గుజరాత్: సింహంపైకి ప్రయోగించిన మత్తుబాణం గురి తప్పి ట్రాకర్ ప్రాణం తీసింది.. జంతువు స్పృహతప్పేంత మోతాదు మనిషి ప్రాణం ఎలా తీసింది?

ఫొటో సోర్స్, Hanif Khokhar/GettyImages
- రచయిత, గోపాల్ కతేషియా
- హోదా, బీబీసీ ప్రతినిధి
గుజరాత్‌లో జునాగఢ్ జిల్లా విసావదర్ తాలూకాలోని నానీ మోణ్‌పరీ గ్రామంలో ఆదివారం (జనవరి 4వ తేదీ) సాయంత్రం ఒక తోటలో సింహం చేసిన దాడిలో వ్యవసాయ కూలీ కుమారుడైన శివం పార్గీ అనే నాలుగేళ్ల బాలుడు చనిపోయాడు.
దీంతో ఆ సింహాన్ని బంధించడానికి సాసన్ వన్యప్రాణి విభాగానికి చెందిన 'వైల్డ్‌లైఫ్ రెస్క్యూటీమ్' నానీ మోణ్‌పరీ గ్రామానికి చేరుకుంది.
బోను అమర్చి అందులో ఆ సింహాన్ని బంధించడానికి వారు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. దీంతో చివరకు దానికి మత్తు ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేయాలని నిర్ణయించారు.
ఈ వ్యూహంలో భాగంగా, వైల్డ్‌లైఫ్ రెస్క్యూటీమ్‌లోని వెటర్నరీ డాక్టర్ మందుతో నింపిన మత్తుబాణాన్ని గన్ సహాయంతో సింహంపైకి ప్రయోగించారు. కానీ అది గురితప్పి, అక్కడ సహాయ చర్యల్లో పాల్గొన్న అష్రఫ్ చౌహాన్ అనే వన్యప్రాణి ట్రాకర్ చేతికి తగిలింది. ప్రమాదవశాత్తూ తగిలినా అది లోతుగా దిగిపోయింది.
కొన్ని నిమిషాల వ్యవధిలోనే 30 ఏళ్ల అష్రఫ్ చౌహాన్ ఆరోగ్యం క్షీణించడం మొదలైంది.
ఆయన్ను వెంటనే విసావదర్ పట్టణంలోని ఒక ఆసుపత్రికి తీసుకెళ్లినట్టు అటవీ అధికారులు చెప్పారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత వైద్యులు, మెరుగైన వైద్యం కోసం జునాగఢ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు.
అక్కడ సుమారు 12 గంటల పాటు వైద్యం అందించినా ఫలితం దక్కలేదు. సోమవారం (జనవరి 5న) ఉదయం 7:33 గంటలకు అష్రఫ్ చౌహాన్ మరణించినట్లు వైద్యులు వెల్లడించారు.
వన్యమృగాలు ఏయే ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి, అవి ఆరోగ్యంగా కనిపిస్తున్నాయా లేదా, వాటికేమైనా సమస్యలున్నాయా, మనుషులపై దాడి చేసే పరిస్థితులున్నాయా అనేదీ వన్యప్రాణి ట్రాకర్లు నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. ఎప్పటికప్పుడు అటవీశాఖ అధికారులకు సమాచారం చేరవేస్తారు.
ఆసియా సింహాలకు ఆవాసమైన గిర్ అడవులు, వాటి పరిసర ప్రాంతాల్లో జరిగే రెస్క్యూ ఆపరేషన్లలో కూడా చురుగ్గా పాల్గొంటూ, రెస్క్యూ టీమ్‌కు అవసరమైన సహకారాన్ని అందిస్తారు.
అలాంటి ట్రాకర్లలో ఒకరైన అష్రఫ్ చౌహాన్ విసావదర్ ఫారెస్టు రేంజ్‌లో పనిచేస్తున్నారు. సింహాలు, పులులు, చిరుతపులుల వంటి వన్య మృగాల రెస్క్యూ ఆపరేషన్ల సమయంలో, అవి దాడి చేసే ప్రమాదం రెస్క్యూటీమ్, అటవీ శాఖ అధికారులకు ఎప్పుడూ పొంచి ఉంటుంది.
