వెనెజ్వెలాలో అమెరికా 'ఆయిల్ గేమ్' భారత్‌కు ప్రయోజనకరమా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, దిల్‌నవాజ్ పాషా
- హోదా, బీబీసీ ప్రతినిధి
అనూహ్య, నాటకీయ పరిణామాల మధ్య అమెరికా సేనలు వెనెజ్వెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను ఆ దేశ రాజధాని కారకస్‌లో అదుపులోకి తీసుకుని అమెరికాకు తీసుకువెళ్లాయి.
ఈ ఘటన తర్వాత, వెనెజ్వెలా చమురు నిల్వలను అమెరికా వినియోగించుకుంటుందని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు.
సురక్షిత, న్యాయమైన, హేతుబద్ధమైన అధికార బదిలీ జరిగేవరకు వెనెజ్వెలా పాలనా బాధ్యతలను అమెరికా చూస్తుందని కూడా డోనల్డ్ ట్రంప్ అన్నారు. కానీ, ఇది ఎలా సాధ్యమవుతుందనేది ఇంకా అస్ఫష్టమే.. కానీ ఇప్పటివరకు ప్రపంచంలో కనుగొన్న చమురు నిల్వల్లో అత్యధికంగా దక్షిణ అమెరికా దేశం వెనెజ్వెలాలోనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో.. ఇటీవల వెనెజ్వెలాలో చోటు చేసుకున్న పరిణామాలు అధికార బదిలీ కంటే ఎక్కువగా చమురు చుట్టూ కేంద్రీకృతమైనట్లుగా కనిపిస్తున్నాయి.

వెనెజ్వెలాలో అమెరికన్ ఆయిల్ కంపెనీలు బిలియన్ల కొద్దీ డాలర్లను పెట్టుబడి పెట్టి, చమురు నిల్వలను అభివృద్ధి చేయాలని, తద్వారా వెనెజ్వెలా నుంచి మరింత ఎక్కువ చమురును వెలికితీయడం సాధ్యమవుతుందని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ భావిస్తున్నారు.
వెనెజ్వెలాలో తీవ్రంగా దెబ్బతిన్న చమురు మౌలిక సదుపాయాలను అమెరికన్ ఆయిల్ సంస్థలు పునర్నిర్మిస్తాయని, వాటి నుంచి భారీగా లాభాలు ఆర్జిస్తాయని ట్రంప్ చెప్పారు. కానీ దీనికి సంబంధించి ఎలాంటి విధాన పత్రాన్ని(పాలసీ డాక్యుమెంట్) శ్వేతసౌధం ఇంకా విడుదల చేయలేదు.
ట్రంప్ ఆశిస్తున్న ప్రణాళికలో పలు సవాళ్లు ఉన్నాయి. వెనెజ్వెలా చమురు నిల్వలను అభివృద్ధి చేసి, ఉత్పత్తిని పెంచడంలో పెట్టుబడులే కాదు, సమయం కూడా కీలకమైనదే.

ఫొటో సోర్స్, AFP via Getty Images
ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు..
వెనెజ్వెలాలో ప్రపంచంలోనే అతిపెద్ద 303 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలు ఉన్నట్లు అంచనా. ఇవి ప్రపంచంలోనే అతిపెద్దవి.
అయితే, తాజా పరిణామాలతో వెనెజ్వెలాలో పీటముడిలా ఉన్న బిలియన్ డాలర్ల బకాయిలను పొందేందుకు భారత్‌కు అవకాశాలు ఉన్నాయని పీటీఐ వార్తా సంస్థ చెబుతోంది. చమురు రంగ నిపుణులు, సంబంధిత వర్గాలతో ఆ సంస్థ జరిపిన సంభాషణల ద్వారా ఈ అంచనాకు వచ్చింది.
నిజానికి వెనెజ్వెలాతో చమురు వ్యాపారంపై అమెరికా ఆంక్షలు విధించే వరకు వెనెజ్వెలాకు భారత్ ప్రధాన ముడి చమురు దిగుమతిదారుగా ఉంది. ఈ దేశ ముడిచమురును శుద్ధి చేసే సామర్థ్యం, సాంకేతికత ఉన్న ప్రపంచంలోని కొన్ని దేశాల్లో భారత్ ఒకటి.
