మార్క్ టలీ కన్నుమూత: ఎమర్జెన్సీ సమయంలో భారత్ నుంచి బహిష్కరణ.. ఇండియాను ఇల్లుగా మార్చుకున్న జర్నలిస్ట్

మార్క్ టలీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మార్క్ టలీ
    • రచయిత, ఆండ్రూ వైట్‌హెడ్

'బీబీసీ వాయిస్ ఆఫ్ ఇండియా'గా పేరొందిన భారతదేశంలో బీబీసీ ఒకప్పటి ప్రతినిధి, సీనియర్ జర్నలిస్టు మార్క్ టలీ ఆదివారం (జనవరి 25) దిల్లీలో కన్నుమూశారు. ఆయన వయస్సు 90 సంవత్సరాలు. ఆయన మాజీ సహోద్యోగి సతీష్ జాకబ్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

మార్క్ టలీ సుదీర్ఘకాలం బీబీసీలో జర్నలిస్టుగా సేవలందించారు. అనంతరం ఆయన ఇండిపెండెంట్ జర్నలిస్టుగా పనిచేశారు.

భోపాల్ విషవాయు దుర్ఘటన, ఆపరేషన్ బ్లూస్టార్, ఇందిరా గాంధీ హత్య వంటి భారతదేశంలో అనేక కీలకమైన ఘటనలను ఆయన రిపోర్ట్ చేశారు.

బంగ్లాదేశ్ ఆవిర్భావం, పాకిస్తాన్‌లో సైనిక పాలన, శ్రీలంకలో ఎల్‌టీటీఈ తిరుగుబాటు, అఫ్గానిస్తాన్‌పై సోవియట్ రష్యా దాడి వంటి కీలక వార్తలను అందించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

2009లో బీబీసీ హిందీ ప్రత్యేక కార్యక్రమం 'ఏక్ ములాకాత్'లో ఆయన తన జీవితంలోని అనేక విషయాలను వెల్లడించారు. అప్పటి బీబీసీ హిందీ ఇండియా ఎడిటర్ సంజీవ్ శ్రీవాస్తవ ఆయనను ఇంటర్వ్యూ చేశారు.

'మేం జర్నలిజంలోకి వస్తున్నప్పుడు, ఎవరైనా ఏదైనా సాధించాలని ప్రయత్నిస్తే వారిని మీతో లేదా అరుణ్ శౌరీతో పోల్చేవారు. అప్పుడు మీకు ఎలా అనిపించేది?' అని సంజీవ్ శ్రీవాస్తవ ప్రశ్నించారు.

దీనికి మార్క్ టలీ స్పందిస్తూ, ''ప్రజలు ఎందుకలా అనేవారో నాకు తెలియదు. నా కెరీర్ కేవలం నా కృషితోనే సాధ్యమైందని చెప్పను. అందులో అదృష్టం, దైవం సహకారం ఉన్నాయి'' అని అన్నారు.

''ఆ కాలంలో భారతదేశంలో టీవీలు లేవు. ఒకవేళ ఉన్నా చాలా తక్కువ. రేడియో కేవలం ప్రభుత్వ ఆధీనంలో ఉండేది. ఆలిండియా రేడియోను ప్రజలు ప్రభుత్వ రేడియోగా భావించేవారు. వార్తలను వారు మరో కోణంలో తెలుసుకోవాలని కోరుకునేవారు. అందుకే వారు బీబీసీ వార్తలను వినేవారు. నేను బీబీసీలో పనిచేశాను. అందుకే నాకు అంతటి గుర్తింపు లభించింది'' అని మార్క్ టలీ చెప్పారు.

దీన్ని కొనసాగింపుగా సంజీవ్ శ్రీవాస్తవ, ''ఈ రోజు కూడా మేం శ్రోతల మధ్యకు లేదా ప్రముఖుల వద్దకు వెళ్లినప్పుడు, 'మార్క్ టలీ ఎక్కడ ఉన్నారు?' అని అడుగుతుంటారు. బీబీసీ అంటే మార్క్ టలీ అనే స్థాయిలో గుర్తింపు సాధించినందుకు మీకు ఎలా అనిపిస్తుంది?' అని ప్రశ్నించారు.

దీనికి మార్క్ టలీ.. ''లేదు, నేను అలా భావించను. ఒకవేళ అలా అనుకుంటే, నాకు అహంకారం పెరుగుతుంది. అహంకారం అనేది పాత్రికేయ వృత్తికి అస్సలు మంచిది కాదు. అహంకారమే జర్నలిజంలో అతిపెద్ద పాపం అని నేను యువ జర్నలిస్టులకు చెబుతుంటాను'' అని చెప్పారు.

''ఉదాహరణకు, నేను జుల్ఫికర్ అలీ భుట్టో ఉరిశిక్ష గురించి రిపోర్టింగ్ చేశాను. అది నా స్టోరీ కాదు, భుట్టో స్టోరీ. అందుకే ప్రజలు నన్ను చాలా గొప్పవాడు అని అన్నప్పుడు, నాలో ఎక్కడ అహం పెరుగుతుందోనని భయపడుతుంటాను'' అని మార్క్ టలీ సమాధానమిచ్చారు.

మార్క్ టలీ

ఫొటో సోర్స్, Getty Images

అయోధ్యలో భయంకరమైన అనుభవం...

అయోధ్యలోని ఒక పురాతన మసీదును 1992లో ఒక భారీ హిందూ సమూహం కూల్చివేస్తున్న సమయంలో మార్క్ టలీ ప్రత్యక్షంగా చూశారు. బీబీసీ పట్ల సందేహంతో ఆ సమూహంలో కొంతమంది మార్క్ టలీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన్ను బెదిరించారు.

