మారిషస్: 'ఉగాదికి దేశమంతా సెలవు ఇచ్చే దేశం ప్రపంచంలో ఇదొక్కటే'..

ఫొటో సోర్స్, mtelugucct
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
''ఎయిర్‌పోర్టులో దిగగానే, పక్కనే ఉన్న నా స్నేహితులతో చెప్పా.. ఇప్పుడు నేను నా ఇంటికి వచ్చానని. అక్కడ తెలుగు అక్షరాలు చూసి ఎంతో గర్వంగా అనిపించింది'' అంటూ అదే గర్వంతో నవ్వారు కేశరాజ్ పొలయ్య.
''తెలుగు మా మాతృ భాష కాదు. అది మా పూర్వీకుల భాష. అందుకే తరతరాలుగా తెలుగును మరిచిపోకుండా గుండెల్లో పెట్టుకుంటున్నాం'' అంటూ సంతోషంగా చెప్పారు రాజవంతి దలయ్య.
వీరిది మారిషస్.
వేగంగా, స్పష్టంగా కాకపోయినా.. వీరు తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు. ‘‘మాకు మాట్లాడటమే కాదు, చదవడం, రాయడం కూడా వచ్చు'' అని చెప్పారు రాజవంతి.
తెలుగువారు మారిషస్ ఎప్పుడు వెళ్లారు? అక్కడ ఎలా స్థిరపడ్డారు?


"తెలుగులో పీహెచ్‌డీ చేశా"
ప్రపంచ తెలుగు మహాసభలు 2026 జనవరి 3 నుంచి 5 వరకు గుంటూరులో నిర్వహించారు. ఆ దేశంలో స్థిరపడిన 14 మంది తెలుగువారు మారిషస్ తెలుగు మహాసభ తరఫున గుంటూరు వచ్చారు.
ఆ తర్వాత 'తెలుగు జాతి ట్రస్ట్' ట్రస్టీ డీపీ అనూరాధ నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొనేందుకు వారిలో 11మంది హైదరాబాద్ వచ్చారు.
వారిలో రాజవంతి కూడా ఒకరు. తెలుగులో తాను పీహెచ్‌డీ చేశానని బీబీసీతో చెప్పారామె.
''చిన్నప్పట్నుంచి తెలుగు అంటే ప్రాణం. బడిలో కూడా బాగా నేర్చుకునేదాన్ని. మారిషస్‌లో కేంబ్రిడ్జి యూనివర్సిటీ నిర్వహించే తెలుగు పరీక్షలో స్కాలర్‌షిప్ వచ్చింది. దాంతో హైదరాబాద్ వచ్చి నిజాం కాలేజీలో తెలుగులో బీఏ, ఎంఏ చేశాను'' అని వివరించారు.
పెళ్లి కావడంతో ఆమె తిరిగి మారిషస్ వెళ్లిపోయారు. అక్కడ మారిషస్ ఓపెన్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేశానని తెలిపారు.
''మారిషస్‌లో ఉన్న తెలుగు భాష, సంస్కృతులపై వేరే భాషల ప్రభావంపై నా పీహెచ్‌డీ సాగింది'' అని చెప్పారామె.

'ఆరేళ్ల వయసు నుంచి కూచిపూడి నేర్చుకుంటున్నా'
మారిషస్‌లో స్థిరపడిన తెలుగు కుటుంబాలు మాతృ భాషను ఇప్పటికీ బతికించుకుంటున్నాయి. తమ పిల్లలకు తెలుగు సంప్రదాయాలు నేర్పించేందుకు కొందరిని తెలుగు రాష్ట్రాలకు పంపిస్తున్నారు.
అలా వచ్చిన వారిలో శయన పెంటయ్య ఒకరు.
''నేను ఆరేళ్ల నుంచి కూచిపూడి నేర్చుకోవడం ప్రారంభించాను. మారిషస్‌లోని మహాత్మా గాంధీ ఇన్‌స్టిట్యూట్ నుంచి సర్టిఫికెట్ కోర్సు చేశాను. తర్వాత హైదరాబాద్ వచ్చి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ (ప్రస్తుతం సురవరం ప్రతాప రెడ్డి యూనివర్సిటీ) నుంచి శిక్షణ పొందాను. ఉగాది రోజున లేదా గోవింద వ్రతం రోజున ప్రదర్శన ఇస్తుంటాను'' అని చెప్పారు.

