రక్రియ.

"మీ రక్తంలో ఆల్కహాల్ స్థాయి సున్నాకి పడిపోయినప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తాయి" అని బ్రిటన్‌లోని నార్త్‌అంబ్రియా విశ్వవిద్యాలయంలో హ్యూమన్ సైకాలజీ ప్రొఫెసర్, ఆల్కహాల్ హ్యాంగోవర్ రీసెర్చ్ గ్రూప్ సభ్యుడు ఆండ్రూ షోలే వివరించారు.

మన శరీరం ఆల్కహాల్‌ను బయోప్రొడక్ట్‌లుగా విచ్ఛిన్నం చేస్తుంది. తరువాత అవి మన రక్తప్రవాహం ద్వారా శరీరం అంతటా పంపిణీ అవుతాయి.

"ఆల్కహాల్ ఒక టాక్సిన్ కాబట్టి, శరీరం ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ చూపిస్తుంది" అని ప్రొఫెసర్ షోలా బీబీసీ వరల్డ్ సర్వీస్ ప్రోగ్రాం ‘ది ఫుడ్ చైన్‌’లో చెప్పారు.

ఈ సమయంలో, మనం ఇన్ఫెక్షన్‌తో పోరాడుతున్నప్పుడు విడుదలయ్యే ప్రోటీన్లు విడుదలవుతాయి వీటిలో చాలా వరకు మెదడు పనిచేసే విధానాన్ని ప్రభావితం చేస్తాయి.

హ్యాంగోవర్ కూడా డ్రైవింగ్‌లో మద్యం తాగినట్టుగానే ప్రమాదకరం అని అధ్యయనాలు చెబుతున్నాయి. దీని అర్థం మీకు హ్యాంగోవర్ ఉన్నప్పుడు.. మీ రక్తంలో ఆల్కహాల్ లేకపోయినా కూడా, మీరు మద్యం తాగిన డ్రైవర్‌లాగా ప్రవర్తించవచ్చు అని.

ఎలా తగ్గించుకోవాలి?

కొంతమంది ఇతరులకన్నా తక్కువ హ్యాంగోవర్‌కు గురవుతారన్నది కూడా నిజమే.

తక్కువ ఆల్కహాల్ తాగడం లేదా నెమ్మదిగా తాగే అలవాట్లతోపాటు, దానిని విచ్ఛిన్నం చేసే ఎంజైమ్‌లో కొన్ని జన్యుపరమైన తేడాలు కూడా ఉన్నాయని ప్రొఫెసర్ షోలే వివరించారు.

"ఆల్కహాల్‌ వేగంగా జీర్ణం అయ్యే వ్యక్తులకు హ్యాంగోవర్‌ తీవ్రత తక్కువగా ఉంటుంది" అని ఆయన అంటున్నారు.

ఆయన బృందం అనేక హ్యాంగోవర్ నివారణ ఉత్పత్తులను పరిశీలించగా, వాటిలో ఒక్కదానికి కూడా శాస్త్రీయ అధ్యయనాల ఆధారం లేదని కనుగొన్నట్టు ప్రొఫెసర్ షోలే తెలిపారు.

"హ్యాంగోవర్ నివారణల విషయంలో ఆధారాల కంటే మార్కెటింగ్ చాలా ఎక్కువ ఉంది. అవి సాధారణంగా సప్లిమెంట్స్, ఎలక్ట్రోలైట్స్ లేదా విటమిన్ కాక్‌టెయిల్స్" అని ఆయన చెప్పారు.

హ్యాంగోవర్, ఆకలి, చక్కెర, ఉప్పు, సంతృప్త కొవ్వు, ఆహారపదార్థాలు

ఫొటో సోర్స్, Matt Cardy / Stringer via Getty Images

ఫొటో క్యాప్షన్, హ్యాంగోవర్ సమయంలో ఆకలిగా అనిపించినప్పుడు, ప్రజలు చక్కెర, ఉప్పు, సంతృప్త కొవ్వు అధికంగా ఉండే ఆహారపదార్థాలు తింటారు.

