ఇందోర్: ‘నా బిడ్డకు ఐదు నెలలు.. కలుషిత నీరు ప్రాణాలు తీసింది’

ఫొటో సోర్స్, SAMEER KHAN
- రచయిత, సమీర్ ఖాన్
- హోదా, బీబీసీ కోసం
వరుసగా ఏడేళ్లపాటు దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా గుర్తింపు పొందిన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇందోర్‌లోని భాగీరథ్‌పురాలో, నర్మదా నది పైప్‌లైన్‌లో డ్రైనేజీ నీరు కలవడంతో తాగునీరు కలుషితమైంది.
కలుషిత నీటివల్ల ఈ ప్రాంతంలో ఇప్పటివరకు 14 మంది మరణించారని స్థానిక జర్నలిస్టులు తెలిపారు.
కాగా మధ్యప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కైలాష్ విజయవర్గియా ‘సుమారు తొమ్మిది మంది చనిపోయారు’ అని తెలిపారు.
ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
కలుషిత నీరు తాగి చాలా మంది అనారోగ్యానికి గురై వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరారు.
పది రోజులు దాటుతున్నా కూడా భాగీరథ్‌పురాలోని ప్రాంతాలకు ఇప్పటికీ స్వచ్ఛమైన తాగునీరు అందడంలేదు.
తాగునీటి పైప్‌లైన్‌లో ఈ మురికినీరు ఎక్కడ కలుస్తుందో ఇందోర్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా కనుక్కోలేకపోయింది.

ఈ విషయంపై మధ్యప్రదేశ్ ప్రభుత్వ మంత్రి కైలాష్ విజయవర్గియా మాట్లాడుతూ, "సుమారు 1400 నుంచి 1500 మంది వరకు అనారోగ్యం పాలయ్యారు. వారిలో 198 మంది ఆసుపత్రిలో చేరారు. ఇప్పుడు మరో ఇద్దరు చికిత్స పొందారు. కొంతమందిని డిశ్చార్జ్ చేశారు" అని అన్నారు.
"ఆరోగ్య శాఖ, పరిపాలన, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది అందరూ ఈ పనిలోనే నిమగ్నమై ఉన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందరూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు" అని ఆయన అన్నారు.
"నలుగురి మరణాలను అధికారికంగా ధ్రువీకరించారు. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు 8-9 మంది మరణించినట్లు సమాచారం అందింది" అని కైలాష్ విజయవర్గియా అన్నారు.
మరోవైపు కైలాష్ విజయవర్గియా భాగీరథ్‌పురాకు వెళ్లినప్పుడు స్థానికుల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.
పరిస్థితిని అంచనా వేయడానికి ఆయన తన బైక్‌పై వచ్చారు. ఆ ప్రాంతంలోని పరిస్థితుల గురించి ప్రజలు ప్రశ్నించారు, కానీ ఆయన ఆగకుండా వెళ్లిపోయారు.
"డ్రైనేజీ లైన్‌ను ఎవరూ పట్టించుకోవడం లేదు. దానిని తాగునీటి లైన్‌కు అనుసంధానిస్తున్నారు, కానీ దానిని చూసుకునే వారు ఎవరూ లేరు. ఏడాదిన్నరగా మేం బాధపడుతున్నాం. ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరూ వినడం లేదు" అని స్థానిక మహిళ ఒకరు చెప్పారు.
తన ఇంట్లో దాదాపు 12 మంది అస్వస్థతకు గురయ్యారని ఆ మహిళ చెప్పారు.

ఫొటో సోర్స్, SAMEER KHAN
బాధితులు ఏమంటున్నారు?
కలుషిత నీటి కారణంగా మరణించిన ఐదు నెలల ఆవ్యాన్ సాహు తండ్రి సునీల్ సాహు బీబీసీతో మాట్లాడుతూ, తన కుటుంబంలో తల్లిదండ్రులు, భార్య, పదేళ్ల కుమార్తె ఉన్నారని అన్నారు.
సునీల్ సాహు కొరియర్ బాయ్‌గా పనిచేస్తున్నారు.
వారికి అవ్యాన్ ఐదు నెలల క్రితం జన్మించాడు.
"తల్లి పాలతో పాటు, డబ్బాపాలను నీటితో కలిపి బిడ్డకిచ్చారు. నర్మదా నీరు కలుషితమైందని అప్పుడు తెలియదు. చాలా మంది పిల్లలు అనారోగ్యంతో ఉన్నారని కొందరు చెప్పిన తర్వాతే నర్మదా నీరు కలుషితమైందని తెలిసింది" అని ఆయన అన్నారు.
"డిసెంబర్ 26న, ఆ పిల్లాడికి అకస్మాత్తుగా విరేచనాలు మొదలయ్యాయి. పొరుగున ఉన్న డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. మందులు ఇచ్చిన తర్వాత కూడా పరిస్థితి మెరుగుపడలేదు. నిరంతర విరేచనాల కారణంగా డిసెంబర్ 29 సాయంత్రానికి పరిస్థితి మరింత విషమించింది. మళ్లీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లగా, అప్పటికే ఆలస్యం అయిపోయిందని చెప్పారు. అవ్యాన్ మృతి చెందాడు" అని ఆయన తెలిపారు.
ఈ పరిస్థితి గురించి విచారించడానికి ఎవరూ ముందుకు రాలేదని, ఇలాంటిది మరెవరికీ జరగకుండా ప్రభుత్వం చూసుకోవాలి. దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సునీల్ సాహు అన్నారు.
"డిసెంబర్ 26 సాయంత్రం కలుషిత నీరు తాగిన తర్వాత 69 ఏళ్ల మా అమ్మకి వాంతులు, విరేచనాలు అయ్యాయి. ఆమెకు మందులు ఇచ్చారు, కానీ అవి పని చేయకపోవడంతో, క్లాత్ మార్కెట్ ఆసుపత్రిలో చికిత్స చేయించాం. 22 గంటలపాటు చికిత్స చేసినప్పటికీ ఆమె బతకలేదు" అని దర్జీ సంజయ్ యాదవ్ అన్నారు.
తన 11 నెలల బిడ్డ ఇంకా ఆసుపత్రిలోనే ఉందని చెప్పారు. వారి పొరుగింటాయన కూడా అనారోగ్యానికి గురయ్యారు.
పరిస్థితిని పరిశీలించడానికి ప్రభుత్వం నుంచి ఇంకా ఎవరూ రాలేదని ఆయన అన్నారు. ఇప్పటికీ కలుషిత నీరే సరఫరా అవుతోందని సంజయ్ యాదవ్ చెప్పారు.
భాగీరథ్‌పురాలో నివసించే 76 ఏళ్ల రిటైర్డ్ రైల్వే ఉద్యోగి నంద్‌లాల్ పాల్ కుమార్తె సుధా పాల్ మాట్లాడుతూ, తన తండ్రి రెండుమూడు రోజులుగా వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారని చెప్పారు. ఆయనను ఆసుపత్రిలో చేర్చారు, కానీ పరిస్థితి మెరుగుపడలేదు.
డిసెంబర్ 30న తన తండ్రి మరణించారని సుధా పాల్ తెలిపారు.

