కూటములను మార్చే ఆట ఇక నితీశ్ కుమార్ ఆడలేరా?

 బిహార్, నితీశ్ కుమార్, ఎన్డీఏ, మోదీ, పశ్చిమ బెంగాల్, రాహుల్

ఫొటో సోర్స్, Santosh Kumar/Hindustan Times via Getty Images

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 89, జేడీయూ 85 సీట్లు గెలుచుకుని క్లీన్ స్వీప్ చేశాయి.

మహాఘట్‌బంధన్‌ పార్టీలు గెలుచుకున్న మొత్తం సంఖ్య 50కి చేరలేదు. ఆర్జేడీ 25 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. ఎన్నికలు ముగిసిన తర్వాత, అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కూటములు మార్చడానికి జేడీయూకి ఎంపిక లేకుండాపోయిందా? మహిళలను ఆకర్షించడం ఒక ఫార్ములాగా మారిందా? తేజస్వీ యాదవ్ బిహార్ ప్రజలకు ఎందుకు భరోసా ఇవ్వలేకపోతున్నారు?

బిహార్ ఎన్నికల ఫలితాలపై 'ది లెన్స్' ఎపిసోడ్‌లో ప్రత్యేక చర్చ జరిగింది. కలెక్టివ్ న్యూస్‌రూమ్ జర్నలిజం డైరెక్టర్ ముకేశ్ శర్మతో పాటు డేటా ట్రాకింగ్ ఆర్గనైజేషన్ సీ-ఓటర్ వ్యవస్థాపకులు యశ్వంత్ దేశ్‌ముఖ్, ది హిందూ సీనియర్ డిప్యూటీ ఎడిటర్ శోభనా నాయర్, సీనియర్ జర్నలిస్ట్ స్మితాశర్మ, బీబీసీ ప్రతినిధి ప్రేరణ పాల్గొన్నారు.

ఈ విజయం జాతీయ స్థాయిలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? వంటివాటితో పాటు ప్రశాంత్ కిశోర్ ప్రయత్నాలు ఎక్కడ విఫలమయ్యాయి? నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి అవుతారా, అయితే పూర్తికాలం పదవిలో ఉంటారా? ప్రధానమంత్రి మోదీ తన చరిష్మాను ఎలా నిలబెట్టుకోగలుగుతున్నారు? ఈ ఓటమిని రాహుల్ గాంధీ ఎలా చూడాలి? అన్న అంశాలపై చర్చ జరిగింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
 బిహార్, నితీశ్ కుమార్, ఎన్డీఏ, మోదీ, పశ్చిమ బెంగాల్, రాహుల్

ఫొటో సోర్స్, ani

ఫొటో క్యాప్షన్, ఎన్డీఏ గెలుస్తుందని భావించారుగానీ ఈ స్థాయి మెజార్టీ వస్తుందని ఎవరూ అంచనా వేయలేదని రాజకీయ నిపుణులు అంటున్నారు.

అత్యంత ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే...

బిహార్ ఎన్నికల ఫలితాలపై చాలామంది నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వస్తుందని చాలామంది అనుకున్నా, ఇంతలా క్లీన్ స్వీప్ చేస్తుందని మాత్రం వారు ఊహించలేదు.

"నితీశ్ కుమార్‌పై క్షేత్రస్థాయిలో ఎలాంటి ఆగ్రహం లేదు. ఎన్డీఏ ఆధిక్యంలో ఉంటుందని మనకు తెలుసు. కానీ ఇంతటి ఘన విజయం సాధిస్తుందని తెలియదు. ఆయన ఆరోగ్యం, పార్టీ మారడం గురించి చర్చ జరిగినందున ఇది కొంచెం ఆశ్చర్యం కలిగించింది" అని సీనియర్ జర్నలిస్ట్ స్మితాశర్మ అన్నారు.

