ఆల్డ్రిచ్ ఏమ్స్: అమెరికా చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన ఈ డబుల్ ఏజెంట్‌ కథ ఎలా ముగిసిందంటే..

ఆల్డ్రిచ్ ఏమ్స్, అమెరికా, స్పై, డబుల్ ఏజెంట్‌, రష్యా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మైల్స్ బర్క్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆల్డ్రిచ్ ఏమ్స్. సీఐఏలో ఒక ఉన్నతాధికారి. ఆయన దాదాపు పదేళ్లపాటు సోవియట్ యూనియన్‌కు రహస్య సమాచారాన్ని అమ్ముకున్నారు.

డబుల్ ఏజెంట్‌గా ఆయన ఇచ్చిన సమాచారం కారణంగా 100కి పైగా అమెరికా రహస్య కార్యకలాపాలు విఫలమయ్యాయి. కనీసం 10 మంది గూఢచారులు చనిపోయారు.

ఏప్రిల్ 28, 1994న ఆ డబుల్ ఏజెంట్‌కు జీవిత ఖైదు విధించారు. ఏమ్స్ తాను పట్టుబడ్డందుకు బాధపడ్డారు తప్ప గూఢచర్యం చేసినందుకు ఆయనలో ఎప్పుడూ పశ్చాత్తాపం లేదు.

ఏమ్స్ తనతోపాటు, తన భార్య ఖరీదైన అభిరుచులను నెరవేర్చడానికి గూఢచర్య మార్గాన్ని ఎంచుకున్నారు. ఇతర అధికారుల మాదిరిగా రష్యన్ ఏజెన్సీ కేజీబీ ఆయన్ను ఎప్పుడూ బ్లాక్‌మెయిల్ చేయలేదు.

జీవిత ఖైదు శిక్షను అనుభవించిన ఆయన 84 ఏళ్ల వయసులో జనవరి 5న జైలులోనే మరణించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
కేజీబీ ఆల్డ్రిచ్ ఏమ్స్‌, కొలోకాల్, కోడ్ నేమ్‌

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆల్డ్రిచ్ ఏమ్స్‌కు కొలోకాల్ అనే కోడ్ నేమ్‌ ఇచ్చింది కేజీబీ.

తప్పించుకున్న ఒలెగ్..

1985లో, సీఐఏ కోసం పనిచేస్తున్న సోవియట్ ఏజెంట్లు ఒక్కొక్కరుగా అదృశ్యమవుతూ వచ్చారు. వారిని సోవియట్ యూనియన్ నిఘా సంస్థ కేజీబీ బంధించి, విచారించి, ఆపై చంపేసింది.

ఆల్డ్రిచ్ ఏమ్స్ అందించిన సమాచారం ఆధారంగానే వారిని గుర్తించారు.

సోవియట్ యూనియన్ కోసం బయటికి పని చేస్తున్నట్టు నటిస్తూ, మరోవైపు పశ్చిమ దేశాలకు సమాచారం ఇస్తున్న ఏజెంట్ల వివరాలను ఏమ్స్ లీక్ చేశారు.

ఒలెగ్ గోర్డియెవ్‌స్కీ కూడా అలాంటి ఏజెంట్లలో ఒకరు. కానీ ఆయన తప్పించుకున్నారు.

కేజీబీ కర్నల్‌గా పనిచేస్తూ, లండన్‌లో కేజీబీ స్టేషన్ చీఫ్‌గా ఉన్నారు. కానీ బ్రిటన్ విదేశీ గూఢచారి సంస్థ M16 కోసం రహస్యంగా గూఢచర్యం చేసేవారు.

ఒకరోజు తాను మాస్కోలో ఉన్నట్లు గుర్తించారాయన. ఆయనకు మత్తుమందు ఇచ్చారు. ఐదు గంటల విచారణ తర్వాత పూర్తిగా అలసిపోయారు. ఆయన్ని చంపాలనుకున్నారు కానీ చివరి నిమిషంలో M16 ఆయన్ను కారు డిక్కీలో దాచిపెట్టి సోవియట్ యూనియన్ నుంచి బయటకు తీసుకెళ్లింది. అలా ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నారు.

ఈ సంఘటన తర్వాత తనను ఎవరు మోసం చేశారో తెలుసుకోవడానికి ఒలెగ్ ప్రయత్నాలు మొదలుపెట్టారు.

