ఎడమ చేతితో చేసే పనులు, పెట్టిన వస్తువులు గుర్తుండవా, ఇది నిజమా.. అపోహా?

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
‘‘రోజూ ఇక్కడే పెడతాను కదా, బండి తాళాలు కనిపించడం లేదు.. ఎవరైనా తీశారా?’’
‘‘ఎవరు తీయలేదు, ఎడమ చేత్తో ఎక్కడో పెట్టి ఉంటావ్.. సరిగా వెతుకు.. అవే దొరుకుతాయి"
ఇలాంటి మాటలు మనం అప్పుడప్పుడూ వింటూ ఉంటాం. చిన్నచిన్న వస్తువులు, తాళాలు, మొబైల్ ఫోన్, కళ్లద్దాలు, పర్సు ఇవన్నీ ఎక్కడో పెట్టి మర్చిపోయి వెతుకుతూ ఉండటం మనలో చాలామందికి అనుభవమే.
అయితే మర్చిపోవడానికి, మనం ఉపయోగించిన చెయ్యి కారణమవుతుందా.. ? ‘ఎడమ చేత్తో పెట్టిన వస్తువులు గుర్తుండవు’ అని మనం తరచూ వింటుంటాం. ఇది నిజమా? లేక అపోహనా?
ఈ ప్రశ్నకు సమాధానం కోసం గతంలో ఈ అంశంపై అమెరికా, జర్మనీ యూనివర్సిటీలలో జరిగిన పరిశోధనలను తెలుసుకోవడంతో పాటు, న్యూరాలజిస్టులు, మానసిక శాస్త్ర నిపుణులతో బీబీసీ మాట్లాడింది.

'ఎడమ చేయి - మర్చిపోవడం' ఏమిటిది...?
నిత్య జీవితంలో కుడి, ఎడమ చేతుల వినియోగం, వాటిపై సమాజంలో ఉన్న భావనలు ఈ 'మర్చిపోవడం' అనే భావన రావడానికి ఒక కారణమని మానసిక శాస్త్ర నిపుణులు బీబీసీతో అన్నారు.
"కుడి చేయిని ప్రధాన చేయిగా చూడటం చాలాకాలంగా ఉంది. తినడం, రాయడం, శుభకార్యాలు చేయడం… ఇవన్నీ ఎక్కువగా కుడి చేత్తోనే చేస్తుంటాం. అందుకే కుడి చేత్తో చేసే పనులు గొప్పవి, ఎడమ చేత్తో చేసే పనులు తక్కువ అన్న భావన పాతుకుపోయింది. ఈ నేపథ్యంలోనే ఎడమ చేత్తో పెట్టిన వస్తువులు మర్చిపోతామనే నమ్మకం కూడా ఏర్పడింది" అని ఏయూ సైకాలజీ విభాగం ప్రొఫెసర్ ఎంవీఆర్ రాజు బీబీసీతో అన్నారు.
"మనలో కుడి చేతివాటం వారు ఎక్కువగా ఉంటారు. పదే పదే కుడి చేత్తో చేసే పనులు మైండ్‌లో రిజిస్టర్ అయిపోతాయి. రోజూ చేసే ఒక పనిపట్ల అంటే తాళాలు ఒకచోట పెట్టడం వంటివి చేసినప్పుడు... ఆ చేతికి, ఆ పనికి మధ్య మెదడులో బంధం ఏర్పడి, లాంగ్ టర్మ్ మెమరీ ఏర్పడుతుంది’’ అని విశాఖకు చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ రాజేశ్ ఇండాల బీబీసీకి చెప్పారు.