నానీ మోణ్‌పరీ ఘటనతో మరో కొత్త ప్రమాదం వెలుగులోకి వచ్చింది.
ఇలాంటి కేసులు ఇదివరకెప్పుడూ తమకు ఎదురుకాలేదని, బాధితులకు తగిన చికిత్స అందించడానికి నిర్దిష్టమైన చికిత్సా విధానం (ప్రోటోకాల్) కూడా అందుబాటులో లేదని, జునాగఢ్ ఆసుపత్రిలో అష్రఫ్‌కు చికిత్స చేసిన వైద్యులు చెబుతున్నారు.


ఫొటో సోర్స్, Hanif Khokhar
వన్యప్రాణులకు వాడే మత్తు మందులేమిటి?
నానీ మోణ్‌పరీ గ్రామం గిర్ నేషనల్ పార్క్, వన్యప్రాణుల అభయారణ్యం సరిహద్దులో ఉంది. ఇది గిర్-పశ్చిమ వన్యప్రాణి విభాగంలోని విసావదర్ రేంజ్ పరిధిలోకి వస్తుంది.
జునాగఢ్ వైల్డ్ లైఫ్ సర్కిల్ ముఖ్య అటవీ సంరక్షణాధికారి (సీసీఎఫ్) డాక్టర్ రామ్‌రతన్ నాలా ఐఎఫ్ఎస్ అధికారి గతంలో సుశిక్షితులైన పశువైద్యుడు కూడా. ఆయన సోమవారం విలేకరులకు నానీ మోణ్‌పరీ ఘటన గురించి వివరించారు.
''సాసన్ రెస్క్యూ టీమ్‌లోని సుశిక్షితుడైన వెటర్నరీ డాక్టర్, సింహం స్పృహ కోల్పోయేందుకు 'మెడిటోమిడైన్', 'కెటామైన్' అనే రెండు మందుల మిశ్రమాన్ని బాణంలా ఉండే డార్ట్‌లోకి నింపి, దాన్ని గన్ సహాయంతో సింహం వైపు ప్రయోగించారు. అయితే అది సింహానికి తగలకుండా గురితప్పి అదే దిశలో నిల్చున్న అష్రఫ్ చౌహాన్‌కు తగిలింది'' అని చెప్పారు.
జునాగఢ్‌లోని సక్కర్‌బాగ్ జూలో 20 ఏళ్ల పాటు పశువైద్యుడిగా పనిచేసి, 2011లో ఉద్యోగ విరమణ చేసిన డాక్టర్ ఛగన్‌లాల్ భువా బీబీసీతో మాట్లాడారు.
''కెటామైన్ జంతువుకు మత్తు కలిగించి స్పృహ కోల్పోయేలా చేస్తుంది. మెడిటోమిడైన్ కండరాలను సడలిస్తుంది. దీంతో ఆ జంతువు కింద కూలబడిపోతుంది. నా ఉద్యోగ జీవితంలో ఎన్నో రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొన్నాను. జంతువులను మత్తులోకి దించడానికి కెటామైన్, జైలాజైన్ మిశ్రమంతో డోస్ సిద్ధం చేసేవాణ్ని. ఎందుకంటే ఈ మిశ్రమం సురక్షితం అనిపించేది. అందులో జైలాజైన్ కండరాల సడలించేలా చేస్తుంది'' అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
జంతువుల మత్తుమందు ప్రభావం మనుషులపై ఎంత?
జంతువుల శరీరంలోని వివిధ అవయవాలపై ఈ మందులు ప్రభావం చూపుతాయని డాక్టర్ భువా చెప్పారు.
''కెటామైన్, జైలాజైన్ జంతువుల నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. ఎంత మోతాదులో మందు ఇవ్వాలనేదీ ఆ జంతువు బరువుపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ప్రతి కిలో గ్రాము బరువుకు ఒకటి నుంచి పది మిల్లీ గ్రాముల వరకూ కెటామైన్, ప్రతీ కిలో గ్రాము బరువుకు ఒక మిల్లీ గ్రాము చొప్పున జైలాజైన్ ఇస్తారు. ఈ నిష్పత్తిలో ఇచ్చే మందుతో సాధారణంగా ఏ జంతువైనా ఒక గంట పాటు స్పృహ లేకుండా ఉండిపోతుంది, ఆ తర్వాత నెమ్మదిగా స్పృహలోకి వస్తుంది'' అని ఆయన వివరించారు.