ఫొటో సోర్స్, SAMMER KHAN
ఇంట్లోకి కలుషిత నీరు ఇప్పటికీ వస్తోందని, ఆ నీరు మురికిగా కనిపించడం లేదు కానీ దుర్వాసన వస్తోందని సుధా పాల్ అన్నారు.
డిసెంబర్ 29న 50 ఏళ్ల సీమా ప్రజాపత్ కూడా కలుషిత నీరు తాగి మరణించారు.
ఆమె కుమారుడు అరుణ్ ప్రజాపత్ మాట్లాడుతూ, "డిసెంబర్ 28 రాత్రి, ఆమె తల్లి కుటుంబంతో కలిసి భోజనం చేసింది. కానీ డిసెంబర్ 29 ఉదయం, ఆమె ఆరోగ్యం క్షీణించింది. వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. అరుణ్ ప్రజాపత్ ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగానే చనిపోయింది" అని అన్నారు.
"ఆ నీళ్లు చేదుగా ఉన్నాయి, కానీ అది ప్రాణాంతకమని మాకు తెలియదు. ఇప్పుడు మేం దాన్ని మరిగించి తాగుతున్నాం. నాకు కూడా అనారోగ్యంగా ఉంది. మా పక్కనుండే ఒక అమ్మాయి అనారోగ్యానికి గురైంది. ప్రజలు అనారోగ్యంతో ఉన్నారు, కానీ ఇక్కడ నీళ్లు లేవు. మేం అదే నీళ్లు తాగాలి. ఇప్పటివరకు మా వీధికి ఎవరూ రాలేదు. కౌన్సిలర్ మాత్రమే వచ్చారు. నీటి సమస్య ఉందని మేం ఆయనకి చెప్పాం. మేం మురికి నీళ్లే తాగుతున్నాం, కనీసం ఆయన మళ్లీ చూడడానికి కూడా రాలేదు" అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
‘తప్పు జరిగింది’ -కైలాష్ విజయవర్గియా
ఇందోర్‌లో కలుషిత నీటి వల్ల మరణాల ఘటనపై నగర మంత్రి కైలాష్ విజయవర్గియా తప్పు జరిగిందని అంగీకరించారు.
కలుషిత నీటి వల్ల భాగీరథ్‌పురాలో తీవ్ర కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఇది ఇందోర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కైలాష్ విజయవర్గియా ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఇందోర్ మున్సిపల్ కార్పొరేషన్ మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ విజయ్‌వర్గియా అధికార పరిధిలోకి వస్తుంది. నీటి సరఫరా బాధ్యత కార్పొరేషన్‌దే.
"ఈ సంఘటన దురదృష్టకరం. మున్సిపల్ జోన్ అధికారులు, ఉద్యోగుల నిర్లక్ష్యం కారణంగా ఇది జరిగింది. కలుషిత నీటి సరఫరా గురించి తెలియగానే, ఆ నీరు తాగొద్దని కోరుతూ ఒక ప్రకటన చేయాల్సింది. ట్యాంకర్లతో మంచినీరు సరఫరా చేయాల్సింది. తప్పు వారిదే, కాబట్టి వారిని సస్పెండ్ చేశారు. ముఖ్యమంత్రి దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని వదిలిపెట్టబోం" అని విజయ్‌వర్గియా బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, SAMEER KHAN
మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు నష్టపరిహారం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
ఈ సమస్యకు ఇంకా పరిష్కారం దొరకలేదని అదే ప్రాంతంలో నివసించే సప్నా పాల్ అన్నారు.
ఓఆర్ఎస్ మాత్రమే పంపిణీ చేస్తున్నారు. తమ వీధిలో కూడా ఒకరు విరేచనాలతో చనిపోయాడని సప్నా పాల్ అన్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














