వరంగల్: యూట్యూబ్ వీడియోలు చూస్తూ అబార్షన్లు చేస్తున్న నకిలీ డాక్టర్ - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పని చేస్తూ, నకిలీ డాక్టర్ అవతారమెత్తిన ఓ యువకుడు యూట్యూబ్ వీడియోల సాయంతో అబార్షన్లు చేస్తూ అధికారులకు పట్టుబడ్డారని ఈనాడు పత్రిక ఒక కథనం ఇచ్చింది.
వరంగల్ నగరం నడిబొడ్డున ఆసుపత్రి నిర్వహిస్తున్న ఈ మెడికల్ రిప్రజెంటేటివ్, అనుమతి, అర్హత లేకుండా అబార్షన్లు చేస్తున్నారని తెలియడంతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు బుధవారం అర్ధరాత్రి దాడి చేసి పట్టుకున్నారు.
వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేటకు చెందిన అండ్రు ఇంద్రారెడ్డి నెల రోజుల కిందట హన్మకొండలోని ఏకశిలా పార్కు ఎదురుగా సిటీ హాస్పిటల్ పేరుతో ఆసుపత్రి ప్రారంభించారు.
రెండోసారి ఆడపిల్లలు వద్దనుకునే మహిళలను ఆర్‌ఎంపీలు, పీఎంపీల ద్వారా గుర్తించి వారికి అబార్షన్లు చేస్తున్నారు. నర్సింగ్‌లో శిక్షణ పొందినవారితో కలిసి , యూట్యూబ్ చూస్తూ ఈ అబార్షన్లు ప్రక్రియను కొనసాగిస్తున్నారు.
దీనిపై సమాచారం అందడంతో బుధవారం అర్ధరాత్రి రెవెన్యూ అధికారులు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆసుపత్రిపై దాడి చేశారు. ఆ సమయంలో మహారాష్ట్ర నుంచి వచ్చిన మహిళలకు ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది.
అధికారులను చూసి వైద్య సిబ్బంది గోడదూకి పారిపోయారు. థియేటర్‌లో ఉన్న మహిళను బాత్రూంలో దాచారు. పోలీసుల సాయంతో ఆమెను బయటకు తీసుకొచ్చి అధికారులు ప్రశ్నించారు. రక్తస్రావం అవుతుండటంతో హన్మకొండ జీఎంహెచ్‌కు తరలించారు.
ఇంద్రారెడ్డి మూడేళ్ల కిందట వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలోనూ ఇలాగే ఓ ఆసుపత్రి ఏర్పాటు చేయగా అధికారులు దాన్ని సీజ్ చేశారు. డీఎంహెచ్‌వో ఫిర్యాదు మేరకు నకిలీ వైద్యుడిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి, ఆసుపత్రిని సీజ్ చేశారు. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు ఈనాడు కథనం పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
రూ.20 లక్షలు స్టవ్ మీద కాల్చేసిన తహసీల్దార్
అవినీతికి పాల్పడి, ఆ వ్యవహారంలో ఎక్కడ దొరికి పోతానో అన్న భయంతో ఓ అధికారి పెద్ద ఎత్తున కరెన్సీ నోట్లను తగలబెట్టినట్లు ఆంధ్రజ్యోతి పత్రిక ఒక కథనం ఇచ్చింది. ఈ ఘటన రాజస్థాన్‌లోని సిరోహి జిల్లాలో బుధవారం నాడు జరిగింది.
ఓ వ్యక్తికి కాంట్రాక్టు అప్పగించడానికి అతని నుంచి తహసీల్దార్ కల్పేశ్ కుమార్ జైన్ తరఫున రూ.లక్ష లంచం తీసుకునేందుకు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ పర్వత్ సింగ్ సిద్ధమయ్యారు.
లంచం పుచ్చుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు ప్రత్యక్షమై అతన్ని పట్టుకున్నారు. అయితే ఈ తతంగంలో తన ప్రమేయం ఏమీ లేదని, తహశీల్దార్ కల్పేశ్ కుమార్ జైన్ తరఫున తాను డబ్బు తీసుకుంటున్నానని రెవిన్యూ ఇన్‌స్పెక్టర్ ఏసీబీ అధికారులకు చెప్పారు.
