ఛత్తీస్‌గఢ్: ఆవు పేడ సేకరణకు కొత్త పథకం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి భూపేష్ - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
ఛత్తీస్‌గఢ్‌లో రైతుల నుంచి ఆవు పేడ సేకరణకు గోధన్ న్యా యోజన పేరిట ఓ కొత్త పథకాన్ని సీఎం భూపేష్ బాగేల్ ప్రకటించారని ‘ఆంధ్రజ్యోతి’ ఒక కథనంలో పేర్కొంది.
ఆ కథనం ప్రకారం.. రోడ్లపై ఆవుల సంచారాన్ని నిరోధించడంతోపాటు పశుసంవర్ధకశాఖను లాభాల దిశగా మళ్లించి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఈ వినూత్న పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు సీఎం చెప్పారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా రైతులకు ఆర్థిక ప్రయోజనాల కల్పించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు.
రైతుల నుంచి ఆవు పేడను సేకరించేందుకు ధరను నిర్ణయించేందుకు వ్యవసాయ శాఖ, జలవనరుల శాఖ మంత్రి రవీంద్ర చౌబే అధ్యక్షతన ఐదుగురు సభ్యులతో కేబినెట్ సబ్ కమిటీని నియమిస్తున్నట్లు సీఎం చెప్పారు. రైతులు, గోశాల నిర్వాహకుల అభిప్రాయాలు తీసుకొని ఆవు పేడకు ధర నిర్ణయిస్తామని సీఎం పేర్కొన్నారు.
ఆవు పేడ సేకరణకు ధరను హరేలీ ఫెస్టివల్‌లో ప్రకటిస్తామని, ఈ పథకం వల్ల ఆవులను వీధుల్లోకి వదిలివేయరని సీఎం వ్యాఖ్యానించారు. పట్టణాభివృద్ధి శాఖ అధికారులు ఆవు పేడను సేకరించి వర్మికంపోస్టు ఉత్పత్తి చేయాలని సూచించారు.
వర్మీకంపోస్టు ఎరువును సహకార సంఘాల ద్వారా అటవీ, వ్యవసాయ, ఉద్యానవన, పట్టణాభివృద్ధి శాఖల ప్లాంటేషన్ కార్యక్రమాలకు, రైతులకు విక్రయించేలా చర్యలు తీసుకుంటామని సీఎం వివరించారు.

ముంబైలో మైనర్ బాలికకు ముద్దు.. ఐదేళ్ల జైలు
మైనర్ బాలికను ముద్దు పెట్టుకున్న కేసులో ఓ వ్యక్తికి కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించిందని ‘సాక్షి’ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో బుధవారం చోటుచేసుకుంది.
మహారాష్ట్ర, ముంబైకి చెందిన అబు అబ్దుల్ రెహ్మాన్ అనే 30 ఏళ్ల వ్యక్తి 2018 జూన్ 29న అదే ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలికను ముద్దు పెట్టుకున్నాడు. దీంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం అతడ్ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.
బుధవారం ఈ కేసుకు సంబంధించిన తుది తీర్పును ముంబై స్థానిక కోర్టు వెలువరించింది. మైనర్ బాలిక తనను ముద్దు పెట్టుకుంది అతనే అంటూ కోర్టులో అబ్దుల్‌ను గుర్తు పట్టింది. దీంతో అతడ్ని దోషిగా తేల్చిన కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. బాలిక కుటుంబానికి ఐదు వేల రూపాయల పరిహారం అందించాలని తీర్పునిచ్చింది.

