ఇరాన్: పెరుగుతున్న నిరసనలు, ఆందోళనకారులను చంపితే నరకం చూస్తారని ట్రంప్ వార్నింగ్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డేవిడ్ గ్రిటెన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇరాన్ రాజధాని టెహ్రాన్, ఇతర నగరాల గుండా పెద్ద సంఖ్యలో నిరసనకారులు కవాతు చేస్తున్నట్లు పలు వీడియోలలో కనిపిస్తోంది. ఇవి ఇరాన్ మత నాయకులకు వ్యతిరేకంగా గత కొన్నేళ్లలో జరిగిన అతిపెద్ద నిరసనలని చెబుతున్నారు.
గురువారం సాయంత్రం టెహ్రాన్‌లో, ఇరాన్‌లోని రెండవ అతిపెద్ద నగరమైన మష్హాద్‌లో శాంతియుత ప్రదర్శనలు జరిగాయి. భద్రతా దళాలు ఈ నిరసనలను ఆపలేదు. బీబీసీ పర్షియన్ ఆ వీడియోలను తనిఖీ చేసి ధ్రువీకరించింది.
మరోవైపు, దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ బ్లాక్‌అవుట్ ఉందని ఒక మానిటరింగ్ గ్రూప్ రిపోర్ట్ చేసింది.
ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీని తొలగించాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు మాట్లాడటం వీడియోలలో వినిపిస్తోంది. ప్రవాసంలో నివసిస్తున్న ఇరాన్ మాజీ రాజు కుమారుడు రెజా పహ్లవీ తిరిగి ఇరాన్ రావాలని కూడా వారు పిలుపునిచ్చారు.
రోడ్డెక్కి నిరసన తెలియజేయమని రెజా పహ్లవీ తన మద్దతుదారులను కోరారు.


ఫొటో సోర్స్, EPA
ఎందుకు మొదలయ్యాయి?
ఇరాన్ కరెన్సీ పతనంపై ఆగ్రహంతో మొదలైన ఈ అశాంతి వరుసగా 12వ రోజు కొనసాగింది. 31 ప్రావిన్సులలోని 100కి పైగా నగరాలకు ఇది వ్యాపించిందని మానవ హక్కుల సంఘాలు చెబుతున్నాయి.
పిల్లలతో సహా 34 మంది నిరసనకారులు మరణించారని, దాదాపు 2,270 మందిని అరెస్టు చేశారని అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ న్యూస్ ఏజెన్సీ(హెచ్ఆర్ఏఎన్ఏ) తెలిపింది. 8 మంది భద్రతా సిబ్బంది కూడా మరణించారని తెలిపింది.
8 మంది పిల్లలు సహా కనీసం 45 మంది నిరసనకారులను భద్రతా దళాలు చంపాయని నార్వేకు చెందిన మానిటరింగ్ సంస్థ ఇరాన్ హ్యూమన్ రైట్స్(ఐహెచ్ఆర్) తెలిపింది. 22 మంది మరణాలను బీబీసీ పర్షియన్ ధృవీకరించింది.
గురువారం సాయంత్రం సోషల్ మీడియాలో పోస్టు చేసిన కొన్ని వీడియోలు మష్హాద్, టెహ్రాన్‌లలో పెద్ద సంఖ్యలో నిరసనకారులు కవాతు చేస్తున్నట్లు చూపిస్తున్నాయి. ఈ వీడియోలను బీబీసీ పర్షియన్ ధృవీకరించింది. "షా వర్దిల్లాలి", "ఇది చివరి యుద్ధం! పహ్లవీ తిరిగి వస్తారు" అనే నినాదాలు వినిపించాయి.
ఒక వీడియోలో ప్రజలు వంతెన నుంచి నిఘా కెమెరాలను తొలగించినట్లు కనిపించింది.
బీబీసీ పర్షియన్‌కు అందిన వీడియోలలో ఇరాన్‌లోని అనేక నగరాల్లో ప్రభుత్వానికి, సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీకి వ్యతిరేకంగా నిరసనకారులు నినాదాలు చేస్తుండటం కనిపిస్తోంది. రెజా పహ్లవికి మద్దతుగా, ఐక్యంగా, ధైర్యంగా ఉండాలని పిలుపునిస్తూ నిరసనకారులు సందేశాలు ఇచ్చారు.
ఇస్ఫాహాన్, బాబోల్, తబ్రిజ్, మష్హాద్ వంటి నగరాల్లో నిరసనకారులు 'నియంతకు మరణం', 'షా చిరకాలం జీవించాలి', 'భయపడకండి, మనందరం కలిసి ఉన్నాం' వంటి నినాదాలు చేస్తుండటం కనిపించింది.
డెజ్‌ఫుల్‌లో నిరసనల సమయంలో భద్రతా దళాలు ఆయుధాలు ఉపయోగిస్తున్నట్లు బీబీసీ పర్షియన్‌కు అందిన వీడియోలలో కనిపించింది.