"అందరికీ అత్యంత ఆశ్చర్యం కలిగించిన విషయాలు ఏంటంటే ఆర్జేడీ పేలవ ప్రదర్శన, ఎన్డీఏ క్లీన్‌స్వీప్. నితీశ్ కుమార్‌కు ఆదరణ ఉంది. నిరుద్యోగం, వలస వంటి అంశాలపై కొంత ఆగ్రహం ఉందిగానీ ఆయనపై భారీ వ్యతిరేకత లేదు'' అని బీబీసీ ప్రతినిధి ప్రేరణ అన్నారు.

సీనియర్ జర్నలిస్ట్ శోభనా నాయర్ ఈ అభిప్రాయంతో ఏకీభవించారు.

"బీజేపీ పనితీరు ఊహించిన దానికంటే చాలా మెరుగ్గా ఉంది" అని ఆమె అంటున్నారు.

అయితే, గతంతో పోలిస్తే బీజేపీకి వచ్చిన ఓట్లలో పెద్దగా పెరుగుదల లేదని ఆమె చెప్పారు.

ఎన్నికల ఫలితాలు తనను ఆశ్చర్యపరచలేదని సీ-ఓటర్ వ్యవస్థాపకులు యశ్వంత్ దేశ్‌ముఖ్ అన్నారు.

"ఎన్డీఏ, మహాఘట్‌బంధన్‌‌కు ఓటేసిన మగవాళ్ల మధ్య వ్యత్యాసం రెండు శాతం మాత్రమే. అందువల్ల మగ ఓటర్లుతో మాత్రమే మాట్లాడడంతోపాటు కుల సమీకరణాలు, మత సమీకరణాలపై దృష్టి సారించిన వారు ఈ ఎన్నికలు హోరాహోరీగా ఉన్నాయని భావించారు" అని యశ్వంత్ దేశ్‌ముఖ్ అన్నారు.

"కానీ మనం చూస్తున్న డేటా ప్రకారం, ఎన్డీఏకు అనుకూలంగా ఉన్న మహిళా ఓటర్లు18 శాతం అదనం. ఇది భారీ అంతరం. ఊహించలేనిది. దీనిని భిన్నంగా అర్థం చేసుకోవాలి" అని ఆయన అన్నారు.

 బిహార్, నితీశ్ కుమార్, ఎన్డీఏ, మోదీ, పశ్చిమ బెంగాల్, రాహుల్
ఫొటో క్యాప్షన్, మహిళాఓటర్లు నితీశ్‌కుమార్‌కు అండగా ఉన్నారని నిపుణులు అంటున్నారు.

నితీశ్ కుమార్‌కు మహిళా ఓటర్లు అండగా ఉన్నారనుకోవచ్చా?

బీజేపీకి, వామపక్షాలకు సొంత క్యాడర్ ఉన్నట్టే, గడచిన కొన్నేళ్లల్లో మహిళలు నితీశ్ కుమార్‌కు విశ్వాసపాత్రులైన ఓటర్లుగా మారారని బీబీసీ ప్రతినిధి ప్రేరణ అభిప్రాయపడ్డారు.

డ్రెస్ స్కీమ్ అయినా, సైకిల్ స్కీమ్ అయినా, పదో తరగతి, ఇంటర్, గ్రాడ్యుయేషన్ తర్వాత డబ్బు ఇవ్వడం వంటి పథకాలైనా, పంచాయతీల్లో 50 శాతం రిజర్వేషన్ అయినా, పోలీసు రిక్రూట్‌మెంట్‌లో 35 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే చర్చ అయినా, మహిళలకు నితీశ్ కుమార్‌తో మంచి అనుబంధం ఉందని ఆమె అంటున్నారు.

"ఓటర్లలో, పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నారు, ఇది ఊహించలేని విషయం. ఎన్డీఏకు, మహాఘట్‌బంధన్‌‌కు మహిళా ఓటర్ల మధ్య అంతరం 18 శాతం" అని యశ్వంత్ దేశ్‌ముఖ్ అన్నారు.

మహిళా ఓటర్లతో నితీశ్ కుమార్ సమీకరణం తరతరాలుగా అనుసరించిన విధానంలో భాగమని ఆయన వివరించారు.

