స్విట్జర్లాండ్: స్కీ రిసార్ట్ పేలుడు ఘటనలో 40 మంది మృతి, ఇది దాడి కాదన్న పోలీసులు

ఫొటో సోర్స్, Getty Images
స్విట్జర్లాండ్‌లోని 'క్రాన్స్-మోంటానా' స్కీ రిసార్ట్‌లో జరిగిన పేలుడులో 40మంది మరణించగా, 115మంది గాయపడినట్టు అక్కడి పోలీసులు వెల్లడించారు.
డిసెంబర్ 31 అర్ధరాత్రి దాటాక స్థానిక కాలమానం ప్రకారం 1.30 గంటలకు కాన్‌స్టలేషన్ బార్‌లో ఈ పేలుడు సంభవించినట్లు స్విట్లర్లాండ్ పోలీసులు 'బీబీసీ'కి చెప్పారు.
ప్రమాదానికి కారణాలేంటో తెలియలేదు. అయితే ఇది దాడి కాదని దర్యాప్తు అధికారులు స్పష్టం చేశారు.
కొత్త సంవత్సరం వేడుకలు జరుగుతున్న సమయంలో బార్ వద్ద మంటలు చెలరేగిన దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి.
ఈ ఘటనలో చనిపోయినవారు, గాయపడిన వారిలో వివిధ దేశాలకు చెందిన వారు ఉన్నారు. చనిపోయిన వారిని వీలైనంత త్వరగా గుర్తించి వారి స్వదేశాలకు పంపే ఏర్పాట్లు చేస్తామని స్థానిక పోలీస్ అధికారి ఫ్రెడ్రిక్ గిస్లెర్ చెప్పారు.

'క్రాన్స్-మోంటానా' అనేది స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్ నుంచి సుమారు రెండు గంటల ప్రయాణ దూరంలో ఉండే ఒక లగ్జరీ స్కీ రిసార్ట్ టౌన్. ఈ ప్రాంతానికి బ్రిటిష్ టూరిస్ట్‌లు ఎక్కువగా వస్తుంటారు.
ప్రమాదం జరిగిన ప్రాంతానికి 13 హెలికాప్టర్లు, 42 అంబులెన్స్‌లు, 150 మంది సహాయకులను పంపించారు.
గాయపడిన వారిలో అనేకమంది శరీరంపై తీవ్రంగా కాలిన గాయాలున్నాయి. 60 మందిని వలైస్‌లోని సియోన్ ఆసుపత్రిలో చేర్చారని స్థానిక గవర్నర్ మథియాస్ రేనార్డ్ చెప్పారు.
ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో పూర్తిగా బాధితులు ఉన్నారని, స్థానికులు అవసరంలేని చికిత్స కోసం ఆసుపత్రికి రాకుండా ఉంటే మంచిదని ఆయన తెలిపారు.
కొంతమంది క్షతగాత్రులను స్విట్జర్లాండ్‌లోని ఇతర నగరాలైన లౌసన్నే, జురిచ్‌లోని ఆసుపత్రిలో చేర్చారు. ఇక్కడ కాలిన గాయాలకు ప్రత్యేక చికిత్స అందించే కేంద్రాలున్నాయి.
తాము 22 మందికి చికిత్స అందిస్తున్నట్లు లౌసన్నే యూనివర్సిటీ హాస్పిటల్ ప్రతినిధి ఒకరు చెప్పారు.
తీవ్రమైన కాలిన గాయాలతో ఉన్న కొంతమంది బాధితులను జెనీవా యూనివర్సిటీ హాస్పిటల్‌కు తరలించారు. "వాళ్లంతా యువకులు 15-25 సంవత్సరాల మధ్య వయసున్నవారు" అని డాక్టర్ రాబర్ట్ లార్రిబౌ బీబీసీకి చెప్పారు.

ఫొటో సోర్స్, EPA
‘ఎలాంటి దాడి జరగలేదు’
ఫ్లాష్ ఓవర్ ( విద్యుత్ పరికరాలన్నీ ఉండే చోట) ప్రభావం వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని యూకే అసోసియేషన్ ఆఫ్ ఫైర్ ఇన్వెస్టిగేషన్ అధ్యక్షుడు రిచర్డ్ హ్యాగర్ అభిప్రాయపడ్డారు.
"మంట మొదలై, అగ్ని కీలలు, థర్మల్ రేడియేషన్ పైకి వెళ్లి అక్కడ నుంచి అంతటా వ్యాపించి ఉండవచ్చు" అని ఆయన వరల్డ్ టు నైట్ కు చెప్పారు.
"థర్మల్ రేడియేషన్ కిందకు ప్రయాణించి కింద తేలిగ్గా అంటుకునే స్వభావం ఉన్న ఫర్నీచర్, టేబుళ్లు లాంటి వాటిని మండిస్తుంది. దీంతో టెంపరేచర్ ఏ స్థాయికి పెరుగుతుందంటే వాటి నుంచి మండే గ్యాస్ విడుదలవుతుంది. ఆ తర్వాత ఆ గ్యాస్ కూడా మండుతుంది. దీంతో క్షణాల్లో గది మొత్తం అగ్ని కీలల్లో చిక్కుకుపోతుంది" అని ఆయన వివరించారు.
తమ దేశస్థులు 16 మంది జాడ తెలియడం లేదని ఇటాలియన్ విదేశాంగ శాఖ బీబీసీకి చెప్పింది. 12 నుంచి 15 మంది ఇటాలియన్లు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
తమ దేశానికి చెందిన 8 మంది కనిపించడం లేదని ఫ్రాన్స్ విదేశాంగ శాఖ తెలిపింది.
చనిపోయిన వారిని గుర్తించడానికి కొన్ని వారాలు పడుతుందని స్విట్జర్లాండ్‌లోని ఇటలీ రాయబారి గియాన్ లొరెంజో కొర్నాడో చెప్పారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