సాసన్ రెస్క్యూటీమ్‌లో సుదీర్ఘ కాలం పనిచేసిన మరో వెటర్నీర డాక్టర్ తన పేరు వెల్లడించవద్దనే షరతు మేరకు బీబీసీతో మాట్లాడుతూ ''మెడెటోమిడైన్, కెటామైన్ ప్రభావం వన్యప్రాణులపై ఎలా ఉంటుందో, మనుషులపై కూడా అలాగే ఉంటుంది. నా అభిప్రాయమేమిటంటే, ఆ ప్రభావం మనుషులపై ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే వన్యప్రాణుల శరీర పరిమాణం, బరువు మనుషుల కంటే ఎక్కువగా ఉంటుంది. వాటిని మత్తులోకి దించడానికి ఇచ్చే మందుల మోతాదు మనుషులకు ప్రాణాంతకమని నిరూపితం కావచ్చు'' అని చెప్పారు.
జునాగఢ్‌కు చెందిన ప్రముఖ మత్తమందు నిపుణుడు డాక్టర్ పూర్వేశ్ కాచా బీబీసీతో మాట్లాడుతూ, ''ఎనస్థీషియా లేదా ట్రాంక్విలైజర్ మందులు చాలా ప్రమాదకరమైనవి. ఇవి నాడీ వ్యవస్థ, గుండె రక్తప్రసరణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి. మోతాదులో తేడా వస్తే రోగి రక్తపోటు, గుండె కొట్టుకొనే వేగం ఒక్కసారిగా పెరగవచ్చు లేదా అకస్మాత్తుగా పడిపోవచ్చు'' అని చెప్పారు.
''రోగికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగవచ్చు, పరిస్థితి విషమిస్తే వెంటిలేటర్ సపోర్ట్ కూడా అవసరమవుతుంది. మెదడు, గుండె, ఊపిరితిత్తులపై ప్రభావం చూపించే ఈ మందులను తీసుకోవడంలో రిస్క్ ఉంటుంది'' అని డాక్టర్ పూర్వేశ్ అన్నారు.

ఫొటో సోర్స్, Hanif Khokhar
మత్తుబాణం తగిలాక అష్రఫ్ పరిస్థితి ఏమిటి?
''సింహం కోసం ప్రయోగించిన మత్తు మందు బాణం ప్రమాదవశాత్తు అష్రఫ్ చౌహాన్ శరీరంలో గుచ్చుకోవడం వల్లే ప్రాణాలు కోల్పోయారని సీసీఎఫ్ డాక్టర్ రామ్‌రతన్ నాలా చెప్పారు.
''మనిషి బరువు సగటున 70 కిలోలు ఉంటే, సింహం ఆడదైనా, మగదైనా 200 నుంచి 250 కిలోల వరకూ బరువు ఉంటుంది. అంత బరువుండే సింహం కోసం సిద్ధం చేసిన మత్తు మందు మనిషికి చాలా ఎక్కువ డోస్ అవుతుంది. ఈ కారణంగానే ట్రాకర్ చనిపోయారు'' అని అన్నారు.
జునాగఢ్ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కృతార్థ్ బ్రహ్మాభట్ బీబీసీతో మాట్లాడుతూ, ఆదివారం ఆసుపత్రికి అంబులెన్స్‌లో తీసుకొచ్చేసరికే అష్రఫ్ చౌహాన్ పరిస్థితి చాలా విషమంగా ఉందని చెప్పారు.
''అష్రఫ్ శరీరంలోకి వెళ్లిన మందు మోతాదు సాధారణంగా రోగులకు మత్తు కలిగించడానికి ఇచ్చే మోతాదు కంటే 40 నుంచి 50 రెట్లు ఎక్కువగా ఉంది. ఈ మందు ప్రభావం గుండెపై చూపించడంతో 'కార్డియాక్ అరెస్టు' సంభవించింది. స్పృహలో లేని ఆయన్ను ఐసీయూకి తరలించి, వెంటిలేటర్ సపోర్ట్‌పై ఉంచాం. మా వైద్యులు ఆయనకు విరుగుడు కూడా ఇచ్చారు. శతవిధాలా ప్రయత్నించినా ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు'' అని డాక్టర్ కృతార్థ్ బ్రహ్మాభట్ వెల్లడించారు.
