వెనెజ్వెలా తరువాత ట్రంప్ టార్గెట్‌లో ఉన్న దేశాలు ఏవి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, టామ్ బెన్నెట్
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ రెండోసారి పాలనకు, ఆయన విదేశాంగ విధానాలే దిశా నిర్దేశం చేస్తున్నాయి.
వెనెజ్వెలా రాజధాని కారకస్‌లో భారీ భద్రత కలిగిన అధ్యక్ష భవనం నుంచి మదురో, ఆయన భార్యను రాత్రికి రాత్రే అదుపులోకి తీసుకుని గతంలో చేసిన హెచ్చరికను అమెరికా అమలు చేసింది.
ఈ ఆపరేషన్ గురించి ట్రంప్ వివరిస్తూ 1823 మన్రో సిద్ధాంతాన్ని మరోసారి ప్రస్తావించారు. పశ్చిమార్ధగోళంలో అమెరికా ఆధిపత్యాన్ని సూచించే మన్రో సిద్ధాంతానికి తన పేరు కూడా కలిపి ఆయన కొత్తగా "డోన్రో డాక్ట్రిన్ (Donroe Doctrine)" అన్నారు .
ఇటీవలికాలంలో వాషింగ్టన్ ప్రభావంలో ఉన్న ఇతర దేశాలపై ఆయన చేసిన కొన్ని హెచ్చరికలు ఏమిటో చూద్దాం.


ఫొటో సోర్స్, Getty Images
గ్రీన్‌ల్యాండ్
అమెరికాకు ఇప్పటికే గ్రీన్‌ల్యాండ్‌లో పిటుఫిక్ స్పేస్ బేస్ అనే సైనిక స్థావరం ఉంది. కానీ ట్రంప్ ఆ స్థావరాన్నే కాకుండా, గ్రీన్‌ల్యాండ్ మొత్తం కావాలని కోరుకుంటున్నారు.
"జాతీయ భద్రత దృష్ట్యా మాకు గ్రీన్‌ల్యాండ్ అవసరం" అని ట్రంప్ విలేకరులతో అన్నారు. ఆ ప్రాంతం "రష్యా, చైనా నౌకలతో నిండి ఉంది" అన్నారు.
డెన్మార్క్‌లో భాగమైన విశాలమైన ఆర్కిటిక్ ద్వీపం, అమెరికాకు ఈశాన్యంగా దాదాపు 3,200 కి.మీ దూరంలో ఉంది.
స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, సైనిక హార్డ్‌వేర్ ఉత్పత్తికి కీలకమైన అరుదైన నిక్షేపాలు ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతం, చైనా అమెరికా కంటే చాలా ఎక్కువగా అరుదైన ఖనిజాలను ఉత్పత్తి చేస్తోంది.
ఉత్తర అట్లాంటిక్‌లో గ్రీన్‌ల్యాండ్ వ్యూహాత్మకమైన ప్రాంతం. ఆర్కిటిక్ వలయానికి గ్రీన్‌ల్యాండ్ ప్రవేశద్వారంలా ఉంటుంది. ధ్రువపు మంచు కరిగి కొత్త నౌకా మార్గాలు తెరుచుకుంటాయని భావిస్తుండటంతో ఆర్కిటిక్ సర్కిల్ ప్రాముఖ్యం పెరుగుతోంది.
ట్రంప్ స్పందనకు సమాధానంగా గ్రీన్‌ల్యాండ్ ప్రధాని జెన్స్ ఫ్రెడరిక్ నీల్సన్ అమెరికా ఈ ద్వీపాన్ని నియంత్రించాలనుకునే ఆలోచనను ‘‘ఫాంటసీ’’గా పేర్కొన్నారు.
"ఇక ఒత్తిడి అవసరం లేదు. ఇంకే పరోక్ష ఆరోపణలూ లేవు. విలీనం గురించి ఊహలు లేవు. మేం చర్చలకు సిద్ధంగా ఉన్నాం. కానీ సరైన మార్గాల ద్వారా, అంతర్జాతీయ చట్టాన్ని గౌరవిస్తూ జరగాలి" అని ఆయన అన్నారు.
గ్రీన్‌ల్యాండ్‌ను ఆక్రమించుకోవడానికి అమెరికా చేసే ఏ ప్రయత్నమైనా అది మరొక నేటో సభ్యదేశంతో ఘర్షణకు దారి తీస్తుంది, ఇది కూటమిని ప్రమాదంలో పడేసే అవకాశం ఉంది.
