పరిటాల: ఆంధ్రప్రదేశ్‌లో గతంలో కొంతకాలం ఏడు చిన్న గ్రామాలు కలిసి ఓ స్వతంత్రదేశంగా ఏర్పడిన కథ తెలుసా?

పరిటాల, హైదరాబాద్, నిజాం, కోస్తా జిల్లాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
    • రచయిత, బళ్ళ సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఎన్టీఆర్ జిల్లాలోని పరిటాల గ్రామం వజ్రాలకు ప్రసిద్ధి అని తెలిసిందే. కానీ అంతకు మించిన విలువైన చరిత్ర ఆ గ్రామానికి ఉంది. అదే పరిటాల రిపబ్లిక్.

ప్రస్తుతం రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలో ఉన్న ఈ చిన్న ఊరు ఒకప్పుడు పరిటాల రిపబ్లిక్ గా ఉండడమే దీని ప్రత్యేకత.

ఏడు చిన్న ఊళ్లన్నీ కలసి ఒక దేశంగా ఏర్పడ్డ అరుదైన చరిత్ర ఈ పేరు వెనుక ఉంది.

విశాల భారతదేశం గణతంత్రంగా మారకముందే ఈ గ్రామాలు గణతంత్రంగా మారాయి.

కొద్దికాలమే అయినప్పటికీ, స్వతంత్ర్య దేశంగా కొనసాగిన ఈ గ్రామం కథ చాలా ఆసక్తికరం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పరిటాల, హైదరాబాద్, నిజాం, కోస్తా జిల్లాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
ఫొటో క్యాప్షన్, పరిటాలను తమ నియంత్రణలో ఉంచుకోవాలని నిజాం రాజులు అనుకున్నారు.

వజ్రాల కోసం నిజాం రాజ్యంలో…

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతంలో చాలా భాగం నిజాం రాజుల నుంచి బ్రిటిష్ వారికి వచ్చింది.

రెండో అసఫ్ జా, బ్రిటిష్ వారి మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం కోస్తా జిల్లాలు బ్రిటిష్ వారికి ఇచ్చినప్పటికీ వజ్రాలు బాగా దొరికే పరిటాల, కోళ్ళూరు మాత్రం తమ నియంత్రణలో ఉంచుకోవాలని అనుకున్నారు.

1766, 1788లలో బ్రిటిష్-నిజాంల మధ్య జరిగిన ఒప్పందాల ప్రకారం, పరిటాల తప్ప మిగిలిన కోస్తా ప్రాంతాలను బ్రిటిష్ వారికి ఇచ్చారు నిజాం. దానికి బదులు ప్రస్తుత తెలంగాణ సూర్యాపేట జిల్లా మునగాల పరగణ, హుజూర్ నగర్ దగ్గర లింగగిరి పరగణాలను బ్రిటిష్ వారికి ఇచ్చారు.

దీంతో పరిటాల నిజాం పాలనలోని భూభాగంలో ఉంటే, చుట్టూ బ్రిటిష్ భూభాగం ఉండేది.

రెండు ప్రదేశాల మధ్య నాకాలు (చెక్ పోస్టులు) ఉండేవి. పరిటాల, మోగులూరు, ఉస్తేపల్లి, మల్లవల్లి, బత్తినపాడు, గని ఆతుకూరు, కొడవటికల్లు - ఈ ఏడు గ్రామాలను కలిపి పరిటాల ఖానాత్ (ఖానాత్ అంటే పర్షియన్ భాషలో తాలూకా అని అర్ధం) అని పిలిచేవారు.

నిజాం అధికారులు పరిటాల కేంద్రంగా కార్యాలయాలు ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని పాలించేవారు.

1947 ఆగస్టు 15న పరిటాల చుట్టూ ఉన్న ప్రాంతానికి స్వాతంత్ర్యం వచ్చింది కానీ పరిటాల మాత్రం నిజాం పాలన కిందే ఉండిపోయింది. మిగిలిన నిజాం రాజ్యం 1948 సెప్టెంబరు 17న భారత్ లో విలీనం కాగా, పరిటాల ఖానాత్ మాత్రం అంతకు ముందే తిరుగుబాటు చేసి, 1947 నవంబర్ 15నే నిజాం పాలన నుంచి విముక్తి పొందింది.

విముక్తి పొందిన వెంటనే తమను తాము స్వతంత్ర్య - గణతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ఆ ప్రాంతానికి ‘పరిటాల రిపబ్లిక్’ అని పేరు పెట్టుకుంది. ప్రత్యేకంగా రాజ్యాంగం రాసుకుంది.

