ఐక్యరాజ్యసమితిలో అనుకూలంగా ఓటు, ఇండియాకు థ్యాంక్స్ చెప్పిన ఇరాన్...

ఫొటో సోర్స్, Getty Images
ప్రభుత్వ వ్యతిరేక నిరసనలపై ఇరాన్ అణిచివేతను ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి వ్యతిరేకంగా భారత్ ఓటు వేసింది.
ఇరాన్ ప్రభుత్వ 'క్రూరమైన అణచివేత చర్యలను' నిలిపివేయాలని పిలుపునిచ్చే ఈ తీర్మానాన్ని 47 మంది సభ్యుల మండలి ఆమోదించింది.
మండలిలోని 25 మంది సభ్యులు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయగా, 14 మంది గైర్హాజరయ్యారు. భారత్, చైనా, పాకిస్తాన్, ఇండోనేషియా, ఇరాక్, వియత్నాం, క్యూబాలు తీర్మానాన్ని వ్యతిరేకించాయి.
తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసినందుకు న్యూదిల్లీలోని ఇరాన్ రాయబారి మొహమ్మద్ ఫతాలి భారతదేశానికి కృతజ్ఞతలు తెలిపారు. చాబహార్ పోర్టుపై అమెరికా తిరిగి ఆంక్షలు విధించడానికి సిద్ధమవుతున్న తరుణంలో, భారతదేశం ఇరాన్ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసింది.
"ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌కు సూత్రప్రాయంగా, దృఢంగా మద్దతు ఇచ్చినందుకు భారత ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ వైఖరి న్యాయం, బహుపాక్షికత, జాతీయ సార్వభౌమాధికారం పట్ల భారత నిబద్ధతను ప్రతిబింబిస్తుంది" అని మొహమ్మద్ ఫథాలి ఎక్స్ పోస్టు ద్వారా తెలిపారు.

ఇరాన్‌లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పతనమవుతున్న కరెన్సీకి వ్యతిరేకంగా డిసెంబర్ 28న ఈ నిరసనలు ప్రారంభమయ్యాయి. ఆ తరువాత నిరసనలు ఊపందుకున్నాయి. మతపరమైన పాలనను అంతం చేయాలని డిమాండ్ చేస్తూ 100కు పైగా నగరాల్లో నిరసనలు జరిగాయి.
వేలాది మంది మరణానికి దారితీసిన 'శాంతియుత ప్రదర్శనలపై హింసాత్మక అణచివేతను ఖండిస్తున్నట్లు' మండలి తన తీర్మానంలో పేర్కొంది.
ఇరాన్ ప్రభుత్వం "తన మానవ హక్కుల బాధ్యతను గౌరవించాలి, రక్షించాలి, నెరవేర్చాలి" అని సూచించింది.
చట్టవిరుద్ధ హత్యలు, అదృశ్యాలు, ఏకపక్ష అరెస్టులను నిరోధించడానికి చర్యలు తీసుకోవాలని ఈ తీర్మానం ఇరాన్‌ను కోరింది.

ఫొటో సోర్స్, AFP via Getty Images
ఇరాన్‌కు భారత్ ఎందుకు మద్దతు ఇచ్చింది?
ఇరాన్‌కు అనుకూలంగా భారత్ నిర్ణయం తీసుకోవడంపై మాజీ విదేశాంగ కార్యదర్శి నిరుపమ రావు ఎక్స్ పోస్టులో స్పందించారు.
‘‘ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కౌన్సిల్‌లో ఇరాన్‌పై తీర్మానానికి వ్యతిరేకంగా ఓటువేయడాన్ని భారత్ వివరించింది. ఆ తీర్మానంలో భాష ఒకరిని లక్ష్యంగా చేసుకున్నట్లు ఉంది. ఆ తీర్మానం రాజకీయ ప్రేరేపితమైనది. నిర్మాణాత్మకంగా లేదంది.
దేశాలను లక్ష్యంగాచేసుకుని చేసే ఇలాంటి తీర్మానాలు మానవ హక్కులను మెరుగుపరచడం కంటే పరిస్థితులను తీవ్రంగా మారుస్తాయని భారత్ వాదించింది. బహిరంగంగా విమర్శించడంకంటే దేశంలో పరిస్థితులను మెరుగుపరుచుకోవాలని సూచించడం మంచిదని తెలిపింది.
