భారత్-ఈయూ వాణిజ్య ఒప్పందం: దీన్ని ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’ అని ఎందుకు అంటున్నారంటే..

ఫొటో సోర్స్, Hindustan Times via Getty Images
- రచయిత, నిఖిల్ ఇనామ్‌దార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెండ్ ఆంటోనియో లూయిస్ శాంటోస్ డా కోస్టా, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్‌లు సోమవారం జరగబోయే భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నారు.
కేవలం ప్రభుత్వం ఇచ్చే అధికారిక విందులు, గణతంత్ర ఉత్సవాల్లో పాల్గొనడమే కాకుండా.. ఇరువురు నేతల ఎజెండాలో మరో ముఖ్యమైన అంశం ఉంది.
అదే ఆసియాలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థతో స్వేచ్ఛా వాణిజ్య చర్చలను మరింత ముందుకు తీసుకెళ్లడం.
యూరప్ అత్యంత క్లిష్టమైన భౌగోళిక రాజకీయ పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో.. ఈ పరిణామం జరగబోతోంది.
గ్రీన్‌లాండ్‌ను అమెరికా స్వాధీనం చేసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న యూరప్ మిత్ర దేశాలతో వాణిజ్య యుద్ధానికి దిగుతానని హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, ఆ తర్వాత ఈ బెదిరింపుల నుంచి ప్రస్తుతం కాస్త వెనక్కి తగ్గారు.

గణతంత్ర దిన వేడుకలకు అతిథుల ఎంపిక కూడా భారత్ అనుసరించే అత్యంత ముఖ్యమైన దౌత్య సందేశాన్ని ప్రపంచానికి తెలియజేస్తోంది.
భారత్‌పై వాషింగ్టన్ విధించిన 50 శాతం సుంకాలపై నెలకొన్న ప్రతిష్టంభన కొత్త ఏడాది కూడా కొనసాగుతోన్న నేపథ్యంలో, ప్రపంచంలోని మిగతా ప్రాంతాలతో వ్యూహాత్మక, వాణిజ్య సంబంధాలను పెంచుకోవడాన్ని దిల్లీ వేగవంతం చేస్తోంది.
''వైవిధ్యమైన విదేశీ విధానాన్ని భారత్ అనుసరిస్తోందనే సంకేతాలను ఇది పంపుతోంది. ఇది ట్రంప్ విధానాలకు, హెచ్చరికలకు లోబడి లేదని తెలియజేస్తోంది'' అని లండన్‌కు చెందిన చాథమ్ హౌస్ థింక్ ట్యాంక్ చియాటీగ్జ్ బాజ్‌పేయి చెప్పారు.
ఉన్నత స్థాయి శిఖరాగ్ర సదస్సులో ఇరువైపుల నేతలు సమావేశమైన తర్వాత జనవరి 27న ఈ ఒప్పందాన్ని ప్రకటించవచ్చని కొన్ని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
వాన్ డెర్ లేయన్, భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ దీన్ని ''మదర్ ఆఫ్ ఆల్ డీల్స్'' (అన్ని ఒప్పందాల కంటే చాలా కీలకమైనది) అని వర్ణించారు.
సుమారు రెండు దశాబ్దాల పాటు ఇరుపక్షాల మధ్య సాగిన సుదీర్ఘ చర్చల తర్వాత, ఒప్పందానికి దగ్గరగా వచ్చిన తమ చర్చలను సఫలం చేయడంపై వారెంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఈ ప్రకటనలు తెలియజేస్తున్నాయి.
గత నాలుగేళ్లలో భారత్‌కు ఇది తొమ్మిదవ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ). అంతకుముందు బ్రిటన్, ఒమన్, న్యూజీలాండ్, ఇతర దేశాలతో భారత్ వరుసగా ఒప్పందాలను కుదుర్చుకున్న తర్వాత ఈ ఒప్పందాన్ని చేసుకోబోతుంది.
ఇక బ్రస్సెల్స్ (యూరోపియన్ యూనియన్) విషయానికి వస్తే.. ఇటీవలే మెర్కోసూర్ ట్రేడింగ్ కూటమితో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది.
దాంతో పాటు జపాన్, దక్షిణకొరియా, వియత్నాంలతో కూడా ఒప్పందాలు చేసుకుంది.
