మొంథా తుపాను ఎంత వేగంతో కదులుతోంది... ఎప్పుడు తీరం దాటుతుంది?

మొంథా తుపాను

ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తున్న మొంథా తుపానుపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

మొంథా తుపాను గడిచిన 6 గంటల్లో గంటకు 15 కి.మీ వేగంతో కదిలిందని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

ఇది ప్రస్తుతానికి చెన్నైకి 420కి.మీ, విశాఖపట్నానికి 450 కి.మీ, కాకినాడకు 500 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు.

ఉత్తర-వాయువ్య దిశగా ప్రయాణిస్తూ బుధవారం ఉదయానికి తీవ్ర తుపానుగా బలపడుతుందని వెల్లడించారు.

'బుధవారం సాయంత్రం/రాత్రి సమయంలో మచిలీపట్నం, కాకినాడ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 90-110 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. దీని ప్రభావంతో రేపు కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు, శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అతిభారీ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అకాశం ఉంది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని' ఆయన అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మొంథా

233 మండలాల్లో తుపాను ప్రభావం

మొంథా తుపాను 233 మండలాల్లోని 1419 గ్రామాలు, 44 మున్సిపాలిటీల్లో ప్రభావం చూపే అవకాశం ఉందని, ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే 2194 రిలీఫ్ క్యాంపులు సిద్ధంగా ఉన్నాయన్నారు.

అవసరమైన చోట ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. 3,465 మంది గర్భిణులు, బాలింతలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 558 కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎలాంటి సహయం కోసమైనా కంట్రోల్ రూమ్స్ ని 24/7 సంప్రదించవచ్చన్నారు.

కమ్యూనికేషన్ సిస్టమ్ కోసం 16 శాటిలైట్ ఫోన్లు, 35 డీఎంఆర్ సెట్లు, ఇతర పరికరాలు జిల్లాల్లో అందుబాటులో ఉంచామన్నారు.

ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని భయాందోళనలకు గురికావొద్దని సూచించారు.

సోమవారం రాత్రి 8 గంటలకు విశాఖ రూరల్ 92.5 మిమీ, కాపులుప్పాడలో 85.5 మిమీ, మధురవాడలో 83.5 మిమీ, సీతమ్మధారలో 81.2 మిమీ, మరో 63 ప్రాంతాల్లో 50 మిమీకు పైగా వర్షపాతం నమోదైందన్నారు.

దక్షిణ మధ్య రైల్వే

ఫొటో సోర్స్, Getty Images

67 రైళ్లు రద్దు

ఆంధ్రప్రదేశ్‌లో మొంథా తుపాను దూసుకొస్తున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది.

మంగళవారం, బుధవారం నడవాల్సిన మొత్తం 67 రైళ్లను రద్దు చేసినట్లు ఒక ప్రకటనను విడుదల చేసింది.

రద్దు అయిన రైళ్ల వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

మొంథా
మొంథా

ఫొటో సోర్స్, IMD

ఫొటో క్యాప్షన్, తేదీలవారీగా తుపాను కదలికల అంచనాను చూపే మ్యాప్

ప్రజలు వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఏపీ హోంశాఖా మంత్రి వంగలపూడి అనిత సూచించారు.

పాండిచ్చేరితో పాటు తమిళనాడులోని ఐదు జిల్లాలకు తమిళనాడు వాతావరణ విభాగం ఆరెంజ్ అలర్ట్ చేసింది.

చెంగల్పట్టు, విల్లుపురం, చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

తుపాను కారణంగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)