దీంతో అధికారులు పర్వత్ సింగ్‌ను తీసుకుని ఏసీబీ అధికారులు జైన్ నివాసానికి చేరుకున్నారు. అధికారులు తన ఇంటికి వస్తున్నారని తెలుసుకున్న జైన్, ఇంట్లో ఉన్న డబ్బును కాల్చేయడానికి సిద్ధమయ్యారు.
ఇంటి తలుపులకు తాళాలు వేసి కరెన్సీ నోట్లను స్టవ్ మీద పెట్టి కాల్చేయడం ప్రారంభించారు. అలా చేయవద్దని ఏసీబీ అధికారులు చెబుతున్నా ఆయన వినలేదు. చివరకు పోలీసులు బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి మంటలను ఆర్పేశారు. అయితే అప్పటికే రూ.20 లక్షల కరెన్సీ కాలిపోయిందని అధికారులు వెల్లడించారు.

ఫొటో సోర్స్, RAGHURAMAKRISHNAMRAJU
ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై సీబీఐ కేసు
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కేసు నమోదు చేసిందని సాక్షి పత్రిక ఒక కథనం రాసింది. బ్యాంక్ లోన్ బకాయిల వ్యవహారంలో కేసు నమోదు చేసిన సీబీఐ గురువారం ఆయన నివాసంలో సోదాలు నిర్వహించింది.
హైదరాబాద్‌లోని ఆయన నివాసంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ఈనెల 6న హైదరాబాద్, ముంబై సహా 11 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు చేపట్టింది.రఘురామ కృష్ణంరాజు సహా 9 మందిపై సీబీఐ చీటింగ్ కేసు నమోదు చేసింది.
దిల్లీ నుంచి వచ్చిన సీబీఐ ప్రత్యేక బృందాలు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఇండ్-భారత్ కంపెనీతో సహా ఎనిమిది కంపెనీలకు చెందిన డైరెక్టర్ల ఇళ్లలోనూ తనిఖీలు చేశారు. ఈ దాడుల్లో పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
2019 ఏప్రిల్ 30న బ్యాంక్ లోన్ బకాయిలు పడిన కేసులో సైతం హైదరాబాద్, భీమవరంలోని రఘురామ కృష్ణంరాజు కంపెనీల్లో సోదాలు చేపట్టారు. వివిధ ప్రాజెక్ట్‌లకు సంబంధించి రూ.600 కోట్ల మేర ఆయన రుణాలు తీసుకున్నారు.
ఇక ఇండ్-భారత్ పవర్ లిమిటెడ్‌కు సంబంధించి రూ.947 కోట్ల మేర బ్యాంకులకు రుణాలు ఎగవేయగా, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి రూ.2655 కోట్ల మేర రఘురామ కృష్ణంరాజు లోన్ తీసుకున్నారు.
బ్యాంకులకు ఎగవేతపై రఘురామ కృష్ణంరాజుపై సీబీఐ దాడులు ఇదే తొలిసారి కాదు. గతేడాది కూడా సీబీఐ కేసు నమోదు చేసి సోదాలు నిర్వహించిందని సాక్షి కథనం తెలిపింది.

రోదసిలో వ్యవసాయం...నాసాతో కలిసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధనలు
వనరులు తక్కువగా ఉన్న ప్రతికూల ప్రదేశాల్లో మొక్కలు పెరగడానికి ఉపయోగపడే జన్యువులను కలిగి ఉన్న పలు రకాల బ్యాక్టీరియాలను హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీ నిపుణులు సృష్టించారని, వీటి ద్వారా రోదసిలో కూడా వ్యవసాయం చేసి ఆహారం తయారు చేసే వీలు కలుగుతుందని నమస్తే తెలంగాణ పత్రిక ఒక కథనం ఇచ్చింది.
వ్యోమగాములు సాధారణంగా తమకు కావాల్సిన ఆహార పదార్థాలను భూమి నుంచే తీసుకెళ్తుంటారు. కానీ భవిష్యత్తులో వారు తమకు కావాల్సిన కూరగాయలు, ఆహార పదార్థాలను అక్కడే సాగుచేసుకోవచ్చు.
నాసాతో కలిసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ జరిపిన పరిశోధనల్లో ప్రతికూల పరిస్థితుల్లోనూ మొక్కలు పెరగడానికి ఉపయోగపడే జన్యువులను కలిగి ఉన్న పలు రకాల బ్యాక్టీరియాలను యూనివర్సిటీ నిపుణులు ఆవిష్కరించారని, ఇటీవలి ప్రాంటియర్స్ ఆఫ్ మైక్రోబయాలజీ సంచికలో ఇవి ప్రచురితమయ్యాయని ఈ కథనం పేర్కొంది.