''భౌగోళిక రాజకీయ పరిస్థితులతో తలెత్తుతున్న ముప్పులు, వాణిజ్యరంగంలో గందరగోళ వాతావరణాన్ని సృష్టించడంతో.. రెండు పక్షాలు ఇప్పుడు నమ్మకమైన వాణిజ్య భాగస్వాముల కోసం చూస్తున్నాయి. ఈ ఒప్పందం రెండు పక్షాలకు ప్రయోజనం చేకూర్చనుందని భావిస్తున్నాయి. అమెరికా సుంకాలతో సతమతమవుతోన్న భారత్‌కు, వాణిజ్యపరంగా చైనాపై ఎక్కువగా ఆధారపడటం తగ్గించుకోవాలని చూస్తోన్న ఈయూకి ఈ డీల్ సహకరించనుంది. చైనాను ఈయూ ఇప్పుడు అంత నమ్మకమైనదిగా భావించడం లేదు'' అని ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ సీనియర్ అనలిస్ట్ సుమేధా దాస్‌గుప్తా తెలిపారు.
''భారత్ రక్షణాత్మక విధానాలతో అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందనే పేరును పోగొట్టుకునేందుకు, దిల్లీ చేస్తున్న ప్రయత్నాలకు ఈ ఒప్పందం ఒక మైలురాయిగా నిలవనుంది'' అని దాస్‌గుప్తా అన్నారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
ఎవరికెంత ప్రయోజనం?
ఆర్థికంగా భారత్‌కు ప్రాముఖ్యత పెరుగుతున్న నేపథ్యంలో ఈ దేశంతో సన్నిహిత వాణిజ్య సంబంధాలను ఏర్పాటు చేసుకోవడం యూరోపియన్ యూనియన్‌కు (ఈయూ) చాలా కీలకం.
ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్. అంతేకాక, వేగంగా పెరుగుతున్న ప్రముఖ ఆర్థిక వ్యవస్థ కూడా.
దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదికలో ప్రసంగించిన వాన్ డెర్ లేయన్.. ''భారత్‌తో ఈయూ కూటమి చేతులు కలిపితే, 200 కోట్ల మందికి స్వేచ్ఛాయుత మార్కెట్‌ను సృష్టించవచ్చు. ఇది ప్రపంచ జీడీపీలో పావు వంతు'' అని తెలిపారు.
ఇక భారత విషయానికి వస్తే.. ఈయూ ఇప్పటికే తన అతిపెద్ద వాణిజ్య కూటమి. అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి ఈయూ మార్కెట్లోకి వచ్చే ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను తొలగించే జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ (జీఎస్‌పీ) పునరుద్ధరణకు ఈ డీల్ సహకరించనుంది.
''ఈయూకు భారత్ 76 బిలియన్ డాలర్ల (సుమారు రూ.6,96,106 కోట్లు) విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. అలాగే, 61 బిలియన్ డాలర్ల (సుమారు రూ.5,58,717 కోట్లు) ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోంది. ఇలా వాణిజ్య మిగులును భారత్ ఆర్జిస్తోంది. అయితే, 2023లో ఈయూ జీఎస్‌పీ ప్రయోజనాలను ఉపసంహరించడంతో చాలా భారతీయ ఉత్పత్తులకు పోటీతత్వం తగ్గింది'' అని దిల్లీకి చెందిన గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) అజయ్ శ్రీవాస్తవ తెలిపారు.
''స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) వల్ల కోల్పోయిన మార్కెట్ యాక్సెస్‌ను తిరిగి పొందవచ్చు. దుస్తులు, ఫార్మాస్యూటికల్స్, స్టీల్, పెట్రోలియం ఉత్పత్తులు, మెషినరీ వంటి కీలకమైన ఎగుమతులపై సుంకాలు తగ్గుతాయి. అమెరికా అత్యధిక సుంకాల నుంచి ఎదురవుతోన్న ఇబ్బందుల నుంచి బయటపడేలా ఇది సాయపడుతుంది'' అని శ్రీవాస్తవ చెప్పారు.
అయితే, రాజకీయంగా అత్యంత సున్నితమైన వ్యవసాయం, డెయిరీ ప్రోడక్టులను ఈ ఒప్పందం నుంచి సురక్షితంగా ఉంచాలని భారత్ భావిస్తోంది. అలాగే, కార్లు, వైన్, స్పిరిట్స్ వంటి రంగాలకు క్రమంగా సుంకాలు దిగిరానున్నాయి. యూకేతో కుదిరిన మునపటి ఒప్పందాల్లో అనుసరించిన విధానానికి అనుగుణంగానే ఇది కూడా ఉండనుందని తెలుస్తోంది.