''పరిటాల ప్రజలు బ్రిటిష్ పాలనలో పార్లమెంటరీ వ్యవస్థను చూశారు. తమకు ఓటు హక్కు లేకపోవడం, నిజాం మత విధానాలు వంటివి వారికి నచ్చలేదు. అదే సమయంలో 1942లో గాంధీ నాయకత్వంలోని క్విట్ ఇండియా ఉద్యమం తరువాత ఉత్తర భారతంలో చాలాచోట్ల ఇలా స్థానిక ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.

‘‘ఆంధ్రాలో అప్పటికే జరిగిన సహాయ నిరాకరణ ఉద్యమం, చీరాల-పేరాల ఉద్యమం, పెదనందిపాడు పన్నుల వ్యతిరేక పోరాటం, పర్లాకిమిడి పోరాటం వంటివి పరిటాల వాసులను ప్రభావితం చేశాయి. దీంతో 1946 నాటికే నిజాం పాలన నుంచి బయటపడాలన్న కాంక్ష ఎక్కువైంది'' అని బీబీసీతో చెప్పారు కోదాడకు చెందిన చరిత్ర అధ్యాపకుడు కృష్ణసాగరపు ఉపేంద్ర.

ఆయన పరిటాల చరిత్రపై పరిశోధన చేసి కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయానికి ఎంఫిల్ థీసిస్ కోసం సమర్పించి, దాన్ని పుస్తకంగా ప్రచురించారు.

ఆ కాలంలో పరిటాలలో నిజాం అధికారుల అకృత్యాలు కూడా తిరుగుబాటుకు కారణం కావచ్చని ఆయన అంచనా.

''పరిటాలలో ప్రజలపై అణచివేత తీవ్రంగా ఉండేది. నిజాం ప్రభుత్వం తరపున పనిచేసిన లంకా సుబ్బయ్య శాస్త్రి అనే వ్యక్తి గని ఆతుకూరు, బత్తినపాడులో అనేక అరాచకాలు చేశారు.

ప్రభుత్వ అండతో ప్రజలను వేధించారు. దీంతో ఆయన్ను కొందరు హత్య చేశారు. లంకా సుబ్బయ శాస్త్రి గుర్రం మీద ఒక ఊరు నుంచి మరో ఊరు వెళ్తుంటే మధ్యలోని చెరువు దగ్గర దాడి చేసి, గుర్రంతో ఈడ్చుకుపోయి, మళ్లీ చెరువు దగ్గర పారేశారు.

నిజాం ప్రభుత్వపు విచారణలో ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి 'తామే చంపాం' అనడంతో దీనిపై ఏం చేయలేక వదిలేశారు. అదే సమయంలో మాదిరాజు దేవరాజు, షేక్ మౌలా, అవ్వా సత్యనారాయణ వంటి వారు ప్రజలను తిరుగుబాటువైపు సన్నద్ధం చేశారు'' అని ఉపేంద్ర చెప్పారు.

పరిటాల, హైదరాబాద్, నిజాం, కోస్తా జిల్లాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఫొటో సోర్స్, Krishnasagarapu Upendra

ఫొటో క్యాప్షన్, ఊరికి ముగ్గురు చొప్పున 21 మందితో సెంట్రల్ కమిటీ ఏర్పడింది.

పోలీస్ స్టేషన్‌పై దాడి

భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన మూడు నెలల తరువాత 1947 నవంబర్ 12 లేదా 15న పరిటాలలోని పోలీస్ స్టేషన్‌పై కొందరు దాడి చేశారు.

1947 నవంబర్ 15న స్టేషన్ పై దాడి జరిగిందని చరిత్ర అధ్యాపకులు ఉపేంద్ర చెబుతుండగా.. నవంబర్ 12న జరిగిందని పరిటాలలోని స్థూపంలో రాశారు.

ఈ రెండింటిలో ఏది సరైనదో బీబీసీ స్వతంత్ర్యంగా నిర్ధరించలేదు.

మొత్తంగా నవంబర్ 15న పరిటాల ఖానాత్ పరిధిలోని ఏడు గ్రామాలను స్వతంత్ర్య, గణతంత్ర దేశంగా ప్రకటించి ‘పరిటాల రిపబ్లిక్’ అని పేరు పెట్టారు.