‘‘నన్ను ఎవరు పట్టించారో దాదాపు తొమ్మిదేళ్ల పాటు ఊహిస్తూనే ఉన్నాను. కానీ ఆ వ్యక్తి పేరు మాత్రం తెలుసుకోలేకపోయాను" అని 1994 ఫిబ్రవరి 28న బీబీసీకి చెందిన టామ్ మాంగోల్డ్‌కు ఆయన చెప్పారు.

రెండు నెలల తర్వాత, సీఐఏతోపాటు ఇతర దేశాలలోని దాదాపు అందరు సోవియట్ గూఢచారుల పేర్లను కేజీబీకి ఇచ్చానని ఆల్డ్రిచ్ ఏమ్స్ అమెరికా కోర్టులో అంగీకరించినప్పుడు వారికి సమాధానం దొరికింది.

కేజీబీ ఆల్డ్రిచ్ ఏమ్స్ కు "కొలోకాల్" అనే కోడ్ నేమ్ ఇచ్చింది. దీని అర్థం "గంట". ఏమ్స్ లీక్ చేసిన సమాచారం వల్ల సీఐఏకి పెద్ద అసెట్ అయిన జనరల్ దిమిత్రి పోల్యాకోవ్ కూడా మరణించారు.

పోల్యాకోవ్ సోవియట్ సైన్యంలో సీనియర్ అధికారి. 20 ఏళ్లకు పైగా పాశ్చాత్య దేశాలకు సమాచారం అందించారు.

కారు ప్రమాదం, పోలీసులు, ఏమ్స్, మద్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విలాసాల కోసం డబ్బు సంపాదించడం ఆల్డ్రిచ్‌కు బలహీనతగా మారింది.

మద్యం మత్తులో...

సీఐఏలో సోవియట్ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగానికి ఆల్డ్రిచ్ ఏమ్స్ అధిపతిగా ఉండేవారు. అందుకే ఆయన వద్ద సీఐఏ గూఢచారుల గురించి చాలా సమాచారం ఉండేది. దీన్ని లీక్ చేయడం వల్ల అమెరికాకు చాలా నష్టం జరిగిందని చెప్పవచ్చు.

ఏమ్స్ పదవి చాలా ఉన్నతమైంది. అందుకే ఇతర పాశ్చాత్య ఏజెన్సీల విచారణ సెషన్‌లలో కూడా పాల్గొనేవారు.

‘‘అమెరికన్లు విచారణలో చాలా బాగా వ్యవహరిస్తారు. నాకు అమెరికన్ అధికారులు నచ్చేవారు. నా సమాచారం వారికి ఇవ్వాలనుకున్నాను. కానీ ఏమ్స్ అక్కడ కూర్చున్నాడని నాకు తెలిసింది. ఆయన నా సమాచారమంతా కేజీబీకి ఇచ్చాడని అర్థమైంది" అని ఒలెగ్ గోర్డివ్స్కీ అన్నారు.

ఆల్డ్రిచ్ ఏమ్స్‌కి చిన్నప్పటి నుంచే గూఢచర్య ప్రపంచం ఎలా ఉంటుందో తెలుసు. సీఐఏ, కేజీబీ వంటి పేర్లు ఆయనకి కొత్తవి కావు.

ఏమ్స్ తండ్రి సీఐఏలో విశ్లేషకుడిగా పనిచేసేవారు. కాలేజ్ తర్వాత ఏమ్స్‌కి ఉద్యోగం రావడంలో ఆయన సాయం చేశారు. కెరీర్ మొదట్లో ఉన్నతాధికారుల్లో ఒకరిగా ఆల్డ్రిచ్ గుర్తింపు తెచ్చుకున్నారు.

1960ల చివరలో, ఏమ్స్ తన భార్య నాన్సీతో కలిసి తుర్కియేకు వెళ్లారు. అక్కడ విదేశీ ఏజెంట్లను నియమించడం మొదలుపెట్టారు.

కానీ 1972 నాటికి, ఆయన ఫీల్డ్ వర్క్‌కు సరిపోడని ఆయన బాస్‌కి అనిపించింది. దాంతో తిరిగి హెడ్ క్వార్టర్స్‌కి పిలిపించారు. అమెరికాలో ఆయన రష్యన్ భాష నేర్చుకొని, సోవియట్ అధికారులపై ఆపరేషన్‌లు ప్లాన్ చేయడం మొదలుపెట్టారు.

