స్విగ్గీ, జొమాటో వెల్ఫేర్ బోర్డ్: తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం 'గిగ్ వర్కర్స్'కు మేలు చేస్తుందా?

గిగ్ వర్కర్లు
    • రచయిత, ఎస్ ప్రశాంత్
    • హోదా, బీబీసీ తమిళ్

ఫుడ్ డెలివరీ సేవలు అందిస్తున్న స్విగ్గీ, జొమాటోతో పాటు ట్యాక్సీ సేవలందించే ర్యాపిడో, ఉబెర్, ఓలా వంటి గిగ్ వర్కర్ల కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. భారత్‌లో రాజస్థాన్‌ ప్రభుత్వం మాత్రమే ఇప్పటి వరకూ ఇలాంటి నిర్ణయం తీసుకుంది.

అయితే, ఈ ప్రకటనను గిగ్ వర్కర్లు ఎలా చూస్తున్నారు? ప్రస్తుతం వాళ్ల పరిస్థితేంటి? వారి కనీస అవసరాలేంటి? ఈ ప్రకటనలతో నిజంగా వారి జీవితాలు మారిపోతాయా?

మనం టీవీ చూసుకుంటూ స్విగ్గీ లేదా జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేస్తాం. డెలివరీలో కొద్దినిమిషాలు ఆలస్యమైతే చాలు తక్కువ రేటింగ్ ఇచ్చేస్తాం.

కానీ, మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, మనం ఇచ్చే రేటింగ్ వల్ల మనకు ఆహారం తీసుకొచ్చిన వ్యక్తి ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంది. రేటింగ్ సమస్య, మిస్సింగ్ ఆర్డర్ల వంటి కారణాలతో కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వ యంత్రాంగం కూడా లేదు.

భారత్‌లో ఎంతమంది ఉన్నారు?

ఇలాంటి అనేక రకాల సేవలు అందిస్తున్న వర్కర్లందరినీ ఇటీవల గిగ్ వర్కర్ల కిందకు చేర్చారు. అందులో స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ సైట్‌లతో పాటు, మెడిసిన్, ఇతర వస్తువులు డెలివరీ చేసేవారు, అలాగే ర్యాపిడో, ఉబెర్ వంటి ట్యాక్సీ సర్వీసులు అందిస్తున్న వారిని కూడా ఇందులో చేర్చారు.

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నీతి ఆయోగ్ 2022 జూన్‌లో నిర్వహించిన సర్వే ప్రకారం, దేశంలో దాదాపు 77 లక్షల మంది గిగ్ వర్కర్లుగా పనిచేస్తున్నారు. ఫుడ్ డెలివరీ, ట్యాక్స్ సర్వీసులతో పాటు పార్ట్ టైం సర్వీసులు అందించే వారు కూడా ఇందులో ఉన్నారు. ఈ సంఖ్య 2030 నాటికి 2.35 కోట్లకు చేరే అవకాశం ఉందని నీతి ఆయోగ్ అంచనా వేసింది.

దేశవ్యాప్తంగా 77 లక్షల మంది గిగ్ వర్కర్లు ఉన్నప్పటికీ ఏ రాష్ట్రంలోనూ కార్మికులుగా వారికి అధికారిక గుర్తింపు లేదు.

గిగ్ వర్కర్లు

గిగ్ ఎంప్లాయీ వెల్ఫేర్ బోర్డు

తమను కార్మికులుగా అధికారికంగా గుర్తించాలని, కార్మిక సంక్షేమ శాఖ అమలు చేస్తున్న ప్రయోజనాలు కల్పించాలని గిగ్ వర్కర్లు చాలా ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు.

గత మే నెలలో కర్ణాటక ఎన్నికల వేళ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గిగ్ వర్కర్లను కలిశారు. సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామని, ప్రయోజనాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ఎన్నికల అనంతరం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే దేశంలోనే మొదటిసారిగా గిగ్ వర్కర్లకు రూ.4 లక్షల ప్రమాద బీమా ప్రకటించింది. ఆ తర్వాత, మూడు వారాల కిందట గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేకంగా వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు రాజస్థాన్ ప్రభుత్వం బిల్లును తీసుకొచ్చింది.

ఫుడ్ డెలివరీ, ఇతర వస్తువుల డెలివరీ, ట్యాక్సీ సేవల కార్మికుల కోసం ప్రత్యేక వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు.

ప్రయోజనమేంటి?