అంతరిక్షంలోనే ఆహార తయారీకి సంబంధించి నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబోరేటరీ (జేపీఎల్), అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్), వర్సిటీ ఆఫ్ హైదరాబాద్, స్కూల్ ఆఫ్ సైన్సెన్స్ సంయుక్తంగా విస్తృత అధ్యయనం చేస్తున్నాయి.
తాజాగా వారు కనుగొన్న నాలుగు కొత్త బ్యాక్టీరియాలలో ఒకటి మిథైలో బ్యాక్టిరాయాసీ కుటుంబానికి చెందినదిగా గుర్తించగా, మిగతా మూడింటిని గతంలో ఎవరూ కనుగొనలేదని తేల్చారు. వాటిని జన్యు విశ్లేషణచేయగా అవి మిథైలో బ్యాక్టీరియం ఇండికమ్‌తో దగ్గరి సంబంధాన్ని కలిగి ఉన్నట్టు గుర్తించారు.
ఆ కొత్త బ్యాక్టీరియాలకు అన్నామలై వర్సిటీకి చెందిన విశ్రాంత, ప్రఖ్యాత భారతీయ జీవవైవిధ్య శాస్త్రవేత్త డాక్టర్ అజ్మల్‌ఖాన్ పేరుతో 'మిథైలో బ్యాక్టీరియం అజ్మాలి' అని పేరు పెట్టారు. ఇక వాటిలో జన్యువులను మరింత లోతుగా విశ్లేషించగా ఆ బ్యాక్టీరియాలు ప్రతికూల పరిస్థితుల్లోనూ మొక్కలు పెరిగేందుకు ఎంతో దోహదపడతాయని గుర్తించారు.
ఆ బ్యాక్టీరియాల్లోని జన్యువులు ఒత్తిడితో కూడిన పరిస్థితులను తట్టుకోవడానికి మొక్కలకు సహాయపడటమేకాకుండా, ఇంధనాన్ని రూపొందించడంలోనూ ఎంతో దోహదపడతాయని కనుగొన్నట్టు పరిశోధనకు నాయకత్వం వహించిన హైదరాబాద్ వర్సిటీ ప్రొఫెసర్ అప్పారావు పొదిలె వివరించారు.
అంతరిక్షంలో వ్యవసాయం సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు ఇది మరింత దోహదపడుతుందని ఆయన పేర్కొన్నట్లు నమస్తే తెలంగాణ కథనం వెల్లడించింది.
ఇవి కూడా చదవండి:
- రైతుల ఆందోళనలను కవర్ చేస్తున్న జర్నలిస్ట్ మన్దీప్ పునియా అరెస్ట్
- మట్టితో ఈ రైతు చేసిన ప్రయోగాలు సేంద్రియ వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తాయా?
- పాకిస్తాన్ నిర్మిస్తున్న ఆనకట్టపై భారత్ ఎందుకు అభ్యంతరం చెబుతోంది?
- ఎడారి ఇసుక నేలలో పచ్చని పొలం... ఈ అద్భుతం ఎలా సాధ్యం?
- గోదావరి నీళ్లు స్నానానికి కూడా పనికి రాకుండా పోతున్నాయా? కాలుష్య సమస్య పరిష్కారమయ్యేదెలా
- రైతుల నిరసనలు: ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గొద్దు.. రైతులకు సూచించిన రాహుల్ గాంధీ
- మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం...
- సింధు నదీజలాల ఒప్పందం వల్ల భారత్ నష్టపోతోందా.. అసలు ఎందుకీ ఒప్పందం చేసుకున్నారు?
- మహిళల మోకాళ్లు, చిరిగిన జీన్స్‌పై ఎందుకింత చర్చ జరుగుతోంది
- కొండ బారిడి: తుపాకులు గర్జించిన నేలలో ఇప్పుడు సేంద్రియ వ్యవసాయ విప్లవం
- 15 వందల మంది భారత సైనికుల భీకర పోరాటం రెండో ప్రపంచ యుద్ధ గతిని ఎలా మార్చిందంటే..
- వరల్డ్ హ్యాపీనెస్ డే: అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్, 139వ స్థానంలో భారత్
- పంటలకు ఈ రైతు హోమియో మందులు వేస్తున్నారు... ఎందుకో తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