"20 సంవత్సరాల కిందట స్కూలుకు వెళ్తూ ప్రభుత్వం నుంచి సైకిల్ పొందిన అమ్మాయి ఇప్పుడు గృహిణి. ఇద్దరు-ముగ్గురు పిల్లల తల్లి. తన కూతుళ్లను స్కూలుకు పంపుతోంది. నితీశ్ ఆమె ఖాతాలో రూ.10,000 జమ చేయడమన్నది తాను ఉన్నానని, తాను దీర్ఘకాలిక దృష్టి కలిగిన వ్యక్తినని, ఆమె జీవనోపాధి కోసం ఏర్పాట్లు చేస్తున్నాననే నమ్మకాన్ని తిరిగి సృష్టించడానికి చేసిన ప్రయత్నం" అని ఆయన విశ్లేషించారు.

"భారతదేశ రాజకీయ చరిత్రలో ఇది ఒక కీలకమైన ఎన్నిక. ఈ దేశ రాజకీయాలు గతంలో ఆధారపడిన కులం, మతం వంటి అంశాల నుంచి దూరమై విభిన్న సమస్యల వైపు మళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే మహిళలు ఓటుబ్యాంకుగా బలమైన ప్రభావం చూపుతున్నారు'' అని అభిప్రాయపడ్డారు.

 బిహార్, నితీశ్ కుమార్, ఎన్డీఏ, మోదీ, పశ్చిమ బెంగాల్, రాహుల్

ఫొటో సోర్స్, ani

ఫొటో క్యాప్షన్, మహిళలను ఆకర్షించడం గెలుపు సూత్రంగా మారుతోందని నిపుణులు అంటున్నారు.

మహిళలను ఆకర్షించడం గెలుపు సూత్రమవుతుందా?

డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ వంటి పథకాలను ప్రవేశపెట్టడం ద్వారా మహిళలను ఆకర్షించడం ఇప్పుడు విజయవంతమైన ఫార్ములాగా మారుతుందా అనే ప్రశ్న కూడా ఉంది.

రాబోయే ఎన్నికల్లో కూడా ఇది గెలుపు ఫార్ములాగా మారుతుందని యశ్వంత్ దేశ్‌ముఖ్, సీనియర్ జర్నలిస్ట్ స్మితాశర్మ అభిప్రాయపడ్డారు.

"తెలంగాణ, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లను చూడండి, మహిళల కోసం ఇప్పటికే అనేక పథకాలు అమలవుతున్నాయి, ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మరిన్ని పథకాలను ప్రకటించవచ్చు" అని స్మితా శర్మ అన్నారు.

"రాజకీయ పార్టీలలో మహిళల ప్రాతినిధ్యం పెరగకపోయినప్పటికీ, మహిళలు ఇప్పుడు ఒక ముఖ్యమైన రాజకీయ ఓటు బ్యాంకుగా మారారు" అని ఆమె అంటున్నారు.

"బిహార్‌ను పరిశీలిస్తే, మహిళా నాయకుల సంఖ్య పెద్దగా పెరిగినట్టుగానీ లేదా రాజకీయ పార్టీలు చాలా మంది మహిళా అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చినట్టుగానీ కనపడదు'' అని ఆమె అన్నారు.

ఎన్నికల సమయంలో నగదు బదిలీ ఆందోళనకరమైన విషయమని స్మితా శర్మ అన్నారు.

"ఎన్నికల మధ్యలో అధికార పార్టీ నగదు బదిలీ చేయగల స్థితిలో ఉంటుంది. కానీ ప్రతిపక్షాలు వాగ్దానాలు మాత్రమే చేయగలవు. ఇది కచ్చితంగా ఆందోళన కలిగించే విషయం. ఎన్నికల సంఘం ఎలాంటి చర్య తీసుకోకపోతే, దానిని మరి ఎవరు ఆపాలి" అని ఆమె ప్రశ్నించారు.