ఏమ్స్ తన తండ్రి చేసిన తప్పునే తన కెరీర్‌లో చేశారు. మద్యానికి బానిసయ్యారు. 1972లో, ఆయన ఒక మహిళా సీఐఏ ఉద్యోగితో అభ్యంతరక స్థితిలో పట్టుబడ్డారు. అప్పుడాయన మద్యం మత్తులో ఉన్నారు.

1976లో, తాగిన మత్తులో ఉన్న ఏమ్స్, సీక్రెట్ డాక్యుమెంట్స్ ఉన్న బ్యాగ్‌ని సబ్‌వేలో వదిలేశారు.

1981లో ఏమ్స్ కెరీర్ కోసం మెక్సికో నగరానికి వెళ్లారు. కానీ ఆయన భార్య న్యూయార్క్‌లోనే ఉండేవారు. మద్యం, ఆయన చెడు ప్రవర్తన కారణంగా అక్కడ కూడా ఆయన సరిగా పనిచేయలేక పోయారు.

ఒక కారు ప్రమాదం కేసులో పోలీసులు ఏమ్స్ తో మాట్లాడటానికి ప్రయత్నించగా, ఆయన మద్యం సేవించి ఉండడంతో మాట్లాడలేకపోయారు. ఒక పార్టీలో క్యూబా అధికారిని తిట్టారు.

ఇలా చాలా ఫిర్యాదులు రావడంతో, ఆయన అమెరికాకు తిరిగి వెళ్లి తన మద్యం వ్యసనానికి చికిత్స పొందాలని ఏమ్స్‌కు ఆయన బాస్ సూచించారు.

ఆల్డ్రిచ్ ఏమ్స్, కాలేజ్, చదువు, తండ్రి, సీఐఏ, అనలిస్ట్‌, ఉద్యోగం

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, ఆల్డ్రిచ్ ఏమ్స్ తన కాలేజీ చదువును మధ్యలోనే మానేశారు.

భార్య ఖరీదైన అభిరుచులు, డబ్బు అవసరం

ఆల్డ్రిచ్ ఏమ్స్‌‌కు వివాహేతర సంబంధాలు కూడా ఉండేవి. సీఐఏ కోసం పనిచేస్తున్న కొలంబియన్ అధికారిణి మరియా డెల్ రోసారియోతో 1982 చివరలో ఆయన వివాహేతర సంబంధం పెట్టుకున్నారు.

తర్వాత, భార్యకు విడాకులిచ్చి రోసారియోను పెళ్లి చేసుకుని, తిరిగి అమెరికాకు వెళ్లారు.

రోసారియో ఖరీదైన వస్తువులను ఇష్టపడేవారు. ఎక్కువగా షాపింగ్ చేసేవారు. కొలంబియాలోని తన కుటుంబానికి తరచూ ఫోన్లు చేస్తుండేవారు. అప్పట్లో అది చాలా ఖరీదైన వ్యవహారం.

తన మొదటి భార్యకు కూడా భరణం అందించాల్సి రావడంతో ఏమ్స్ ఆర్థిక పరిస్థితి దెబ్బతింది.

ఆ సమయంలో అప్పులపాలయ్యానని, అందుకే డబుల్ ఏజెంట్‌గా మారాలని నిర్ణయించుకున్నానని ఏమ్స్ స్వయంగా చెప్పారు.

"ఏమ్స్ కేవలం డబ్బు సంపాదించడానికే కేజీబీ కోసం గూఢచర్యం చేశారు. దానికి వేరే కారణం ఉందని ఆయన ఎప్పుడూ చెప్పలేదు" అని ఎఫ్‌బీఐ అధికారి లెస్లీ జి. వీజర్ 2015లో బీబీసీతో అన్నారు.

దేశ ద్రోహం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇప్పటివరకు బయటపడిన డబుల్ ఏజెంట్లలో, ఆల్డ్రిచ్ ఏమ్స్ అత్యంత సీనియర్ సీఐఏ అధికారి.

దేశ ద్రోహం

1985 ఏప్రిల్ 16న ఆల్డ్రిచ్ ఏమ్స్ మద్యం తాగి నేరుగా వాషింగ్టన్‌లోని రష్యన్ రాయబార కార్యాలయానికి వెళ్లారు.

