ఆంధ్రప్రదేశ్‌కు హెచ్చరిక, 12 గంటల్లో తుపానుగా మారనున్న తీవ్ర వాయుగుండం

ఫొటో సోర్స్, IMD
- రచయిత, వద్ది ప్రభాకర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం రానున్న 12 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు వెల్లడించింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఆదివారం (అక్టోబర్ 26) ఉదయం 11:30 గంటలకు ఈ తుపాను, ఏపీలోని విశాఖపట్నం నుంచి ఆగ్నేయంగా 820 కిలోమీటర్లు, పోర్ట్ బ్లెయిర్‌కు పశ్చిమాన 620 కి.మీ., చెన్నైకి తూర్పు-ఆగ్నేయంగా 770 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది.
భారత వాతావరణ శాఖ ప్రకారం, ఈ వాయుగుండం వాయువ్య దిశగా కదులుతూ అక్టోబర్ 28 ఉదయం నాటికి తీవ్ర తుపానుగా మారుతుందని అంచనా. అక్టోబర్ 28 సాయంత్రం లేదా రాత్రికి కాకినాడ సమీపంలో.. మచిలీపట్నం, కళింగపట్నం మధ్య ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉంది. తుపాను తీరం దాటే సమయంలో గాలి వేగం గంటకు 90–100 కి.మీ.లకు చేరుకోవచ్చని.. గంటకు 110 కి.మీ.ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉందని వాతావవరణ శాఖ తెలిపింది.


ఫొటో సోర్స్, IMD
వచ్చే మూడు రోజుల్లో ఏ రోజు ఎలా ఉండనుంది?
ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. సోమవారం (అక్టోబర్ 27) నాటికి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి.
మంగళవారం (అక్టోబర్ 28) వర్షపాతం గరిష్టంగా ఉండనుంది. కొన్నిచోట్ల అతి భారీ నుంచి అసాధారణ స్థాయిలో వర్షపాతం (20 సెం.మీ.కు పైగా) ఉంటుంది.
బుధవారం (అక్టోబర్ 29) నాడు ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర తీరప్రాంతంలో భారీ వర్షాలు కొనసాగుతాయి.
తెలంగాణకూ హెచ్చరిక
తెలంగాణలో సోమవారం కొన్నిచోట్ల భారీ వర్షాలతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.
మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు, బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తుపాను సమీపిస్తున్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని, తీరప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఫొటో సోర్స్, Getty Images
తీరం వెంబడి బలమైన గాలులు
ఆంధ్రప్రదేశ్, యానాం తీరాల వెంబడి ఇప్పటికే బలమైన గాలులు (గంటకు 35–45 కి.మీ నుంచి 55 కి.మీ. వేగంతో) వీస్తున్నాయి.
సోమవారం (అక్టోబర్ 27) ఉదయం నుంచి గాలి వేగం గంటకు 45–55 కి.మీ నుంచి 65 కి.మీ. వరకు పెరుగుతుంది.
మంగళవారం (అక్టోబర్ 28) ఉదయం, గాలుల వేగం గంటకు 60–70 కి.మీ నుంచి 80 కి.మీ.కు చేరుకుని సాయంత్రం నాటికి గంటకు 90–100 కి.మీ. నుంచి 110 కి.మీ వరకు బలపడవచ్చు.
అక్టోబర్ 29 తెల్లవారుజాము వరకు ఇది కొనసాగుతుంది.
అక్టోబర్ 29 మధ్యాహ్నం నుంచి గాలి వేగం క్రమంగా తగ్గుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఆంధ్ర తీరం వెంబడి అక్టోబర్ 27 ఉదయం వరకు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది.
అక్టోబర్ 28 ఉదయం నుంచి పరిస్థితులు మరింత తీవ్రంగా మారి, చాలా అల్లకల్లోలంగా మారతాయి. అక్టోబర్ 28 సాయంత్రం నుంచి అక్టోబర్ 29 ప్రారంభం వరకు చాలా తీవ్రంగా మారుతాయి.
అక్టోబర్ 29 మధ్యాహ్నం నాటికి సముద్రంలో సాధారణ పరిస్థితి ప్రారంభమవుతుంది.