'తెలుగు పండుగలన్నీ జరుపుకొంటాం'
తెలుగు పండుగలన్నీ అక్కడ జరుపుకుంటామని చెప్పారు మారిషస్ తెలుగు మహాసభ అధ్యక్షుడు హెవిన్.
మారిషస్ ఆంధ్ర మహాసభను 1947 ఆగస్టు 4న ఏర్పాటు చేశారు. 2014లో ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన తర్వాత మారిషస్ తెలుగు మహాసభగా దీని పేరు మార్చారు.
''సంక్రాంతి, ఉగాది, రామ కీర్తనలు, గోవింద వ్రతం 40 రోజులు, దీపావళి, బోనాలు.. ఇలా అన్ని పండుగలూ చేసుకుంటాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని ఘనంగా చేస్తుంటాం'' అని అన్నారు.
ఉగాది రోజున మారిషస్‌లో దేశమంతా సెలవు దినం (నేషనల్ హాలిడే) అని చెప్పారు హెవిన్.
''ఉగాది రోజున దేశమంతా సెలవు ఇచ్చే ఏకైక దేశం మారిషస్'' అని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, mauritiustelugumahasabha
మారిషస్‌కు తెలుగువారు ఎందుకు వెళ్లారంటే..
1830లలో బ్రిటిషర్లు చెరకు తోటలు, రబ్బరు తోటల్లో పనిచేసేందుకు తెలుగువారిని తీసుకెళ్లారని డీపీ అనూరాధ వివరించారు.
ప్రస్తుతం మారిషస్ జనాభా సుమారు 12లక్షలు.
ఇందులో తెలుగు వారు సుమారు లక్ష మంది ఉంటారని మారిషస్ తెలుగు మహాసభ అధ్యక్షుడు హెవిన్ గురయ్య బీబీసీతో చెప్పారు.
మరోవైపు, వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్ వెబ్ సైట్ ప్రకారం, తెలుగు వారి సంఖ్య సుమారు 50వేలుగా ఉంది.
ఈ లెక్కలను బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.
''మారిషస్‌లో ప్రభుత్వం మూడు సంస్థలు ఏర్పాటు చేసింది. మారిషస్ తెలుగు భాషా సంఘం, మారిషస్ తెలుగు మహాసభ, మారిషస్ తెలుగు సాంస్కృతిక సంఘం.
వీటితో పాటు కొన్ని సంస్థలు కూడా తెలుగువారి కోసం అక్కడ పనిచేస్తున్నాయి. ఈ సంస్థల నిర్వహణ కోసం ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేస్తుంటుంది'' అని బీబీసీతో చెప్పారు రాజవంతి.

ఫొటో సోర్స్, mtelugucct
మారిషస్‌కు వలస ఎప్పుడు వెళ్లారంటే..
మారిషస్ తెలుగు కల్చరల్ సెంటర్ ట్రస్టు (ఎంటీసీసీటీ) ప్రకారం, 1834 నుంచి 1912 వరకు ఆంధ్రప్రదేశ్ నుంచి మారిషస్‌కు వలసలు వెళ్లారు.
ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణాజిల్లా తీర ప్రాంతాల నుంచి ప్రజలు వలస వెళ్లారు.
వీరిలో ఎక్కువ మంది కోరంగి పోర్టు నుంచి సముద్రం మీదుగా మారిషస్ చేరుకున్నట్లు ఎంటీసీసీటీ చెబుతోంది.
ఈ జిల్లాల నుంచే కాకుండా గుంటూరు, నెల్లూరు, కడప జిల్లాల నుంచి చెన్నై మీదుగా కూడా కొందరు మారిషస్ చేరుకున్నారు.

ఫొటో సోర్స్, mauritiustelugumahasabha
'బడిలో తెలుగు తప్పనిసరి'
''మారిషస్ వెళ్లినప్పుడు నాకు ఒక ప్రత్యేకత కనిపించింది. అక్కడ కులాలు కనిపించవు. భాషల ఆధారంగా ఈ విభజన ఉంటుంది.
తెలుగువాళ్లందరిదీ ఒక కులం, తమిళులది ఒక కులం, హిందీ మాట్లాడేవారిది ఒక కులం.. ఇలా విభజన జరిగింది'' అని తెలుగు యూనివర్సిటీ మాజీ వైస్ చాన్సలర్ గౌరీశంకర్ చెప్పారు.
ఇప్పటికే నాలుగైదు తరాలు గడిచినా తెలుగును బతికించుకునేందుకు వారు తమ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని ఆయన అన్నారు.
''మాకు బడిలో తెలుగు చదవడం తప్పనిసరిగా ఉంటుంది. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత స్థాయిలో తెలుగు చదవాల్సి ఉంటుంది. ఈ భాష ఎంపిక అనేది ఆయా పిల్లల నేపథ్యంపై ఆధారపడి ఉంటుంది'' అని హెవిన్ చెప్పారు.
తెలుగు నేర్పించేందుకు పాఠశాలల్లో ప్రత్యేకంగా సాయంత్రం స్కూళ్లు నడుస్తున్నాయని చెప్పారాయన.
'తెలుగు సినిమాల విడుదల'
తెలుగువారు అక్కడ ప్రత్యేకంగా ఆలయాలు కూడా నిర్మించుకున్నారు.
అంతేకాదు, తెలుగు ప్రజల కోసం అక్కడ తెలుగు సినిమాలు కూడా విడుదలవుతుంటాయి.
''నాకు తెలుగు నటుల్లో మహేశ్ బాబు, విజయ్ దేవరకొండ, నాగార్జున, వెంకటేశ్ అంటే ఇష్టం. ఆర్ఆర్ఆర్ సినిమా మారిషస్ థియేటర్ల విడుదలైంది. నేనూ ఆ సినిమా చూశా'' అని చెప్పారు శయన.
'నువ్వేకావాలి' సినిమా నుంచి ''కళ్లల్లోకి కళ్లు పెట్టి చూడవెందుకు..'' అనే పాటను కూడా పాడి వినిపించారు.
అలాగే రెండు వారాలకోసారి మారిషస్ నేషనల్ చానెల్‌లో తెలుగు సినిమా ఒకటి వస్తుంటుందని హెవిన్ గురయ్య చెప్పారు.