"ఎన్నికలకు ఐదారు నెలల ముందు వరకే నగదు బదిలీ చేయగల నియమాలు ఉండాలి. కానీ ఎన్నికలు జరిగేటప్పుడు నగదు బదిలీ చేయడం ఉద్దేశం మంచిదే, పథకం మంచిదే అయినప్పటికీ ఇది నాకు కచ్చితంగా సమస్య అనిపిస్తుంది" అని ఆమె అభిప్రాయపడ్డారు.

 బిహార్, నితీశ్ కుమార్, ఎన్డీఏ, మోదీ, పశ్చిమ బెంగాల్, రాహుల్

ఫొటో సోర్స్, NIHARIKA KULKARNI/AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, బిహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ పార్టీ ఒక్కస్థానంలో కూడా గెలవలేదు.

ప్రశాంత్ కిశోర్ ఎక్కడ విఫలమయ్యారు?

మహిళా ఓటర్లు, వారి ప్రాతినిధ్యంతో పాటు విద్య, ఉపాధి, వలసలు బిహార్‌లో చాలా ముఖ్యమైన సమస్యలు.

జన్ సురాజ్‌ పార్టీ వ్యవస్థాపకులు ప్రశాంత్ కిశోర్ గత మూడేళ్లగా బిహార్‌లో ఈ మూడు అంశాలను లేవనెత్తుతున్నారు. పాదయాత్రలు, ఇంటింటి ప్రచారాలు చేశారు. కానీ ఆయన ప్రయత్నాలు ఓట్లు రాబట్టలేదు.

మరి ఆయన ఎక్కడ విఫలమయ్యారు?

అనేక కారణాల వల్ల ప్రశాంత్ కిశోర్ ప్రజలతో కనెక్ట్ కాలేకపోయారని ఈ ప్రశ్నకు సమాధానంగా, ది హిందూ సీనియర్ డిప్యూటీ ఎడిటర్ శోభనా నాయర్ అన్నారు.

"గ్రామీణ ప్రాంతాల్లో గమనిస్తే, మీరు ఎవరితో మాట్లాడినా, ఆయన క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవ్వడానికి సమయం పడుతుందని అందరూ నమ్ముతున్నారు. ప్రశాంత్ కిశోర్ ప్రభావం ఎక్కువగా కనిపించేది సోషల్ మీడియా లేదా టీవీలోనే" అని ఆమె అన్నారు.

"ఆయన అనేక పొరపాట్లు చేశారు. ఎన్నికల్లో పోటీ చేయకూడదనే ఆయన నిర్ణయం తప్పు అని నిరూపితమైంది. ఈ ప్రకటన తర్వాత ఆయన ప్రచారం స్థాయి తగ్గింది. ఒక విధంగా, ప్రచారం ముగిసింది. అనేక అసెంబ్లీ నియోజకవర్గాల్లో నెలల తరబడి ఆయనతో కలిసి పనిచేస్తున్న చాలా మందికి కూడా టిక్కెట్లు రాలేదు. మరో విషయమేంటంటే, కొత్త అభ్యర్థులను గ్రామీణ ప్రాంతాల ప్రజలు గుర్తించలేకపోయారు. అభ్యర్థులు ఊళ్లల్లోని జనంతో మమేకం కాలేకపోయారు'' అని శోభనా నాయర్ విశ్లేషించారు.

అయితే ప్రశాంత్ కిశోర్ లేవనెత్తిన సమస్యలు తీవ్రమైనవని, మరో ఐదు, పదేళ్లపాటు పనిచేస్తే ఆయన మంచి రాజకీయ నాయకుడిగా ఎదుగుతారని శోభనా నాయర్ అభిప్రాయపడ్డారు.

 బిహార్, నితీశ్ కుమార్, ఎన్డీఏ, మోదీ, పశ్చిమ బెంగాల్, రాహుల్

ఫొటో సోర్స్, Santosh Kumar/Hindustan Times via Getty Images

ఫొటో క్యాప్షన్, ఆర్డేడీ ఇంత తక్కువ స్థానాలు గెలుచుకుంటుందని ఎవరూ ఊహించలేదని నిపుణులు అంటున్నారు.

తేజస్వీ ప్రజలను ఎందుకు ఆకర్షించలేకపోయారు?