సాధారణ ఆటుపోట్ల కంటే 1 మీటరు ఎత్తులో తుపాను ఉప్పెన వల్ల కోస్తా ప్రాంతంలో ల్యాండ్ ఫాల్ సమయంలో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది.
తుపాను సమయంలో సముద్ర నీటి మట్టం సాధారణ ఆటుపోట్ల కంటే దాదాపు ఒక మీటర్ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. తుపాను తీరాన్ని తాకినప్పుడు ఏపీలోని కోస్తా లోతట్టు తీర ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదముంది.
అక్టోబరు 29 వరకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, యానాం, ఒడిశా తీరాల వెంబడి సముద్రంలోకి వెళ్లవద్దని మత్స్యకారులు సూచించారు. ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు వెంటనే తిరిగి రావాలని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏపీలో ప్రభావితమయ్యే జిల్లాలు
తిరుపతి, నెల్లూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, నంద్యాల, గుంటూరు, కృష్ణా, తూర్పు, పశ్చిమగోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, ఏలూరు, విజయనగరం, పరకాల, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షం, ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, x.com/ncbn
యంత్రాంగం సిద్ధం కండి: సీఎం చంద్రబాబు
మొంథా తుపాను రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపించే ప్రమాదం ఉండటంతో సీఎం చంద్రబాబు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఆదివారం అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
తుపాను సమయంలో ఎక్కడా ఎటువంటి ప్రాణ-ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్ఎంఎస్ అలర్ట్స్, సోషల్ మీడియా, ఐవీఆర్ఎస్ కాల్స్, వాట్సాప్‌ల ద్వారా ప్రజలకు ముందస్తుగా హెచ్చరికలు పంపించాలన్నారు.
విద్యుత్, టెలికాం, తాగునీటి సరఫరా వ్యవస్థకు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. సముద్ర తీర ప్రాంత ప్రజలను తక్షణమే సమీపంలోని తుపాను రక్షణ కేంద్రాలకు తరలించి, పునరావాసం కల్పించాలని సూచించారు. తుపాన్ తీవ్రతను బట్టి విద్యాసంస్థలకు ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవులు ప్రకటించాలన్నారు.
పంటనష్టం వివరాలను స్పష్టంగా తెలుసుకునేలా వ్యవసాయ శాఖ-ఆర్టీజీ వ్యవస్థ సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
ప్రజలను అప్రమత్తం చేయండి: డిప్యూటీ సీఎం
తుపాను నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శనివారం కాకినాడ జిల్లా కలెక్టర్‌తో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
"తుపానుపై ప్రజలను అప్రమత్తం చేయండి. జిల్లావ్యాప్తంగా తీరం వెంబడి ఉన్న గ్రామాల ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు తగిన చర్యలు తీసుకోండి. తుపాను షెల్టర్లలో ఆహారం, ఔషధాలు, పాలు లాంటివన్నీ సమకూర్చి ఉంచండి" అని అధికారులకు పవన్ సూచించారు.
వాతావరణ శాఖ సలహాలు
- తుపాను ప్రభావిత ప్రాంతంలోని మత్స్యకారులు చేపల వేటను నిలిపివేయండి, సముద్రంలోకి వెళ్లవద్దు.
- తీరప్రాంత గుడిసెలలో నివసించే ప్రజలు సురక్షిత ప్రదేశాలకు వెళ్లండి.
- తుపాను సమయంలో ఇంటి లోపల ఉండండి.
- పడవల్లో ప్రయాణించవద్దు; సముద్ర ప్రయాణం సురక్షితం కాదు.
- చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల దగ్గర నిలబడవద్దు.
- పిడుగుపాటు సమయంలో ఎలక్ట్రానిక్ వస్తువులను అన్‌ప్లగ్ చేయండి. నీరు ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండండి.
- పర్యటకం, బహిరంగ కార్యకలాపాలను నివారించాలి. రోడ్డు, విమాన ప్రయాణం పరిమితం చేయండి.
- వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ ఉండండి. అవసరమైతే సురక్షితమైన ప్రదేశానికి వెళ్లడానికి సిద్ధంగా ఉండండి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