పీటీఐ ప్రకారం.. భారత్ ఒకప్పుడు వెనెజ్వెలా నుంచి రోజుకు 4 లక్షల బ్యారెళ్ల చొప్పున ముడి చమురును దిగుమతి చేసుకునేది. అయితే, 2020లో అమెరికా ఆంక్షలు, చట్టపరమైన నియమాలపై పెరుగుతున్న ఆందోళనల కారణంగా 2020లో వెనెజ్వెలా నుంచి చమరు దిగుమతులను భారత్ నిలిపివేసింది. గతేడాది నవంబర్ నాటికి భారత్ తన మొత్తం చమురు దిగుమతుల్లో వెనెజ్వెలా నుంచి కేవలం 0.3శాతమే దిగుమతి చేసుకున్నట్లుగా వాణిజ్య, పరిశ్రమల శాఖ డేటా చెబుతోంది.

ఫొటో సోర్స్, Bloomberg via Getty Images
వెనెజ్వెలాలో భారత్ పెట్టుబడులు
ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు వెనెజ్వెలాలో ఉన్నట్లు అంచనా. భారత్ ఓవర్సీస్ ఆయిల్ కంపెనీ అయిన ఓఎన్‌జీసీ విదేశ్ లిమిటెడ్ (ఓవీఎల్), తూర్పు వెనెజ్వెలాలోని శాన్ క్రిస్టోబాల్ చమురు క్షేత్రాన్ని సంయుక్తంగా నిర్వహించింది.
అయితే అమెరికా ఆంక్షల కారణంగా వెనెజ్వెలాలో చమురు ఉత్పత్తి నష్టాలమయంగా మారింది. సాంకేతికత అందుబాటు, పరికరాలు, కీలకమైన సేవలపై నిషేధం విధించడంతో ఓవీఎల్ అక్కడ తమ కార్యకలాపాలను ముగించాల్సి వచ్చింది.
పీటీఐ వార్తా సంస్థ ప్రకారం.. ఈ ఆయిల్ ఫీల్డ్‌లో ఓవీఎల్‌కు 40శాతం వాటా ఉంది. 2014 వరకు 536 మిలియన్ డాలర్లను వెనెజ్వెలా ఓవీఎల్‌కు చెల్లించాల్సి ఉండటమే కాక, ఇంకా అంతే మొత్తం వెనెజ్వెలా బకాయి పడిందని, కానీ ఈ మొత్తాన్ని ఎంత అనేది నిర్థరించడానికి అవసరమైన ఆడిట్‌కు వెనెజ్వెలా అనుమతించలేదు.

ఫొటో సోర్స్, Federico PARRA / AFP via Getty Images
తాజా పరిణామాలతో భారత్‌కు కలిగే లాభం ఏంటి?
ప్రస్తుతం వెనెజ్వెలాలో పరిస్థితులు నాటకీయంగా మారాయి. ఇదే క్రమంలో వెనెజ్వెలా పరిణామాలు భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి, వాటివల్ల భారత్‌కు కలిగే లబ్ధి ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
వెనెజ్వెలా చమురు విషయంలో అమెరికా విధానంపై ఇది ఆధారపడి ఉన్నప్పటికీ.. ఈ అంశంపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
వెనెజ్వెలా చమురుపై అమెరికా ఆంక్షలను ఎత్తివేస్తుందా అనే దానిపై ఇది ఆధారపడి ఉంటుందని ఇంటర్నేషనల్ కమొడిటీ ఇంటెలిజెన్స్ కంపెనీ కేప్లర్‌లో సీనియర్ పరిశోధక నిపుణుడు నిఖిల్ దూబే తెలిపారు.
అదే సమయంలో… వెనెజ్వెలాలో జరుగుతున్న పరిణామాలతో భారత్ ప్రత్యక్ష లాభం పొందే అవకాశాలు క్లిష్టంగా ఉన్నాయని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(జీటీఆర్ఐ) వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ అన్నారు. ఎందుకంటే… అక్కడి చమురుపై నియంత్రణను కొనసాగించాలని అమెరికా భావిస్తోందని పేర్కొన్నారు.
అయితే, వెనెజ్వెలాలో భారీ ముడి చమురును శుద్ధి చేసేందుకు కావాల్సిన మౌలిక సదుపాయాలు భారత్‌కు ఉన్నాయని, దీనివల్ల దీర్ఘకాలంలో భారత్ లాభాలు పొందగలదని సీనియర్ జర్నలిస్ట్, చమురు నిపుణులు నరేంద్ర తనేజా అన్నారు. వెనెజ్వెలాలో ముడి చమురు భారీగా ఉందని, భారత్‌కు దాన్ని శుద్ధి చేసే సాంకేతికత ఉందని అన్నారు.