ప్రతిపక్షాలు "జంగల్ రాజ్" అంశాన్ని ఎన్నికల సమయంలో లేవనెత్తాయి. దీంతో 1990లనాటి "జంగల్ రాజ్" చర్చల్లోకొచ్చింది. ఆ సమయంలో తేజస్వీ రాజకీయాల్లో లేరు, కాబట్టి దానికి ఆయన్ను లింక్ చేయడం సరైనది కాదు.

ఈ నీడ నుంచి స్వయంగా తేజస్వీ బయటపడలేకపోతున్నారా? ప్రజల ఆయనపై భరోసా ఉంచలేకపోవడానికి కారణమేంటి?

"ఐదేళ్ల క్రితం యువతకు ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చినప్పుడు ఆయన దాదాపు దీని నుంచి బయటపడ్డారని నేను అనుకుంటున్నాను. బిహార్ ప్రజలు ఆయన్ను పెద్ద సంఖ్యలో అంగీకరించారు. తేడా ఏంటంటే, ఇప్పటి నుంచి మనం ఏదైనా ఓటు బ్యాంకును గమనించినప్పుడు, అందులో సగం మంది మహిళలే అని అర్థం చేసుకోవాలి" అని సీ-ఓటర్ వ్యవస్థాపకులు యశ్వంత్ దేశ్‌ముఖ్ అన్నారు.

"యువకులు జంగిల్ రాజ్‌ను చూడలేదు. వారు ముందుకు వచ్చి తేజస్వీ యాదవ్‌కు ఓటు వేశారు. కానీ యువతులు నితీశ్‌కు ఓటు వేశారు. యువతులు జంగిల్ రాజ్‌ను చూడలేదు, కానీ బహుశా వారి తల్లులు వారికి దాని గురించి చెప్పి ఉండవచ్చు’’ అని ఆయన విశ్లేషించారు.

"2020లో, తేజస్వీ అధికారానికి చాలా దగ్గరగా వచ్చారు. ఆయన హామీలు ప్రజలతో కనెక్ట్ అయ్యాయి. కానీ ఈసారి, ఎన్డీఏ ఆయన్ను అధిగమించింది. అవి ఉద్యోగాలు, వ్యవసాయం లేదా ప్రజల అవసరాలు కావచ్చు. దీని వల్ల ఆయన నష్టాలను చవిచూశారు" అని బీబీసీ ప్రతినిధి ప్రేరణ అన్నారు.

"మహాఘట్‌బంధన్‌‌ సీట్ల పంపకంలో జాప్యం కూడా కొంత ప్రభావాన్ని చూపింది. తేజస్వీ దాని భారాన్ని భరించాల్సి వచ్చింది" అని ఆమె అభిప్రాయపడ్డారు.

 బిహార్, నితీశ్ కుమార్, ఎన్డీఏ, మోదీ, పశ్చిమ బెంగాల్, రాహుల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆర్జేడీ హామీలను ప్రజలు నమ్మలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఎన్నికల హామీలు

"ఎన్నికలకు ముందు నగదు బదిలీ, ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పట్ల నా అభ్యంతరం ఏంటంటే ఇది ఎన్నికలకు ముందు జరిగి ఉండకూడదు" అని యశ్వంత్ దేశ్‌ముఖ్ అన్నారు.

నగదు బదిలీ అంశంపై మాట్లాడుతూ "దానిపై చట్టం చేసినా లేదా నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు, లేకుంటే దానిని అనుకరించవచ్చు. ఎన్నికల్లో గెలవడానికి మంచి పథకాన్ని ఉపయోగిస్తే, అది అధికారంలో ఉన్నవారికి ప్రయోజనం చేకూరుస్తుందని మీరు చెప్పవచ్చు. నేను దీనిని తిరస్కరించడం లేదు" అని దేశ్‌ముఖ్ అన్నారు.

"అధికార కూటమికి ప్రతిగా ప్రతిపక్షాలు రూపొందించిన పథకం కొంచెం నమ్మశక్యం కానిదిగా ఉంది. ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం సాధ్యమేనని వారి మద్దతుదారులు కూడా నమ్మలేకపోయారు. ఇది అసాధ్యమని ఒక సామాన్యుడు కూడా వారికి చెప్పగలరు" అని ఆయన అన్నారు.