ఫొటో సోర్స్, Getty Images
రెజా పహ్లవీ ఏమన్నారు?
ఇరానియన్లు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలపాలని రెజా పహ్లవీ పిలుపునిచ్చిన తర్వాత ఈ నిరసనలు ప్రారంభమయ్యాయి.
పహ్లవి 'ఎక్స్'లో పెట్టిన ఒక పోస్టులో 'ఈ రాత్రి లక్షలాది మంది ఇరానియన్లు స్వేచ్ఛ కావాలంటూ డిమాండ్ చేశారు' అని తెలిపారు.
దేశంలో అశాంతికి ఇరాన్ పాలకులనే బాధ్యులను చేసినందుకు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కు పహ్లవీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. యూరోపియన్ నాయకులు కూడా ఇలాగే చేయాలని ఆయన కోరారు. ఈ నిరసనలు మరుసటి సాయంత్రం కూడా కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు.
అక్కడి అశాంతిని, నిరసనలను ఇరాన్ ప్రభుత్వ మీడియా తక్కువగా చూపించింది. అదే సమయంలో, దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ బ్లాక్‌అవుట్‌ను ఇంటర్నెట్ వాచ్‌డాగ్ నెట్‌బ్లాక్స్ నివేదించింది.
నిరసనల సమయంలో ప్రజలు సమాచారాన్ని పంచుకోకుండా నిరోధించడమే ప్రభుత్వ ఉద్దేశమని నెట్‌బ్లాక్స్ అభిప్రాయపడింది.

ఫొటో సోర్స్, Getty Images
హింసాత్మకంగా నిరసనలు, అణచివేతలు
ఇరాన్ పశ్చిమ పట్టణం లోమార్ నుంచి అందిన వీడియోలు ఇరాన్ మత పాలకులను తొలగించాలని నిరసనకారులు నినాదాలు చేస్తున్నట్లు చూపించాయి. ఇలామ్, కెర్మాన్షా, లోరెస్తాన్ ప్రావిన్సులలోని అనేక కుర్దిష్ ప్రాంతాలలో బ్యాంకుపై దాడి, దుకాణాలు మూసివేయడాన్ని ఇతర ఫుటేజ్‌లు చూపించాయి.
ఈ ప్రాంతంలో నిరసనలపై జరిగిన అణచివేతకు ప్రతిస్పందనగా, ప్రవాసంలో ఉన్న కుర్దిష్ ప్రతిపక్ష సమూహాల 'జనరల్ స్ట్రైక్' పిలుపు తర్వాత ఇది జరిగింది.
ఈ పశ్చిమ ప్రావిన్సులలో కనీసం 17 మంది నిరసనకారులు మరణించారని, వారిలో చాలామంది కుర్దిష్ లేదా లోర్ మైనారిటీ వర్గాలకు చెందినవారని కుర్దిష్ మానవ హక్కుల సంఘం హెంగావ్ తెలిపింది.
బుధవారం పశ్చిమ ఇరాన్, ఇతర ప్రాంతాలలో నిరసనకారులు, భద్రతా దళాల మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగినట్లు రిపోర్టులున్నాయి.
బుధవారం ఇప్పటివరకు అత్యంత ఘోరమైన రోజు అని, దేశవ్యాప్తంగా కనీసం 13 మంది నిరసనకారులు మరణించారని ఇరాన్ మానవ హక్కుల సంస్థ ఐహెచ్ఆర్ తెలిపింది.
"నిరసనలపై అణచివేత చర్యలు రోజురోజుకూ మరింత హింసాత్మకంగా మారుతున్నాయని ఆధారాలున్నాయి" అని ఐహెచ్ఆర్ డైరెక్టర్ మహమూద్ అమిరీ-మొగద్దం అన్నారు.
బుధవారం నిరసనల సమయంలో ముగ్గురు పోలీసులు కూడా మరణించారని ప్రభుత్వ-సంబంధిత మీడియా ‘ఫార్స్’ నివేదించింది.

ఫొటో సోర్స్, Getty Images
ట్రంప్ హెచ్చరిక
ఇరాన్‌లో నిరసనలు తెలుపుతున్న ఆందోళనకారులను హతమార్చాలనుకుంటే వారిని రక్షించడానికి అమెరికా రంగంలోకి దిగుతుందని అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వారం కిందటే హెచ్చరించారు.
''మేం అన్నీ సిద్ధం చేసుకుని, బయలుదేరడానికి రెడీగా ఉన్నాం'' అని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
గురువారం ఈ విషయాన్ని ట్రంప్ మరోసారి పునరుద్ఘాటించారు.
ట్రంప్ ప్రకటనను ఇరాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఖండించింది. ఇది తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని పేర్కొంది.
ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందుల్లో ఉందని అమెరికా అధికారులు అన్నారు.
శాంతియుత నిరసనల సమయంలో భద్రతా దళాలు అత్యంత సంయమనం పాటించాలని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ కోరారు. హింస లేదా బలప్రయోగం చేయరాదని అన్నారు. అయితే, సుప్రీం లీడర్ ఖమేనీ మాత్రం నిరసనకారులతో మాట్లాడాలని, కానీ అల్లర్లపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు.
బహిరంగ మార్కెట్లో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే ఇరానియన్ కరెన్సీ రియాల్ విలువ భారీగా పడిపోతుండటంతో డిసెంబర్ 28న దుకాణదారులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి టెహ్రాన్ వీధుల్లోకి రావడంతో ఈ నిరసనలు ప్రారంభమయ్యాయి.
గత ఏడాదిలో ఎప్పుడూ లేనంత కనిష్ట స్థాయికి రియాల్ పడిపోయింది. ద్రవ్యోల్బణం దాదాపు 40 శాతం పెరిగింది. ఇరాన్ అణు కార్యక్రమంపై ఆంక్షలు, ప్రభుత్వ నిర్వహణ లోపం, అవినీతి ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










