సునీతా విలియమ్స్, విల్‌మోర్‌ను భూమిపైకి తీసుకొచ్చేందుకు వెళ్లిన స్పేస్‌ఎక్స్ రాకెట్, అంతరిక్షం నుంచి వాళ్లొచ్చేది ఎప్పుడు?

ఫొటో సోర్స్, NASA
అంతరిక్ష కేంద్రంలో ఉండిపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్‌విల్‌మోర్‌లను భూమిపైకి తీసుకువచ్చేందుకు స్పేస్ ఎక్స్ కొత్త వ్యోమగాములతో ఓ రాకెట్‌ను ప్రయోగించింది.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కేవలం 8రోజులపాటు మాత్రమే ఉండటానికి వెళ్లిన సునీత, విల్‌మోర్‌లు భూమికి తిరిగి రావాల్సిన నౌకలో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా 9 నెలలకుపైగా అక్కడే ఉండిపోయారు.
కొత్త వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న రెండురోజుల తరువాత సునీత, విల్‌మోర్‌లు భూమిపైకి తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తారని నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ మేనేజర్ స్టీవ్ స్టిచ్ చెప్పారు.
''బుచ్, సునీ ఎంతో కష్టపడి పనిచేశారు. వారిని వెనక్కు తీసుకువచ్చేందుకు మేం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం'' అని ఆయన చెప్పారు.


ఫొటో సోర్స్, NASA
‘వాతావరణం అనుకూలించాలి’
సునీత, విల్‌మోర్‌లతోపాటు వారి ఐఎస్ఎస్ సహోద్యోగులైన నాసాకు చెందిన నిక్ హేగ్, రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ రాస్‌కాస్మోస్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్‌లను కొత్తగా ఇక్కడి నుంచి వెళుతున్న నలుగురు వ్యోమగాములు (రష్యా, జపాన్‌ల నుంచి ఒకొక్కరు, అమెరికా నుంచి ఇద్దరు) రిలీవ్ చేస్తారు.
ఈ కొత్త వ్యోమగాములకు అక్కడి బాధ్యతల అప్పగింత కార్యక్రమం పూర్తవడానికి 2రోజుల సమయం పడుతుంది. తరువాత వారు భూమికి పయనమవుతారు. కానీ రిటర్నింగ్ క్యాప్సుల్ సురక్షితంగా వచ్చేందుకు భూమిపై పరిస్థితులు అనుకూలంగా ఉండేవరకు వారు వేచి ఉండాల్సి రావచ్చని, దీనివల్ల వారి రాక ఆలస్యం కావచ్చని ఐఎస్ఎస్ ప్రోగ్రామ్ మేనేజర్ డానా వీగెల్ చెప్పారు.
''వాతావరణం ఎప్పుడూ అనుకూలంగా ఉండాలి. ఒకవేళ అనుకూలించకపోతే మరింత సమయం తీసుకుంటాం'' అని ఆమె విలేఖరులకు చెప్పారు.
కిందటి వారం నుంచే అంతరిక్ష కేంద్రంలోని వ్యోమగాములు, అక్కడి బాధ్యతల అప్పగింత కార్యక్రమానికి సిద్ధమయ్యారని వీగెల్ వివరించారు.
''సునీత మరో వ్యోమగామి అలెక్సీ ఓవ్‌చిన్‌కు బాధ్యతలు అప్పగించగా, దానికి గుర్తుగా బుచ్ ఒక గంటను మోగించారు'' అని వీగెల్ చెప్పారు.

ఫొటో సోర్స్, NASA
‘సంతోష స్థావరమేనా?’
తాము అంతరిక్షకేంద్రంలో ఉండటం సంతోషం కలిగిస్తోందని సునీత, విల్‌మోర్ తరచూ చెబుతున్నారు. వారిద్దరూ దానిని 'సంతోష స్థావరం'గానూ ఎప్పడూ వర్ణిస్తుంటారు. కానీ అది వారి జీవితాన్ని పణంగా పెట్టడమేనంటారు ఓపెన్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ సైమన్ బార్బర్.
''ఓ వారం రోజులు పట్టాల్సిన పనిపై మిమ్మల్ని పంపితే, ఆ పని మీ జీవితంలో ఓ ఏడాదిని లాక్కుంటుందని మీరు కలగనగలరా? ఇలా దీర్ఘకాలం అంతరిక్షంలో ఉండటం వల్ల ఫ్యామిలీ లైఫ్‌ను మిస్సవుతారు. ఇంటికి తిరిగి వచ్చిన తరువాత వాళ్లు సాధారణ జీవితం గడిపేందుకు సమయం పడుతుంది'' అన్నారు సైమన్.
స్పేస్ ఎక్స్ ప్రత్యర్థి అయిన ఏరోస్పేస్ సంస్థ బోయింగ్ నిర్మించిన స్టార్‌లైనర్ అనే ప్రయోగాత్మక వ్యోమనౌకను పరీక్షించేందుకు బుచ్, సునీత 2024 జూన్ మొదట్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు.
వ్యోమనౌక అభివృద్ధిలో సాంకేతిక సమస్యలు, దాని ప్రయోగం, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి అనుసంధానించడంలో సమస్యల కారణంగా ఈ కార్యక్రమం ఏళ్లతరబడి ఆలస్యమైంది. ఈ నౌక భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించే సమయంలో వేగం తగ్గడానికి అవసరమైన కొన్ని థ్రస్టర్లలో సమస్యలు, ప్రొపల్షన్ వ్యవస్థలో హీలియం వాయువు లీకవడం తదితర సమస్యలు కూడా తలెత్తాయి.