"తేజస్వీ 'ప్రతి ఇల్లు' అన్న మాట ఉపయోగించకపోతే, అది నమ్మదగినదిగా ఉండేది. ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తాననే హామీ తేజస్వీ ఆకర్షణను తగ్గించింది" అని యశ్వంత్ దేశ్‌ముఖ్ అంటున్నారు.

కాంగ్రెస్ ఓట్ల దొంగతనం ప్రచారం గురించి యశ్వంత్ ఇలా అన్నారు, "ఎన్నికలకు ముందు, ఓటు దొంగతనం ప్రచారం కారణంగా తేజస్వీకి దాదాపు ఒకటిన్నర నెలల సమయం వృధా అయింది. ఆయన ఈ సమయాన్ని తన ప్రచారానికి ఉపయోగించుకోవాల్సింది" అని అభిప్రాయపడ్డారు.

 బిహార్, నితీశ్ కుమార్, ఎన్డీఏ, మోదీ, పశ్చిమ బెంగాల్, రాహుల్

ఫొటో సోర్స్, Sonu Mehta/Hindustan Times via Getty Images

ఫొటో క్యాప్షన్, కూటములు మార్చడానికి నితీశ్‌కు ఇక అవకాశం లేదని భావిస్తున్నారు.

యూ టర్న్ తీసుకోవడానికి జేడీయూకు అవకాశాలు అయిపోయాయా?

బిహార్‌లో జేడీయూ ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. కాబట్టి, నితీశ్ కుమార్ దగ్గర రాజకీయ సమీకరణాలు తారుమారు చేయడానికి ఆప్షన్లు లేకుండా పోయాయా?

"గణాంకాలను పక్కనపెడితే, నితీశ్ ఇప్పుడు ఎక్కడికీ వెళ్ళే ఉద్దేశంలో లేరని నేను అనుకుంటున్నాను. ప్రతి వ్యక్తి తన చివరి ఇన్నింగ్స్‌లో మంచి వారసత్వాన్ని వదిలి వెళ్లాలని కోరుకుంటారు. తాను పని చేయడానికి అవసరమైన ఆర్థికసాయం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నుంచి అందుతుందని ఆయనకు తెలుసు" అని యశ్వంత్ దేశ్‌ముఖ్ అన్నారు.

"15 సంవత్సరాల కిందట, ప్రధానమంత్రి అభ్యర్థిత్వం కోసం ప్రతిపక్షం నుంచి నరేంద్ర మోదీతో సమాన పోటీదారుగా నితీశ్ ఉండేవారు. కానీ ఇప్పుడు ఆయన తన ప్రాధాన్యతను మార్చుకున్నారు. ఒక విషయం మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. తాను కోరుకున్నప్పుడు నితీశ్ కుమార్ పదవీ విరమణ చేస్తారు" అని అభిప్రాయపడ్డారు దేశ్‌ముఖ్.

 బిహార్, నితీశ్ కుమార్, ఎన్డీఏ, మోదీ, పశ్చిమ బెంగాల్, రాహుల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భవిష్యత్తులో బీజేపీ తరఫున కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి తెరపైకి రావొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

బిహార్‌లో నితీశ్ తప్ప బీజేపీకి వేరే మార్గం లేదా?

జేడీయూ కంటే ఎక్కువ సీట్లు వస్తే, బీజేపీ నుంచి ఎవరో ఒకరిని ముఖ్యమంత్రి పదవికి ప్రతిపాదించే అవకాశం ఉందని, నితీశ్ మళ్లీ ముఖ్యమంత్రి కాలేకపోవచ్చునని ఎన్నికలకు ముందు ఊహాగానాలు వినిపించాయి.

