అమెరికాలో నిరసనలు: ఫెడరల్ ఏజెంట్ల కాల్పుల్లో ఒకరి మృతి.. చేతిలో గన్ ఉందంటున్న అధికారులు, ఫోన్ తప్ప ఇంకేం లేదంటున్న ప్రత్యక్ష సాక్షులు.. వీడియోల్లో ఏం కనిపిస్తోంది?

ఫొటో సోర్స్, Michael Pretti/AP
- రచయిత, ఈఫా వాల్ష్, ఒలివియా ఐర్లాండ్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
అమెరికాలోని మినియాపొలిస్‌లో ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ అధికారులు శనివారం ఒకరిని కాల్చిచంపారు. మృతుడిని 37ఏళ్ల అలెక్స్ ప్రెట్టీగా స్థానిక అధికారులు గుర్తించారు.
వలసలపై ట్రంప్ పాలన కఠిన చర్యలు మొదలుపెట్టిన తర్వాత ఈ నెలలో ఇలా కాల్పుల్లో చనిపోయిన రెండో వ్యక్తి అలెక్స్ ప్రెట్టీ.
అమెరికా పౌరుడైన అలెక్స్ ప్రెట్టీ మినియాపొలిస్‌లో నివసిస్తారు. నర్స్‌గా పనిచేస్తున్నారు.
ప్రెట్టీపై కాల్పులను వ్యతరేకిస్తూ అమెరికావ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి.
ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యకలాపాలకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి.


ఫొటో సోర్స్, EPA
‘చేతిలో ఉంది గన్ కాదు ఫోన్’
బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లకు, ప్రెట్టీకి మధ్య జరిగిన గొడవకు సంబంధించి వీడియోలు బయటకు వచ్చాయి. ఈ ఘర్షణే కాల్పులకు దారితీసింది.
అలెక్స్ ప్రెట్టీ దగ్గర హ్యాండ్ గన్ ఉందని, ఆ తుపాకీ తీసుకునేందుకు ఏజెంట్లు చేసిన ప్రయత్నాన్ని ఆయన అడ్డుకున్నారని, ఆ క్రమంలో ఆత్మరక్షణ కోసం ఏజెంట్లు కాల్పులు జరిపారని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ(డీహెచ్ఎస్) తెలిపింది.
అయితే ఈ మాటలను ప్రత్యక్షసాక్షులు, స్థానిక అధికారులు, మృతుని కుటుంబ సభ్యులు అంగీకరించడం లేదు.
అలెక్స్ ప్రెట్టీ చేతిలో ఫోన్ ఉందని, ఆయుధం లేదని చెప్పారు. ఏం జరిగిందనేదానిపై అధికార యంత్రాంగం దారుణమైన అబద్ధాలు వ్యాప్తి చేస్తోందని అలెక్స్ తల్లిదండ్రులు ఆరోపించారు.
''మా కుమారుడికి సంబంధించిన నిజాన్ని బయటకు తేవాలి'' అని విజ్ఞప్తి చేశారు.
రెండు వారాల క్రితం ఇలాంటి కాల్పుల్లోనే రిన్నీ నికోలే అనే మహిళ చనిపోయారు. ఇది నిరసనలకు దారితీసింది. ఫెడరల్ ఏజెంట్లు నగరం విడిచి వెళ్లాలని స్థానిక నాయకులు పిలుపునిచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
కాల్పులకు ముందు ఏం జరిగింది?
అమెరికా కాలమానం ప్రకారం శనివారం ఉదయం 9.05నిమిషాలకు దక్షిణ మినియాపొలిస్‌లోని నికోలెట్ అవెన్యూ, 26వ వీధిలో కాల్పులు జరిగాయి.
ఇమ్మిగ్రేషన్ ఆపరేషన్‌ను ఏజెంట్లునిర్వహిస్తుండంగా అలెక్స్ ప్రెట్టీ ''9ఎంఎం సెమీ-ఆటోమ్యాటిక్'' హ్యాండ్‌గన్‌తో ఏజెంట్ల దగ్గరకు వచ్చారని బోర్డర్ పెట్రోల్ కమాండర్ గ్రెగ్ బొవినో ఆరోపించారు.
అలెక్స్ ప్రెట్టీ తుపాకీ చూపించారో లేదో బోవినో చెప్పలేదు కానీ ఏజెంట్లు ఆయన చేతిలోని గన్ తీసుకోవడానికి ప్రయత్నించారని, దాన్ని ప్రెట్టీ ''హింసాత్మకంగా అడ్డుకున్నారు'' అన్నారు. ఆ తర్వాత బోర్డర్ పెట్రోల్ అధికారి ''రక్షణాత్మకంగా కాల్పులు జరిపారు''అని చెప్పారు.
కాల్పులకు ముందు తీసిన వీడియోల్లో అలెక్స్ ప్రెట్టీ రోడ్డు మధ్యలో నిలబడి తన ఫోన్‌తో ఏజెంట్లను వీడియో తీస్తున్నట్టు కనిపిస్తోంది. వెనకవైపు నుంచి జనం అరుపులు, విజిల్ శబ్దాలు వినిపిస్తున్నాయి.
ఓ వైపు నుంచి ఓ ఏజెంట్ ఒక మహిళను నెట్టివేస్తున్నారు. కెమెరా వెనకవైపు తిప్పినప్పుడు అలెక్స్ తన చేతిని ఆమె చుట్టూవేసి పట్టుకున్నారు. తర్వాత ఏజెంట్ మరో మహిళను నెట్టివేశారు. అదే సమయానికి అలెక్స్ తన చేతిని చాపి రెండో మహిళకు, ఏజెంట్‌కు మధ్య వెళ్లి నిల్చున్నారు.

