వరల్డ్ కప్ సెమీఫైనల్: న్యూజీలాండ్‌ను భారత్ ఓడిస్తుందా? 2019 నాటి ఓటమికి బదులు తీర్చుకోగలదా?

భారత్, న్యూజీలాండ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఐసీసీ వరల్డ్ కప్-2019లో భారత కెప్టెన్ ధోనీ రనౌట్
    • రచయిత, నితిన్ శ్రీవాస్తవ
    • హోదా, బీబీసీ ప్రతినిధి, ముంబయి నుంచి

ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగే వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో ఒక రికార్డు బద్దలు కావడం ఖాయం.

భారత్‌ను న్యూజీలాండ్ వేర్వేరు ఫార్మాట్లలో వరుసగా గత నాలుగు నాకౌట్ మ్యాచ్‌ల్లో ఓడించింది.

అలాగే, న్యూజీలాండ్ గత మూడు వన్డే వరల్డ్‌కప్‌లకు ఆతిథ్యమిచ్చిన జట్టు చేతిలోనే ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది.

ఇలా చూస్తే బుధవారం నాటి మ్యాచ్‌లో భారత్ గెలిస్తే న్యూజీలాండ్ చేతిలో నాకౌట్ పరాజయాల పరంపరకు బ్రేక్ పడుతుంది.

ఒకవేళ న్యూజీలాండ్ గెలిస్తే ఆతిథ్య జట్టు చేతిలో ఓటమితో వరల్డ్ కప్ టోర్నీల నుంచి నిష్క్రమిస్తుందని కివీస్ పేరిట ఉన్న రికార్డు చెరిగిపోతుంది.

ఈ నేపథ్యంలో ఈసారి కొత్త రికార్డును నెలకొల్పాలనే లక్ష్యంతోనే బుధవారం సెమీఫైనల్లో భారత్, న్యూజీలాండ్ తలపడనున్నాయి.

వన్డే క్రికెట్ ప్రపంచకప్ చరిత్ర చూస్తే న్యూజీలాండ్ జట్టు నిలకడ ఏంటో తేలిగ్గా అర్థమవుతుంది. 2007 నుంచి ప్రతీ వరల్డ్ కప్‌లోనూ న్యూజీలాండ్ జట్టు సెమీస్‌కు చేరింది.

2015, 2019 వరల్డ్‌కప్‌లలో న్యూజీలాండ్ ఫైనల్‌కు కూడా చేరింది. 2019 ఫైనల్ మ్యాచ్‌ ఇంగ్లండ్, న్యూజీలాండ్ జట్ల మధ్య చాలా ఉత్కంఠభరితంగా సాగింది. చివరివరకు పోరాడిన న్యూజీలాండ్‌ను దురదృష్టం వెంటాడింది. బౌండరీల సంఖ్య ఆధారంగా ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించడంతో, న్యూజీలాండ్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

2021 టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లోనూ న్యూజీలాండ్ చేతిలో భారత్‌ ఓడింది.

న్యూజీలాండ్ జట్టు ప్రదర్శన గురించి బీబీసీతో ప్రస్తుత వరల్డ్ కప్ టోర్నీకి కామెంటరీ చేస్తున్న న్యూజీలాండ్ మాజీ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ ఇయాన్ స్మిత్ మాట్లాడారు.

‘‘న్యూజీలాండ్ ప్రస్తుత జట్టుకు, గత జట్లకు ఒక అద్భుతమైన లక్షణం ఉంది. ఈ జట్టు ఒకరిద్దరు లేదా ముగ్గురు స్టార్ ఆటగాళ్లపై ఆధారపడదు. ఆల్‌రౌండ్ ప్రదర్శనపై జట్టు నమ్మకం ఉంచుతుంది’’ అని అన్నారు.

భారత్, న్యూజీలాండ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2019 జులై 10న మాంచెస్టర్‌లో జరిగిన వరల్డ్ కప్ సెమీస్‌లో న్యూజీలాండ్ చేతిలో ఓటమి తర్వాత స్టేడియంలోని భారత అభిమానులు నిరాశ చెందారు

2019 నాటి చేదు జ్ఞాపకాలు

గత వన్డే వరల్డ్‌కప్ సెమీఫైనల్లో న్యూజీలాండ్ చేతిలో టీమిండియా ఓటమికి సంబంధించిన చేదు జ్ఞాపకాలు ఇంకా తాజాగా ఉన్నాయి.

ఆ మ్యాచ్‌లో ఆడిన చాలామంది ఆటగాళ్లు, ప్రస్తుత జట్టులోనూ ఉన్నారు.

మాంచెస్టర్‌లో జరిగిన ఈ సెమీస్ మ్యాచ్‌లో న్యూజీలాండ్ 239 పరుగులు చేసింది.