ఫొటో సోర్స్, Twitter/UGC
నెహ్రూ జూపార్కులో తెల్ల పులి కిరణ్ మృతి.. దాని తండ్రి, తాత కూడా అదే వ్యాధికి బలి
హైదరాబాద్‌లోని జవహర్‌ల్ నెహ్రూ జువాలజికల్ పార్కులో తెల్ల రంగు రాయల్ బెంగాల్ టైగర్ కిరణ్ మృతిచెందిందని ‘నమస్తే తెలంగాణ’ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. ఎనిమిదేండ్ల వయసున్న పులి కిరణ్ కుడి దవడ భాగంలో ఏర్పడిన నియోప్లాస్టిక్ కణితి కారణంగా అనారోగ్యం పాలైందని, గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతూ ఇప్పుడు మరణించిందని జూ అధికారులు తెలిపారు.
కిరణ్ నెహ్రూ జూలోనే పుట్టి పెరిగిందని వారు వెల్లడించారు. గత నెల 29న పరీక్షలు చేయగా కిరణ్ కుడి దవడలో కణితి ఉన్న విషయం బయటపడిందని చెప్పారు. అప్పటి నుంచి వైద్యులు పులికి చికిత్స అందిస్తున్నారని తెలిపారు.
మృతి చెందిన పులికి వెటర్నరీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. కిరణ్ తండ్రి బద్రి కూడా నియో ప్లాస్టిక్ కణితితోనే బాధపడుతూ కొన్నేళ్ల క్రితం మృతి చెందింది. కిరణ్ తాత రుద్ర 12 ఏండ్ల వయసులో ఇదే వ్యాధితో మృతి చెందింది.
ఇప్పుడు కిరణ్ కూడా అదే వ్యాధితో మృతి చెందడంతో వైద్యులు శాంపిళ్లు సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా, జూపార్కుకే వన్నెతెచ్చే రాయల్ బెంగాల్ టైగర్లు ఒకేరకమైన ట్యూమర్ వ్యాధితో మృతిచెందుతుండటం ఆందోళనకు గురి చేస్తోందని అధికారులు పేర్కొన్నారు.

ఆగస్టు 12 వరకు రైళ్ల రద్దు పొడిగింపు
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ రైల్వే శాఖ మరోసారి కీలక నిర్ణయం తీసుకుందని.. టైం టేబుల్ ఆధారిత అన్ని రెగ్యులర్ ప్రయాణికుల రైలు సర్వీసులను (మెయిల్/ ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్, సబర్బన్ రైళ్లు) ఆగస్టు 12 వరకు రద్దు చేస్తున్నట్టు ప్రకటించిందని 'ఈనాడు' ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. తాజా నిర్ణయంతో జులై 1 నుంచి ఆగస్టు 12 మధ్య చేసుకున్న అన్ని టిక్కెట్లు రద్దవుతాయని రైల్వే బోర్డు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
కరోనా కట్టడికి మార్చిలో విధించిన లాక్‌డౌన్ నిర్ణయంతో అన్ని రెగ్యులర్ ప్యాసింజర్ రైలు సర్వీసులను రైల్వే శాఖ రద్దు చేసిన విషయం తెలిసిందే. తదుపరి నోటీసు జారీ చేసే వరకు ఈ నిర్ణయం కొనసాగుతుందని అప్పట్లో తెలిపింది. ఆ తర్వాత దాన్ని మే 3 వరకు పొడిగించింది. అప్పటికీ కరోనా మహమ్మారి అదుపులోకి రాకపోవడంతో రైళ్ల రద్దును జూన్ 30 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. తాజాగా దేశంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్న వేళ మరోసారి రెగ్యులర్ ప్యాసింజర్ రైలు సర్వీసుల రద్దు గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశంలో లాక్‌డౌన్ మూలంగా పలు చోట్ల చిక్కుకున్న వసల కూలీలను తరలించేందుకు ఏర్పాటు చేసిన శ్రామిక్ ప్రత్యేక రైళ్లు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మరికొన్ని రైళ్లు మాత్రం యథాతథంగా నడవనున్నాయి.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- కరోనావైరస్: అన్ని వైరస్లు ఒకేసారి అంతమైపోతే ఏం జరుగుతుంది? మానవులు సుఖంగా బతకగలరా?
- కరోనావైరస్: డెక్సామెథాసోన్ ఏంటి? ఈ మందు ఎలా పనిచేస్తుంది? దీని ధర ఎంత?
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్‌లను ఎదుర్కోవచ్చా?
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- కరోనావైరస్: 36 రోజులు వెంటిలేటర్‌పై మృత్యువుతో పోరాడి, బతికి బయటపడిన వ్యక్తి ఇతను
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్: హంతక మహమ్మారిపై శాస్త్రవేత్తల వేటలో వెలుగు చూసిన నిజాలేమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