ఫొటో సోర్స్, Michael Pretti/AP
‘10సార్లు కాల్చిన శబ్దం’’
అప్పుడు ఏజెంట్ ఆయన కళ్లల్లో స్ప్రే కొట్టారు. ప్రెట్టీ తన ముఖాన్ని పక్కకు తిప్పుకుని ఓ చేతిని పైకి ఎత్తారు. మరో చేతిలో ఫోన్ ఉన్నట్టు కనిపిస్తోంది. అక్కడ తుపాకీ కనిపించడం లేదు.
ఇంకో యాంగిల్‌లో ఉన్న మరో వీడియోలో ఏజెంట్ ప్రెట్టీని చేత్తో లాగేస్తున్నారు. తర్వాత మరింతమంది ఏజెంట్లు వచ్చారు.
ప్రెట్టీని నేలమీద పడేశారు. ఆయన మీద ఆరుగురు ఏజెంట్లున్నారు. ఓ ఏజెంట్ ఆయన తలపై కొట్టారు.
మరో అధికారి అక్కడకు ఖాళీ చేతులతో వచ్చినట్టు కనిపించింది. తిరిగి వచ్చేటప్పుడు ఆయన చేతిలో గన్ కనిపించింది.
ఆ తర్వాత ఆయన వాహనం వైపు వెళ్లిన మరుక్షణమే మరో ఏజెంట్ ఆయన పక్కన నిల్చుని కాల్పులు ప్రారంభించారు.
నేలమీద పడిపోయిన వ్యక్తి నుంచి ఏజెంట్లు దూరంగా జరిగారు. కాల్పులు కొనసాగాయి. మొత్తం 10సార్లు కాల్పుల శబ్దం వినిపించింది.

