‘ఇన్ఫాంట్ ఫార్ములా’కు సంబంధించి నెస్లే ఎందుకు క్షమాపణలు చెప్పింది? అసలు ఏం జరిగింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శుభ్ రాణా
- హోదా, బీబీసీ కోసం
ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమయ్యే టాక్సిన్ ఉందనే ఆందోళనల కారణంగా నెస్లే ఇటీవల ప్రపంచవ్యాప్తంగా తమ బేబీ ఫార్ములా ఉత్పత్తులను రీకాల్(మార్కెట్ నుంచి వెనక్కి తీసుకోవడం) చేసింది.
ప్రపంచవ్యాప్తంగా అమ్ముడవుతున్న తమ ఎస్ఎమ్ఏ బ్రాండ్‌కు చెందిన కొన్ని బ్యాచ్‌ల ఇన్ఫాంట్ ఫార్ములా, ఫాలో-ఆన్ ఫార్ములా పిల్లలకు తినిపించడం సురక్షితం కాదని నెస్లే తెలిపింది.
వాటిలో సెరులైడ్ అనే టాక్సిన్ ఉండే అవకాశం ఉందని, ఇది వాంతులు, వికారంవంటి సమస్యలకు కారణమవుతుందని తెలిపింది. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సహా వివిధ దేశాలలో ముందుజాగ్రత్తగా ఈ ఉత్పత్తులను ఉపసంహరించుకున్నారు.
నెస్లే సీఈఓ ఫిలిప్ నావ్రాటిల్ ఒక వీడియో విడుదల చేసి క్షమాపణలు తెలిపారు.
'గత వారం మేం కొన్ని బ్యాచ్‌ల ఇన్ఫాంట్ ఫార్ములా ఉత్పత్తులను మార్కెట్ నుంచి వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాం. ఇది పూర్తిగా ముందుజాగ్రత్త చర్యగా చేశాం, ఎందుకంటే మా కొన్ని ఉత్పత్తుల్లో ఉపయోగించిన ఒక పదార్థం నాణ్యతలో సమస్య ఉన్నట్టు మాకు తెలిసింది' అని నెస్లే సీఈఓ ఫిలిప్ నావ్రాటిల్ ఒక వీడియో విడుదల చేసి క్షమాపణలు తెలిపారు.

'వెనక్కి తీసుకున్న ఉత్పత్తుల్లో ఏవీ భారత్‌కు దిగుమతి కాలేదు, అమ్మకానికి కూడా లేవు.
మా ఉత్పత్తులన్నీ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐతోపాటు ఇతర అన్ని నిబంధనలు, చట్టాలకు పూర్తిగా అనుగుణంగానే ఉంటాయి' అని నెస్లే ఇండియా ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది.
భారతదేశంలో బేబీ ఫుడ్, బేబీ ఫార్ములా మార్కెట్ పరిమాణం 2024 నాటికి సుమారు రూ. 54,700 కోట్లుగా అంచనావేసింది మార్కెటింగ్ పరిశోధన సంస్థ ఐఎమ్‌ఏఆర్‌సీ గ్రూప్ పేర్కొంది.
ఈ మార్కెట్‌లో ఫార్ములా మిల్క్ వాటా అత్యధికంగా 54 శాతం ఉంది. ఈ మార్కెట్ పరిమాణం 2033 నాటికి రూ. 84,700 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
అయితే, ఈ సంఘటన తర్వాత, ఫార్ములా మిల్క్ ఎంత సురక్షితమైనవి, అలాగే శిశువులకు ఉత్తమమైన పాలు ఏవి? అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.
ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి బీబీబీ ఆరోగ్య నిపుణులతో మాట్లాడింది.

ఫొటో సోర్స్, Getty Images
పిల్లలకు ఫార్ములా పాలు ఎప్పుడు ఇస్తారు?
6 నెలల వయసు వరకు పిల్లలకు తల్లి పాలు మాత్రమే ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేస్తుంది.
'నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఎన్ఐసీయూ)లో ట్యూబ్ ద్వారా పాలు ఇవ్వాల్సిన శిశువులకు వైద్యులు ఫార్ములా పాలు ఇవ్వవచ్చు, అయితే ఇప్పుడు అనేక ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో హ్యూమన్ మిల్క్ బ్యాంకులు ప్రారంభమయ్యాయి' అని అని డబ్యూహెచ్‌ఓ మాజీ చీఫ్ సైంటిస్ట్, ఎమ్ఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ అంటున్నారు.
చాలామంది ఆరోగ్యవంతమైన తల్లులు తమ అదనపు పాలను మిల్క్ బ్యాంకులకు దానం చేస్తారని డాక్టర్ స్వామినాథన్ వివరించారు. దీనివల్ల ఎన్ఐసీయూలోని పిల్లలకు ఫార్ములా పాలకు బదులుగా తల్లి పాలను అందుతాయి. ఇలాంటి మిల్క్ బ్యాంకులు ప్రారంభించిన ఆసుపత్రుల సమాచారం ప్రకారం, తల్లి పాలు తాగే ఎన్‌ఐసీయూ పిల్లలు ఆసుపత్రిలో ఉండాల్సిన కాలం సుమారు ఒక వారం వరకు తగ్గుతుంది.
అయితే, కొన్ని సందర్భాల్లో తల్లులు తమ పిల్లలకు పాలివ్వలేని పరిస్థితులు కూడా ఏర్పడుతుంటాయి.
'సాధారణంగా ఫార్ములా పాలు మూడు సందర్భాలలో ఇస్తారు. మొదటిది, తల్లి పాలు పిల్లలకు సరిపోనప్పుడు. రెండవ సందర్భం.. తల్లిదండ్రులు ఇద్దరూ పని చేస్తున్నప్పుడు, వారికి తగినంత సమయం లేనప్పుడు, వారు వారి సౌలభ్యం ప్రకారం ఫార్ములా పాలను ఇస్తారు. ఇక కొన్ని అరుదైన సందర్భాల్లో వైద్యులే ఫార్ములా మిల్క్ ఇవ్వాలని సూచిస్తారు' అని దిల్లీలోని సీతారాం భారతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్, పీడియాట్రిక్స్ విభాగం అధిపతి, డిప్యూటీ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ జితేంద్ర నాగ్‌పాల్ వివరించారు.
'తల్లి పాలను 'లిక్విడ్ గోల్డ్' అని కూడా పిలుస్తారు. మనం ఎంత ప్రయత్నించినా ఫార్ములా మిల్క్‌లో కలపలేని అనేక ముఖ్యమైన పోషకాలు ఇందులో ఉంటాయి. ఉదాహరణకు పిల్లల పోషణ, అభివృద్ధిపై లోతైన ప్రభావాన్ని చూపే డిఫెన్స్ సెల్స్ (రోగ నిరోధక కణాలు)వంటివి' అని డాక్టర్ నాగ్‌పాల్ తెలిపారు.
అయితే, ఆవు, గేదెపాలతో పోలిస్తే ఫార్ములా మిల్క్ కొంత మెరుగ్గా కనిపిస్తుందని ఆయన చెబుతున్నారు.
అయితే, ఫార్ములా మిల్క్‌లో పిల్లల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా జోడించిన అనేక మైక్రోన్యూట్రియంట్లు ఉంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
తేడా ఏంటి?
'పిల్లలకు తల్లిపాలు ఇవ్వడానికి బదులుగా బాటిల్‌తో ఫార్ములా పాలు ఇస్తున్నప్పుడు ఆ బాటిల్ సరిగా శుభ్రం చేయకపోతే, అందులో క్రిములు చెరే ప్రమాదం ఉంది. దీంతో పిల్లలు విరేచనాలు, ఇతర వ్యాధులతో బాధపడవచ్చు, ఇది పోషకాహార లోపానికి దారితీస్తుంది' అని డాక్టర్ స్వామినాథన్ అంటున్నారు.
'కొన్ని సందర్భాల్లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఫార్ములా మిల్క్‌లో అవసరానికి మించి నీరు కలిపి పిల్లలకు ఇస్తారు. దీని వల్ల పిల్లలకు సరిపడా పోషకాహారం అందదు' అన్నారు.
'పిల్లలకు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు తల్లి శరీరం సహజంగానే అటువంటి యాంటీబాడీలను తయారు చేస్తుంది. అవి పాల ద్వారా పిల్లల శరీరానికి చేరతాయి. అయితే ఫార్ములా మిల్క్ తాగే పిల్లల్లో మలబద్దకం సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఇలాంటి పిల్లల బరువు వేగంగా పెరుగుతుంది. దీని వల్ల భవిష్యత్తులో ఊబకాయం వచ్చే ప్రమాదం పెరుగుతుంది' అని తెలిపారు.
'మొదటి ఆరు నెలలు ప్రత్యేకంగా తల్లిపాలు తాగని పిల్లలు విరేచనాలు లేదా న్యుమోనియాతో చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇంకా, తల్లిపాలు ఇవ్వడం వల్ల శిశువు రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఊబకాయం, మధుమేహం వంటి జీవితకాల వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు' అని యూనిసెఫ్ తెలిపింది.
అయినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా 0 నుంచి 5 నెలల వయసు గల శిశువులలో సగం కంటే తక్కువ (కేవలం 47 శాతం) మందికే మొదటి ఆరు నెలలు తల్లిపాలు ఇస్తున్నారు. (ఈ డేటా యూనిసెఫ్ నుంచి తీసుకున్నాం)
తల్లిపాలు ఇవ్వడం, ఫార్ములా ఫీడింగ్ తల్లుల శారీరక, మానసిక ఆరోగ్యంపై చూపే ప్రభావం గురించి డాక్టర్ స్వామినాథన్ మాట్లాడుతూ, 'పాలిచ్చే తల్లులు తమ పిల్లలతో వినూత్న బంధాన్ని ఏర్పరుస్తారు, ఎందుకంటే స్కిన్-టు-స్కిన్ (చర్మానికి చర్మం స్పర్శ) సంబంధం ఏర్పడుతుంది. ఇది పిల్లలకు ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది. పిల్లల ముఖం తల్లి ముఖానికి సరైన దూరంలో ఉండడం వల్ల, వారు తల్లిని సులభంగా చూడగలుగుతారు, గుర్తించగలుగుతారు. కానీ తల్లికి పూర్తి మద్దతు ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. శిశువుకు అవసరమైన విధంగా ఆహారం ఇవ్వాలి, కాబట్టి తల్లి అన్ని సమయాల్లో అందుబాటులో ఉండాలి ' అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'మొదటి టీకా'
తల్లిపాలు ఇవ్వడం ఆహ్లాదకరమైన అనుభవంగా మారాలంటే, తల్లికి కావలసింది పూర్తి విశ్రాంతి, సంతులిత ఆహారం, ఇంటి పనుల్లో సహాయం, పనిచేసే మహిళలకు వేతనంతో సెలవులు లేదా అసంఘటిత రంగంలో పనిచేసే మహిళలైతే ప్రభుత్వ మాతృత్వ లాభాలు, కుటుంబ సభ్యుల మద్దతు.
'ఫార్ములా మిల్క్ వాడే తల్లులను నిందించకూడదు . లేదా వారిలో అపరాధ భావన కలిగించకూడదు. చాలాసార్లు వారు ఇలా చేయడానికి కారణం పాలివ్వడానికి తగినంత సమయం ఉండకపోవడమే' అని స్వామినాథన్ చెప్పారు.
'పాలివ్వడం తల్లికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. తల్లి పాలివ్వడంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది, ఇది భావోద్వేగ బంధాన్ని పెంచుతుంది. ప్రసవానంతర నిరాశ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది తల్లి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది' అని డాక్టర్ మిట్టల్ వివరించారు.