మనం ఏం తింటాం, ఏం తాగుతాం అనే విషయాల్లో జాగ్రత్తగా ఉండటం కూడా ముఖ్యం.

హ్యాంగోవర్ సమయంలో ఆకలిగా ఉన్నప్పుడు, ప్రజలు తరచుగా చక్కెర, ఉప్పు, సంతృప్త కొవ్వులు అధికంగా ఉండే వాటిని తింటారు.

వీటిని అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ అని పిలుస్తారు.

ఇవి ఇన్ఫ్లమేషన్‌ను మరింత పెంచుతాయి.

"కాబట్టి వాటిని తీసుకోకూడదు" అని ప్రొఫెసర్ షోలే అంటున్నారు.

నీళ్లు ఎక్కువగా తాగాలా?

"హ్యాంగోవర్ లక్షణాలను తగ్గించడానికి చాలా మంది ఎక్కువ నీరు త్రాగాలని చెబుతున్నప్పటికీ, ఇది హ్యాంగోవర్‌ను తగ్గించదని అధ్యయనంలో తేలింది" అని ప్రొఫెసర్ షోలే చెప్పారు.

"ఇది కచ్చితంగా ఒక లక్షణాన్ని తగ్గిస్తుంది. అదే దాహం" అని ఆయన అన్నారు.

పరాగ్వేకు చెందిన రిజిస్టర్డ్ న్యూట్రిషనిస్ట్ మారిస్ మోల్, దోసకాయ, సెలెరీ, కొబ్బరి నీళ్లు, గ్రీన్ ఆపిల్, పార్స్లీ, అల్లంతో తయారు చేసిన గ్రీన్ జ్యూస్‌తో తనను తాను హైడ్రేట్ చేసుకోవడానికి ఇష్టపడతానని చెప్పారు.

"నిజానికి అల్లం వికారం తగ్గడానికి చాలా మంచిది" అని ఆయన సూచించారు.

మద్యం, ఆహారం, హ్యాంగోవర్‌

ఫొటో సోర్స్, ollo via Getty Images

ఫొటో క్యాప్షన్, 'మద్యం తాగే ముందు తేలికైన ఆహారం తినడం వల్ల హ్యాంగోవర్‌ను నివారించవచ్చు'

మద్యం తాగేముందు ఇవి తినండి

మద్యం తాగే ముందు తేలికపాటి ఆహారం తినడం వల్ల హ్యాంగోవర్‌ను నివారించవచ్చని ఇద్దరు నిపుణులూ అంగీకరిస్తున్నారు.

చికెన్, గుడ్లు వంటి అధిక ప్రోటీన్ ఆహారాలు, అవకాడో, ఆలివ్ ఆయిల్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు తినాలని న్యూట్రిషనిస్ట్ మారిసా మోల్ చెప్పారు.

"అవకాడో మిశ్రమాన్ని తయారు చేసుకుని అందులో ఆలివ్ నూనె వేసుకోవచ్చు. దానిని చికెన్‌తో సాస్‌లాగా తినొచ్చు" అని చెప్పారు.

"మద్యం తాగే ముందు సరిగ్గా తింటే, రక్తప్రవాహంలోకి ప్రవేశించే ఆల్కహాల్ శాతాన్ని సగానికి తగ్గించవచ్చు. ఎందుకంటే ఆల్కహాల్‌ను విచ్ఛిన్నం చేసే ఎంజైమ్‌లు శరీరంలోని మిగిలిన భాగాలకు చేరే ముందు కడుపులో పని చేస్తాయి" అని ప్రొఫెసర్ షోలే వివరిస్తున్నారు.

"హ్యాంగోవర్‌ను నివారించడానికి ఎక్కువ మద్యం తాగకపోవడమే మార్గం" అని ప్రొఫెసర్ షోలే చెప్పారు.

కాబట్టి, చివరిగా చెప్పేదేంటంటే హ్యాంగోవర్‌ను నివారించాలంటే ఎక్కువ మద్యం తాగకుండా ఉండాలి.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)