స్థానిక అధికారి ఒకరు, ఓ హిందూ పూజారి వచ్చి ఆయన్ను రక్షించేవరకూ ఆయన కొన్ని గంటల పాటు ఒక గదిలో బందీగా గడిపారు.

బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన తరువాత కొన్నేళ్లకు మార్క్ టలీ.. భారతదేశ లౌకికవాదానికి ఇది అతిపెద్ద విఘాతం అని వ్యాఖ్యానించారు.

1965‌లో భారతదేశానికి బీబీసీ ప్రతినిధిగా టలీ వచ్చినప్పటి చిత్రం
ఫొటో క్యాప్షన్, 1965‌లో భారతదేశానికి బీబీసీ ప్రతినిధిగా టలీ వచ్చినప్పటి చిత్రం

భారతదేశమే టలీ ఇల్లు...

బ్రిటిష్ పాలనాకాలంలో 1935 సంవత్సరంలో టలీ కలకత్తాలో జన్మించారు. ఆయన తండ్రి ఒక వ్యాపారవేత్త. ఆయన తల్లి జన్మస్థలం కూడా బెంగాలే. వారి కుటుంబం తరతరాలుగా భారతదేశంలో వ్యాపారులుగా, అధికారులుగా పనిచేశారు.

ఆయన బాల్యంలో ఒక ఆంగ్లేయ సంరక్షకురాలి పర్యవేక్షణలో పెరిగారు.

మార్క్ టలీ హిందీ భాషలో ఎంతో ప్రావీణ్యం సంపాదించారు. దిల్లీలోని విదేశీ జర్నలిస్టుల బృందంలో ఇది చాలా అరుదైన విషయం.

ఆయన భారతీయులకు ఎంతో దగ్గరయ్యారు. ఆయన్ను ప్రేమగా 'టలీ సాహెబ్' అని పిలిచేవారు.

రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత, టలీ తన తొమ్మిదేళ్ల వయసులో చదువు కోసం బ్రిటన్ వెళ్లారు.

మత గురువు కావాలనేది ఆయన చిన్ననాటి లక్ష్యం. ఇందుకోసం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చరిత్ర, థియాలజీ అభ్యసించారు. కానీ జర్నలిస్టుగా మారారు.

బీబీసీ తరఫున 1965లో మళ్లీ భారతదేశానికి వచ్చారు.

క్షేత్ర పర్యటనలో మార్క్ టలీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, క్షేత్ర పర్యటనలో మార్క్ టలీ

వార్తలు చెప్పడంలో విలక్షణమైన తీరు

భారతదేశంలో సంఘటనలపై వార్తలు చెప్పే మార్క్ టలీ తీరు విలక్షణంగా ఉండేది. భారతదేశంలోని పేదరికం, కుల అసమానతల పట్ల ఆయన వైఖరిని కొందరు విమర్శించేవారు.

మరికొందరు మతపరమైన సహనం పట్ల ఆయనకున్న నిబద్ధతను ఎంతగానో మెచ్చుకునేవారు.

జర్నలిస్టుగా ఆయన దేశమంతటా పర్యటించేవారు.

1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు, కేవలం 24 గంటల నోటీసుతో మార్క్ టలీని భారతదేశం నుంచి బహిష్కరించారు.

కానీ, 18 నెలల తర్వాత ఆయన మళ్లీ తిరిగొచ్చారు.

నాటి నుంచి దిల్లీలోనే నివాసం ఏర్పాటుచేసుకున్నారు.

దిల్లీలో బీబీసీ బ్యూరో చీఫ్‌గా 20 ఏళ్లకు పైగా పనిచేశారు.

తర్వాత బీబీసీ నుంచి బయటకు వచ్చేసినా, బీబీసీ రేడియో 4లో 'సంథింగ్ అండర్‌స్టుడ్' అనే కార్యక్రమం ద్వారా ఆధ్యాత్మిక అంశాలపై ప్రసంగాలను కొనసాగించారు.

మార్క్ టలీ

ఫొటో సోర్స్, Getty Images

అరుదైన గౌరవాలు, పురస్కారాలు...

భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మశ్రీ, పద్మవిభూషణ్ మార్క్ టలీ అందుకున్నారు.

బ్రిటన్ బ్రాడ్‌కాస్టింగ్, జర్నలిజం రంగాల్లో టలీ సేవలకు గాను 2002లో ఆయనకు నైట్‌హుడ్ ప్రకటించింది. ఈ పురస్కారం లభించినప్పుడు, దానిని 'భారతదేశానికి లభించిన గౌరవం' అని టలీ అభివర్ణించారు.

ఆయన తన భాగస్వామి గిలియన్ రైట్‌తో కలిసి భారతదేశంపై అనేక పుస్తకాలు, వ్యాసాలు, కథలు, విశ్లేషణలు రాశారు.

దక్షిణ దిల్లీలోనే ఎంతో నిరాడంబరమైన జీవితాన్ని గడిపారు.

కానీ టలీ ఎప్పుడూ తన బ్రిటిష్ పౌరసత్వాన్ని వదులుకోలేదు. కానీ 'ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా' పౌరసత్వం పొందినందుకు ఎంతో గర్వపడేవారు.

'నేను ఏ రెండు దేశాల (భారతదేశం, బ్రిటన్)కు చెందినవాడినని భావిస్తానో, ఆ రెండు దేశాల పౌరుడిని అయ్యాను'' అని టలీ ఆనందంగా చెప్పేవారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)