బోరాక్స్: క్యారమ్‌ బోర్డు మీద వాడే ఈ పౌడర్‌ను తిని బరువు తగ్గాలనుకున్న విద్యార్థిని మృతి, అసలేంటి ఈ బోరాక్స్, ప్రాణం తీసేంత ప్రమాదమా?

బోరాక్స్

ఫొటో సోర్స్, Getty Images/BBC

ఫొటో క్యాప్షన్, బోరాక్స్ (నమూనా చిత్రం), కలైయరసి
    • రచయిత, జేవియర్ సెల్వకుమార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బరువు తగ్గేందుకు ఒక యూట్యూబ్ చానల్‌లో చెప్పిన సమాచారాన్ని నమ్మి బోరాక్స్‌ను తిన్న ఒక కాలేజీ విద్యార్థిని మృతిచెందారు. ఈ ఘటన మదురై లో జరిగింది.

మదురైలోని సెల్లూర్, మీనాంబాలపురానికి చెందిన కలైయరసి ఒక ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటున్నారు.

''కలైయరసి కాస్త బరువు ఎక్కువగా ఉండేవారు. ఒక యూట్యూబ్ చానల్‌ చెప్పిన విషయాన్ని నమ్మి ఆమె స్థానిక మందుల షాపు నుంచి బోరాక్స్‌ను కొన్నారు. దాన్ని తినడం వల్ల బరువు తగ్గుతానని ఆమె అనుకున్నారు'' అని పోలీసులు తెలిపారు.

బోరాక్స్‌ను తిన్న కొద్దిసేపటి తర్వాత.. కలైయరసి బాగా వాంతులు చేసుకుని, అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స తర్వాత తిరిగి ఇంటికి తీసుకొచ్చారు.

కానీ, ఆరోజు రాత్రి మళ్లీ ఆమె ఆరోగ్యం క్షీణించింది. వెంటనే మదురై లోని ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్న సమయంలో ఆమె మృతి చెందారు.

దీనిపై సెల్లూరు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు చెప్పారు.

యూట్యూబ్ చానల్‌లో వీడియో చూసిన తర్వాతనే కలైయరసి బోరాక్స్‌ను కొనుగోలు చేసి, తిన్నట్లు పోలీసులు తెలిపారు.

ఆ పౌడర్‌ను తినొద్దని, యూట్యూబ్ చానల్‌లో చూసిన దాన్ని నమ్మవద్దని తాను చెప్పానని కలైయరసి తండ్రి వేల్ మురుగన్ మీడియాకు చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

‘తప్పుడు సూచనలిచ్చే యూట్యూబ్ చానళ్లను నిషేధించాలి’

బోరాక్స్ (వెలిగారం) ఒక తెల్లటి పౌడర్. నాటు మందుల తయారీలో అత్యంత స్వల్ప పరిమాణంలోనే దీన్ని వాడతారని సిద్ధ వైద్య నిపుణులు చెబుతున్నారు.

సిద్ధ వైద్యం అనేది దక్షిణ భారత్‌లో ముఖ్యంగా తమిళనాడులో అత్యంత ప్రాచీనమైన సంప్రదాయ వైద్య విధానం.

సోడియం బోరేట్‌నే బోరాక్స్‌ అని పిలుస్తారని కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఒకరు చెప్పారు.

ఇదొక రసాయనమని, దీనిలో విషంస్థాయి(టాక్సిసిటీ) రసాయన ఎరువుల్లో మాదిరిగానే ఉంటుందని తెలిపారు.

కలైయరసి మృతి ఘటన తర్వాత వైద్య చికిత్స విషయంలో తప్పుడు సూచనలు ఇచ్చే యూట్యూబ్ చానళ్లను ప్రభుత్వం నిషేధించాలని అల్లోపతి, సిద్ధ వైద్య నిపుణులు కోరుతున్నారు.

బోరాక్స్

ఫొటో సోర్స్, Getty Images

బోరాక్స్ అంటే ఏమిటి?

‘‘బోరాక్స్ అనేది క్యారమ్ బోర్డు ఆడేటప్పుడు కాయిన్స్ సులభంగా కదలడానికి వాడే పౌడర్’’ అని కోయంబత్తూర్‌లోని భారతియార్ యూనివర్సిటీలో కెమిస్ట్రీ ప్రొఫెసర్‌గా పనిచేసే సెల్వరాజ్ చెప్పారు.

''ఇది చాలా మెత్తగా ఉండే పౌడర్. ముఖానికి రాసుకునే పౌడర్‌లో సాధారణంగా దీన్ని చాలా తక్కువ మొత్తంలో కలుపుతారు'' అని బీబీసీతో మాట్లాడుతూ సెల్వరాజ్ తెలిపారు.

''మన మందులలో చాలా తక్కువ మొత్తంలో జింక్‌ను కూడా కలుపుతుంటారు. అయితే, జింక్‌ను నేరుగా తీసుకుంటే, బ్లీచ్ వల్ల కలిగే దుష్ప్రభావాలే కలుగుతాయి'' అని అన్నారు.

సెల్వరాజ్ చెబుతున్న వివరాల ప్రకారం.. సోడియం బోరేట్ అని పిలిచే రసాయనమే ఈ పౌడర్. దీన్నే వాడుక భాషలో బోరాక్స్ అని పిలుస్తారు. కానీ, ఇది ఆహార పదార్థం కాదు.