"బీజేపీ విషయానికొస్తే, అది నితీశ్ ఇమేజ్‌ను అర్థం చేసుకుంటుంది. ఆయన పదవీ విరమణ చేసిన తర్వాత ఆ ఇమేజ్‌ను కొనసాగిస్తుంది. నితీశ్‌కు మహిళా ఓటర్ల నుంచి భారీ మద్దతు ఉంది. వారికి ద్రోహం చేస్తున్నట్టుగా వచ్చే ఇమేజ్‌ను తెచ్చుకోవడానికి బీజేపీ ఇష్టపడదు. ఇకపై అలాంటి రిస్క్ తీసుకునే స్థితిలో బీజేపీ ఉండదు" అని యశ్వంత్ దేశ్‌ముఖ్ అన్నారు.

ప్రస్తుతానికి బీజేపీ ఇలాంటిది చేయాలనుకుంటున్నట్టు కనిపించడం లేదని సీనియర్ జర్నలిస్ట్ స్మితాశర్మ అన్నారు.

"నితీశ్ పేరును బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చెప్పకపోయినా, నితీశ్ నాయకత్వంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని వారు పదేపదే చెబుతూ వచ్చారు. ఈ ఎన్నికల్లో బీజేపీ స్ట్రైక్ రేట్ కొంచెం బలహీనంగా ఉంటే నితీశ్ కుమార్ సౌకర్యవంతంగా ఉండేవారని నేను భావిస్తున్నాను" అన్నారు స్మితాశర్మ.

"కూటములు మార్చాలని నితీశ్ అనుకున్నా, ఆయన మద్దతుతో అధికారాన్ని చేజిక్కించుకునే సంఖ్యాబలం మహాఘట్‌బంధన్‌‌కి లేదు. బీజేపీ విషయానికొస్తే, ఆశ్చర్యకరమైన విషయాలకు ఆ పార్టీ వైపు నుంచి కొదవ లేదు. బహుశా ఇప్పుడు కాకపోవచ్చుగానీ భవిష్యత్తులో తమ సొంత ముఖ్యమంత్రిని తెరపైకి తెచ్చే పని వాళ్లు మొదలుపెట్టవచ్చు’’ అని ఆమె అన్నారు.

 బిహార్, నితీశ్ కుమార్, ఎన్డీఏ, మోదీ, పశ్చిమ బెంగాల్, రాహుల్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, బిహార్ ఫలితాల తర్వాత చిరాగ్ పాశ్వాన్‌పై బాగా చర్చ జరుగుతోంది.

బిహార్ ఎన్నికల్లో ఎంఐఎం, చిరాగ్ పాశ్వాన్ పాత్ర ఎలా ఉందంటే...

సీమాంచల్‌లో అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఏఐఎంఐఎం కీలకంగా ఉంది. ఆ పార్టీ ఇక్కడ ఐదు సీట్లు గెలుచుకుంది.

గత ఎన్నికల్లో కూడా ఆ పార్టీ ఐదు సీట్లు గెలిచింది. కానీ ఒక్కరు తప్ప, మిగతా ఎమ్మెల్యేలందరూ ఆర్జేడీలో చేరారు.

"మహాఘట్‌ బంధన్‌‌ వైపు వెళ్లాలని తాము భావించామని కానీ వారు తమను తిరస్కరించారని చెప్పారు. కలిసి పోటీచేస్తే ఈ సీట్లు మహాఘట్‌బంధన్‌‌కు అనుకూలంగా ఉండేవి" అని స్మితాశర్మ అన్నారు.

"చిరాగ్ పాశ్వాన్‌కు ఇచ్చిన 29 సీట్లలో 27 మహాఘట్‌బంధన్‌‌ స్థానాలు. రెండు సీట్లు మాత్రమే ఎన్డీఏవి. చిరాగ్ ఈ ఎన్నికల్లో తనను తాను నిరూపించుకున్నారు'' అని సీనియర్ జర్నలిస్ట్ శోభనా నాయర్ చెప్పారు.

