బిహార్ సీఎంగా పదోసారి నితీశ్ కుమార్ ప్రమాణం, ముగ్గురు మహిళలు సహా మంత్రులుగా ఏ పార్టీ నుంచి ఎవరెవరంటే..

బిహార్‌, నితీశ్ ప్రభుత్వం

ఫొటో సోర్స్, IPRD Bihar

బిహార్ ముఖ్యమంత్రిగా పదోసారి నితీశ్ కుమార్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. ముఖ్యమంత్రి కాకుండా, 26మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో ముగ్గురు మహిళలు, ఒక ముస్లిం మంత్రి ఉన్నారు.

గత ప్రభుత్వంలో కేవలం రేణుదేవి అనే ఒకే ఒక్క మహిళా మంత్రి ఉన్నారు.

ఈసారి ముగ్గురు మహిళలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రస్తుతం బిహార్ మంత్రి మండలిలో మహిళల వాటా దాదాపు 11 శాతం. మొత్తం 243మంది సభ్యులున్న బిహార్ శాసనసభలో ఈసారి 29మంది మహిళలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఈ సంఖ్య దాదాపుగా 12 శాతానికి సమానం. వీరిలో 26మంది ఎన్డీయేకు చెందినవారు.

గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేల సంఖ్య, వారి వాటా దృష్ట్యా చూస్తే బిహార్ ప్రభుత్వంలో మహిళల వాటా పెరిగిందని చెప్పవచ్చు.

ఇక ఈసారి కూడా ఒకే ఒక్క ముస్లిం ఎమ్మెల్యే మంత్రి అయ్యారు. కిందటి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న జమాఖానే ఈసారి కూడా మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఆ ముగ్గురు ఎవరు?

ఈసారి బిహార్ ప్రభుత్వంలో ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో జేడీయూ ఎమ్మెల్యే లేషీసింగ్, బీజేపీ ఎమ్మెల్యేలు రమానిషాద్, శ్రేయాసి సింగ్ ఉన్నారు. వీరి ముగ్గురి మధ్య సారూపత్య ఏమిటంటే వీరందరి కుటుంబాలకు రాజకీయ నేపథ్యం ఉంది.

లేషీసింగ్

ఫొటో సోర్స్, @LESHISINGH

లేషీసింగ్

సీమాంచల్ ప్రాంతంలోని పూర్ణియా జిల్లాలోని ధమ్‌దాహా స్థానంలో 2000 సంవత్సరం నుండి లేషి సింగ్ ఎన్నికల్లో గెలుస్తున్నారు. ఆమె బిహార్ మునుపటి ప్రభుత్వంలో కూడా మార్చి 2024వరకు ఆహారమంత్రిగా ఉన్నారు.

లేషీ సింగ్ 1974లో జన్మించారు. ఇంటర్ వరకు చదువుకున్నారు. ఆమె భర్త భూటాన్ సింగ్ సమతా పార్టీ పూర్ణియా జిల్లా అధ్యక్షుడిగా ఉండేవారు. ఆయన 2000 సంవత్సరంలో కోర్టు ప్రాంగణంలో హత్యకు గురయ్యారు. సమతా పార్టీ 2003లో జనతాదళ్ యునైటెడ్‌గా రూపాంతరం చెందింది.

భర్త హత్యకు గురవడానికి ముందే లేషీ సింగ్ రాజకీయ ప్రస్థానం మొదలైంది. 2000 సంవత్సరంలో ఆమె ధమ్‌దాహా నుంచి పోటీ చేయడం ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. అప్పటి నుండి ఆమె ఒక్కసారి కూడా ఓడిపోలేదు. లేషి సింగ్ బిహార్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గానూ పనిచేశారు. ఆమె గత బిహార్ ప్రభుత్వంలో ఆహార వినియోగదారుల రక్షణ శాఖా మంత్రిగా ఉన్నారు.

రాజకీయ విజయంతో పాటు, లేషి సింగ్ వివాదాల్లో కూడా చిక్కుకున్నారు. 2021లో విశ్వజీత్ సింగ్ గా పిలిచే జర్నలిస్ట్ పింటు రాయ్ హత్య కేసులో లేషి సింగ్‌పై ఆరోపణలు వచ్చాయి . పింటు రాయ్ స్థానిక రాజకీయాల్లో కూడా చురుకుగా ఉండేవారు. ఈ ఆరోపణలను రాజకీయ ప్రేరేపితమని లేషి సింగ్ ఖండించారు.

పింటు రాయ్ హత్య కేసులో పోలీసులు ఎవరినీ అరెస్టు చేయలేకపోయారు.

లేషి సింగ్ నేరాలకు పాల్పడ్డారని 2022లో, జేడీయూ ఎమ్మెల్యే బీమా భారతి ఆరోపించారు. అయితే వీటిని రాజకీయప్రేరేపిత ఆరోపణలుగా లేషీసింగ్ కొట్టిపడేశారు.

