ఎలక్ట్రోలైట్స్ డ్రింక్ తాగడం బెటరా, ఆమ్లెట్ తినడం బెటరా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, యాస్మిన్ రుఫో
- హోదా, బీబీసీ న్యూస్
వ్యాయామశాలల్లో, రన్నింగ్ చేసే మార్గాల్లో ఎలక్ట్రోలైట్ డ్రింక్ పోస్టర్లు తరచూ కనిపిస్తుంటాయి. ఇవి వ్యాయామ పనితీరును మెరుగుపరుస్తాయని, త్వరగా కోలుకోవడానికి ఉపయోగపడతాయని చెబుతుంటాయి.
తీవ్రమైన వేడి వాతావరణంలో కఠిన శిక్షణ తీసుకునేటప్పుడు ప్రముఖ క్రీడాకారులు తీసుకునే పానీయాలుగా ఒకప్పుడు పేరొందిన ఈ ఎలక్ట్రోలైట్ పానీయాలు... ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ చేరువలోకి వచ్చేశాయి.జిమ్‌కు వెళ్లేవారితో పాటు.. ఆఫీసుకు వెళ్లేవారు, ప్రయాణాలు చేసేవారు కూడా హైడ్రేషన్ బూస్ట్‌గా దీన్ని తీసుకోవచ్చంటూ మార్కెటింగ్ చేస్తున్నారు.
కొద్ది మొత్తం వెచ్చిస్తే స్పోర్ట్స్ డ్రింక్ నుంచి సాచెట్స్, పౌడర్లవరకు లభిస్తోంది.
స్పోర్ట్స్ డ్రింక్‌ల నుంచి సాచెట్స్, పౌడర్ల వరకు అమ్ముడుపోతున్నాయి.
ఎలక్ట్రోలైట్లలో సోడియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరంలో నరాలను, కండరాలను నియంత్రించేందుకు, ద్రవాల సమతుల్యతకు ఉపయోగపడతాయి. అయితే, చాలామంది వారికి అవసరం లేకపోయినా వీటిపై డబ్బులు వెచ్చిస్తున్నారని లివర్‌పూల్ జాన్ మూర్స్ యూనివర్సిటీలోని ప్రముఖ స్పోర్ట్స్ న్యూట్రిషియన్ రీసెర్చర్, ప్రొఫెసర్ గ్రేమ్ క్లోజ్ చెప్పారు.

'కేవలం ప్రత్యేక పరిస్థితుల్లోనే తీసుకోవాలి'
శరీరంలో ఎలక్ట్రోలైట్లు తగ్గిపోవడం చాలా అరుదుగా జరుగుతుంటుందని, ఎందుకంటే, సహజంగానే శరీరం ఎలక్ట్రోలైట్లను స్థిరంగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తుందని ప్రొఫెసర్ క్లోజ్ వివరించారు.
'క్రమం తప్పకుండా మంచి సమతుల్యమైన ఆహారం తీసుకుంటే'' చాలామంది శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్లను పొందుతారు.
మనం తీసుకునే అనేక ఆహారాల్లో ఉప్పు ద్వారా సోడియం శరీరానికి అందుతుంది. పండ్లు, కూరగాయాలలో పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి.
కానీ, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో, వ్యాయామం తీవ్రంగా చేసినప్పుడు.. చాలా చెమట బయటికి వచ్చేస్తుంది. అప్పుడు, శరీరంలోని ఎలక్ట్రోలైట్లు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది.
''ఎక్కువ సేపు వ్యాయామం చేసినప్పుడు, ముఖ్యంగా ఉప్పగా ఉండే చెమట శరీరం నుంచి బయటకి విడుదలైతే.. సోడియం రూపంలో కొంత ఎలక్ట్రోలైట్లను తీసుకోవడం పెద్ద తప్పేమీ కాదు'' అని బీబీసీ స్లైస్డ్ బ్రెడ్‌కు ప్రొఫెసర్ క్లోజ్ చెప్పారు.
ఎలక్ట్రోలైట్ డ్రింక్‌లు దాహాన్ని కూడా పెంచుతాయి. ఎక్కువ సేపు వ్యాయామం చేసినప్పుడు కొంతమంది ఎక్కువగా నీరు తాగేందుకు కూడా ఇవి సాయపడుతుండొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
'నీరు తాగండి లేదా ఆమ్లెట్ తినండి'
జిమ్‌కు వెళ్లడం లేదా 5కే రన్ చేయడం వంటి ఒక మోస్తరు వ్యాయామాలు చేసినప్పుడు ఎలక్ట్రోలైట్లు అవసరం లేదు.