రిసెప్షన్‌లో ఒక కవర్ ఇచ్చారు. అందులో కొంతమంది డబుల్ ఏజెంట్ల పేర్లు, సీఐఏకి సంబంధించిన డాక్యుమెంట్లు, 50 వేల డాలర్లు డిమాండ్ చేస్తూ ఒక నోట్ ఉన్నాయి.

ఏమ్స్ ఇలా ఒక్కసారి మాత్రమే చేస్తాడని అనుకున్నారు. కానీ ఆయన బయటకు రాలేని ఒక ఊబిలోకి కూరుకుపోయారు. తర్వాత తొమ్మిదేళ్లు, కేజీబీకి సమాచారం అందిస్తూ, డబ్బు సంపాదించారు.

ఆయన సీఐఏ కార్యాలయం నుంచి రహస్య పత్రాలను ఫాయిల్‌లో చుట్టి తీసుకెళ్లేవారు. అధికారిక సమావేశం ముసుగులో రష్యన్ దౌత్యవేత్తలతో సమావేశమై హ్యాండ్లర్‌కు పత్రాలు అందజేసేవారు.

కొన్నిసార్లు ముందుగా నిర్ణయించిన ప్రదేశాలలో ఆయన డాక్యుమెంట్స్ పెట్టేవారు.

"డాక్యుమెంట్స్ వేసేముందు మెయిల్‌బాక్స్‌లో చాక్‌పీస్‌తో గుర్తు పెట్టేవారు ఏమ్స్. ఆ గుర్తు చూసి డాక్యుమెంట్లు వేశారని సోవియట్ ఏజెంట్లు అర్థం చేసుకునేవారు. పత్రాలను తీసుకున్న తర్వాత వారు ఆ గుర్తును చెరిపేసేవారు. దాంతో పని పూర్తయిందని ఏమ్స్‌కు తెలిసేది" అని ఎఫ్‌బీఐ అధికారి వీజర్ అన్నారు.

ఏమ్స్ కారణంగా సీఐఏలోని దాదాపు సోవియట్ గూఢచారులందరనీ కనిపెట్టింది కేజీబీ. దీంతో అమెరికా రహస్య కార్యకలాపాలు ఆగిపోయాయి.

"ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణమైన ఇలాంటి డబుల్ ఏజెంట్‌ను నేను ఇంత వరకూ చూడలేదు" అని వీజర్ అన్నారు.

అనేకమంది గూఢచారుల అదృశ్యం కొన్ని ప్రశ్నలు లేవనెత్తింది. 1986లో సీఐఏ దర్యాప్తు మొదలుపెట్టింది. కానీ ఏమ్స్ తొమ్మిదేళ్లు తప్పించుకున్నారు. సోవియట్ యూనియన్ నుంచి సుమారు 2.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.20.75 కోట్లు) అందుకున్నారు. ఏమ్స్ తన సంపాదనను దాచలేదు. విలాసవంతమైన జీవితాన్ని గడపడం మొదలుపెట్టారు.

సీఐఏలో ఆయన వార్షిక జీతం 70వేల డాలర్ల (సుమారు రూ.58.1 లక్షలు)కు మించి ఉండదు. కానీ, 540,000డాలర్ల (సుమారు రూ.4.48కోట్లు) విలువైన ఇల్లు కొన్నారు. ఇల్లు బాగు చేయించడానికి వేల డాలర్లు ఖర్చు చేశారు. ఖరీదైన కారు కూడా కొన్నారు.

ఈ విలాసవంతమైన లైఫ్‌స్టైల్ ఏమ్స్‌పై సందేహం కలిగేలా చేసింది. ఆయనపై దర్యాప్తు మొదలైంది. చివరికది 1994లో ఆయన్ను అరెస్ట్ చేయడానికి దారితీసింది.

అరెస్ట్ తర్వాత, ఏమ్స్‌ను విచారించడంలో సహకరించినదుకు అతని భార్య రోసారియోకు తక్కువ శిక్ష పడింది.

ఐదేళ్ల తర్వాత రోసారియో విడుదలయ్యారు. ఏమ్స్ జీవితాంతం జైలుశిక్ష అనుభవించారు.

"తన గూఢచర్యం గురించి చాలా గర్వంగా ఫీలయ్యాడు. పట్టుబడినందుకు బాధపడ్డాడు తప్ప గూఢచర్యం చేసినందుకు ఆయనలో ఎలాంటి విచారం లేదు" అని ఎఫ్‌బీఐ అధికారి వీజర్ చెప్పారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)