రమా నిషాద్

ఫొటో సోర్స్, Rama Nishad

రమా నిషాద్

నితీశ్ మంత్రివర్గంలో ప్రమాణస్వీకారం చేసిన రమా నిషాద్ ముజఫర్‌పూర్‌కు చెందిన ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు.

మొదటిసారి జిల్లాలోని ఔరాయి స్థానం నుంచి బీజేపీ టికెట్‌పై ఎన్నికలలో పోటీ చేసి, భారీ మెజారిటీతో విజయం సాధించారు.

ఎమ్మెల్యే అవ్వకముందు, రమా నిషాద్ మున్సిపల్ కౌన్సిల్ రాజకీయాల్లో సుదీర్ఘకాలం పనిచేశారు.

58 ఏళ్ల రమా నిషాద్ గత 30 ఏళ్లుగా రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు .

వార్డు కౌన్సిలర్ ఎన్నిక నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె, హాజీపూర్ మున్సిపల్ కౌన్సిల్ వైస్‌ప్రెసిడెంట్‌గా, చైర్‌పర్సన్‌గా పనిచేశారు.

రమా నిషాద్ భర్త అజయ్ నిషాద్ రెండుసార్లు ఎంపీగా పనిచేశారు. ఆమె మావయ్య కెప్టెన్ జయనారాయణ్ నిషాద్ కూడా కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.

శ్రేయాసి సింగ్

ఫొటో సోర్స్, @shreyasisinghofficial

శ్రేయాసి సింగ్

జముయి అసెంబ్లీ సీటు నుంచి ఎమ్మెల్యే అయిన శ్రేయాసి సింగ్.. నితీశ్ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. ఆమె ప్రముఖ షూటర్ కూడా.

ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో జరిగిన 2018 కామన్‌వెల్త్ గేమ్స్‌లో మహిళల డబుల్ ట్రాప్‌ ఈవెంట్‌లో ఆమె బంగారు పతకం సాధించారు. అంతకుముందు 2014లో స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్‌లో వెండి పతకం గెలుచుకున్నారు.

శ్రేయాసి సింగ్ తండ్రి దివంగత దిగ్విజయ్ సింగ్... అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.

బిహార్‌లో బంకా లోక్‌సభ సీటు నుంచి అనేకసార్లు పార్లమెంట్ సభ్యుడిగా కూడా పనిచేశారు. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.

1991లో పుట్టిన శ్రేయాసి సింగ్.. 2020లో క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. అదే ఏడాది బీజేపీ టికెట్‌పై జముయి నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు.

దిల్లీలోని హన్స్‌రాజ్ కాలేజీ నుంచి ఆర్ట్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

శ్రేయాసి సింగ్ దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్‌లో, ఆమెపై ఎలాంటి కేసులు లేవు. రూ.7.6 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు ఉన్నట్లు ప్రకటించారు.

జమాఖాన్...

ఫొటో సోర్స్, @BhaiZamakhan

జమాఖాన్...

నితీశ్ కుమార్ గత ప్రభుత్వంలో ఏకైక ముస్లిం మంత్రిగా ఉన్న మహ్మద్ జమాన్ ఖాన్ ఈసారి కూడా మంత్రిగా నియమితులయ్యారు.

జనతాదళ్ యునైటెడ్ అభ్యర్థిగా కైమూర్ జిల్లాలోని చైన్పూర్ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన మహ్మద్ జమాన్ ఖాన్ వరుసగా రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు.

మొహమ్మద్ జమాన్ ఖాన్ 2020లో బహుజన్ సమాజ్ పార్టీ టిక్కెట్‌పై ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే, తరువాత ఆయన నితీశ్ కుమార్ ప్రభుత్వంలో జేడీయూలో లో చేరి మైనారిటీ వ్యవహారాల మంత్రి అయ్యారు.

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ నేతృత్వంలోని కూటమి ఎన్డీఏ 243 స్థానాలకు గాను 202 స్థానాలను గెలుచుకుంది. బిహార్‌లో ఎన్డీయే తరఫున ఎన్నికైన ఏకైక ముస్లిం ఎమ్మెల్యే మొహమ్మద్ జామాఖాన్.

బిహార్‌లో 2022-23 సంవత్సరంలో నిర్వహించిన కులగణన ప్రకారం, రాష్ట్రంలో ముస్లిం జనాభా 17.7 శాతంగా ఉంది.

కానీ రాజకీయ ప్రాతినిధ్యంలో ముస్లింలు చాలా వెనుకబడి ఉన్నారు. ఈసారి రాష్ట్రంలో కేవలం 11 మంది ముస్లిం ఎమ్మెల్యేలు మాత్రమే ఎన్నికయ్యారు.