‘‘కానీ, ఆ పనిని అనుకోకుండా ఎడమ చేత్తో చేసినప్పుడు... ఆ పనికి, ఆ చేతికి మధ్య మెదడులో బంధం ఉండదు. దాంతో, ఆ పని వెంటనే గుర్తుకు రాదు. దాన్ని గుర్తు పెట్టుకునేందుకు శ్రమను తీసుకోవాల్సి వస్తుంది. పెట్టిన వస్తువు తిరిగి వెతికినప్పుడు, దానిని గుర్తుకు తెచ్చుకునేందుకు మనం తీసుకునే సమయాన్నే... ఆ వస్తువుని 'మర్చిపోయిన సమయం'గా చెప్పవచ్చు" అని డాక్టర్ రాజేశ్ ఇండాల వివరించారు.

‘మర్చిపోయాను’ అనే భావనకు కారణం
"సహజంగా మనకు ఏ చేయి అలవాటు ఉంటుందో…ఆ చేతినే ఎక్కువగా వాడతాం. దాన్నే డామినెంట్ హ్యాండ్ అంటారు. కుడి చేతివాటం ఉన్నవాళ్లు కుడి చేత్తోనే.. ఎడమ చేతి వాటం ఉన్నవాళ్లు ఎడమ చేత్తోనే పనులు చేస్తుంటారు. అది సహజంగా జరుగుతుంది. ఏదైనా సందర్భంలో రోజూ కుడి చేతితో చేసే పనిని ఎడమ చేత్తో, ఎడమ చేతితో చేసే పనిని కుడి చేత్తో చేస్తే... తిరిగి ఆ పనిని గుర్తు తెచ్చుకోవడానికి సమయం పడుతుంది" అని డాక్టర్ రాజేశ్ ఇండాల స్పష్టం చేశారు.
"కుడి చేతి వాటం ఉన్న వాళ్లు ఎడమ చేత్తో వస్తువు పెట్టినప్పుడు…తర్వాత దాన్ని వెతికితే 'ఏమయ్యిందో గుర్తు రావడం లేదు' అనే భావన కలుగుతుంది. దీనికి కారణం చేతివాటం కాదు. దృష్టి లోపం’’ అని డాక్టర్ రాజేశ్ ఇండాల చెప్పారు.
‘‘మనలో చాలామంది ఒకేసారి చాలా పనులు చేస్తుంటాం. ఫోన్‌లో మాట్లాడుతూ తాళాలు పెట్టడం, టీవీ చూస్తూ పర్సు ఎక్కడో పెట్టేయడం, ఏదో ఆలోచిస్తూ మొబైల్‌ను ఏదోచోట పెట్టడం… వంటి పనులు చేస్తుంటాం. అంటే, ఆ సమయంలో మన మెదడు పూర్తిగా ఆ పనిపై ఫోకస్ చేయదు. అందుకే ఆ సమాచారం మెమరీలో సరిగ్గా రిజిస్టర్ కాదు" అని డాక్టర్ రాజేశ్ చెప్పారు.
దీనినే మనం 'మర్చిపోయాం' అని అనుకుంటామని న్యూరాలజీ నిపుణులు తెలిపారు.

ఇది జ్ఞాపకశక్తి సమస్యా?
చిన్న చిన్న వస్తువులు ఎక్కడ పెట్టామో మర్చిపోవడానికి కారణం జ్ఞాపకశక్తి బలహీనపడటం కాదని న్యూరాలజిస్టులు అంటున్నారు.
కుడి చేతివాటం ఉన్న వారి మెదడు కూడా కుడి చేతితో చేసిన పనులకు సహాజంగానే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఎడమ చేతి పనులను మెదడులో తక్కువ ప్రాధాన్యం లభిస్తుందన్న దానికి డాక్టర్ రాజేశ్ ఇండాల చెబుతున్న దాని ప్రకారం... "ఇది మెమరీ డిస్ట్రబెన్స్ కాదు. ఇది అబ్సెంట్ మైండెడ్‌నెస్ మాత్రమే. మన దృష్టి ఎక్కడ ఉందో, మెదడు ఏ విషయంపై ఫోకస్ అయి ఉందో… అదే మనం ‘గుర్తుపెట్టుకునే విషయాల’ను నిర్ణయిస్తుంది" అని చెప్పారు.