అష్రఫ్‌కు చికిత్స అందించిన వైద్యుల బృందానికి నేతృత్వం వహించిన ఆసుపత్రి అసిస్టెంట్ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అల్పేష్ వైష్ణాని బీబీసీతో మాట్లాడుతూ, ''కెటామైన్ మందును మనుషులకు చికిత్సలోనూ ఉపయోగిస్తారు. రోగికి ఏదైనా చిన్న సర్జరీ చేయాల్సి వచ్చినప్పుడు నొప్పి నివారిణిగా వైద్యులు అందిస్తారు. అయితే అష్రఫ్ శరీరంలోకి వెళ్లిన మెడెటోమిడైన్, కెటామైన్ మిశ్రమం మోతాదు చాలా ఎక్కువ. ఆయన్ను తీసుకొచ్చే సమయానికే ముఖ్యమైన అవయవాలు సాధారణ స్థితిలో పనిచేయడం లేదు. అందువల్లే, మేం మందులు ఇచ్చినా ఆయన శరీరం స్పందించలేకపోయింది. ఆ తర్వాత గుండె కొట్టుకోవడం ఆగిపోయింది'' అని వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇలాంటి మందులకు విరుగుడు ఉంటుందా?
"వన్య మృగాల రెస్క్యూ కోసం మత్తు మందు ప్రయోగించిన తర్వాత సాధారణంగా ఒక గంట పాటు స్పృహ లేకుండా ఉంటుంది. అవసరమైతే అదనపు డోస్ ఇస్తారు. ఒకవేళ రెస్క్యూ త్వరగా పూర్తయితే, ఆ ట్రాంక్విలైజర్ డ్రగ్‌కు విరుగుడు ఇస్తారు. కెటామైన్, జైలాజైన్ మిశ్రమానికి 'యోహింబిన్' విరుగుడుగా పనిచేస్తుంది' అని డాక్టర్ భువా చెప్పారు.
''ట్రాంక్విలైజర్ డ్రగ్ ఉన్న డార్ట్‌ను గన్ ద్వారా ప్రయోగిస్తారు కాబట్టి, అది కండరాలలోకి చొచ్చుకు వెళ్తుంది. ఆ మందు కండరాల ద్వారా రక్తంలో కలవడానికి కొన్ని నిమిషాల సమయం పడుతుంది, కాబట్టి దాని ప్రభావం నెమ్మదిగా మొదలవుతుంది. కానీ విరుగుడును నరాల ద్వారా నేరుగా రక్తంలోకి ఇస్తారు, కాబట్టి ఇది చాలా వేగంగా పనిచేస్తుంది" అని వివరించారు.
అష్రఫ్ చౌహాన్ చికిత్స సమయంలో అటిపామెజోల్ అనే విరుగుడు మందును ఇచ్చినట్లు డాక్టర్ వైష్ణాని తెలిపారు. ''అయితే, ఇటువంటి కేసుల్లో అటిపామెజోల్ ఎంతవరకు ప్రభావం చూపుతుందనేది ఇంకా నిరూపితం కాలేదు. పైగా, మా కెరీర్‌లో ఇలాంటి కేసును చూడటం ఇదే మొదటిసారి. ఇది మాకు కూడా కొత్త విషయమే'' అని అన్నారు.
''సాధారణంగా ఈ మందులు మనుషులకు ఈ విధంగా ఇవ్వరు. కాబట్టి దీని లక్షణాలు, ప్రభావం ఎలా ఉంటాయో రిపోర్టులు వచ్చిన తర్వాతే తెలుస్తుంది. పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహం నుంచి సేకరించిన విసెరా నమూనాలను ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపాం. ఆ నివేదిక వచ్చిన తర్వాతే అష్రఫ్ మరణానికి ఖచ్చితమైన కారణం తెలుస్తుంది'' అని డాక్టర్ కృతార్థ్ బ్రహ్మాభట్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