మహిళా ఓటర్లు

ఫొటో సోర్స్, ANI

మహిళా ప్రాతినిథ్యం పెరిగింది... కానీ...

బిహార్ ఎన్నికల వేళ, ప్రభుత్వం స్వయం ఉపాధి కోసం మహిళల బ్యాంకు ఖాతాలలో ఒక్కొక్కరికి రూ. 10వేల రూపాయలు జమచేసింది.

బిహార్ ఎన్నికల ఫలితాలపై మహిళా ఓటర్ల ప్రభావం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే, బిహార్‌లో ఓటింగ్‌లో పాల్గొన్న మహిళల సంఖ్య అసెంబ్లీలో, మంత్రివర్గంలో ప్రతిఫలించడంలేదు.

గత ప్రభుత్వంలో ఒకే ఒక మహిళా మంత్రి ఉన్న ప్రభుత్వంతో పోలిస్తే, ముగ్గురు మహిళా మంత్రుల సంఖ్య ఎక్కువగా అనిపించవచ్చు కానీ జనాభా పరంగా ఇది చాలా తక్కువ అని విశ్లేషకులు భావిస్తున్నారు.

సీనియర్ జర్నలిస్ట్ ఫైజాన్ మాట్లాడుతూ, "ప్రభుత్వం ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలను మంత్రులుగా నియమించింది, ఎన్డీఏ మొత్తం 26 మంది మహిళా ఎమ్మెల్యేలను ఎన్నుకుంది. ఆ రీత్యా చూసినా ఈ సంఖ్య తక్కువగానే కనిపిస్తోంది"అన్నారు.

" పోలింగ్ బూత్‌ల వద్ద మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. కానీ ప్రభుత్వంలో వారి భాగస్వామ్యం వారి జనాభాకు అనుగుణంగా లేదు. రాబోయే మంత్రివర్గ విస్తరణలో మరింతమంది మహిళా ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యే అవకాశం ఉంది'' అని ఫైజాన్ అన్నారు.

రాష్ట్రంలో ఒకే ఒక్క ముస్లిం మంత్రి ఉన్నారు. బిహార్ జనాభాలో ముస్లింలు 17 శాతానికి పైగా ఉన్నారు. ఈసారి కేవలం 11 మంది ముస్లిం ఎమ్మెల్యేలు మాత్రమే ఎన్నికయ్యారు.

బిహార్ రాజకీయాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ ముస్లింలు అణగారిన వర్గాలుగానే ఉన్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.

"ముస్లిం రాజకీయ ప్రాతినిధ్యం క్రమంగా తగ్గుతోంది. ఇది బిహార్‌లోనే కాదు. ఇతర రాష్ట్రాలలోనూ ఇదే పరిస్థితి ఉంది. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో మంత్రి హోదా కలిగిన ఒకే ఒక సహాయ మంత్రి ఉన్నారు" అని ఫైజాన్ అన్నారు.

"ఎమ్మెల్యేల సంఖ్య తగ్గడమే కాకుండా, ముస్లింలకు కూడా తక్కువ టిక్కెట్లు వస్తున్నాయి. జాతీయ స్థాయిలో రాజకీయాల్లో ముస్లింలకు అవకాశాలు తగ్గిపోతున్నాయి" అంటారు ఫైజాన్.

ఏ పార్టీ నుంచి ఎవరెవరు మంత్రులు..

బీజేపీ నుంచి

  • సామ్రాట్ చౌదరి
  • విజయ్ కుమార్ సిన్హా
  • దిలీప్ జైస్వాల్
  • మంగళ్ పాండే
  • రామ్‌కృపాల్ యాదవ్
  • నితిన్ నవీన్
  • సంజయ్ సింగ్ టైగర్
  • అరుణ్ శంకర్ ప్రసాద్
  • సురేంద్ర మెహతా
  • నారాయణ్ ప్రసాద్
  • రామ నిషాద్
  • లఖేంద్ర సింగ్ రోషన్
  • శ్రేయసి సింగ్
  • ప్రమోద్ కుమార్

జనతా దళ్ యునైటెడ్ నుంచి

  • విజయ్ కుమార్ చౌదరి
  • బిజేంద్ర ప్రసాద్ యాదవ్
  • శ్రావణ్ కుమార్
  • అశోక్ చౌదరి
  • లేషి సింగ్
  • మదన్ సాహ్ని
  • సునీల్ కుమార్
  • మొహమ్మద్ జామా ఖాన్

లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)

  • సంజయ్ కుమార్
  • సంజయ్ కుమార్ సింగ్
  • హిందుస్తానీ అవామ్ మోర్చా
  • సంతోష సుమన్ (జీతన్ రామ్ మాంఝీ కుమారుడు)

నేషనల్ పీపుల్స్ ఫ్రంట్

  • దీపక్ ప్రకాష్ (ఉపేంద్ర కుష్వాహ కుమారుడు)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)