''ప్యూరిఫికేషన్ కోసం మాత్రమే దీన్నొక ముడి సరుకుగా వాడతారు. నేరుగా తీసుకోవడానికి ఇది అనువైనది కాదు. ఎరువుల మాదిరే ఇది కూడా ఒక రసాయనం'' అని ప్రొఫెసర్ సెల్వరాజ్ వివరించారు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

మందుల తయారీలో బోరాక్స్ పౌడర్‌ను వాడతారని సిద్ధ వైద్య నిపుణులు కె. శివరామన్ తెలిపారు.

''నోటి పూతకు ఒక ఎక్స్‌టర్నల్ మెడిసిన్‌లాగానే (అంటే పుక్కిలించి వేసే లేదా పైన రాసే మందులాగానే) బోరాక్స్‌ను వాడతారు. బరువు తగ్గడం కోసం సిద్ధ వైద్యంలో దీన్ని వాడరు'' అని చెప్పారు.

మందులు వేసుకోవడం వల్ల బరువు తగ్గరని నొక్కి చెప్పిన ఆయన, వ్యాయామం, డైట్ ద్వారానే బరువు తగ్గించుకోవచ్చని సూచించారు.

సిద్ధ వైద్యంలో బోరాక్స్ వాడకం గురించి సిద్ధ వైద్య నిపుణులు వీరబాబు వివరించారు.

''కొన్ని సిద్ధ మందులలో చాలా స్వల్ప పరిమాణంలోనే బోరాక్స్‌ను కలుపుతారు. కానీ, దీన్ని నేరుగా ఒక మెడిసిన్‌లాగా ఇవ్వరు. సరిగ్గా శుద్ధి చేయకుండా దీన్ని వాడితే చాలా ప్రమాదకరం'' అని హెచ్చరించారు.

బోరాక్స్ అనేది విషపూరితం, శరీరానికి ఇది ప్రమాదకరమని చెప్పిన వీరబాబు.. ''నోటి పూతకు, నోరు లేదా పళ్ల సమస్యలకు చాలా స్వల్ప మోతుదుల్లో దీన్ని ఇస్తారు. కానీ, ఇది బరువు తగ్గించే మెడిసిన్ కాదు'' అని తెలిపారు.

బోరాక్స్

ఫొటో సోర్స్, Getty Images

బోరాక్స్ తిన్న తర్వాత వచ్చే ప్రభావాలేంటి?

బోరాక్స్‌ను స్వల్ప పరిమాణంలో తీసుకంటే, పెద్దగా ప్రమాదం ఉండదని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, లాపరోస్కోపిక్ సర్జన్ వి.జి మోహన్ ప్రసాద్ తెలిపారు.

వి.జి మోహన్ ప్రసాద్ ప్రస్తుతం ఇండియన్‌ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ప్రెసిడెంట్‌.

''స్వచ్ఛమైన బోరాక్స్ పౌడర్‌ను చాలా తక్కువ మోతాదులో తీసుకుంటే ఏం కాదు. కానీ, పెద్ద మొత్తంలో తీసుకుంటే, స్వల్ప వ్యవధిలోనే శరీరమంతా విషం పాకుతుంది. ఆ వ్యక్తికి సీరియస్ అవుతుంది. డయేరియా, వాంతులు అవుతాయి. కొంతమందికి మూర్ఛ కూడా రావొచ్చు. సకాలంలో చికిత్స ఇచ్చినా, కొన్నిసార్లు ఆ వ్యక్తి ప్రాణం కాపాడటం కష్టమవుతుంది'' అని మోహన్ ప్రసాద్ చెప్పారు.

''ఒకవేళ ఎవరైనా ప్రమాదవశాత్తు దీన్ని తింటే, గంట వ్యవధిలోనే ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించాలి. ఒక ట్యూబ్‌ను వారి శరీరంలోకి పంపి, విషాన్ని బయటికి తీసి కాపాడతారు'' అని తెలిపారు.

గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ వి.జి మోహన్ ప్రసాద్
ఫొటో క్యాప్షన్, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, లాపరోస్కోపిక్ సర్జన్ వి.జి మోహన్ ప్రసాద్

ఏమాత్రం ఆలస్యమైనా.. బోరాక్స్‌లోని టాక్సిసిటీ (విషం) శరీరంలోని అంతర్గత అవయవాలపై ప్రభావం చూపుతుందని చెప్పారు. తక్కువ సమయంలోనే కిడ్నీలు పనిచేయకుండా పోతాయని, రక్తస్రావం అవుతుందని తెలిపారు.

ఇటీవల చాలామంది యూట్యూబ్‌లో పోస్టు చేసిన వీడియోలు చూస్తూ... వారికే వారే మందులు వేసుకుంటున్నారని, సొంతంగా వైద్య చికిత్సలు చేసుకుంటున్నారని అల్లోపతి వైద్యులు, సిద్ధ వైద్య నిపుణులు అంటున్నారు.

''సిద్ధ వైద్యంపై ఎలాంటి అధ్యయనం చేయకుండా, పరిశోధనలో ఎటువంటి అనుభవం లేకుండా.. ప్రకృతి వైద్యం పేరుతో ఏవో కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవాలని యూట్యూబ్ చానల్స్ ప్రచారం చేస్తున్నాయి. ప్రభుత్వం వీటిని నిషేధించాలి. యూట్యూబ్ చానల్స్‌లో ఇచ్చే ఇటువంటి వీడియోల పట్ల ప్రజల్ని హెచ్చరించాలి'' అని వీరబాబు కోరారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)