హైదరాబాద్: ‘డ్రైవర్‌కు బీమా చేయించి చంపేశారు - హెడ్ కానిస్టేబుల్ సాయంతో ప్లాన్ వేశారు’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆర్థిక కష్టాలు తీర్చుకోవడం కోసం ఒక వ్యక్తికి బీమా చేయించి మరీ హత్య చేసిన ఉదంతం హైదరాబాద్ శివార్లలో వెలుగు చూసింది.
ఈ హత్యకు స్వయంగా ఒక పోలీస్ హెడ్ కానిస్టేబుల్ చేత ప్లాన్ గీయించారు నిందితులు.
శంషాబాద్ డీసీపీ జగదీశ్వర రెడ్డి, షాద్ నగర్ ఏసీపీ కుషాల్కర్, ఇతర పోలీసులు చెప్పిన కేసు వివరాలు ఇవీ...

ఫొటో సోర్స్, Cyberabad Police
క్రెడిట్ కార్డులు వాడుకుని.. జైలుకు వెళ్లొచ్చి...
‘‘వరంగల్ జిల్లాకు చెందిన బోడ శ్రీకాంత్ హైదరాబాద్ శివార్లలో ఉండేవాడు. క్రెడిట్ కార్డులు తీసుకుని వాటిని వాడుకుని బ్యాంకులకు డబ్బు ఎగ్గొట్టడం వంటి పనులు చేసేవాడు.
తన దగ్గర ఉద్యోగాల కోసం వచ్చిన వారి ఆధార్ కార్డు, పాన్ కార్డులు పెట్టి వాటితో కూడా కార్డులు తీసుకుని వాడుకుని ఎగ్గొట్టిన చరిత్ర ఇతనికి ఉంది. అతనిపై నాచారం పోలీస్ స్టేషన్లో 420 కేసు కూడా ఉంది. 2022 జూలైలో జైలుకు వెళ్లి వచ్చాడు.
అమాయకులను ఉద్యోగాల పేరుతో పిలవడం వారి పత్రాలు తీసుకుని బ్యాంకుల్లో వాడుకోవడం అతనికి అలవాటు. కొత్తగా కంపెనీలు పెట్టడం, అందులోకి ఉద్యోగులను తీసుకుని వారి పేరిట లోన్లూ, క్రెడిట్ కార్డులూ తీసుకోవడం, వారికి నామమాత్రం జీతాలు ఇవ్వడం, ఆ లోన్లు, కార్డుల డబ్బు వాడుకోవడం చేసేవాడు. 2019 నుంచీ ఈ పద్ధతిలోనే చేస్తున్నాడు.
ఆ క్రమంలో అతని దగ్గర డ్రైవర్‌గా పనికి చేరాడు పల్నాడు జిల్లాకు చెందిన భిక్షపతి అనే 30 ఏళ్ల యువకుడు. భిక్షపతికి తల్లీ, తండ్రీ, అన్నదమ్ములు, అక్కచెక్కెళ్లు ఎవరూ లేరని, పెళ్లి కాలేదని గుర్తించాడు. తన ఆర్థిక సమస్యలు తీర్చడం కోసం ఒక పథకం అల్లాడు.
డ్రైవర్‌కు ఎవరూ లేరని తెలుసుకుని...
2020వ సంవత్సరంలో తన దగ్గర పనిచేసే భిక్షపతి పేరిట లైఫ్ ఇన్సూరెన్స్ చేయించాడు శ్రీకాంత్. ఐసీఐసీఐ బ్యాంకులో 50 లక్షలకు పాలసీ కట్టాడు. నామినీగా తన పేరు పెట్టుకున్నాడు. ఏడాది గిడిచింది.
2021వ సంవత్సరంలో అదే భిక్షపతి పేరిట ఒక ఇంటిలోన్ తీసుకున్నాడు శ్రీకాంత్. లోన్ ఉంది కాబట్టి ఆ ఇల్లు కూడా భిక్షపతి పేరుతోనే ఉంది. మేడిపల్లి ప్రాంతంలోని ఆ ఇంటిలోన్ విలువ 52 లక్షలు.
మధ్యలో శ్రీకాంత్‌కూ, భిక్షపతికీ ఏం తేడాలొచ్చాయో కానీ ఆ ఇంటిని శ్రీకాంత్ అమ్మకానికి పెట్టాలి అనుకున్నప్పుడు, దానికి భిక్షపతి ఒప్పుకోలేదు.
అంతా మామూలుగా జరిగిపోతుంది అనుకుంటున్నారు కానీ శ్రీకాంత్ వేరే ప్లాన్ వేశాడు.
హెడ్ కానిస్టేబుల్‌తో కలిసి...
ఈ శ్రీకాంత్‌కు అప్పట్లో మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేసే మోతీలాల్ అనే వ్యక్తితో పరిచయం ఉంది.