''నీరు తాగండి.. అదే చాలా ఎక్కువ. మీరు కష్టించి సంపాదించుకున్న డబ్బును ఇతర అవసరాల కోసం అట్టిపెట్టుకోండి'' అని ప్రొఫెసర్ క్లోజ్ చెప్పారు.
కొంతమంది ఎలక్ట్రోలైట్ డ్రింకుల రుచిని ఆస్వాదిస్తారని ఆయన తెలిపారు. వ్యాయామ సమయంలో ఎక్కువగా ఎలక్ట్రోలైట్ డ్రింక్ తాగాలని ఎవరైనా ప్రోత్సహిస్తే... అదేమంత చెడ్డ విషయం కూడా కాదని క్లోజ్ అన్నారు.
అయితే, ఖరీదైన పౌడర్లకు బదులుగా, సింపుల్‌గా ఇంట్లో చేసుకున్న డ్రింక్‌ను మీతో పాటు తీసుకెళ్లాలని సూచిస్తున్నారు.
'' మూడొంతుల నీరును, ఒక వంతు పైనాపిల్ జ్యూస్ వంటి ఫ్రూట్ జ్యూస్‌ను, రుచి కోసం చిటికెడు ఉప్పును కలుపుకోండి'' అని ఆయన చెప్పారు.
''ఇవి 6 శాతం కార్బోహైడ్రేట్, ఎలక్ట్రోలైట్ సొల్యుషన్‌ను మీకు అందిస్తాయి'' అని తెలిపారు.
ఉదయాన్నే ఎలక్ట్రోలైట్ ఉత్పత్తులను తీసుకోవడం వల్ల ఏదైనా ప్రభావం ఉంటుందా అనే దానిపై పెద్దగా ఆధారాలు లేవని ప్రొఫెసర్ క్లోజ్ అన్నారు.
చెప్పాలంటే.. ఒక సాచెట్ నుంచి పొందే ఎలక్ట్రోలైట్ల కంటే ఆమ్లెట్ తినడం నుంచి చాలా ఎక్కువగా పొందవచ్చని వివరించారు.
పొద్దున్నే దీన్ని తినడం వల్ల మరింత ప్రభావవంతంగా ఉంటుందన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘ఇవి మిమ్మల్ని బలంగా మార్చవు’
అయితే, స్పోర్ట్స్ డ్రింక్‌లలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్నట్లు బలమైన శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. సుమారు 70 నుచి 90 నిమిషాల పాటు చేసే కఠిన వ్యాయామానికి మాత్రమే అవసరమైన కార్బోహైడ్రేట్లను మీ శరీరం నిల్వ చేసుకుంటుంది.
అథ్లెట్లు అంతకుమించి చేస్తారు కాబట్టి, ఈ డ్రింక్‌ల తీసుకోవడం ద్వారా ప్రయోజనం పొందుతారు.
కానీ, అంతకుమించి క్లోరైడ్, కాల్షియం లేదా ఫాస్ఫరస్ వంటి ఇతర ఖనిజాలు ఏదైనా ప్రయోజనాలను అందిస్తాయా అని చెప్పడానికి తగినన్ని ఆధారాలు లేవని ప్రొఫెసర్ క్లోజ్ చెప్పారు. శరీరం దానికదే ఈ ఖనిజాలను తగిన స్థాయిలో నియంత్రించుకోగలదు.
''వ్యాయామ సమయంలో మీరు చేయాల్సిందల్లా.. తగినంత నీరు, కార్బోహైడ్రేట్లు, సోడియం ఉండేలా మాత్రమే చూసుకోవాలి'' అని ప్రొఫెసర్ క్లోజ్ చెప్పారు.
రోజువారీ వ్యాయామానికి ఎలక్ట్రోలైట్లు పెద్ద అవసరమేమీ కాదు. కానీ, ఎక్కువ వేడిలో వ్యాయామం చేసినప్పుడు లేదా ఎక్కువగా నీరు తీసుకునేలా మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోవాలనుకున్నప్పుడు.. ఎలక్ట్రోలైట్ ప్రొడక్టుల ద్వారా సోడియాన్ని తీసుకోవడం ప్రయోజనకరమని వివరించారు.
ఈ ప్రొడక్టుల మార్కెటింగ్‌లో ఏం చెబుతున్నా.. ఇవి తీసుకోవడం వల్ల సామర్థ్యం పెరుగుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని తేల్చిచెప్పారు.
''మీ పర్‌ఫార్మెన్స్‌లో 10 శాతం మెరుగుదల కనిపిస్తుందని ఎక్కడైనా చెబితే.. మీకు తెలుసు కదా, అది అబద్ధమని'' అని చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














