అమెరికాలో కస్టమ్స్ అండ్ ఇమ్మిగ్రేషన్ ఏజెంట్ కాల్చి చంపిన రెనీ నికోల్ గుడ్ ఎవరు?

ఫొటో సోర్స్, Renee Nicole Good
అమెరికాలోని మిన్నెయాపోలిస్ ఇమ్మిగ్రేషన్ ఏజంట్ ఓ మహిళను కాల్చి చంపారు. ఆమెను 37 ఏళ్ల రినీ నికోల్ గుడ్ గా గుర్తించారు. ఆమెకు ముగ్గురు పిల్లలు.
ఆమె రాసిన కవిత్వానికి అవార్డు వచ్చింది. గిటార్ వాయిస్తారు. ఆమె ప్రస్తుతం ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యకలాపాలకు న్యాయ పరిశీలకురాలిగా ఉన్నారని నగర నాయకులు తెలిపారు.
అయితే ఆమె "స్థానిక ఉగ్రవాది" అని ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది.
ఆమె మరణాన్ని నిరసిస్తూ దేశం అంతటా "రీనికి న్యాయం జరగాలి" అని రాసి ఉన్న ప్లకార్డులతో ప్రదర్శనలు చేపట్టారు.
అధికారితో ఘర్షణ సమయంలో తన కుమార్తె భయపడి ఉండవచ్చని ఆమె తల్లి డొన్నా గాంగర్ మిన్నెసోటా స్టార్ ట్రిబ్యూన్‌తో చెప్పారు.
ఈ ఘర్షణలో అధికారి ఆమెను కాల్చి చంపారని, తాను చూసిన వ్యక్తులలో తన కుమార్తె అత్యంత దయగల వ్యక్తి అని ఆమె అన్నారు.
"ఆమె కరుణామయురాలు. తన జీవితాంతం అందర్నీ జాగ్రత్తగా చూసుకున్నారు. ఆమెకు క్షమించే హృదయం ఉంది" అని గాంగర్ వార్తాపత్రికతో చెప్పారు.
"ఆమె జీవితం బాగానే ఉంది కానీ అందులో కష్టాలు ఉన్నాయి" అని ఆమె తండ్రి టిమ్ గాంగర్ వాషింగ్టన్ పోస్ట్‌తో చెప్పారు.
రీని గుడ్ కుటుంబ సభ్యుల కోసం 50వేల డాలర్ల విరాళాలు సేకరించాలని భావిస్తే 10 గంటల్లోనే 3 లక్షల 70వేల డాలర్ల విరాళాలు వచ్చాయి.
"మిన్నెయాపొలిస్ గురించి తెలుసుకుంటున్నాను" "రచయిత్రిని, కవిని, భార్యను, తల్లిని" అని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో తన గురించి రాసుకున్నారు. ప్రస్తుతం ఈ అకౌంట్‌ను ప్రైవేట్‌గా మార్చారు.
నికోలస్ గుడ్ వాస్తవంగా కొలరాడో స్ప్రింగ్స్ వాసి. గతేడాది ఆమె కన్సాస్ నుంచి మిన్నెయాపొలిస్‌కు వచ్చారు. ఆమె అమెరికన్ పౌరురాలు.

ఆమె తన రెండో భర్త టిమ్ మెక్లిన్‌తో కలిసి పాడ్‌కాస్ట్ నిర్వహించేవారని ది మిన్నెసోటా స్టార్ ట్రిబ్యూన్ తెలిపింది. మెక్లిన్ 2023లో చనిపోయారు.
వాళ్లిద్దరికీ ఓ కొడుకు ఉన్నాడు. ఇప్పుడతనికి ఆరేళ్లని మెక్లిన్ తండ్రి ది మిన్నెసోటా స్టార్ ట్రిబ్యూన్‌తో చెప్పారు.
నికోలస్ గుడ్, ఆమె మొదటి భర్తకు ఇద్దరు సంతానమని పేరు చెప్పడానికి ఇష్టపడని వ్యక్తి ఒకరు అమెరికన్ మీడియాకు తెలిపారు.
గుడ్ మంచి కార్యకర్త అని, ఆమె యవ్వనంలో ఉన్నప్పుడు ఉత్తర ఐర్లండ్‌లో యూత్ మిషన్లలో పాల్గొనేవారని, క్రైస్తవ విశ్వాసురాలని ఆయన చెప్పారు. గతంలో ఆమె ఓ క్రెడిట్ యూనియన్‌లో డెంటల్ అసిస్టెంట్‌గా పని చేశారు. అయితే ఇటీవల కొంత కాలంగా ఇంటి వద్దే ఉంటున్నారని అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
రచయిత, సృజనశీలి
వర్జీనియాలోని నార్ఫోక్‌లో ఓల్డ్ డొమినియన్ యూనివర్సిటీలో గుడ్ క్రియేటివ్ రైటింగ్ చదువుకున్నారు. 2020లో ఆన్ లెర్నింగ్ టు డిస్‌సెక్ట్ ఫెటల్ పిగ్స్ అనే తన రచనకు ఆమె అకాడమీ ఆఫ్ అమెరికన్ పోయెట్స్ నుంచి అండర్‌గ్రాడ్యుయేట్ బహుమతి పొందారు .