'ప్రస్తుత తరంపైనా కొంత ప్రభావం'
ప్రస్తుత తరంలో తెలుగు మాట్లాడటం తగ్గుతోందేమో అనిపిస్తోందని కొందరు చెప్పారు.
''మేం బడిలో తెలుగు నేర్చుకుంటున్నాం. తెలుగు రాయడం వస్తుంది. మాట్లాడటమే కష్టంగా ఉంటుంది. అక్కడ రెగ్యులర్‌గా మాట్లాడుకున్నప్పుడు ఇంగ్లిష్‌లోనే మాట్లాడుకుంటాం. ఎప్పుడైనా చెల్లితో మాట్లాడేటప్పుడు తెలుగులో మాట్లాడుకుంటాం'' అని కేశరాజ్ బీబీసీతో చెప్పారు.
రామ కీర్తనలు, గోవింద నామ కీర్తనలతోపాటు భజనలు, పూజలు చేసేటప్పుడు తెలుగులోనే చేస్తుంటామని కేశరాజ్ చెప్పారు.
‘పేరు చివరన తాతల పేరు’
మారిషస్‌లో స్థిరపడిన తెలుగువారి పేర్లలో పాతకాలం నాటి తెలుగు వ్యక్తుల పేర్లు కనిపిస్తుంటాయి.
తాతల పేర్లను తమ పేరు చివర్లో పెట్టుకున్నామని కేశరాజ్ పొలయ్య చెప్పారు.
ఒకవిధంగా దీన్ని ఇంటిపేరుగా చెబుతున్నారు.
గురయ్య, పొలయ్య, దలయ్య, పెంటయ్య… ఇలాంటి పేర్లు ప్రతిఒక్కరి పేరు చివర్లో కనిపిస్తుంటాయి.

ఫొటో సోర్స్, mtelugucct
'రామ కీర్తనలకు యునెస్కో గుర్తింపు కోసం ప్రయత్నాలు'
మారిషస్‌లో పాడుకునే రామ కీర్తనలకు యునెస్కో వారసత్వ గుర్తింపు కోసం కృషి చేస్తున్నామని మారిషస్ తెలుగు మహాసభ అధ్యక్షుడు హెవిన్ గురయ్య చెప్పారు.
దీనిపై కేశరాజ్ బీబీసీతో మాట్లాడారు.
''మా ముత్తాతలు అప్పట్లో మారిషస్‌కు వచ్చినప్పుడు చాలా కష్టాలు పడేవారట. బాగా కష్టపడి పనిచేసినా తక్కువ జీతం వచ్చేది. సాయంత్రం తాతలంతా సమావేశం పెట్టుకుని, రామ కీర్తనలు పాడి, వారి బాధలను ఆ రూపంలో రాముడికి చెప్పుకొనేవారట. అప్పట్నుంచి మేం రామ కీర్తనలు చేసే ఆనవాయితీని కొనసాగిస్తున్నాం'' అని చెప్పారు.
మారిషస్‌లో పాడే రామ కీర్తనలకు, తెలుగు రాష్ట్రాల్లో పాడే కీర్తనలకు పాడే విధానంలో కొంత వ్యత్యాసం కనిపిస్తుందని కేశరాజ్ చెప్పారు.
‘‘అక్కడ (మారిషస్)లో పాడే రామ కీర్తనలకు యునెస్కో వారసత్వ గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నాం. వచ్చే ఏడాది నాటికి సాధిస్తామని నమ్మకం ఉంది. దీనిపై ఇప్పటికే పరిశోధన బృందాలు పనిచేస్తున్నాయి'' అని వివరించారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