కొలంబియా
వెనెజ్వెలాలో ఆపరేషన్ జరిగిన కొన్ని గంటల తర్వాత, కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోను జాగ్రత్తగా ఉండమని ట్రంప్ హెచ్చరించారు
వెనెజ్వెలాకు పశ్చిమాన ఉన్న కొలంబియా గణనీయమైన చమురు నిల్వలకు నిలయం. బంగారం, వెండి, పచ్చలు, ప్లాటినం, బొగ్గువంటి ఖనిజాలకు ప్రధాన ఉత్పత్తిదారుగా ఉంది.
ఈ ప్రాంతం కొకైన్ వంటి మాదకద్రవ్యాల వ్యాపారానికి కీలకమైన కేంద్రంగా ఉంది.
ఆధారాలు లేకపోయినప్పటికీ మాదకద్రవ్యాలు తీసుకువెళుతున్నాయనే ఆరోపణలపై సెప్టెంబర్‌లో అమెరికా, కరేబియన్, తూర్పు పసిఫిక్‌లలో పడవలపై దాడులు మొదలుపెట్టినప్పటి నుంచి ట్రంప్‌కు, కొలంబియా వామపక్ష అధ్యక్షుడికి మధ్య వివాదం రాజుకుంది.
అక్టోబర్‌లో కొలంబియా అధ్యక్షుడు పెట్రోపై అమెరికా ఆంక్షలు విధించింది. ఆయన కార్టెల్స్ (అక్రమ వ్యాపార గుంపులు) వృద్ధి చెందడానికి అవకాశం ఇచ్చారని ఆరోపించింది.
ఆదివారం ఎయిర్ ఫోర్స్ వన్‌లో మాట్లాడుతూ.. "కొకైన్ తయారు చేసి అమెరికాకు అమ్మడానికి ఇష్టపడే సంకుచిత మనస్తత్వం కలిగిన వ్యక్తి కొలంబియాను పాలిస్తున్నాడు, కానీ ఎక్కువకాలం పాలించలేడు" అని ట్రంప్ అన్నారు.
కొలంబియాను లక్ష్యంగా చేసుకుని అమెరికా ఆపరేషన్ నిర్వహిస్తుందా అని అడిగినప్పుడు, ట్రంప్ "ఇదేదో బావున్నట్టు అనిపిస్తోంది" అని బదులిచ్చారు. మాదకద్రవ్యాలపై చేస్తున్న యుద్ధంలో చరిత్రాత్మకంగా వాషింగ్టన్‌కు కొలంబియా మిత్రదేశంగా ఉంది. కార్టెల్స్‌ను ఎదుర్కోవడానికి ఏటా వందల మిలియన్ల డాలర్ల సైనిక సహాయాన్ని అందుకుంటోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇరాన్
ప్రస్తుతం ఇరాన్‌లో పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు జరుగుతున్నాయి. మరింత మంది నిరసనకారులు చనిపోతే అక్కడి అధికారులు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు అని ట్రంప్ హెచ్చరించారు.
"మేం దీన్ని చాలా నిశితంగా గమనిస్తున్నాం. గతంలో చేసినట్లే వాళ్లు ప్రజలను చంపడం మొదలుపెడితే అమెరికా నుంచి వారికి చాలా కఠినమైన స్పందన ఎదురవుతుంది" అని ఆయన ఎయిర్ ఫోర్స్ వన్‌లో విలేఖరులతో అన్నారు.
సైద్ధాంతికంగా ఇరాన్ "డోన్రో డాక్ట్రిన్" పరిధికి వెలుపల ఉంటుంది. కానీ, ట్రంప్ గతంలో ఇరాన్ న్యూక్లియర్ స్థావరాలపై దాడి చేసిన తర్వాత, ఇరాన్ ప్రభుత్వంపై అదనపు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇరాన్ అణ్వాయుధాన్ని అభివృద్ధి చేయగల సామర్థ్యాన్ని తగ్గించడానికి ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున ఆపరేషన్ ప్రారంభించిన తర్వాత ఆ దాడులు జరిగాయి. ఇది 12 రోజుల ఇజ్రాయెల్-ఇరాన్ సంఘర్షణకు దారితీసింది.