తన ఆర్థిక సమస్యలు తీరాలంటే భిక్షపతిని చంపి, ఆ ఇన్సూరెన్సు డబ్బు తీసుకోవాలి అనుకున్న శ్రీకాంత్ హత్య ప్లాన్ కోసం హెడ్ కానిస్టేబుల్ మోతీలాల్‌ను సంప్రదించాడు. అందుకు 10 లక్షలు ఇస్తానని ప్రలోభ పెట్టాడు.
ఈ హత్యకు సాయం కోసం సమ్మన్న, సతీశ్ అనే మరో ఇద్దరి సాయం కూడా తీసుకున్నాడు. వారికి చెరో ఐదు లక్షలు ఇస్తానని ఆశ పెట్టాడు.
మొత్తం ఇన్సూరెన్సు 50 లక్షల్లో 30 లక్షలు శ్రీకాంత్‌కి, చెరో ఐదు లక్షల చొప్పున్న సమ్మన్న, సతీశ్‌లకూ, పది లక్షలు మోతీలాల్‌కీ అని ఒప్పందం అయిపోయింది.
చంపి కారు కింద తొక్కించి...
అది 2021 డిసెంబరు 23.
మోతీలాల్ వేసిన పథకం ప్రకారం ఈ నలుగురూ కలసి భిక్షపతికి బాగా మందు తాగించారు. మొగిలిగిద్ద ప్రాంతానికి కారులో తీసుకెళ్లారు. హాకీ స్టిక్‌తో కొట్టారు. భిక్షపతి చనిపోయాడు. ఆ మృతదేహాన్ని రోడ్డుపై వేసి, ఫోర్డ్ ఎండీవర్ కారుతో తొక్కించారు.
మరునాడు పోలీసులు వచ్చారు. అందరూ రోడ్ ప్రమాదం అనుకున్నారు. కానీ పోలీసులకు మాత్రం అది ప్రమాదంగా అనిపించలేదు. అందుకే అనుమానాస్పద మరణం అనే కేసు పెట్టుకున్నారు. పోస్టుమార్టం రిపోర్టును బట్టి కూడా హత్యే అని తెలుస్తోంది కానీ ఎవరు చేశారన్న స్పష్టత రాలేదు.
మరోవైపు, శ్రీకాంత్ అండ్ టీమ్ అనుకున్న పథకం ప్రకారం ఇన్సూరెన్సు డబ్బు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఇన్సూరెన్స్ కంపెనీ సందేహం...
అమ్మానాన్న, ఇతర ఏ రక్త సంబంధీకులూ లేని భిక్షపతికి శ్రీకాంత్ ఎలా నామినీగా అయ్యాడు అనే సందేహం కలిగింది ఇన్సూరెన్సు కంపెనీ వారికి. అదే విషయాన్ని వారు పోలీసుల దగ్గరా ప్రస్తావించారు. దానికితోడు భిక్షపతి పేరిట ఉన్న ఇంటికి కూడా ఇన్సూరెన్సు ఉంది.
సాధారణంగా ఇంటిలోన్‌కి ఇన్సూరెన్స్ ఉంటుంది. లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే, ఆ లోన్ మొత్తం కవర్ అయ్యేలా ఇన్సూరెన్స్ చేస్తారు. అప్పుడు లోన్ భారం మిగిలిన వారిపై పడదు, అటు బ్యాంకుకూ నష్టం ఉండదు.
అప్పటికే ఈ కేసుపై అనుమానంతో ఉన్న పోలీసులకు, ఇన్సూరెన్సు కంపెనీ వారు ఇచ్చిన సమాచారం మరింత అనుమానాన్ని పెంచాయి. స్థానిక ఇనస్పెక్టర్ నవీన్ కుమార్, ఎస్సై వెంకటేశ్వర్లు, మరో ఎస్సై రాంబాబు, కానిస్టేబుళ్లు రవి, యాదగిరి కలసి కేసు దర్యాప్తు చేశారు.
ఈ దర్యాప్తులో భిక్షపతిది హత్య అని తేలింది. దాదాపు ఏడాది తరువాత, రోడ్డు యాక్సిడెంటుగా చూపించాలనుకున్న కేసును, ఇన్సూరెన్స్ కోసం జరిగిన హత్యగా గుర్తించి, నిందితులను పట్టుకున్నారు పోలీసులు.’’
ఇవి కూడా చదవండి:
- ఆ స్కూల్లో విద్యార్థినులందరూ టీనేజీ తల్లులే...
- భాంగఢ్ కోట: "చీకటి పడ్డాక అక్కడికి వెళ్లినవారు ప్రాణాలతో తిరిగి రారు" - ఇది నిజమేనా?
- సెక్స్, అధికారం, భయం....మన పురాణాలకు ప్రేరణ ఇచ్చింది ఇవేనా?
- రోమియో జూలియట్:‘‘బలవంతంగా మాతో నగ్నంగా నటింపజేశారు’’- 70 ఏళ్ల వయసులో కేసు వేసిన హీరో హీరోయిన్లు
- హెచ్ఐవీని తన దేశానికి స్మగ్లింగ్ చేసిన మహిళా శాస్త్రవేత్త....ఎందుకలా చేశారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


