ఇరాన్ అణిచివేత చర్యలను, మానవ హక్కుల ఉల్లంఘనలపై వచ్చిన రిపోర్టులను భారత్ సమర్థించలేదు. ఓ దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించేలా ఉండడం, లక్ష్యంగా మార్చుకోవడం, అవమానించేలా ఉన్న విధానాలను భారత్ వ్యతిరేకిస్తోంది. భారత విధానం చైనా, పాకిస్తాన్‌లకు భిన్నంగా ఉంటుంది. బాహ్య పర్యవేక్షణను వ్యతిరేకించడం చైనా అంతర్గత వ్యవస్థలో ఉంది. పాకిస్తాన్ తరచూ చైనా, ఓఐసీలను అనుసరిస్తుంది. భారత్ మాత్రం చాలా పరిమితమైన, విధానపరమైన ప్రక్రియ అవలంబిస్తుంది. దేశాలపై ప్రత్యేక తీర్మానాల విషయంలో ఉన్న అనుమానాల ప్రభావం దీనిపై ఉంది.
ఇందులో ఓ అంతర్లీన అంశం కూడా ఉంది. ఇప్పుడు ఇరాన్‌కు వ్యతిరేకంగా ఉపయోగిస్తున్నవాటిని రేపు రాజకీయ పరిస్థితులు మారితే కశ్మీర్ లేదా అంతర్గత భద్రత అంశాలపై భారత్‌కు వ్యతిరేకంగా వాడతారన్న అప్రమత్తత దీని వెనక దాగి ఉంది.
మొత్తంగా ఆ ఓటు భారత్ ఇరాన్ విషయంలో అనుసరించే విస్తృత విధానానికి అనుగుణంగా ఉంది. కార్యనిర్వహణ సంబంధాలను కొనసాగించడం, నైతిక బలప్రదర్శనకు దూరంగా ఉండడం, బహిరంగంగా తీవ్ర విమర్శలు చేయకుండా మౌనంగా దౌత్యం కొనసాగించడం ఈ విధానం’’ అని నిరుపమా రావు అన్నారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
తీర్మానంలో ఏముంది?
ఐస్‌లాండ్ రాయబారి ఐనా గున్నార్సన్ ఓటింగ్‌కు ముందు తీర్మానాన్ని ప్రవేశపెడుతూ ‘‘దేశంలోని భయం, జరుగుతున్న నేరాలకు శిక్షలు లేని వాతావరణం మంచిది కాదు. న్యాయం, జవాబుదారీతనాన్ని పొందే అర్హత బాధితులకు, ఈ అరాచకాల నుంచి తప్పించుకున్నవారికీ ఉంది" అన్నారు.
ఇరాన్‌పై స్పెషల్ రిపోర్టర్ పదవీకాలాన్ని మరో సంవత్సరం పొడిగిస్తున్నట్లు తీర్మానంలో ఉంది. ఇరాన్ మహిళ మహాస అమిని నిర్బంధంలో మరణించడంతో నిరసనలు చెలరేగడం, అణిచివేతలు పెరగడంతో 2022 నవంబర్‌లో ఫ్యాక్ట్ ఫైండింగ్ మిషన్‌ను ఏర్పాటు చేశారు. దాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తున్నట్లు ప్రస్తుత తీర్మానంలో తెలిపారు.
ఇటీవలి నిరసనలకు సంబంధించిన "తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలు, దురాగతాలు, నేరాలకు సంబంధించిన ఆరోపణలు" మీద దర్యాప్తు చేయడానికి విచారణ కమిటీకి ఈ తీర్మానం అధికారం ఇస్తుంది.

ఫొటో సోర్స్, AFP via Getty Images
మానవ హక్కుల చీఫ్ ఏం చెప్పారు?
భద్రతా దళాలు నిరసనకారులపై 'ప్రత్యక్ష కాల్పులు' జరిపాయని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ వోల్కర్ టుయెర్క్ అన్నారు. పిల్లలు సహా వేలమంది మరణించారని తెలిపారు.
"ఇరాన్ అధికారులు తమవైఖరిని పునఃపరిశీలించుకోవాలని, వెనక్కి తగ్గాలని, తొందరపాటు విచారణలు, ఉరిశిక్షలతో సహా క్రూరమైన అణచివేతను ఆపేయాలని కోరుతున్నాను" అన్నారు వోల్కర్.