ఫొటో సోర్స్, Reuters
తుపాకీ ఎక్కడిది?
కాల్పుల తర్వాత డీహెచ్ఎస్ సోషల్ మీడియాలో ఓ తుపాకీ ఫోటో పోస్టు చేసింది. అది ప్రెట్టీకి చెందినదని తెలిపింది. ప్రెట్టీ దగ్గర రెండు మ్యాగజీన్స్ ఉన్నాయని, గుర్తింపు పత్రాలు లేవని చెప్పింది.
''చట్టాన్ని అమలుచేయాలుకునేవారికి నష్టం కలిగించాలని, వారిని హతమార్చాలని ఆ వ్యక్తి భావించినట్టుగా అక్కడి పరిస్థితి ఉంది'' అని బోవినో రిపోర్టర్లకు చెప్పారు. ఆయన ఇతర ఆధారాలేవీ చూపించలేదు.
ప్రెట్టీ ఆయుధాన్ని తీసుకెళ్లడానికి అనుమతి ఉన్న వ్యక్తి కావొచ్చని మినియాపొలిస్ పోలీస్ చీఫ్ బ్రయాన్ ఓ హరా చెప్పారు.
గతంలో ఆయనకు సంబంధించి ఉన్న ఒకే ఒక సమస్యాత్మక అంశం పార్కింగ్ టికెట్లని చెప్పారు.
ఫెడరల్, స్థానిక అధికారులకు మధ్య ఘర్షణాత్మక పరిస్థితులు ఉన్నట్టు కనిపిస్తోంది. డీహెచ్ఎస్ ఈ ఘటనపై ''ఎలాంటి ప్రత్యేక వివరాలు'' అందించలేదని పోలీస్ చీఫ్ చెప్పారు.
ప్రెట్టీ చేతిలో తుపాకీ ఉందా లేదా అని అడిగిన ప్రశ్నకు.. ''చట్టం అమలును అడ్డుకునేలా కొందరు కనిపించారు. మా ఆఫీసర్లను అవమానించారు''అని హోంలాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టి నోయమ్ చెప్పారు.
''తమకు శిక్షణ ఇచ్చిన ప్రకారం వారు స్పందించారు. అధికారులు, చుట్టుపక్కల ఉన్న ప్రజల ప్రాణాలను కాపాడడానికి చర్యలు తీసుకున్నారు. శాంతియుతంగా నిరసన చేసే ఎవరైనా ప్లకార్డులకు బదులు తుపాకీ చూపిస్తారని నాకు తెలియదు'' అని ఆమె అన్నారు.

‘అసలు నిజం చెప్పండి’
ఫెడరల్ ఏజెంట్ల కార్యకలాపాలకు ప్రత్యక్షసాక్షులుగా ఉండడానికి, వాటిని చిత్రీకరించానికి ప్రయత్నించే ప్రజలకు ఎదురయ్యే సమస్యలను తాను అర్ధం చేసుకోగలనని మిన్నెసోటా గవర్నర్, డెమోక్రాట్ టిమ్ వాల్జ్ చెప్పారు.
''థాంక్ గాడ్, థాంక్ గాడ్, మనకు వీడియో దొరికింది. ఆ ఏడుగురు హీరోల్లా ఏదో సైన్యంపై దాడిచేసినట్టు డీహెచ్ఎస్ చెబుతోంది. ఇది పూర్తిగా అబద్దం. ఇవి అర్ధం లేని మాటలు'' అని అన్నారు.
'నిజం' చెప్పాలని ప్రెట్టీ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
''మా అబ్బాయి గురించి అసలు నిజం బయటకు రావాలి'' అని అలెక్స్ ప్రెట్టీ తల్లిదండ్రులు మైఖేల్, సుసాన్ కోరారు.
''మా గుండె పగిలింది, మాకు చాలా కోపంగా ఉంది. ప్రభుత్వం మా కుమారుడిపై దారుణమైన అబద్ధాలు వ్యాప్తిచేస్తోంది.
ఫెడరల్ ఏజెంట్లతో మాట్లాడుతున్నప్పుడు ప్రెట్టీ దగ్గర తుపాకీ లేదని వీడియోల్లో కనిపిస్తోంది. ప్రెట్టీ ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నారు. మరో చేత్తో పెప్పర్ స్ప్రే కొడుతున్న ఏజెంట్ నుంచి ఓ మహిళను కాపాడుతున్నారు.
ప్రెట్టీ ఎంతో దయార్ధ్రహృదయం ఉన్న వ్యక్తి అని, కుటుంబాన్ని, స్నేహితులను చాలా జాగ్రత్తగా చూసుకుంటారని, మినియాపొలిస్‌లోని వీఏ ఆస్పత్రిలో ఐసీయూ నర్స్‌గా పనిచేస్తున్న ప్రెట్టీ అందరినీ బాగా చూసుకుంటాడని తల్లిదండ్రులు చెప్పారు.
ఈ ప్రపంచంలో మార్పు తేవాలని ప్రెట్టీ అనుకున్నారు. ఆయన ఎంత ప్రభావం చూపించారో గమనించడానికి దురదృష్టవశాత్తూ ఆయన లేరు.
''మా అబ్బాయి చాలా మంచివాడు. అసలు నిజం బయటకు చెప్పండి'' అని వారు కోరారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










