విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ.. ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో కేకేఆర్‌పై ఆర్‌సీబీ విజయం

virat kohli

ఫొటో సోర్స్, Getty Images

ఐపీఎల్ 2025 సీజన్ వేడుకగా మొదలైంది. తొలి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) జట్టు విజయం సాధించింది.

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన డిఫెండింగ్ చాంపియన్ 'కోల్‌కతా నైట్ రైడర్స్'(కేకేఆర్) జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.

175 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన ఆర్‌సీబీ జట్టు 16.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

ఆర్‌సీబీకి ఓపెనర్లు మంచి ఆరంభాన్నిచ్చారు. ఫిల్ సాల్ట్ 31 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 56 పరుగులు చేసి తొలి వికెట్‌గా అవుట్ కాగా.. మరో ఓపెనర్ విరాట్ కోహ్లీ 36 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59 పరుగులు చేసి నాట్అవుట్‌గా నిలిచాడు.

కెప్టెన్ రజత్ పటీదార్ 16 బంతుల్లో 34 పరుగులు చేసి చివర్లో అవుటయ్యాడు. కోల్‌కతా జట్టులో వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ ఒక్కో వికెట్ తీశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
Kolkata Knight Riders' captain Ajinkya Rahane

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అజింక్య రహానే

కేకేఆర్: అజింక్య రహానే హాఫ్ సెంచరీ చేసినా

ఈ సీజన్ తొలి ఐపీఎల్ మ్యాచ్‌లో టాస్‌ను ఆర్‌సీబీ గెలుచుకుంది. ఆ జట్టు బౌలింగ్ చేయడానికి నిర్ణయించుకోవడంతో కేకేఆర్ జట్టు ఓపెనర్లు సునీల్ నరైన్, క్వింటన్ డికాక్ బ్యాటింగ్ ప్రారంభించారు.

అయితే, తొలి ఓవర్లోనే కేకేఆర్ ఒక వికెట్ కోల్పోయింది. హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో అయిదో బంతికే వికెట్ కీపర్ జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి డికాక్ పెవిలియన్ చేరాడు.

అనంతరం రెండు ఓవర్ల పాటు స్కోరు మందగించింది. మూడో ఓవర్ ముగిసేటప్పటికి స్కోర్ ఒక వికెట్ నష్టానికి 9 మాత్రమే.

అయితే, నాలుగో ఓవర్ నుంచి అజింక్య రహానే, అయిదో ఓవర్‌లో సునీల్ నరైన్ బంతిని బౌండరీకి తరలించడంతో అయిదో ఓవర్ ముగిసేటప్పటికి స్కోర్ 40కి చేరింది.

రహానే ధాటిగా ఆడుతూ 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడంతో రెండో వికెట్‌కు పార్టనర్‌షిప్ 100 పరుగులు దాటింది. అయితే, 10వ ఓవర్లో 44 పరుగులు చేసి నరైన్ అవుట్ కావడంతో ఇద్దరి భాగస్వామ్యానికి ముగింపు పడింది.

నరైన్ రసిఖ్ సలామ్ బౌలింగ్‌లో కీపర్ జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

అనంతరం 11వ ఓవర్లో రహానే కూడా అవుటయ్యాడు. రహానే 31 బంతుల్లోనే 6 ఫోర్లు 4 సిక్సర్లతో 56 పరుగులు చేశాడు.

Krunal Pandya

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కృణాల్ పాండ్య

పాండ్యాకు 3 వికెట్లు

రహానే అవుటైన తరువాత అంగ్‌క్రిష్ రఘువంశీ మినహా మిగతా ఎవరూ రాణించలేదు. రఘువంశీ 22 బంతులు ఆడి 2 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 30 పరుగులు చేశాడు.

రింకూసింగ్ 12 పరుగులు చేశాడు. మిగతా ఆటగాళ్లలో ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయలేదు.

ఆర్సీబీ బౌలర్లలో కృణాల్ పాండ్య 3 వికెట్లు, హేజెల్‌వుడ్ 2 వికెట్లు తీసుకున్నారు. రసిఖ్ సలామ్, యశ్ దయాల్, సుయాశ్ శర్మ చెరో వికెట్ తీశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయం.)