సైకాలజీ నిపుణులు ఏమన్నారంటే...
ఈ విషయంపై మానసిక శాస్త్ర ప్రభావం ఎలా ఉంటుందనే అంశాన్ని ఆంధ్రా యూనివర్సిటీ సైకాలజీ విభాగం ప్రొఫెసర్ ఎంవీఆర్ రాజు వద్ద ప్రస్తావించింది బీబీసీ.
ఒక చేతితో పెట్టిన వస్తువులను మర్చిపోవడం అనే అంశాన్ని సైకాలజికల్‌గా తాము మరో కోణంలో చూస్తామని ప్రొఫెసర్ రాజు చెప్పారు.
"ఒక పనికి మనం ఎలా అలవాటు పడతామో, అలాగే ఆ పనిని ఎలా ప్రాక్టీస్ చేస్తామనేది జ్ఞాపకశక్తిని ప్రభావం చేస్తుంది. ఒక చేయితో నిరంతరం చేసే పని ఆ చేయికే కాదు…మెదడుకూ అలవాటుగా మారుతుంది. అయితే, ఏదైనా కారణంగా ఆ చేయిని కోల్పోతే... ఆ పనులన్ని సహజంగానే మరో చేయికి మారుతాయి. ఉదాహరణకు కుడి చేతివాటం ఉన్న వ్యక్తి, ఆ చేతిని కోల్పోతే... అతని ఎడమ చేతితో రాసేందుకు అలవాటు పడతాడు" అని ప్రొఫెసర్ ఎంవీఆర్ రాజు చెప్పారు.
అంటే…లెఫ్ట్ అయినా రైట్ అయినా ప్రాక్టీస్ ఉంటే రెండూ సమానంగానే పనిచేస్తాయి. ఒక చేయి ఎక్కువ ప్రభావవంతంగా, మరో చేయి తక్కువ ప్రభావంతో పని చేయదని స్పష్టం చేశారు.

మన జీవన శైలి కూడా కారణమా...?
న్యూరాలజీ నిపుణులు మరో ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అదే మన జీవనశైలి.
"అధిక ఒత్తిడి, సరైన నిద్ర లేకపోవడం, తగినంత నీరు తాగకపోవడం... ఇవన్నీ మన జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న చిన్న విషయాలు మర్చిపోవడం సహజమే" అని డాక్టర్ రాజేశ్ అన్నారు.
అయితే, దీనిని మెమరీ డిస్ట్రబెన్సెస్ అనుకోనవసరం లేదని చెప్పారు.
"నిత్యం చేసే పనులు కూడా మర్చిపోవడం, అంటే ప్రతిరోజూ కుడి చేతితో తాళాలను ఫ్రిజ్‌పై పెట్టడం మనకు అలవాటు ఉంటే... ఆ పనిని కూడా మర్చిపోయి, మరో చోట తాళాలు కోసం వెతకడం వంటివి జరిగితే అప్పుడు వైద్యులను సంప్రదించాలి. అంత వరకు ఈ చిన్న చిన్న వస్తువులు మర్చిపోవడం వంటి విషయాల పట్ల ఆందోళన చెందాల్సినవసరం లేదు" అని డాక్టర్ రాజేశ్ చెప్పారు.
పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే...
ఈ అంశంపై శాస్త్రీయ పరిశోధనలూ జరిగాయి.
2019లో అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మిసిసిప్పి, 2014లో జర్మనీలోని ట్రియర్ యూనివర్సిటీ చేతి వాటం, జ్ఞాపకశక్తి మధ్య సంబంధంపై అధ్యయనాలు చేశాయి.
ఈ పరిశోధనల్లో ఎడమ చేత్తో లేదా కుడిచేత్తో పెట్టిన వస్తువులు ఎక్కువగా మర్చిపోతామని ఎక్కడా నిర్ధరణ కాలేదు. వస్తువు పెట్టే సమయంలో మన దృష్టి ఎక్కడ ఉందన్నదే మర్చిపోవడాన్ని నిర్ణయిస్తుందని ఈ పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.