ఊరికి ముగ్గురు చొప్పున 21 మందితో సెంట్రల్ కమిటీ ఏర్పడింది. న్యాయవాది అవ్వా సత్యనారాయణ ఈ ఊరి కోసం చిన్న రాజ్యాంగం రాశారు.

పోలీస్ స్టేషన్‌పై దాడిలో కమ్యూనిస్టుల పాత్ర ఉందని ఆ ఊరిలో 2009 ప్రాంతంలో నిర్మించిన స్థూపం ప్రకారం తెలుస్తోంది.

తిరుగుబాటుకు కాంగ్రెస్ సహకారం ఉందని ఉపేంద్ర పరిశోధనలో దొరికిన పత్రాలు చెబుతున్నాయి.

ఎవరి పాత్ర ఏంటి, ఎంత అనే దానిపై మరింత లోతైన పరిశోధన జరగాల్సి ఉంది.

పరిటాలలోని స్థూపంపై వివరాల ప్రకారం… బొంబాయి ప్రసాద్ అలియాస్ వీరమాచనేని వేంకటేశ్వర రావు, పెర్నా శ్రీరామమూర్తి, దొడ్డపనేని రామారావు, వీరమాచనేని వేంకటేశ్వరరావు, మల్లెల నర్సయ్య, కూటం నాగయ్య, సిద్ధి రాములు, ములసా వీరయ్య, పెన్నా రాధాకృష్ణమూర్తి, గుణ్ణం రామిరెడ్డి, కుర్రా వెంకట నర్సయ్యతో మరికొందరు ఈ పోలీస్ స్టేషన్ పై దాడిలో పాల్గొన్నట్టు రాశారు. వీరంతా కమ్యూనిస్టులు అని ఆ స్థూపం చెబుతోంది.

తిరుగుబాటు తర్వాత ఏర్పడిన పరిటాల రిపబ్లిక్ ప్రథమ సెంట్రల్ కమిటీలో అధ్యక్షుడిగా మాదిరాజు దేవరాజు, ఉపాధ్యక్షుడుగా మాగంటి రామకోటయ్య, కార్యదర్శిగా చింతల అచ్చయ్య చౌదరి, సభ్యులుగా చింతలపాటి విశ్వనాథం, అవ్వా సత్యనారాయణ, చింతా బాపయ్య, మన్నెం కోటయ్య, వెలగా రామకృష్ణయ్య, మాదిరాజు నాగభూషణ రావు, బండి వెంకయ్య, అక్కినేని రామారావు ఇంకా కొందరు ఉన్నారని పరిటాల స్థూపంలో రాసుకున్నారు.

ఈ కమిటీ పెద్దలంతా నిత్యం జాతీయ కాంగ్రెస్ తో సంప్రదింపులు చేస్తూ వారి సహకారం తీసుకున్నారని ఉపేంద్ర తెలిపారు.

''మాదిరాజు దేవరాజుగారితో నాకు చిన్నప్పటి నుంచి దాదాపు 40-50 ఏళ్ల పరిచయం ఉంది. ఆయన ప్రెసిడెంట్‌గా సుమారు రెండేళ్ల పాటు ఈ ఊళ్లని పాలించారని తెలుసు.

ఇప్పుడు పరిటాల హైస్కూలు ఉన్న చోట మా చిన్నతనంలో ఒక ఆస్పత్రి ఉండేది. అంతకుముందు అందులో నిజాం ప్రభుత్వ కార్యాలయాలు ఉండేవని చెప్పేవారు. అది రాతి కట్టడం. మా ఊళ్లో స్వంతంత్ర్య పోరాట యోధులు చాలా మంది ఉండేవారు'' అని బీబీసీతో చెప్పారు అత్తలూరి నరసింహారావు అనే గ్రామస్థుడు.

పరిటాల, హైదరాబాద్, నిజాం, కోస్తా జిల్లాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఫొటో సోర్స్, Krishnasagarapu Upendra

ఫొటో క్యాప్షన్, రామానంద తీర్థ

జాతీయ నాయకత్వం మద్దతు

ఈ తిరుగుబాటు అంత తేలికగా జరగలేదు. స్థానికులు దానికోసం చాలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించారు.

సుభాష్ చంద్రబోస్ స్థాపించిన అజాద్ హింద్ ఫౌజ్‌లో పనిచేసిన తమిళుడు రామచంద్రన్‌ను తీసుకువచ్చి పరిటాలలో యువతకు శిక్షణ ఇప్పించారని ఉపేంద్ర చెప్పారు.

''ఈ దాడిని ఎదుర్కోవడానికి అదనపు బలగాల కోసం స్థానిక అధికారులు నిజాం ప్రభుత్వానికి నివేదించారు. అయితే ఆ సైన్యం భారత భూభాగంలోని మద్రాస్ రాష్ట్రాన్ని దాటి రావాల్సి ఉంది.

సరిగ్గా ఈ పాయింటే ఉద్యమకారులకు బలంగా మారింది. తమ భూభాగం మీదుగా పరిటాలకు వెళ్లడానికి నిజాం సైన్యానికి అనుమతి ఇవ్వకుండా జాతీయ కాంగ్రెస్ నాయకత్వం, మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తిరుగుబాటుదారులు అడ్డుకోగలిగారు'' అన్నారు ఉపేంద్ర.

''అటు అదనపు బలగాలు సరిహద్దుల వద్దనే ఆగిపోయాయి. దీంతో పరిటాల వాసుల ప్రణాళిక అమలైంది. నిజాం రాజ్యపు అధికారులను వెళ్లగొట్టారు.

టంగుటూరి ప్రకాశం పంతులు, బెజవాడ గోపాల రెడ్డి వంటి వారు బెజవాడ కాంగ్రెస్ కమిటీ ద్వారా పరిటాలలో పోరాటం చేసేవారికి సన్నిహితంగా ఉండడం కూడా కలసివచ్చింది.

తాము ఏర్పాటు చేయబోయే రిపబ్లిక్ ప్రభుత్వానికి అగ్ర నాయకత్వం మద్దతు కోసం ముందు నుంచే దిల్లీతో ఉత్తర ప్రత్యుత్తరాలు చేసేవారు. గాంధీ, నెహ్రూల దగ్గరకు రాయబారులను పంపించారు.

ఈ ఉద్యమం గురించి తెలుసుకుని స్వయంగా జయప్రకాశ్ నారాయణ, అరుణ అసఫ్ అలీ పరిటాలను సందర్శించారు. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఫౌండర్ రామానంద తీర్థ, హయగ్రీవాచారి కూడా కొంతకాలం పరిటాలలో ఉన్నారు.

అదే సమయంలో దేశానికి స్వాతంత్ర్యం రావడంతోపాటు ఎలా అయినా ఎప్పటికైనా హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనం అవుతుందనే నమ్మకం వీరికి కలిగిందని తెలుస్తోంది.

తెరవెనుక జాతీయ కాంగ్రెస్, బెజవాడ కాంగ్రెస్ ఎప్పటికప్పుడు వీరితో సంప్రదింపులు జరుపుతూ పరిటాల రిపబ్లిక్ కి మద్దతుగా ఉన్నారు. అజాద్ హింద్ ఫౌజ్ రామచంద్రన్‌ను శిక్షణ కోసం రప్పించడానికి సాయం చేసింది కూడా బెజవాడ కాంగ్రెస్సే.

ప్రతి నెలా బెజవాడ కాంగ్రెస్ కమిటీ లేఖలు వచ్చాయి. ఎలా నడుస్తోంది? మీకేమైనా సహాయం కావాలా? అని అందులో రాసేవారు. రాజకీయంగా చురుగ్గా ఉండడం వలన వారికి ఆ అవగాహన ఉంది.

గాంధీ దగ్గరకు రాయబారం పంపినప్పుడు కూడా, వారిని అభినందిస్తూనే, భవిష్యత్తులో ప్రధాన భూభాగంలో విలీనం చేయాలని ఆయన సూచించినట్టు తెలుస్తోంది'' అని వివరించారు ఉపేంద్ర.

పరిటాల, హైదరాబాద్, నిజాం, కోస్తా జిల్లాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఫొటో సోర్స్, Krishnasagarapu Upendra

ఫొటో క్యాప్షన్, రిపబ్లిక్ ఆఫ్ పరిటాల స్టాంప్ ఉన్న డాక్యుమెంట్

పరిటాల – వరంగల్ – ఉస్మానియా లింక్

1938లో ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా జరిగిన వందేమాతరం ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న యువతలో చాలా మంది పరిటాల వారు ఉండడం ఈ ఊరిలో ఉద్యమ స్ఫూర్తికి ప్రేరణ కావచ్చని ఉపేంద్ర అంచనా.

''ఈ తిరుగుబాటులో బ్రాహ్మణుల నాయకత్వం ఎక్కువగా కనిపించింది. ఇతర కులాల వారినీ కలుపుకుపోయారు, ముస్లింలు, దళితులు కూడా ఉన్నారు'' అన్నారు ఉపేంద్ర.

భౌగోళికంగా కృష్ణా జిల్లా మధ్యలో ఉన్నప్పటికీ చాలా మంది పరిటాల వాసులకు వరంగల్‌తో మంచి సంబంధాలు ఉండేవి. చదువుకున్నవారు, వ్యాపారం చేసేవారు పరిటాల నుంచి వరంగల్ వెళ్లి స్థిరపడేవారు.

అలా వరంగల్‌లో స్థిరపడిన అవ్వా సత్యనారాయణ తిరిగి పరిటాల వచ్చారు. ఆయన రాసిన పరిటాల రాజ్యాంగం చాలా చిన్నది, స్థూలంగా ఉండేది.

ఈ మొత్తం వ్యవహారంలో పైకి మాదిరాజు దేవరాజు ప్రధానంగా కనిపించినా తెర వెనుక ఎక్కువ మంత్రాంగం, ఇతర ప్రభుత్వాలు, జాతీయ నాయకత్వంతో సంప్రదింపులు జరపడంలో అవ్వా సత్యనారాయణ కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోందంటారు ఉపేంద్ర.

నిజాం సైన్యాన్ని ఎదిరించాలంటే ఎవరెవరితో సంప్రదింపులు జరపాలన్న అవగాహన కలిగిన వ్యక్తి సత్యనారాయణ. అదే సమయంలో స్థానికంగా అందరి ఆమోదం ఉన్న, పలుకుబడి ఉన్న మాదిరాజు దేవరాజు ముందుండి అధ్యక్ష స్థానం తీసుకున్నారు.

మొత్తంగా మిగిలిన తెలంగాణ కన్నా కాస్త ముందుగానే ఈ ప్రాంతం నిజాం పాలన నుంచి విముక్తి పొందింది. 1947 నవంబర్ 15 నుంచి 1950 జనవరి 26 వరకూ సాంకేతికంగా ఈ పరిటాల రిపబ్లిక్ అనే దేశం ఉనికిలో ఉన్నట్టు.

అయితే వాస్తవానికి భారత ప్రభుత్వంలో హైదరాబాద్ సంస్థానం విలీనం పూర్తయిన తరువాత నుంచే, అప్పటి సైనిక ప్రభుత్వాన్ని నడుపుతున్న జేఎన్ చౌధురితో కూడా వారు సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది.

పాలన సమర్థంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అనేక ఏర్పాట్లు చేసుకున్నారు. భద్రత, సంక్షేమాలను ప్రాధాన్యంగా తీసుకున్నారు.

''కులం, మతం తేడాలేకుండా, నిస్వార్థంగా పనిచేశారు. ఉదాహరణకు నిజాం ప్రభుత్వం జాతీయ జెండాను ఎగురవేయద్దని చాటింపు వేసినా, షేక్ మౌలా స్వయంగా జెండా పట్టుకుని ఊరు మొత్తం తిరిగి, ఒక చెట్టుపై జెండా కట్టారు'' అని వివరించారు ఉపేంద్ర.

పరిటాల, హైదరాబాద్, నిజాం, కోస్తా జిల్లాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
ఫొటో క్యాప్షన్, ఏడు గ్రామాలను కలిపి పరిటాల రిపబ్లిక్ గా పేరు పెట్టారు

తెలంగాణ నుంచి ఆంధ్రకు (నాటి హైదరాబాద్ నుంచి మద్రాస్‌కు):

ఉస్తేపల్లి, కొడవటికల్లు, పరిటాల, మోగులూరు, బత్తినపాడు, గొనుగుపాడు, బూరవంచ, మల్లపల్లి, పుల్లపాడు.. ఈ తొమ్మిది గ్రామాలను అప్పటి హైదరాబాద్ రాష్ట్రం నుంచి అప్పటి మద్రాస్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో 1950లో కలిపినట్టు చరిత్ర పరిశోధకుడు ప్రశాంత్ బీబీసీకి చెప్పారు.

దానికి ప్రతిగా నల్లగొండ దగ్గర్లోని లింగగిరి, సర్పవరం, కలవపల్లి, లక్కవరం, అమరవరం, గనగలంద, ములుగుమాడ, రొంపిమల్ల, మల్లవరం అనే గ్రామాలు మద్రాస్ నుంచి హైదరాబాద్‌లో కలిపినట్టు ఆయన వివరించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)