మదురై ఎల్ఐ‌సీ కార్యాలయంలో మహిళా మేనేజర్ మంటల్లో చిక్కుకుని చనిపోవడానికి కారణమేంటి? చివరి ఫోన్ కాల్ ఆధారంగా పోలీసులు ఏం చేశారు?

కళ్యాణి నంబి, ఎల్ఐసీ బ్రాంచ్ మేనేజర్

ఫొటో సోర్స్, FACEBOOK

ఫొటో క్యాప్షన్, కళ్యాణి నంబి
    • రచయిత, విజయానంద్ అరుముగం
    • హోదా, బీబీసీ ప్రతినిధి

(గమనిక: కలచివేసే అంశాలున్నాయి)

"మా అమ్మ ఎల్ఐసీలో 30 సంవత్సరాలకు పైగా పనిచేశారు. ఆమెకు ఇచ్చిన ఏ బాధ్యతనైనా అంకితభావంతో పూర్తి చేసేవారు. ఆమె కుటుంబానికి వెన్నెముక లాంటిది. ఆమెను ఇలా చేస్తారని ఊహించలేదు" అని లక్ష్మీ నారాయణన్ అన్నారు.

మధురైలో ఎల్ఐసీ బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేసిన ఆయన తల్లి కళ్యాణి నంబి డిసెంబర్ 17న హత్యకు గురయ్యారు.

ఈ కేసులో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

ఇంతకీ అక్కడ ఏం జరిగింది?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అదే చివరి కాల్

డిసెంబర్ 17 రాత్రి మధురై ఎల్ఐసీ బ్రాంచ్ ఆఫీసులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బ్రాంచ్ మేనేజర్ కళ్యాణి నంబి మరణించారు. అదే ఆఫీసులో పనిచేస్తున్న అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రామ్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరిపారు.

గాయాలపాలైన రామ్‌ కొన్నిరోజులుగా మధురైలోని రాజాజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఘటన జరిగిన దాదాపు 30 రోజుల తర్వాత మహిళా మేనేజర్‌కు నిప్పంటించిన కేసులో రామ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

"ఆ రాత్రి 8.27 గంటలకు మా అమ్మ నుంచి నాకు కాల్ వచ్చింది. ఆమె భయంతో, 'పోలీసులకు ఫోన్ చేయి, పోలీసులకు ఫోన్ చేయి' అన్నారని ఆమె కుమారుడు లక్ష్మీ నారాయణన్ చెప్పారు.

"పోలీసులు అరెస్టు చేసిన వ్యక్తితో నా తల్లికి గొడవలున్నాయి. ఆయనపై ఇప్పటికే ఫిర్యాదులున్నాయి. కానీ, అది నా తల్లి ప్రాణం తీసేంత దూరం వెళుతుందని అనుకోలేదు" అని లక్ష్మీ నారాయణన్ బీబీసీతో అన్నారు.

ఆఫీసులు మంటలు ఎలా చెలరేగి ఉంటాయనే విషయంపై పోలీసులు విచారణలో కొత్త విషయాలు తెలిశాయి. ఆఫీసులో ఎటువంటి షార్ట్ సర్క్యూట్ జరగలేదని, రిఫ్రిజిరేటర్, విద్యుత్ వైరింగ్‌లో ఎటువంటి సమస్యా లేదని దర్యాప్తులో తేలినట్లు పోలీసులు చెప్పారని ఆయన అన్నారు.

మధురై ఎల్ఐసీ కార్యాలయం

ఫొటో సోర్స్, FACEBOOK

ఫొటో క్యాప్షన్, డిసెంబర్ 17 రాత్రి మధురై ఎల్ఐసీ బ్రాంచ్ ఆఫీసులో మంటలు అంటుకున్నాయి.

డిసెంబర్ 17న ఏం జరిగింది?

కల్యాణి నంబి కుమారుడు దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా, తిలకర్ తిడల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

"పోలీసులకు ఫోన్ చేయమని కల్యాణి నంబి చెప్పారు. అగ్నిప్రమాదం జరిగి ఉంటే, ఆమె ఇలా ఫోన్ చేసి ఉండేవారు కాదు. మేం దానిపై దృష్టి పెట్టాం" అని తిలగర్ తిడల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ అళగర్ అన్నారు.

కేసు దర్యాప్తులో లభించిన సమాచారాన్ని ఈ పోలీసు అధికారి బీబీసీతో పంచుకున్నారు.

"కార్యాలయంలోని సీసీటీవీ ఫుటేజ్, అక్కడ దొరికిన వస్తువులు, ఉద్యోగుల వాంగ్మూలాలు కీలకంగా ఉన్నాయి. ముఖ్యంగా సంఘటన జరిగిన రోజు కార్యాలయంలో ముగ్గురు మాత్రమే ఉన్నారు" అని ఇన్‌స్పెక్టర్ అళగర్ చెప్పారు.

ఆ సమయంలో కల్యాణి నంబి, శంకర్, రామ్ మాత్రమే ఆఫీసులో ఉన్నారని ఆయన చెప్పారు.

"శంకర్ ఎనిమిది గంటల ప్రాంతంలో తన పని అయిపోయిందని చెప్పి వెళ్లిపోయారు. ఆ తర్వాత కల్యాణి, రామ్ మాత్రమే ఉన్నారు" అన్నారు.