గత వారం ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మధ్య జరిగిన మార్-ఎ-లాగో సమావేశంలో, అజెండాలో ఇరాన్ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. 2026 లో ఇరాన్‌పై కొత్త దాడులు జరిగే అవకాశాన్ని నెతన్యాహు ప్రస్తావించారని యుఎస్ మీడియా నివేదించింది.

ఫొటో సోర్స్, Getty Images
మెక్సికో
ట్రంప్ 2016లో అధికారంలోకి రాగానే మెక్సికో దక్షిణ సరిహద్దు వెంబడి "గోడ నిర్మిస్తాం’’ అనిప్రకటించి వార్తల్లో నిలిచారు.
ట్రంప్ రెండోసారి 2025లో పదవీ బాధ్యతలు స్వీకరించిన తొలి రోజున, ఆయన గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును " గల్ఫ్ ఆఫ్ అమెరికా "గా మార్చడానికి ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు.
అమెరికాలోకి డ్రగ్స్ లేదా అక్రమ వలసదారులు ప్రవేశించకుండా నిరోధించడంలో మెక్సికో అధికారులు తగిన చర్యలు తీసుకోలేదని ఆయన తరచుగా ఆరోపించేవారు.
ఆదివారం ట్రంప్ మాట్లాడుతూ, మెక్సికో ద్వారా మాదకద్రవ్యాలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయని, ఏదో ఒకటి చేయాలని, అక్కడి కార్టెల్స్ చాలా బలంగా ఉన్నాయన్నారు.
కార్టెల్స్‌ను ఎదుర్కోవడానికి మెక్సికోకు అమెరికా దళాలను పంపడానికి ముందుకొచ్చానని ట్రంప్ అన్నారు. కానీ అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ మెక్సికన్ గడ్డపై అమెరికా సైనిక చర్యలను అంగీకరించమని బహిరంగంగా చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
క్యూబా
ఫ్లోరిడాకు దక్షిణంగా కేవలం 145 కి.మీ దూరంలో ఉన్న ఈ ద్వీప దేశం 1960ల ప్రారంభం నుంచి అమెరికా ఆంక్షల కింద ఉంది.
ఈ దేశం నికోలస్ మదురో నాయకత్వంలోని వెనెజ్వెలాతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉంది. రిపోర్టుల ప్రకారం వెనెజ్వెలా సుమారు 30 శాతం చమురును క్యూబాకు సరఫరా చేసింది. అదే సమయంలో క్యూబా వైద్యులు వెనిజ్వెలాకు వెళ్లేవారు.
ఇప్పుడు వెనెజ్వెలాలో మదురో లేకపోవడం, అక్కడి నుంచి వచ్చే చమూరు క్యూబా పొందలేకపోతే హవానా సమస్యల్లో పడే అవకాశం ఉంది.
క్యూబా ఇప్పటికే పతనానికి సిద్ధంగా ఉంది కాబట్టి, అక్కడ అమెరికా సైనిక జోక్యం అవసరం లేదని ట్రంప్ అన్నారు.
"మనం ఎటువంటి చర్య తీసుకోవాల్సిన పనిలేదనుకుంటున్నాను, దానంతటదే కుప్పకూలుతున్నట్టు కనిపిస్తోంది" అని ఆయన అన్నారు.
"వారు నిలబడగలరో నాకు తెలియదు, కానీ క్యూబాకు ఇప్పుడు ఆదాయం లేదు" అని ఆయన అన్నారు. "వారు తమ ఆదాయమంతా వెనెజ్వెలా నుంచి, వెనిజ్వెలా చమురు నుంచి పొందారని’’ ఆయన చెప్పారు.
క్యూబా వలసదారుల కుమారుడు అయిన అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో చాలా కాలంగా క్యూబాలో పాలనా మార్పు కోసం పిలుపునిస్తున్నారు.
"నేను హవానాలో నివసిస్తుంటే, ప్రభుత్వంలో ఉంటే కనీసం కొంచెం అయినా ఆందోళన చెందేవాడిని "అని ఆయన విలేకరులతో ఇలా అన్నారు.
"అమెరికా అధ్యక్షుడి మాటలను సీరియస్‌గా తీసుకోవాలి" అని ఆయన అన్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