" వెనెజ్వెలా హెవీ, హై-ట్యాన్ క్రూడ్ ఆయిల్‌ను ఇదివరకే భారత్‌లోని అధునాతనమైన రీఫైనరీల్లో ప్రాసెస్ చేస్తున్నారు. సరఫరాలు మళ్లీ మొదలైతే ఈ ఆయిల్ రాయితీ ధరలకే దొరుకుతుంది. ఇది భారత్‌కు ప్రయోజనకరం" అని నిఖిల్ దూబే అన్నారు.
'అంతా అమెరికానే చూసుకుంటుంది'
అయితే, వెనెజ్వెలా క్రూడ్ ఆయిల్‌ను స్వయంగా అమెరికానే శుద్ధి చేసి, అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముతుందని అజయ్ శ్రీవాస్తవ భావిస్తున్నారు.
"వెనెజ్వెలా చమురు రంగాన్ని అమెరికా నియంత్రణలోకి తీసుకున్నా కూడా.. తమ సొంత వినియోగానికి కూడా అమెరికాకు ముడి చమురు కావాల్సి ఉంటుంది. దేశీయ వినియోగం కోసం ఆయిల్‌ను ప్రాసెస్ చేయడంతో పాటు, శుద్ధి చేసిన దాన్ని ప్రపంచానికి అమ్ముతుంది. అందువల్ల.. భారత్‌కు ఎలాంటి చెప్పుకోదగ్గ లాభం లేదా నష్టం ఉండదు. మొత్తంగా పరిస్థితి భారత్‌కు తటస్థంగా ఉంటుంది" అని అజయ్ శ్రీవాస్తవ అన్నారు.
వెనెజ్వెలా చమురు నిల్వలు, దానిపై అమెరికా ఆసక్తుల ప్రాధాన్యాన్ని వివరిస్తూ… అంతర్జాతీయ ప్రతిస్పందనల గురించి పట్టించుకోకుండా వెనెజ్వెలాపై అమెరికా ఈ చర్య తీసుకోవడం ద్వారా అక్కడి చమురుపై అమెరికా దృష్టి పెట్టినట్లు స్పష్టమవుతోందని నరేంద్ర తనెజా అన్నారు.
"అంతర్జాతీయంగా చెడ్డపేరు వస్తుందని తెలిసి కూడా వెనెజ్వెలాలోకి దూకుడుగా ఎందుకు యూఎస్ వెళ్లిందో ముందు అర్థం చేసుకోవడం ప్రధానం. ఇది వెనెజ్వెలాలో ఉన్న భారీ ఇంధన నిల్వల కోసమే. అక్కడ భారీ చమురు నిల్వలు ఉన్నాయి. 300 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలు ఉన్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అలాగే అక్కడ సహజ వాయువు, బంగారం, కీలక ఖనిజాలు కూడా ఉన్నాయి" అని తనేజా అన్నారు.
"అదే నిజమైన ఆకర్షణీయమైన అంశం" అని తనేజా పేర్కొన్నారు.
"ఇంధన స్వతంత్రత కావాలని అమెరికా కోరుకుంటోంది. మిడిల్ ఈస్ట్‌పై ఆధారపడడం తగ్గించాలని భావిస్తోంది. అలాగే వెనెజ్వెలా అమెరికాకు పొరుగునే ఉంటుంది. వెనెజ్వెలా చమురు నిల్వలపై నియంత్రణ కోసమే అమెరికా ఇదంతా చేస్తోందన్నది ఇక్కడ స్పష్టం" అని అన్నారు.
'ఆ కోణంలో చూస్తే భారత్‌కు మంచిదే'
చమురు అవసరాలు, ఆర్థిక దృక్కోణంలో చూస్తే వెనెజ్వెలాలో పరిణామాలు భారత్‌కు మంచిదేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
"భారత్ దృక్కోణం నుంచి చూస్తే, వెనెజ్వెలాలో భారీ చమురు నిల్వలు ఉన్నాయి. కానీ, ప్రస్తుతం అక్కడ జరుగుతున్న ఉత్పత్తి రోజుకు 8 లక్షల బ్యారెళ్లు మాత్రమే. ఎందుకంటే.. ఆ దేశంపై విధించిన ఆంక్షలు అక్కడి పెట్టబడులను అడ్డుకున్నాయి. ఓఎన్‌జీసీ విదేశ్‌కు అక్కడ ఆస్తులు ఉన్నాయి. కానీ, వాటిని అభివృద్ధి చేయలేదు. అక్కడికి అమెరికన్ కంపెనీలు వెళ్లినట్లయితే… డోనల్డ్ ట్రంప్ చెప్పినట్లుగా ఏడాదిన్నరలో ఉత్పత్తి రోజుకు 25 లక్షల బ్యారెళ్ల చొప్పున పెరుగుతుంది. రెండేళ్లలో 30 లక్షల బ్యారెళ్లకు చేరుతుంది. ఇవి ఇదివరకే అభివృద్ధి చేసిన క్షేత్రాలు . దీని వల్ల అంతర్జాతీయ సరఫరా పెరిగి, చమురు ధరలపై ప్రభావం పడుతుంది. ఇది ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారైన భారత్‌కు శుభవార్త అవుతుంది" అని నరేంద్ర తనేజా చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
వెనెజ్వెలా క్రూడ్ ఆయిల్‌ను భారత్ పొందగలదా?
ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారు భారతే. తమ సొంత చమురు అవసరాల్లో 88శాతం దిగుమతులపైనే ఆధారపడుతుంది. అమెరికా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ.. గత కొన్నేళ్లలో రష్యన్ క్రూడ్ ఆయిల్‌పై భారత్ ఆధారపడడం పెరిగింది. అలాగే రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను తగ్గిస్తున్నామని భారత్ అమెరికాకు చెప్పింది.
రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై అమెరికా అదనపు టారిఫ్‌లను విధించింది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లను తగ్గించకపోతే… భారత్‌పై మరిన్ని టారిఫ్‌లను అమెరికా విధిస్తుందని అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఆదివారం హెచ్చరించారు.
"భారత్- అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్న తరుణంలో తమ ముడి చమురు వనరులను విభిన్న దేశాలకు విస్తరించే ప్రయత్నాలను భారత్ కొనసాగిస్తోంది. సరఫరా కేంద్రీకృతం వల్ల అయ్యే ప్రమాదాన్ని తగ్గించడంపై దృష్టిపెట్టింది. ఇది రష్యన్ ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించాలనే అమెరికా విధానానికి అనుగుణంగా ఉంటుంది" అని నిఖిల్ దూబే తెలిపారు.
'ఇది భారత్ ఇంధన భద్రతను పెంచుతుంది'
ఇలాంటి పరిస్థితుల్లో వెనెజ్వెలా ఆయిల్ భారత్‌కు మంచి అవకాశం అవ్వగలదని నిపుణులు భావిస్తున్నారు.
"భారత్‌లోని చాలా అధునాతన రీఫైనరీలు ఎంచుకోగల రాయితీలతో కూడిన అవకాశాలలో వెనెజ్వెలా ముడిచమురు ఒకటిగా ఉంది. ఈ చమరు ద్వారా రిలయన్స్‌కు చెందిన జామ్‌నగర్ సెజ్ ఎంఆర్‌పీఎల్‌లు పోటీ ధరలకు ఉత్పత్తి చేయడానికి, ఐరోపాకు ఎగుమతి చేయడంలో నిబంధనలను పాటించడానికి, మార్జిన్‌లను కాపాడుకోవడానికి సహాయపడుతుంది" అని నిఖిల్ దూబే అన్నారు.
ఇది భారత్ ఇంధన భద్రతను పెంచుతుందని, అలాగే ముడి చమరు సరఫరాదారులతో బేరం ఆడే శక్తిని పెంచుతుందని దూబే అన్నారు.
అయితే, వెనెజ్వెలా క్రూడ్ ఆయిల్‌ను భారత్ నేరుగా పొందే విషయంలో ఎలాంటి బలమైన సూచనలు లేవని అజయ్ శ్రీవాస్తవ భావిస్తున్నారు.
‘‘దీనికి బలమైన ఆధారాలేవీ లేవు. భారత్ నేరుగా వెనెజ్వెలా క్రూడ్ ఆయిల్‌ను పొందలేదనడంలో నేను స్పష్టంగా ఉన్నాను. అమెరికాకు చమురు వెళ్లి, అక్కడ రీఫైన్ అవుతుంది. అప్పుడు అమెరికా రీఫైన్డ్ పెట్రోలియమ్ ప్రోడక్ట్స్‌ను తమ వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఇతర దేశాలకు అమ్ముతుంది. ఐరోపా సమాఖ్య, దక్షిణ కొరియా, జపాన్‌తో చేసుకున్న ఒప్పందాలమేరకు ఆ దేశాలు .. అమెరికా రీఫైన్డ్ ఉత్పత్తులనే కొనాలి కానీ, ముడిచమురును కాదు " అని శ్రీవాస్తవ చెప్పారు
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