ఛేదనలో భారత టాపార్డర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ (1), రోహిత్ శర్మ (1), విరాట్ కోహ్లీ (1) కేవలం ఒక పరుగు మాత్రమే చేయగా, దినేశ్ కార్తీక్ 6 పరుగులు చేసి అవుటయ్యాడు.

రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా చెరో 32 పరుగులు చేశారు. అప్పటికి చెప్పుకోదగ్గ ఫామ్‌లో లేని ధోనీ చాలా జాగ్రత్తగా ఆడుతూ 50 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. ఈ రనౌట్‌ క్రికెట్ అభిమానుల మదిలో ఎప్పటికీ నిలిచిపోతుంది.

కేవలం రవీంద్ర జడేజా మాత్రమే వేగంగా ఆడాడు. జడేజా 59 బంతుల్లో 77 పరుగులు చేశాడు. కానీ జట్టు విజయానికి అవి సరిపోలేదు.

రచిన్ రవీంద్ర

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, న్యూజీలాండ్ యువ బ్యాట్‌మన్ రచిన్ రవీంద్ర మంచి ఫామ్‌లో ఉన్నాడు

న్యూజీలాండ్ పునరాగమనం

2023 వరల్డ్ కప్‌ను న్యూజీలాండ్ ఘనంగా ప్రారంభించింది. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌ను ఆరంభ మ్యాచ్‌లోనే ఓడించి, గత వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ చేతిలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకుంది.

టోర్నీలో మొదటి నాలుగు మ్యాచ్‌ల్లో వరుస విజయాలు సాధించింది.

అయిదో మ్యాచ్‌లో ధర్మశాల వేదికగా భారత్‌తో న్యూజీలాండ్ తలపడింది. ఇక్కడే కివీస్ విజయాలకు భారత్ బ్రేక్ వేసింది. ఈ మ్యాచ్‌లో 4 వికెట్లతో భారత్ గెలిచింది.

తర్వాత ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్ జట్ల చేతిలో కూడా ఓటమి పాలైన కివీస్, పాయింట్ల పట్టికలో దిగువకు పడిపోయింది. అయితే, తమ చివరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంకపై గెలుపొంది న్యూజీలాండ్ సెమీఫైనల్ బెర్తు దక్కించుకుంది.

కానీ, ఇక్కడొక విషయం గుర్తుంచుకోవాలి. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో న్యూజీలాండ్ 400లకు పైగా పరుగులు చేసినప్పటికీ, వర్షం కారణంగా సమీకరణాలు మారడంతో విజయం పాకిస్తాన్‌ను వరించింది.

అలాగే భారత్, ఆస్ట్రేలియా చేతుల్లో కూడా చాలా స్వల్ప తేడాతోనే న్యూజీలాండ్ ఓటమి పాలైంది.

ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ మాట్లాడుతూ, ‘‘టోర్నీ మధ్యలో ఎదురైన ఎదురుదెబ్బల నుంచి న్యూజీలాండ్ తప్పకుండా గుణపాఠాలు నేర్చుకొని ఉంటుంది. వాటి నుంచి కోలుకొని ఉంటుంది. ఇంకా వారికి టోర్నీలో రెండు మ్యాచ్‌లే మిగిలి ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌ విభాగాలను బాగా పరీక్షించి ఉంటారు’’ అని అన్నారు.

వీడియో క్యాప్షన్, 2019 వరల్డ్ కప్ కలలకు గండి కొట్టిన న్యూజిలాండ్‌పై భారత్ ఈసారైనా గెలిచేనా?

భారత్‌కు ప్రమాదం

ఈ టోర్నీ ఆరంభం నుంచి న్యూజీలాండ్ బ్యాట్స్‌మెన్ అద్భుతంగా ఆడుతున్నారు. రచిన్ రవీంద్ర పరుగుల వరద పారిస్తున్నాడు. గాయం నుంచి కోలుకొని వచ్చినప్పటి నుంచి కెప్టెన్ కేస్ విలియమ్సన్ మంచి ఫామ్‌లో కనిపిస్తున్నాడు.

డేవాన్ కాన్వేలో మునుపటి ఫామ్ కనిపించట్లేదు. కానీ, డరైల్ మిచెల్ భారీగా స్కోర్ చేస్తూ ఫాస్ట్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటున్నాడు.

ఒకవేళ కెప్టెన్ కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్రలు ఇద్దరూ భారత పేస్ దళాన్ని విజయవంతంగా ఎదుర్కొంటే, మిడిల్ ఓవర్లలో న్యూజీలాండ్‌ పరుగులు చేయకుండా అడ్డుకోవడం చాలా కష్టం.

కివీస్ బౌలర్లు ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ, లాకీ ఫెర్గూసన్‌లు భారత బ్యాట్స్‌మెన్‌ను బాగా ఇబ్బంది పెట్టగలరు.