తమిళనాడు ప్రభుత్వ ప్రకటనపై తమిళనాడు ఫుడ్ అండ్ అదర్ గూడ్స్ డిస్ట్రిబ్యూషన్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) అధ్యక్షుడు గోపీ కుమార్ మాట్లాడారు. ''గిగ్" వర్కర్ల కోసం వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు రాజస్థాన్ ప్రభుత్వం ప్రకటన చేయడం మినహా, ఆ బోర్డు ఎలా పనిచేస్తుంది? దాని వల్ల కార్మికులకు దక్కే ప్రయోజనాలేంటి? ఎలాంటి హక్కులు లభిస్తాయి? అనే విషయాలపై స్పష్టత ఇవ్వలేదు.

రాజస్థాన్‌ను అనుసరిస్తూ గిగ్ వర్కర్ల కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. అయితే, రాజస్థాన్‌లా కాకుండా వెల్ఫేర్ బోర్డు విధులు, కార్మికుల కోసం ఏం చేయబోతోందనే విషయాలను వివరించాలి.

ఎందుకంటే, తమిళనాడులో గిగ్ వర్కర్లు తమ డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేశారు. అలాగే, ఆయా కంపెనీలతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరాం. కానీ, సమావేశం నిర్వహించేందుకు కూడా తమిళనాడు ప్రభుత్వం ముందుకు రాలేదు. అందుకే సంక్షేమ బోర్డు విధివిధానాలను స్పష్టంగా తెలియజేయాలి'' అని ఆయన అన్నారు.

గిగ్ వర్కర్లు

ఫొటో సోర్స్, GETTY IMAGES

రేటింగ్‌ల ప్రభావం..

రేటింగ్‌ల కారణంగా గిగ్ వర్కర్లు చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ''కంపెనీలు రేటింగ్ ఆధారంగానే వర్కర్లకు విధులు కేటాయిస్తాయి. ఒకవేళ కస్టమర్ ఆహారం బాగా ఉడకలేదని, లేదంటే రుచిగా లేదని నెగెటివ్ రేటింగ్ ఇచ్చినా కూడా అది ఫుడ్ డెలివరీ చేసిన వర్కర్‌‌పై కూడా పడుతుంది'' అని అన్నారు.

కనీసం 5కి 4.5 రేటింగ్ వస్తేనే మళ్లీ ఆ కంపెనీ ఆ వర్కర్‌ను తిరిగి విధుల్లోకి తీసుకుంటుంది. ఒకవేళ రేటింగ్ పడిపోతే, ఉద్యోగం పోవడం, విధుల నుంచి అర్ధాంతరంగా తీసేయడం వంటివి జరుగుతున్నాయి.

అలాగే, వారంలో నిర్దేశించిన డెలివరీలు, క్యాబ్ సర్వీసులు పూర్తి చేసిన వారికే ఇన్సెంటివ్‌లు లభిస్తాయి. ఈ ఇన్సెంటివ్‌ల కోసం అలవికాని టార్గెట్‌లు పెడుతుండడంతో, ఇన్సెంటివ్‌లు పొందేందుకు ఎండా వానా లేకుండా, అతి వేగంతో వెళ్లి డెలివరీ చేసేలా వర్కర్లపై ఒత్తిడి పడుతోంది.

ఫిర్యాదులు వినడానికి కూడా ఎవరూ లేరు..

లక్షల సంఖ్యలో ఉన్న గిగ్ వర్కర్ల ఫిర్యాదులు వినేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఎలాంటి ఏర్పాట్లూ లేవు.

''గిగ్ వర్కర్ల సమస్యలు పట్టించుకునేందుకు, వారి సమస్యలను పరిష్కరించేందుకు ఎలాంటి ప్రభుత్వ యంత్రాంగం లేకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే, గిగ్ వర్కర్లు ప్రభుత్వంలోని ఏ కార్మిక సంక్షేమ బోర్డులోనూ నమోదు కావడం లేదు. అందువల్ల, ఇతర కార్మికులకు వర్తించే పీఎఫ్, ఇన్సూరెన్స్, పెన్షన్ వంటి కనీస ప్రాథమిక హక్కులు, ప్రయోజనాలు పొందలేకపోతున్నారు'' అని గోపీ కుమార్ అన్నారు.