"చిరాగ్ ఈ ఎన్నికల్లో చాలా సంయమనంతో పోరాడారు. సీట్ల పంపకం గురించి చాలా చర్చలు జరిగాయి. అసంతృప్తిగా ఉన్నారని సూచించే వ్యాఖ్యలేవీ ఆయన వైపు నుంచి రాలేదు. ఎన్నికల సమయంలో కూడా ఎల్జేపీ, జేడీయూ రెండు కలిసి పనిచేశాయి. ఛాత్ సమయంలో, నితీశ్ ఎవరి ఇంటికీ వెళ్లలేదుగానీ చిరాగ్ పాశ్వాన్ ఇంటికి వెళ్లారు. అలా చేయడం ద్వారా కలిసి పనిచేయాలని ఆయన తన మద్దతుదారులకు సంకేతాలిచ్చారు" అని ఆమె విశ్లేషించారు.

ఛాత్ అనేది ఉత్తరాదిలో జరుపుకునే ఒక పండగ.

 బిహార్, నితీశ్ కుమార్, ఎన్డీఏ, మోదీ, పశ్చిమ బెంగాల్, రాహుల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కాంగ్రెస్ తన తప్పులను గుర్తించి సరిదిద్దుకోవాలని రాజకీయ నిపుణులు సూచిస్తున్నారు.

కాంగ్రెస్‌కు పశ్చిమ బెంగాల్ సమస్య

"అమిత్ షాకు పశ్చిమ బెంగాల్ ప్రతిష్టాత్మక సమస్యగా మారిందనడంలో సందేహం లేదు. బిహార్ ఫలితాల తర్వాత బీజేపీ ఇప్పుడు మరింత విశ్వాసంతో బరిలోకి దిగుతుంది'' అని సీనియర్ జర్నలిస్ట్ స్మితాశర్మ అన్నారు.

బిహార్‌లో బీజేపీ తీసుకోలేని చర్యలు మమతా బెనర్జీ తీసుకోగలరని ఆమె అభిప్రాయపడ్డారు.

"కాంగ్రెస్‌కు ఉన్న పెద్ద సమస్య ఏంటంటే, ప్రాంతీయ పార్టీలతో కలిసి పోటీచేసే చోట అది భారంగా కనిపించడం" అని స్మితా శర్మ అన్నారు.

బిహార్ ఫలితాల తర్వాత, పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ కాంగ్రెస్‌ను ఒక ముఖ్యమైన పార్టీగా చూస్తారో లేదో చెప్పడం కష్టమని యశ్వంత్ దేశ్‌ముఖ్ అంటున్నారు.

పశ్చిమ బెంగాల్‌లోనే కాదు, ఉత్తరప్రదేశ్‌లో కూడా కాంగ్రెస్‌కు బేరసారాల శక్తి తగ్గుతుందని ఆయన అంటున్నారు.

"కాంగ్రెస్‌కు అతిపెద్ద సమస్య దాని ప్రచారం తీరు. కాంగ్రెస్ నాయకత్వం దాని లోపాలను గుర్తిస్తుందా లేదా అనేది ప్రశ్న. లోక్‌సభ ఎన్నికల తర్వాత, బీజేపీ తన తప్పులను త్వరగా గుర్తించి వాటిని సరిదిద్దుకుంటోందని స్పష్టంగా అర్ధమవుతోంది. మరోవైపు, కాంగ్రెస్ తన తప్పులను గుర్తించడానికి సమయం తీసుకుంటోంది. వాటిని సరిదిద్దడం గురించి చెప్పనవసరం లేదు. ఎస్ఐఆర్‌కి వ్యతిరేకంగా ప్రచారం స్పష్టంగా విఫలమైంది" అని యశ్వంత్ దేశ్‌ముఖ్ అన్నారు.

"రాహుల్ గాంధీ ఎప్పుడు ప్రచారం చేసినా, అది కాంగ్రెస్‌కు ప్రయోజనం చేకూరుస్తుంది. కానీ ఆయన పర్యటన మధ్యలో లేదా ప్రచారం మధ్యలో వస్తే, దాని ప్రభావం ఏమీ ఉండదు. కాంగ్రెస్ ఈ విషయాలను పరిశీలించాలి. ఇది ముఖ్యమైన విషయం" అని ఆయన విశ్లేషించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)