‘‘దర్యాప్తులో శంకర్ ఈ విషయాన్ని ధృవీకరించారని’’ ఇన్‌స్పెక్టర్ అళగర్ చెప్పారు.

మధురై ఎల్ఐసీ భవనంలో నైట్ గార్డులు కూడా ఉన్నారు.

"వారు లేకుండా కల్యాణి నంబి ఉండేపై అంతస్తుకు ఎవరూ వెళ్లలేరు" అని ఇన్‌స్పెక్టర్ అన్నారు.

"వెనుకవైపు అత్యవసర ద్వారం ఉంది. కానీ, దాని ద్వారా కూడా ఎవరూ ప్రవేశించలేరు" అన్నారు.

‘‘సంఘటన జరిగిన రోజున రామ్ ముందు గేటుకు తాళం వేసి వెనుక తలుపు ద్వారా బయటకు వచ్చినట్లు భద్రతా సిబ్బంది గమనించారని’’ ఇన్‌స్పెక్టర్ అళగర్ చెప్పారు.

"రామ్ కాలికి గాయమైంది. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నప్పుడు, ఆయన తప్ప మరెవరూ అక్కడ లేరు. గాయం కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందారు" అని చెప్పారు.

మధురై ఎల్ఐసీ కార్యాలయం, కళ్యాణి నంబి హత్య

ఫొటో సోర్స్, FACEBOOK

కేసు నేపథ్యం ఏమిటి?

"కల్యాణి నంబి తన పనిలో చాలా కఠినంగా ఉంటారు. బీమా తీసుకొని మరణించిన వారిలో దాదాపు 40 కుటుంబాలు రామ్‌కు క్లెయిమ్ దరఖాస్తులను సమర్పించాయి" అని అళగర్ చెప్పారు.

ఈ దరఖాస్తులను కంప్యూటర్‌లోకి అప్‌లోడ్ చేయడం, పత్రాలను తనిఖీ చేయడం, చివరకు కళ్యాణి నంబి నుంచి సంతకం పొందడం రామ్ బాధ్యత అన్నారు అళగర్.

"ఈ క్లెయిమ్ దరఖాస్తులను ముందుకు తీసుకెళ్లడంలో రామ్ అలసత్వం ప్రదర్శించారు. దీంతో, బీమా చేసిన వారి బంధువులు కళ్యాణి నంబికి చెప్పారు" అని పోలీస్ ఇన్‌స్పెక్టర్ అళగర్ అన్నారు.

ఈ నేపథ్యంలో రామ్‌ను కళ్యాణి నంబి చాలాసార్లు ప్రశ్నించారని, దీంతో రామ్ ఓవర్ టైం చేయాల్సి వచ్చిందని చెప్పారు అళగర్.

మధురై ఎల్ఐసీ కార్యాలయం, కళ్యాణి నంబి హత్య

ఫొటో సోర్స్, FACEBOOK

"గత సంవత్సరం మే నెలలో, కళ్యాణి నంబి ఉద్యోగంలో ఇక్కడికి వచ్చే వరకు సాయంత్రం 7గంటలకు ముందే ఇంటికి బయలుదేరడం రామ్‌కు అలవాటు". కళ్యాణి నంబి ఆఫీసుకు వచ్చిన తర్వాత రాత్రి 9 వరకు పని చేయాల్సి వచ్చిందని రామ్ వాంగ్మూలం ఇచ్చారని అళగర్ చెప్పారు.

"ఎటువంటి విచారణ లేకుండా క్లెయిమ్స్ పక్కన పెట్టడంపై రామ్‌ను కళ్యాణి నంబి ప్రశ్నించారు. దీనివల్ల కలిగిన మానసిక క్షోభ కారణంగానే ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు రామ్ దర్యాప్తులో చెప్పారు" అని ఇన్‌స్పెక్టర్ అళగర్ అన్నారు.

"సంఘటనా ప్రాంతంలో పోలీసులు కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వారు కచ్చితమైన ఆధారాల కోసం చూస్తున్నారు. దర్యాప్తు ఆధారంగా రామ్‌ను అరెస్టు చేశారు" అని ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ జి. ఆనంద్ చెప్పారు.

జి. ఆనంద్

ఫొటో సోర్స్, FACEBOOK

ఫొటో క్యాప్షన్, ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ జి. ఆనంద్

'ఆర్థిక మోసం లేదు'

"రామ్‌కు ఒక కంటిలో దృష్టి లోపం ఉంది. దీని కారణంగా, ఆయన పని చేయడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు" అని అళగర్ చెప్పారు.

"సంఘటన జరిగిన రోజు రామ్ తెచ్చిన పెట్రోల్ డబ్బాను స్వాధీనం చేసుకున్నాం. ఆయన పెట్రోల్ కొనుగోలు చేసిన స్థలం వివరాలతో సహా అన్ని ఆధారాలు సేకరించాం" అన్నారు.

"డిసెంబర్ 17న కళ్యాణి నంబి గదికి నిప్పంటించినట్లు సీసీటీవి ఫుటేజ్ లేదు" అన్నారాయన.

"ఆమె మంటల్లో కాలిపోయారు. ఈ కేసులో ఎటువంటి ఆర్థిక మోసం జరగలేదు" అన్నారు ఇన్‌స్పెక్టర్ అళగర్

ఈ ఘటనలో పోలీసులు రామ్‌పై హత్య కేసు నమోదు చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)