''వెల్ఫేర్ బోర్డు ఏర్పాటుకు ముందు గిగ్ వర్కర్లు, కంపెనీల ప్రతినిధులు, కార్మిక సంక్షేమ శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలి. ఎందుకంటే, వర్కర్ల నిరసనల ప్రభావం నుంచి తప్పించుకునేందుకు డెలివరీ పార్టనర్, రైడర్, సర్వీస్ ప్రొవైడర్ అని వేర్వేరు కేటగిరీలుగా కంపెనీలు విభజిస్తున్నాయి. పార్టనర్ అంటే లాభాల్లోనూ వాటా ఇవ్వాలి.

కానీ, ప్లాట్‌ఫాం చార్జి, జీఎస్టీ, పెనాల్టీ పేరుతో కంపెనీలు వారి వేతనాలకు కూడా కోత పెడుతున్నాయి. వర్కర్ల హోదాలను కూడా సక్రమంగా విభజించాలి'' అని ఆయన అన్నారు.

''గిగ్ వర్కర్లను కార్మికులుగా తమిళనాడు ప్రభుత్వం ప్రకటించాలి. కార్మిక సంక్షేమ చట్టాలను వర్తింపజేయాలి. వారికి పీఎఫ్, బీమా, ఉద్యోగ భద్రత, మెరుగైన వేతనాలు, ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేకంగా హెల్ప్ అండ్ గ్రీవెన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలి. ఫుల్ టైం వర్కర్లు, పార్ట్ టైం వర్కర్లను వర్గీకరించి గుర్తింపు కార్డులు ఇవ్వాలి'' అని వివరించారు.

గిగ్ వర్కర్లు

ఫొటో సోర్స్, GETTY IMAGES

'కంపెనీలు అణచివేస్తున్నాయి'

తమిళనాడు ప్రభుత్వ ప్రకటనపై స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో వర్కర్లు బీబీసీ తమిళ్‌తో మాట్లాడారు.

''మా బాధలు వినేందుకు ఎలాంటి వ్యవస్థా లేదు. వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయడం ద్వారా న్యాయమైన వేతనాలు, రోజూ పని, అర్ధాంతరంగా ఉపాధి కోల్పోయే ప్రమాదాలను అరికడుతుందని ఆశిస్తున్నాం.

న్యాయమైన వేతనాల కోసం నిరసన తెలిపినా ఐడీ ఆధారంగా మమ్మల్ని విధుల్లో నుంచి తీసేస్తున్నారు. ప్రాథమిక హక్కుల కోసం పోరాడినా కంపెనీలు మమ్మల్ని అణచివేయడానికి ప్రయత్నిస్తాయి.

ఇకపై ఈ ధోరణి మారుతుందని, ప్రభుత్వం మా డిమాండ్లు విని ఉపాధి అవకాశాలను కాపాడుతుందని ఆశిస్తున్నాం'' అని చెప్పారు.

వెల్ఫేర్ బోర్డు ఎలా పనిచేయబోతోందని కార్మిక సంక్షేమ శాఖ మంత్రి సీవీ గణేషన్‌తో బీబీసీ తమిళ్ మాట్లాడింది.

''తమిళనాడులోని కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నాం. అందులో భాగంగానే ఫుడ్, ఇతర వస్తువుల డెలివరీ కార్మికుల కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం స్టాలిన్ ప్రకటించారు.

ఇది ప్రాథమికంగా ఇచ్చిన నోటిఫికేషన్ మాత్రమే. ఐఏఎస్ స్థాయి అధికారులతో సంప్రదించి, కార్మికుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని వెల్ఫేర్ బోర్డు విధివిధానాలను నిర్ణయిస్తాం. మూడు వర్గాలతో సమావేశం నిర్వహించి, అందులో అన్ని విషయాలు చర్చించి నిర్ణయం తీసుకుంటాం'' అని మంత్రి బీబీసీతో చెప్పారు.

''తమిళనాడులో ప్రస్తుతం 18 మాన్యువల్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డులు ఉన్నాయని, వాటి తరహాలోనే వీరికి కూడా వెల్ఫేర్ బోర్డు ఏర్పాటవుతుంది'' అని మాన్యువల్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ బోర్డు కార్యదర్శి మాధవన్ బీబీసీతో చెప్పారు.

''ఇతర కార్మికులకు వర్తించే ప్రయోజనాలు, హక్కులు అన్నీ వీరికి కూడా వర్తిస్తాయి. ఉన్నత స్థాయి కమిటీ సమావేశం నిర్వహించి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తాం, కార్మికుల సంక్షేమం కోసం ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తాం'' అన్నారు.

ఇవి కూడా చదవండి: