ఏఐ రేసులో చైనా, అమెరికాతో పోల్చితే భారత్ స్థానమెక్కడ?

ఏఐ కృత్రిమ మేద్ధస్సు, భారత్, ప్రపంచ రేసు

ఫొటో సోర్స్, Nurphoto via GettyImages

అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలు భారత్‌లో కృత్రిమ మేథ రంగంలో అక్షరాల 50 బిలియన్ డాలర్లకు పైగా కళ్లు చెదిరే పెట్టుబడులను ప్రకటించాయి.

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల ఆసియాలోనే అతిపెద్ద పెట్టుబడిని 17.5 బిలియన్ డాలర్లు ప్రకటిస్తూ "భారత్‌లో ఏఐ ఆధారిత భవిష్యత్తుకు కావాల్సిన మౌలిక వసతులు, నైపుణ్యాలు, సామర్థ్యాలను నిర్మించడానికి ఇది ఉపయోగపడుతుంది'' అన్నారు.

తర్వాత అమెజాన్ కూడా 2030 నాటికి 35 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెడతామని ప్రకటించింది, ఇందులో ఎంత మొత్తం ఏఐ సామర్థ్యాలపై ఖర్చు చేయనుందో వెల్లడించలేదు.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ ప్రకటనలు వెలువడిన సమయంసందర్భం ప్రత్యేకంగా గమనించదగిన విషయం.

ఏఐ బబుల్‌పై ఉత్కంఠ పెరిగి ప్రపంచ మార్కెట్లలో టెక్ షేర్ల విలువ క్రమంగా పెరుగుతున్న వేళ, భారతీయ ఏఐ రంగంపై కొన్ని బ్రోకరేజీలు విభిన్న అభిప్రాయం వ్యక్తం చేశాయి.

జెఫరీస్‌కు చెందిన క్రిస్టఫర్ వుడ్, భారతీయ స్టాక్స్‌ను "రివర్స్ ఏఐ ట్రేడ్'' అని పేర్కొన్నారు. అంటే ప్రపంచ ఏఐ బుడగ ఒక్కసారిగా పేలిపోతే, భారత్ ఇతర మార్కెట్లకంటే మెరుగ్గా నిలవగలదని ఆయన అన్నారు. హెచ్‌ఎస్‌బీసీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, భారతీయ ఈక్విటీలు ప్రస్తుత ఏఐ ర్యాలీపై అసంతృప్తిగా ఉన్న పెట్టుబడిదారులకు "హెడ్జ్, డైవర్సిఫికేషన్'' అవకాశం ఇస్తాయని తెలిపింది.

గత ఏడాది ఆసియా మార్కెట్లతో పోలిస్తే ముంబై స్టాక్స్ వెనుకబడి ఉండటంతో, విదేశీ పెట్టుబడులు కొరియా, తైవాన్ వంటి ఏఐ ఆధారిత టెక్ కంపెనీలకు మళ్లాయి.

ఈ నేపథ్యంలో అమెజాన్,మైక్రోసాఫ్ట్ పెట్టుబడుల ప్రకటనలు ఈ లోటును పూరించే అవకాశముంది. అయితే ప్రపంచ ఏఐ పోటీలో భారత్ నిజంగా ఏ స్థానంలో ఉంది అనేది ఇంకా జవాబు లేని ప్రశ్న.

ఏఐ కృత్రిమ మేద్ధస్సు, భారత్, ప్రపంచ రేసు

ఫొటో సోర్స్, AFP via Getty Images

సులువైన సమాధానాలు లేవు

ఈ ప్రశ్నకు సులువైన సమాధానాలు లేవు.

భారత్‌లో ఏఐ వినియోగం, విస్తరణ వేగం పుంజుకుంటోంది. డేటా సెంటర్లు, చిప్ తయారీ వంటి పరిశ్రమల్లో పెట్టుబడుల ప్రవాహం ప్రారంభమైంది. ఇటీవల అమెరికా చిప్ దిగ్గజం ఇంటెల్, టాటా ఎలక్ట్రానిక్స్‌తో కలిసి భారత్‌లోనే చిప్ తయారీకి భాగస్వామ్యం ప్రకటించింది.

అయితే స్వతంత్ర ఏఐ మోడెల్‌ విషయంలో భారత్ ఇంకా వెనుకంజలోనే ఉంది.

భారత ప్రభుత్వం 2023లో ఒక ఏఐ మిషన్‌ను ప్రారంభించి, స్టార్టప్‌లు, విశ్వవిద్యాలయాలు, పరిశోధకులకు ఇండియాకు సొంత ఏఐ మోడల్ నిర్మించేందుకు కావాల్సిన హై-ఎండ్ చిప్‌లను అందిచడం ప్రారంభించింది. ఈ సొంత ఏఐ మోడల్ ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ ప్రకారం, 22కు పైగా భారతీయ భాషలలో నైపుణ్యం చూపగలదు. అయితే ఈ లోపు చైనా డీప్‌సీక్, అమెరికా ఓపెన్‌ ఏఐ వంటి సంస్థలు మరిన్ని ఆధునిక వేరియంట్లను విడుదల చేశాయి.

విదేశీ ప్లాట్‌ఫారంలపై ఆధారపడే పరిస్థితి సెక్యూరిటీ, శిక్షణ పరిమితులకు దారితీస్తుందని భారత ప్రభుత్వం గుర్తించినప్పటికీ, భారత మిషన్ బడ్జెట్ 1.25 బిలియన్ డాలర్లు, ఫ్రాన్స్ (117 బిలియన్), సౌదీ అరేబియా (100 బిలియన్) ప్రోగ్రామ్‌లతో పోలిస్తే ఎంతో తక్కువ.

ఈవై నివేదిక ప్రకారం, ఏఐ విస్తరణలో భారత్‌‌కు అనేక అడ్డంకులు ఉన్నాయి -సెమీకండక్టర్ కొరత, నైపుణ్యంగల శ్రామిక శక్తి, ఇవన్నీ ఇంకా పెద్ద సమస్యలే.

చైనా, అమెరికా దశాబ్దాలుగా బిలియన్ల డాలర్లు పెట్టుబడిగా పెట్టి నిర్మించిన పరిశోధన, అభివృద్ధి సామర్థ్యాలు భారత్‌కు ఇప్పటికీ లేవు.

ఏఐ నైపుణ్యంలో ప్రపంచదేశాలలో భారత్‌ బలంగా ఉన్నప్పటికీ, ఆ ప్రతిభను దేశంలోనే నిలుపుకోవడం పెద్ద సవాలు.

ఈవై ప్రకారం, "ప్రపంచ దేశాల వీసా పరిమితులు భారత్‌కు ఏఐ ప్రతిభను దేశంలోనే నిలుపుకోవడానికి మంచి అవకాశం. కానీ అగ్రశ్రేణి ఏఐ ప్రతిభ ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నందున, వారిని దేశంలోకి తీసుకురావడానికి ఆకర్షణీయమైన ప్రోత్సహకాలు అవసరం.''

ఈ విషయంలో చైనా ఇప్పటికే ఆర్థిక ప్రోత్సాహకాలు, సబ్సిడీలు, ఆర్ అండ్ డీ ఫండింగ్, ప్రత్యేక ప్రతిభ వీసాలు వంటి పథకాలను అమలు చేస్తోంది.

భారత్‌లో ఏఐ నైపుణ్యం గ్లోబల్ సగటు కంటే 2.5 రెట్లు ఎక్కువ ఉన్నప్పటికీ, ఆ ప్రతిభను నిలుపుకొనే విధానాలు ఇంకా దృఢంగా లేవు.

ఏఐ కృత్రిమ మేద్ధస్సు, భారత్, ప్రపంచ రేసు

ఫొటో సోర్స్, Bloomberg via Getty Images

టాప్ 5లో భారత్

బ్రెజిల్, ఫిలిప్పీన్స్‌లతో పాటు భారత్ కూడా ఏఐ రంగంలో మెరుగైన అభివృద్ధిని కనబరుస్తోందని యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ పేర్కొంది.

స్టాన్‌ఫర్డ్ ఏఐ ఇండెక్స్ 2025 ప్రకారం, ఏఐ పెట్టుబడులు పొందుతున్న కొత్త దేశాల సంఖ్యలో భారత్ ప్రపంచంలో టాప్ 5లో ఒకటి.

గత సంవత్సరం 74 భారతీయ ఏఐ స్టార్టప్‌లు నిధులు పొందగా, అమెరికాలో ఈ సంఖ్య వెయ్యి దాటింది.

ప్రైవేటు పెట్టుబడి పరంగా, భారత్ కేవలం 1.16 బిలియన్ డాలర్లు సేకరించగా, అమెరికా 100 బిలియన్, చైనా 10 బిలియన్లు దాటాయి.

అయితే ఏఐ పరిశోధనలో నివేదికల ప్రచురణలతో భారత్ అమెరికాను స్వల్పంగా అధిగమించినప్పటికీ, యూరప్‌, చైనా కంటే వెనుకబడి ఉంది.

నిపుణుల ప్రకారం, భారత్‌ బలం పెద్ద మోడళ్లను నిర్మించడంలో కాకుండా, వాటిని ఉపయోగించి వ్యాపార వృద్ధిని ప్రోత్సహించడంలో ఉండవచ్చు.

పీక్ ఎక్స్‌వీ పార్ట్‌నర్స్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేంద్ర సింగ్ , "వచ్చే ఐదు పదేళ్లలో ఏఐ కొత్త కంపెనీల సృష్టి భారీగా ప్రజాస్వామ్యీకరణ చెందుతుంది చిన్న వ్యవస్థాపకుల సంఖ్య పెరుగుతుంది, ఇది భారత్ వంటి దేశాలకు గొప్ప ప్రయోజనాలను కలిగిస్తుంది'' అన్నారు.

భారత్‌లో ఏఐ ఆధారిత వినియోగదారు యాప్‌లు వేగంగా పెరుగుతున్నాయి. పెట్టుబడులు రెట్టింపు అయ్యాయి. వెనుకబడిన వర్గాల సమస్యలను పరిష్కరించడానికి ఏఐ ని వినియోగిస్తున్న స్టార్టప్‌ల సంఖ్య కూడా పెరుగుతుంది.

ఉదాహరణకు, మహారాష్ట్ర ప్రభుత్వ మహావిస్తార్ యాప్ స్థానిక మరాఠీ భాషలో వ్యవసాయ సమాచారాన్ని 1.5 కోటి మంది రైతులకు అందిస్తోంది.

నందన్ నిలేకని రాసినట్టు, " క్లినిక్‌లు, పొలాల్లో ఏఐ పనిచేయగలిగితే ప్రపంచంలో ఎక్కడైనా పనిచేయగలదు.''

అయితే ఏఐ భారత ఐటీ సేవల రంగానికి కొత్త సవాళ్ళను కూడా తెచ్చిపెడుతోంది.

ఏఐ వ్యాప్తి భారత బిలియన్ డాలర్ల ఐటీ సేవా రంగాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది.

ఇప్పటికే ఐటీ రంగంలో వృద్ధి మందగించింది, షేర్లు వెనుకబడ్డాయి, నియామకాలు తగ్గాయి, వేతనాలు అస్థిరంగా ఉన్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)