తల్లి పాలతో బిడ్డకు, తల్లికి ఇద్దరికీ ప్రయోజనాలను కలిగి ఉంటాయి.
శిశువు అవసరాలకు అనుగుణంగా తల్లి పాలు మారుతాయని డాక్టర్ స్వామినాథన్ అంటున్నారు.
తల్లి శరీరం శిశువు పోషక అవసరాల ఆధారంగా పాల పరిమాణం, నాణ్యతను సర్దుబాటు చేస్తుంది.
పుట్టిన వెంటనే ఉత్పత్తి అయ్యే మొదటి పాలను కొలొస్ట్రమ్ అంటారు. ఇది అధిక పోషకాలను కలిగి ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచే పదార్థాలతో నిండి ఉంటుంది, కాబట్టి దీనిని శిశువుకు "మొదటి టీకా" అని పిలుస్తారు. ఇది జీర్ణం కావడం కూడా సులభం.
దీర్ఘకాలిక ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉండే కొత్త బయోయాక్టివ్ సమ్మేళనాలు కూడా ఇందులో ఉన్నాయని పరిశోధనలో తేలింది.
ఫార్ములా పాలలో ఈ బయోయాక్టివ్, రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు లేవు, అందుకే ఫార్ములా పాలు తాగిన పిల్లలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

బిడ్డకు, తల్లికి ఇద్దరికీ ప్రయోజనకరం
'బిడ్డలకు పాలివ్వడం తల్లులు బరువు తగ్గడంలో సాయపడతుందని, గర్భధారణ తర్వాత వేగంగా కోలుకుంటారని త్వరగా గర్భాశయం సాధారణ స్థితికి చేరుకుంటుందని, తల్లిపాలు తాగే పిల్లలకు తెలివితేటలు మెరుగ్గా ఉంటాయి. వారి రోగనిరోధక శక్తి కూడా చాలా బాగుంటుంది' అని డాక్టర్ నాగ్‌పాల్ వివరించారు.
'ప్రెగ్నెన్సీ నిర్ధరణ అయిన వెంటనే తల్లిదండ్రులకు తల్లిపాలు ఇవ్వడానికి సంబంధించిన కౌన్సెలింగ్ మొదలు పెట్టాలి. మొత్తం కుటుంబం ఇందులో భాగంకావాలి. ముఖ్యంగా తల్లికి మద్దతు ఇవ్వడంపై దృష్టి పెట్టాలి' అని డాక్టర్ స్వామినాథన్ అంటున్నారు.
చనుమొనల్లో పగుళ్లు లేదా నొప్పి రాకుండా ఉండటానికి తల్లికి సరైన స్థానం, ఆహారం ఇచ్చే పద్ధతిని నేర్పించాలి. బిడ్డ అదనపు ఆహారం ఇవ్వడం ప్రారంభించిన తర్వాత కూడా కౌన్సెలింగ్, మద్దతు కొనసాగించాలి, దీని వల్ల సమస్యలను త్వరగా పరిష్కరించవచ్చు' అని స్వామినాథన్ వివరించారు.
'తల్లిపాలు ఇవ్వడం మొదట్లో కష్టంగా అనిపించవచ్చు, కానీ ఆపొద్దు' అని డాక్టర్ నాగ్‌పాల్ సూచిస్తున్నారు.
'మీ బిడ్డ నిద్ర, మేల్కొనే సమయాలకనుగుణంగా మీ దినచర్యను మార్చుకోండి. ఫార్ములా మిల్క్ ప్రత్యామ్నాయం కాదని గుర్తుపెట్టుకోండి. వైద్యులు ఫార్ములా పాలను సూచిస్తే తప్పితే తల్లి పాలను ఇవ్వడం ఆపకూడదు. గడియారం చూసి కాకుండా, బిడ్డల ఆకలి చూసి పాలివ్వండి. దీనివల్ల మీ ఆందోళన తగ్గడంతోపాటు బిడ్డకు పోషకాహారం లభిస్తుంది' అని నాగ్‌పాల్ చెప్పారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