"ఇరాన్ అధికారులు ఏకపక్షంగా నిర్బంధించిన వారందరినీ వెంటనే విడుదల చేయాలి, మరణశిక్షను పూర్తిగా నిలిపివేయాలి" అన్నారు.
"గత వారాలలో జరిగిన భయానక సంఘటనలకు జవాబుదారీతనం ఉండాలి. మానవ హక్కులను వినియోగించుకున్నందుకు, చట్టబద్ధమైన డిమాండ్లు చేసినందుకు మరణించిన, గాయపడిన లేదా నిర్బంధంలో ఉన్న వారందరికీ న్యాయం చేయాలి" అని యూరోపియన్ యూనియన్ ప్రతినిధి మిచెల్ సెర్వోన్ డి'ఉర్సో డిమాండ్ చేశారు.
"ఇరాన్ వీధుల్లో హత్యలు తగ్గి ఉండవచ్చు, కానీ క్రూరత్వం కొనసాగుతోంది" అని వోల్కర్ ఆరోపించారు.
నిర్బంధంలోని వేలాది మందికి ఎటువంటి ఉపశమనం ఉండదని ఈవారం ఇరాన్ జ్యుడీషియరీ చీఫ్ చెప్పడం 'భయంకరమైన పరిణామం' అన్నారు.
నిర్బంధంలో ఉన్న వారికి ఉరిశిక్ష విధిస్తారా, లేదా అనే దానిపై ఇరాన్ అధికారులు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని చెప్పారు.
ప్రపంచంలో అత్యధికంగా ఉరిశిక్షలు అమలు చేసిన దేశాలలో ఇరాన్ ఒకటని, గత సంవత్సరం కనీసం 1500 మందిని ఉరితీసినట్లు వోల్కర్ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
ఇరాన్ విమర్శలు
ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి అత్యవసర సమావేశం బూటకమని, ఇరాన్‌పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నమని ఇరాన్ రాయబారి అలీ బహ్రెయిని విమర్శించారు.
ఈ తీర్మానం "పూర్తిగా అసమతుల్యంగా, పక్షపాతంగా, రాజకీయంగా ప్రేరేపితమైనదిగా కనిపిస్తోందని అలీ సహోద్యోగి సోమాయే కరీమ్‌దూస్ట్ అభివర్ణించారు.
ఈ సమయంలో, పలు దేశాలు ఇరాన్‌కు మద్దతుగా నిలిచాయి.
క్యూబా రాయబారి రోడాల్ఫో బెనిటెజ్ ఈ సమావేశాన్ని 'ఖండించదగిన కపటత్వం'గా అభివర్ణించారు.
"మానవ హక్కుల పేరుతో దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తాం" అని చైనా రాయబారి జియా గైడ్ బీజింగ్ అన్నారు.
ఇరాన్‌లో రెండు వారాల ఇంటర్నెట్ షట్‌డౌన్ కారణంగా తమ పనికి ఆటంకం కలుగుతోందని, మరణించిన వారి డేటాను సేకరిస్తున్న ప్రభుత్వేతర సంస్థలు, వోల్కర్ కార్యాలయం చెబుతున్నాయి.
కాగా, డిసెంబర్ చివరిలో సామూహిక నిరసనలు ప్రారంభమైనప్పటి నుంచి దేశంలో 3,117 మంది మరణించారని ఇరాన్ అధికారులు బుధవారం ప్రకటించారు.
అయితే, మరణాల సంఖ్య 5 వేలకు పైగా ఉందని అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ శుక్రవారం పేర్కొంది. ఈ గణాంకాలు ఇంకా ఎక్కువగానే ఉండొచ్చని అభిప్రాయపడింది. నార్వేకు చెందిన ఇరాన్ హ్యూమన్ రైట్స్ సంస్థ ఈ మరణాలు 25,000కి చేరుకోవచ్చని హెచ్చరించింది.
మరోవైపు, ఇరాన్‌పై దాడి చేయడానికి ఇజ్రాయెల్ ఇప్పటికీ అవకాశాల కోసం వెతుకుతున్నట్లు సమాచారం ఉందని తుర్కియే విదేశాంగ మంత్రి హకన్ ఫిడాన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారని బీబీసీ పర్షియన్ సర్వీస్ తెలిపింది.
అలాంటి చర్య ఈ ప్రాంతంలో మరింత అస్థిరతను సృష్టిస్తుందని హకన్ ఫిడాన్ అన్నారని తెలిపింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