"రాయడం, చదవడం లేదా రచనల గురించి మాట్లాడటం కాకుండా మిగతా సమయాల్లో ఆమె సినిమాలు చూసేవారు . తన కుమార్తె, ఇద్దరు కుమారులతో కలిసి అస్తవ్యవస్తమైన పనులను (మెస్సీ ఆర్ట్) కళాత్మకంగా చేసేవారు'' అని ఆ బహుమతి సందర్భంగా ఆమె గురించి ప్రచురించిన బయోగ్రఫీలోని మాటలను అమెరికా మీడియా పేర్కొంది. కానీ ఇప్పుడు వాటిని తొలగించినట్టుగా కనిపిస్తోంది.
గుడ్ అదే ఏడాది ఓల్డ్ డొమినియన్ యూనివర్సిటీకి చెందిన కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ నుంచి ఇంగ్లిష్‌లో డిగ్రీ పూర్తి చేశారు.
ఆమె ఆకస్మిక మరణంపై యూనివర్సిటీ అధ్యక్షుడు బ్రయాన్ హెంప్‌హిల్ ఒక ప్రకటన విడుదల చేశారు. "భయం, హింస మన దేశంలో సాధారణ విషయాలుగా మారిపోయాయని ఇది మరో స్పష్టమైన ఉదాహరణ" అని ఆయన పేర్కొన్నారు. "రెనీ జీవితం మనల్ని ఏకం చేసే స్వేచ్ఛ, ప్రేమ, శాంతి విలువలను గుర్తు చేయాలి''అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మిన్నియాపోలిస్ దక్షిణ ప్రాంతంలో జరిగిన ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) దాడుల సమయంలో న్యాయ పరిశీలకురాలిగా అక్కడ ఉన్నట్లు పలువురు రాష్ట్ర అధికారులు తెలిపారు. నిరసనలు, భద్రతా చర్యల సమయంలో పోలీసులు, భద్రతా బలగాల ప్రవర్తనను గమనిస్తూ, శాంతిని కాపాడటం, దుర్వినియోగాన్ని అడ్డుకోవడం, న్యాయ హక్కుల పరిరక్షణను చూడటమే న్యాయపరిశీలకుల లక్ష్యమని వారు చెప్పారు.
అయితే గుడ్ తల్లి మిన్నెసోటా స్టార్ ట్రిబ్యూన్ పత్రికతో మాట్లాడుతూ, ఐసీఈ అధికారులను ఎదిరించే లేదా అడ్డుకునే చర్యల్లో తన కుమార్తె పాల్గొనలేదని స్పష్టం చేశారు. "ఆమె ఎలాంటి వ్యతిరేక కార్యకలాపంలోనూ భాగం కాదు" అని చెప్పారు.
దీనికి భిన్నంగా, అధ్యక్షుడితో సహా వైట్ హౌస్ అధికారులు మాత్రం గుడ్ కేవలం పరిశీలకురాలు కాదని, అధికారుల పనిలో జోక్యం చేసుకున్నారని ఆరోపించారు.
అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టీ నోయం మాట్లాడుతూ, గుడ్ రోజంతా ఐసీఈ అధికారులను వెంబడిస్తూ, తన కారుతో వారి మార్గాన్ని అడ్డుకున్నారని, వారిపై అరుస్తూ వారి విధులకు భంగం కలిగించారని చెప్పారు.
"ఆమె తన వాహనాన్ని ఆయుధంగా మార్చారు" అని నోయం మీడియాకు తెలిపారు. ఐసీఈ అధికారిని కారు కింద తొక్కేందుకు ప్రయత్నించి, ఆయనను చంపాలని లేదా తీవ్రంగా గాయపరచాలని ప్రయత్నించారని, ఇది దేశీయ ఉగ్రవాద చర్యకు సమానమని ఆమె వ్యాఖ్యానించారు.
ఐసీఈ అధికారి తన ప్రాణాలకు ముప్పు ఉందని భావించి, ఆత్మరక్షణ చర్యగా కాల్పులు జరిపారని నోయం చెప్పారు.
ఈ వాదనలకు అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ కూడా మద్దతు పలికారు. ఆయన తన ట్రూత్ సోషల్ వేదికలో, "కారు నడిపిన మహిళ అత్యంత అస్తవ్యస్తంగా ప్రవర్తించారు. అధికారుల పనిని అడ్డుకున్నారు, ప్రతిఘటించారు" అని రాశారు. ఆమెను ''వృత్తిగత ఆందోళనకారిణి''గా అభివర్ణిస్తూ ''హింసాత్మకంగా, ఇష్టారాజ్యంగా ఐసీఈ అధికారిపై వ్యవహరించారని చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
అయితే నగర మేయర్ మాత్రం కాల్పులు జరిపిన ఐసీఈ అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు.
"నేనే ఆ వీడియో చూశాను. ఇది పూర్తిగా అబద్ధమని అందరికీ నేరుగా చెప్పాలనుకుంటున్నా" అని మేయర్ జేకబ్ ఫ్రే అన్నారు.
"ఒక వ్యక్తి ప్రాణాలు పోవడానికి కారణమైనది ఆ ఏజెంట్ అధికార దుర్వినియోగమే" అని ఆయన వ్యాఖ్యానించారు.
గుడ్ తాను హతమైన ప్రదేశానికి కేవలం కొన్ని బ్లాకుల దూరంలోనే నివసించేవారని సమాచారం. ఆ ప్రాంతం 2020లో జార్జ్ ఫ్లాయిడ్‌ను ఒక నగర పోలీసు అధికారి హత్య చేసిన ప్రదేశానికి సుమారు ఒక మైలు దూరంలో ఉంది. ఆ ఘటన ప్రపంచవ్యాప్తంగా జాత్యహంకార వ్యతిరేక నిరసనలకు దారితీసింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