''వాణిజ్య ఒప్పందాల చర్చలను భారత్ దశల వారీగా చేపడుతోంది. రాజకీయంగా సున్నితమైన విషయాలపై తదుపరి రౌండ్ల చర్చలకు పిలుస్తోంది. ఇలా చేయడం ద్వారా ఆర్థిక ప్రయోజనాలతో పాటు భౌగోళిక రాజకీయాల ప్రాముఖ్యత కూడా అంతే ముఖ్యమైనదిగా చెబుతోంది'' అని బాజ్‌పేయి తెలిపారు.

ఫొటో సోర్స్, Anadolu via Getty Images
పురోగతిని పక్కన పెడితే.. రెండు ప్రాంతాల మధ్య లోతైన విభేదాలు దీనిలో కనిపిస్తున్నాయి.
యూరప్‌కు మేధోసంపత్తి హక్కుల రక్షణ ప్రధాన ఆందోళనకర అంశంగా ఉంది. దీనికోసం మెరుగైన డేటా రక్షణ, కఠినమైన పేటెంట్ నిబంధనలను ఇది కోరుకుంటోంది.
ఇక భారత విషయానికొస్తే.. ఈ ఏడాది నుంచి యూరప్ విధిస్తోన్న సీబీఏఎంగా (కార్బన్ బోర్డర్ అడ్జస్ట్‌మెంట్ మెకానిజంగా) పిలిచే సరికొత్త కార్బన్ ట్యాక్స్ ఈ చర్చలలో ప్రధానమైన అంశంగా ఉంది.
''ఎఫ్‌టీఏ కింద దిగుమతి సుంకాలను పూర్తిగా తీసేసినా.. సీబీఏఎం అనేది భారత ఎగుమతులపై సరికొత్త సరిహద్దు పన్నులా ఉంటుంది'' అని జీటీఆర్ఐకి చెందిన శ్రీవాస్తవ తెలిపారు.
''ఇది ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) నష్టం చేకూర్చనుంది. దీనివల్ల, భారీ వ్యయాలతో కూడిన నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఉద్గార విలువలను ఏమాత్రం పెరిగినా, వాటి ఆధారంగా జరిమానాలు పడే ప్రమాదం ఉంది'' అని వివరించారు.
కానీ, దీర్ఘకాలంలో ఇది ఇరు వర్గాలకు ప్రయోజనాన్నే చేకూరుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
''అంతిమంగా ఇది అమెరికా, ఇతర నమ్మదగినవికాని భాగస్వాముల నుంచి వాణిజ్యపరంగా వేరుపడటాన్ని వేగవంతం చేస్తోంది. అంటే, అమెరికాపై లేదా చైనాపై ఆధారపడటాన్ని ఇది తగ్గిస్తుందని అర్థం. దీనివల్ల తరచుగా మారే సుంకాల ప్రభావాన్ని, ఎగుమతి నియంత్రణలను తగ్గించుకోవచ్చు. సప్లై చైన్లనే ఆయుధాలుగా మార్చుకునే పద్ధతుల నుంచి ఎదురయ్యే ప్రమాదాల నుంచి బయటపడొచ్చు'' అని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌కు చెందిన అలెక్స్ కాప్రి తెలిపారు.
కాప్రి చెబుతున్న ప్రకారం.. ''భారత అత్యధిక కార్బన్ ఉద్గారాలు, తమ మానవ హక్కుల రికార్డులపై ఉన్న ఆందోళనలు యూరప్‌లో ఈ ఒప్పందానికి వ్యతిరేకత రావొచ్చు. కానీ, నవంబర్ 2025 నుంచి రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లను భారత్ తగ్గించుకోవడం ఈయూ పార్లమెంట్‌లో ఈ ఒప్పందం సులువుగా ఆమోదం పొందేందుకు వీలవుతుంది. ఈ ఒప్పందం అమల్లోకి రావాలంటే ఈయూ పార్లమెంట్‌లో ఇది ఆమోదం పొందాలి'' అని పేర్కొన్నారు.
2026 ప్రారంభం నుంచి అమెరికాతో నెలకొన్న రాజకీయ ఘర్షణల నేపథ్యంలో.. ఈ వాణిజ్య ఒప్పందం విషయంలో ఈయూ లీడర్లు గతంలో కంటే ఇప్పుడు మరింత సానుకూలత వ్యక్తం చేసే అవకాశం ఉందని దాస్‌గుప్తా అభిప్రాయపడ్డారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