వాంఖెడే పిచ్‌పై సాయంత్రం తర్వాత బంతి బాగా స్వింగ్ అవుతుంది. గత మ్యాచ్‌ల్లో ఇది స్పష్టంగా కనిపించింది.

ఇదే పిచ్‌పై శ్రీలంకను 55 పరుగులకే భారత్ ఆలౌట్ చేసింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ల్లో అఫ్గానిస్తాన్ ఫాస్ట్ బౌలర్లు 50 పరుగుల్లోపే 4 వికెట్లను పడగొట్టారు.

భారత్ ఒకవేళ రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేస్తే బుమ్రా, షమీ, సిరాజ్‌ల పని సులువు అవుతుంది.

భారత్‌ను ఓడించడానికి జట్టులోని సీనియర్ ఆటగాళ్ల అనుభవం మీద ఆధారపడతామని న్యూజీలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే చెప్పాడు.

న్యూజీలాండ్ క్రికెట్ జట్టు విడుదల చేసిన ఒక వీడియోలో కాన్వే మాట్లాడుతూ, ‘‘భారత్ ఎంత పటిష్ట జట్టు అనే సంగతి అందరికీ తెలుసు. జట్టులో సమర్థులైన ఆటగాళ్లు ఉండటంతో పాటు వారు మంచి జోరులో ఆడుతున్నారు. మేం కూడా వారిని దీటుగా ఎదుర్కొనేందుకు ఎదురుచూస్తున్నాం’’ అని అన్నాడు.

షమీ, సిరాజ్

ఫొటో సోర్స్, Getty Images

భారత సన్నద్ధత

గత 9 మ్యాచ్‌ల్లో భారత్ ఆటతీరు అద్భుతంగా ఉంది.

టోర్నీ ఆరంభానికి ముందు 9 మ్యాచ్‌ల్లో 18 పాయింట్లను స్కోర్ చేస్తామని భారత్ కూడా ఊహించి ఉండదని ద గార్డియన్ పత్రిక క్రికెట్ విమర్శకుడు అలీ మార్టిన్ అన్నారు.

మ్యాచ్‌మ్యాచ్‌కూ వారిలో మనోధైర్యం పెరిగిందని, గత తప్పిదాల నుంచి గుణపాఠాలు నేర్చుకుందని వ్యాఖ్యానించారు.

అన్నింటికంటే పెద్ద తేడా భారత ఫాస్ట్‌బౌలింగ్‌లో కనిపించింది. భారత పేసర్లు బుమ్రా, సిరాజ్, షమీ విసిరిన బంతులు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టాయి.

ఈ టోర్నీలో ఆడిన 5 మ్యాచ్‌ల్లోనే షమీ 16 వికెట్లు తీశాడు. బుమ్రా 9 మ్యాచ్‌ల్లో 17, సిరాజ్ 9 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు దక్కించుకున్నారు.

మొత్తంగా ముగ్గురు కలిపి 45 వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు. ఇందులో ప్రతీ ప్రత్యర్థి జట్టులోని టాపార్డర్ వికెట్లు కూడా ఉన్నాయి.

భారత బ్యాట్స్‌మెన్‌ కూడా తమ ప్రతిభకు తగిన ఆటతీరును ప్రదర్శించారు. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ దూకుడైన ఆరంభాలు, విరాట్ కోహ్లి నిలకడైన పరుగులు, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ సరైన సమయంలో జట్టుకు అందివచ్చారు.

భారత్ ఈ మ్యాచ్‌పై పట్టు సాధించాలంటే తొలి 10 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా ఆడాలి. ముఖ్యంగా టాస్ ఓడి ఛేదన చేయాల్సి వస్తే ఈ సూత్రాన్ని తప్పక పాటించాలి.

అందుకే వాంఖెడేలో టాస్ పాత్ర చాలా కీలకం కానుంది. ఎందుకంటే, టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ చేసేందుకే మొగ్గు చూపుతుంది.

హార్దిక్ పాండ్యా జట్టుకు దూరం అయ్యాడు. జడేజా, కుల్దీప్‌లపై ఒత్తిడి పెరగకుండా ఉండాలంటే పేసర్లంతా మ్యాచ్‌లో త్వరగా వికెట్లు తీయాలని జట్టు భావిస్తోంది.

ధర్మశాలలో భారత్, న్యూజీలాండ్ తలపడినప్పుడు జడేజా తన 10 ఓవర్ల కోటా పూర్తి చేసినప్పటికీ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.

‘‘సెమీఫైనల్ ముందు మాపై ఎలాంటి ఒత్తిడి లేదని నేను చెప్పడం తప్పు అవుతుంది. క్రికెట్ ఆటలో ఏ మ్యాచ్ గెలుస్తామో గ్యారంటీ ఉండదు. సరైన రీతిలో సన్నద్ధం కావడమే మనం చేయగలం. మేం అదే పని చేస్తున్నాం’’ అని స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ భారత కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)