ఫొటో సోర్స్, NASA
‘‘బోయింగ్‌కు ఇబ్బందే’’
సునీత, విల్‌మోర్‌లను స్టార్‌లైనర్‌లో తీసుకువచ్చే విషయంలో చిన్నపాటి రిస్కు కూడా చేయకూడదని నాసా నిర్ణయించుకుంది. దీనికి బదులుగా స్సేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సుల్స్‌ను సేఫ్ ఆప్షన్‌గా భావించింది. దీంతోపాటు సునీత, విల్‌మోర్‌లు ఎక్కువకాలం అంతరిక్ష కేంద్రంలో ఉన్నా, వారిని వ్యోమగాముల రొటేషన్ సమయంలోనే తీసుకురావాలని నిర్ణయించుకుంది.
అయితే బుచ్, సునీతలను సురక్షితంగా తిరిగి తీసుకువచ్చే సామర్థ్యం తమకు ఉందని బోయింగ్ వాదిస్తోంది. తమ ప్రత్యర్థి కంపెనీ స్టార్‌లైనర్‌లో వారిని తీసుకురావడంపై ఆ కంపెనీ అసంతృప్తిగా ఉంది. ఇది బోయింగ్‌కు ''ఇబ్బందిగా'' అనిపిస్తోందని డాక్టర్ బార్బర్ అభిప్రాయపడ్డారు.
''తాము అంతరిక్షంలోకి తీసుకువెళ్లిన వ్యోమగాములు తమ ప్రత్యర్థి నౌకలో తిరిగి రావడం బోయింగ్‌కు అంత మంచిది కాదు' అన్నారు బార్బర్.

ఫొటో సోర్స్, Getty Images
ట్రంప్ ఏమన్నారు?
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్‌లు ఫాక్స్ న్యూస్‌కు ఫిబ్రవరిలో ఇచ్చిన ఇంటర్వ్యూలో బుచ్, సునీతలను త్వరలోనే భూమి మీదకు తీసుకువస్తామని అన్నారు. ‘వాళ్లని అక్కడ వదిలేశారు’ అని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
వీరిని ఇంటర్వ్యూ చేసిన సీన్ హానిటీ ''వాళ్లు అక్కడ 8 రోజులు ఉండేందుకు వెళ్లారు. కానీ 300 రోజులకుపైగా అక్కడే ఉన్నారు'' అని అనగా, దీనికి ట్రంప్ 'బైడెన్' అని ఏకవాక్య సమాధానమిచ్చారు. ''వారిని రాజకీయ కారణాలతో అక్కడ వదిలేశారు'' అని మస్క్ వ్యాఖ్యానించారు.
అయితే ఈ వాదనను నాసాకు చెందిన స్టీవ్ స్టిచ్ ఖండించారు. సునీత, విల్‌మోర్‌లను వెనక్కు తీసుకురావడంపై స్పేస్ ఎక్స్‌తో కలిసి వీలైనన్ని అవకాశాలను పరిగణనలోకి తీసుకున్నామని, అన్నీ బేరీజు వేసుకున్నాకే సిబ్బంది మార్పిడి సమయంలోనే వారిని వెనక్కు తీసుకురావాలని నిర్ణయించామని చెప్పారు.
నాసా నిర్ణయాన్ని లండన్‌లోని సైన్స్ మ్యూజియంలో స్పేస్ హెడ్, ఐఎస్ఎస్ కోసం యూరప్ కంట్రోల్ సెంటర్‌లో పనిచేసిన డాక్టర్ లిబ్బి జాక్సన్ సమర్థించారు.
అందరి మనసుల్లో బుచ్, సునీల క్షేమమే మెదులుతుంటుందని, ఈ విషయంలో నాసా సరైన నిర్ణయం తీసుకుందని, బుచ్, సునీతల భద్రతకు ఇది అవసరమని జాక్సన్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