"ఎడమ చేత్తో పెడితే మర్చిపోతాం. కుడి చేత్తో పెడితే గుర్తుంటుంది ఇవి శాస్త్రీయంగా నిరూపితమైనవి కావు. మన దృష్టి ఎక్కడ ఉందో, మన జీవనశైలి ఎలా ఉందో... అదే జ్ఞాపకశక్తిని నిర్ణయిస్తుంది. కాబట్టి… చేతి వాటం గురించి కాదు, మన పనులపై ఫోకస్ గురించి ఆలోచించాలి" అని డాక్టర్ రాజేశ్ అన్నారు.

ఏ చేతితో చేసిన పనైనా గుర్తుపెట్టుకోవాలంటే...
మనం ఏ చేత్తో పని చేసినా మర్చిపోమని నిరూపించేందుకు న్యూరాలజీ నిపుణులు చెప్పిన ప్రకారం...
"ఒక వస్తువు కుడి చేతితో ఒకచోట పెట్టాలి. అలాగే ఇంకో వస్తువును ఎడమ చేతితో మరో చోట పెట్టాలి. ఈ రెండు వస్తువులను పెట్టేటప్పుడు ఆ వస్తువు పెట్టిన చోటును గుర్తు పెట్టుకునేలా ఫలానా ప్రదేశంలో పెట్టాను అని ఫోకస్డ్‌గా అనుకోవాలి. ఒక మూడు గంటల తర్వాత ఏదీ ముందు గుర్తుకు వస్తుందో జ్ఞాపకం తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తే... రెండూ దాదాపు ఒకేసారి గుర్తుకు వస్తాయి. ఎందుకంటే వస్తువులు పెట్టే పనిని ఫోకస్డ్‌గా చేశాం. అంతే" అని చెప్పారు డాక్టర్ రాజేశ్.
అలాగే ఎడమ చేతి వాటం ఉన్న వాళ్లకి కుడి చేతితో పెట్టిన వస్తువులు మర్చిపోతారా అనే ప్రశ్నకు సమాధానంగా... న్యూరో సైన్స్ ప్రకారం మనం ఏ చేతిని ఎక్కువగా వాడుతామో ఆ చేతితో చేసిన పనులు మెదడు బాగా సేవ్ చేస్తుంది. మరో చేతి పనులకు తక్కువ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు.
‘‘ఇది ఎడమ / కుడి చేతుల సమస్య కాదు. డామినెంట్ హ్యండ్ ఏదీ అనేదే విషయం. డామినెంట్ హ్యండ్‌ని మెదడు గుర్తుపెట్టుకోవడం సులభం. రోజు కలిసే వారిని మనం ఎలా గుర్తుపెట్టుకుంటామో అలా. అందుకే ఇది ఫోకస్ అండ్ హ్యాబిట్ సమస్యగా చెప్పవచ్చు’’ అని సైకాలజీ ప్రొఫెసర్ ఎంవీఆర్ రాజు బీబీసీకి వివరించారు.
వైద్యపరంగా చూస్తే, ఎడమ చేత్తో పెట్టడం వల్లనే మర్చిపోతామనే శాస్త్రీయ ఆధారం లేదు. జ్ఞాపకశక్తి అనేది చేతితో కాదు, మెదడులోని దృష్టి, జ్ఞాపక శక్తి మీద ఆధారపడి న్యూరాలజీ నిపుణులు చెబుతున్నారు.
"వస్తువులను ఏ చేత్తో పెట్టామనేది సమస్య కాదు. వస్తువు పెట్టే సమయంలో మన ఆలోచనలు ఎక్కడ ఉన్నాయన్నదే" అని న్యూరాలజిస్టులు చెబుతున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














