కర్ణాటక రాజకీయాల్లో 'హనీట్రాప్' కుదుపు.. 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై అసెంబ్లీలో వేటు ఎందుకు వేశారు

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, అసెంబ్లీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
    • రచయిత, ఇమ్రాన్ ఖురేషి
    • హోదా, బీబీసీ కోసం

తనను 'హనీట్రాప్' చేయడానికి ప్రయత్నించారని కర్ణాటక సహకార మంత్రి కేఎన్ రాజన్న ఆరోపించారు, దీంతో శుక్రవారం అసెంబ్లీలో గందరగోళం చెలరేగింది.

మంత్రి ఆరోపణలతో బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ పోడియం వద్దకు చేరుకొని నిరసన తెలిపారు. దీంతో 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు స్పీకర్.

మంత్రి రాజన్న ఫిర్యాదు చేసిన వెంటనే, సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని హోం మంత్రి పరమేశ్వర అన్నారు.

"రాజన్న తన ఫిర్యాదులో విషయాలన్నీ స్పష్టంగా చెప్పేవరకు ఆయన ఆరోపణలపై ఎటువంటి అంచనాకు రాలేం" అని హోం మంత్రి అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు మరింత దూకుడుగా వ్యవహరించారు.

దర్యాప్తు నుంచి ఎవరూ తప్పించుకోలేరని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హామీ ఇచ్చారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
కర్ణాటక అసెంబ్లీ, ఎమ్మెల్యేల సస్పెన్షన్

ఫొటో సోర్స్, Ani

బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

ఆర్థిక బిల్లుపై చర్చ సమయంలో ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, జేడీఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ వెల్‌లోకి వచ్చి గందరగోళం సృష్టించారు.

ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బడ్జెట్ ప్రసంగం తర్వాత, ఆర్థిక బిల్లు ఆమోదం పొందకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రతులను చించి, స్పీకర్ పోడియం పైకి ఎక్కారు. దీంతో మూజువాణి ఓటుతో ఆర్థిక బిల్లును ఆమోదించారు స్పీకర్.

ఇదే సందర్భంలో ప్రభుత్వ కాంట్రాక్టులలో మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు (రూ.1 కోటి వరకు) కల్పించే బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.

సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులకు ఇలాంటి రిజర్వేషన్ కల్పించారు.

ఇప్పుడు ఈ ప్రతిపాదనలో ముస్లింలు, క్రైస్తవులు, జైనులు, సిక్కులు మొదలైన మైనారిటీ వర్గాలకు అవకాశం కల్పించడంతో ఇది 'హలాల్ బడ్జెట్' అని బీజేపీ పేర్కొంది.

ఈ నిరసనల నేపథ్యంలో స్పీకర్ 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై ఆరు నెలల పాటు సస్పెన్షన్ విధించారు.

ఇలా, సభ్యులను ఆరు నెలల పాటు సస్పెండ్ చేయడం కర్ణాటక శాసనసభ చరిత్రలో మొదటిసారి.

సిద్ధరామయ్య, రాజన్న

ఫొటో సోర్స్, AN

ఫొటో క్యాప్షన్, తనను హనీట్రాప్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయని మంత్రి రాజన్న (కుడి) ఆరోపించారు.

రాజన్న ఏం చెప్పారు?

గురువారం తెల్లవారుజామున కొంతమంది మంత్రులను 'హనీట్రాప్'లోకి దించే ప్రయత్నం జరిగిందనే వార్తలు వ్యాపించడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. దీంతో బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ అసెంబ్లీలో ఈ అంశాన్ని ప్రస్తావించారు, ఎమ్మెల్యేల మధ్య ఎలాంటి చర్చ జరుగుతుందో ప్రభుత్వం నుంచి వివరణ కోరారు.

తనను 'హనీట్రాప్' చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని యత్నాల్‌కు ఎమ్మెల్యే రాజన్న బదులిచ్చారు. అలాంటి ప్రయత్నాలు బీజేపీ నాయకులతో కూడా జరిగాయని ఆయన పేర్కొన్నారు.

'రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలో ఇలాంటివి మరో 48 కేసులున్నాయి' అని రాజన్న చెప్పారు.

ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని హోంమంత్రికి విన్నవించారు మంత్రి రాజన్న. సభ గౌరవాన్ని కాపాడాలని రాజన్న సూచించారు. రాజన్నలిఖితపూర్వకంగా ఫిర్యాదుచేస్తే, దర్యాప్తునకు సిద్ధంగా ఉన్నామని హోంమంత్రి పరమేశ్వర స్పష్టంచేశారు.

అసెంబ్లీలో ఈ చర్చకు కొద్దిసేపటి ముందు, ప్రజా పనుల శాఖ మంత్రి సతీష్ జార్కిహోళి విలేకరులతో మాట్లాడుతూ.. ''గత రెండు దశాబ్దాలుగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి'' అని అన్నారు.

"ప్రతి పార్టీలోనూ - కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్‌లలో దీని బాధితులున్నారు" అని సతీష్ అన్నారు.

గతంలో బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న రమేష్ జార్కిహోళి ఒక మహిళతో అభ్యంతరకరంగా కలిసి ఉన్న సీడీ వెలుగులోకి రావడంతో ఆయన పదవికి రాజీనామా చేశారు. ఈ రమేశ్ సోదరుడు సతీష్ జార్కిహోళి.

"కర్ణాటక సీడీ రాజధానిగా మారింది" అని రాజన్న అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. 'హనీట్రాపింగ్‌లో కింగ్‌పిన్ ఎవరు?' అని బీజేపీ లీడర్, ఎమ్మెల్సీ సీటీ రవి ప్రశ్నించారు.

కర్ణాటక అసెంబ్లీ, రాజకీయాలు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ఎమ్మెల్యేలను రక్షించుకోలేని ముఖ్యమంత్రి, ప్రజలను ఎలా రక్షిస్తారని అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఆర్. అశోక ప్రశ్నించారు.

'సీఎం రాజీనామా చేయాలి'

ఇవన్నీ అధికార కాంగ్రెస్ పార్టీలోని సంఘర్షణకు నిదర్శనమని రాజకీయ నిపుణులు అంటున్నారు. కానీ, ఈ ప్రకటనలలో బీజేపీ నాయకుల పేర్లు కూడా రావడం చర్చనీయమైంది.

పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక మాజీ ఎమ్మెల్యే బీబీసీతో మాట్లాడుతూ "ఇది అన్ని పార్టీలను ప్రభావితం చేస్తున్న రాజకీయ క్రీడ. ఇది కాంగ్రెస్ అంతర్గత వివాదం కావచ్చు, కానీ, బీజేపీని కూడా ప్రభావితం చేస్తోంది. బీజేపీలోనూ వర్గపోరు ఉందని మర్చిపోవద్దు" అని అన్నారు.

దీంతో, ఈ ఘటనలపై ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.

అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఆర్ అశోక మాట్లాడుతూ "ఆయన (ముఖ్యమంత్రి సిద్ధరామయ్య) తన మంత్రులనే రక్షించుకోలేరు. ఇక రాష్ట్ర ప్రజలను కాపాడుతారని ఎలా నమ్మగలం" అని అన్నారు.

ఎమ్మెల్యేల సస్పెన్షన్ తర్వాత బీజేపీ, జేడీఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి రాజ్‌భవన్ వరకు పాదయాత్ర చేశారు. ప్రభుత్వ కాంట్రాక్టులలో 'ముస్లింలకు' రిజర్వేషన్ కల్పించే చట్టాన్ని అనుమతించవద్దని గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌కు ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు.

'ముస్లిం బాలికల ఉన్నత విద్యకు నిధులు ఏర్పాటు చేయడానికి బదులుగా, హిందూ బాలికలను లవ్ జిహాద్ నుంచి కాపాడటానికి ముఖ్యమంత్రి నిధులు ఏర్పాటు చేయాలి' అని బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర అన్నారు.

'రూ. 4.09 లక్షల కోట్ల బడ్జెట్‌లో మైనారిటీలకు ఒక శాతం లేదా రూ. 4,000 కోట్లు మాత్రమే కేటాయించాం' అని కాంగ్రెస్ స్పష్టం చేసింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)