లండన్ బ్యాంకులో ఉన్న రూ.307 కోట్ల నిజాం నిధికి 120మంది వారసులు - ప్రెస్‌రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
దాదాపు ఏడు దశాబ్దాలపాటు న్యాయపోరాటం చేసి గెలుచుకున్న నిజాం నవాబు నిధులను ఆయన వారసులు 120 మంది పంచుకోనున్నారని నమస్తే తెలంగాణ పేర్కొంది.
హైదరాబాద్ నిజాం నవాబుకు చెందిన.. లండన్‌లోని నాట్‌వెస్ట్ బ్యాంక్‌లోగల 3.5 కోట్ల పౌండ్లు (సుమారు రూ.307 కోట్లు) ఆయన వారసులకే దక్కుతాయని లండన్ కోర్టు బుధవారం తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే.
7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు చెందిన ఆ నిధులు ఆయన వారసులుగా చెప్పుకుంటున్న యువరాజులు, భారతదేశానికి మాత్రమే పొందే హక్కు ఉందని లండన్‌లోని రాయల్ కోర్ట్స్ ఆఫ్ జస్టిస్‌కు చెందిన జస్టిస్ మార్కస్ స్మిత్ తీర్పు చెప్పారు.
ఈ నేపథ్యంలో ఆ సొమ్మును ఎవరెవరు పంచుకుంటారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఆ నిధుల కోసం నిజాం మనుమలు ముకరం జా, ముఫఖ్కం జా భారత ప్రభుత్వంతో కలిసి న్యాయపోరాటం చేశారు. ఆ తరువాత నిజాం ఎస్టేట్‌గా ఏర్పడిన 120 మంది నిజాం వారసులు కూడా ఆ కేసులో ప్రతివాదులుగా చేరారు.
వీరే కాకుండా నిజాం కుటుంబ సంక్షేమ సంస్థకు నేతృత్వం వహిస్తున్న నిజాం మరో మనుమడు నజఫ్ అలీఖాన్ కూడా కేసులో హక్కుదారుగా చేరారు. వీరందరినీ కలిపి ఇప్పుడు నిజాం ఎస్టేట్‌గా పరిగణిస్తున్నారు.
బ్యాంక్‌లోని నిధుల విషయంలో నిజాం ఎస్టేట్ భారత ప్రభుత్వంతో ఒక రహస్య ఒప్పందం చేసుకున్నట్టు చెప్తున్నారు. ఆ ఒప్పందం ప్రకారం కేసులో హక్కుదారులుగా ఉన్న వారందరూ ఆ సొమ్మును పంచుకోవాలి. అయితే భారత ప్రభుత్వం కూడా తన వాటాను కోరుతుందా లేదా అన్నది వెల్లడి కావాల్సి ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
డంపింగ్ యార్డుల్లా పోలీసు శిక్షణాసంస్థలు
దేశంలోని పోలీస్ శిక్షణ సంస్థలు డంప్ యార్డుల్లా మారాయని సీనియర్ ఐపీఎస్ అధికారి వినయ్ కుమార్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు ఈనాడు వెల్లడించింది.
ఐపీఎస్‌లకు శిక్షణ ఇచ్చే జాతీయ పోలీస్ అకాడమీ ఇందుకు మినహాయింపు కాదని అన్నారు. పోలీస్ విభాగాల్లో పనికిరారనుకున్న అధికారులతో శిక్షణ సంస్థలను నింపేస్తున్నారని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప్రజల దృష్టిలో పోలీసులకు చెడ్డపేరు రావడానికి శిక్షణ సంస్థలే కారణమని కుండబద్దలు కొట్టారు.
ప్రస్తుతం అకాడమీల్లో శిక్షణ వల్ల ప్రజాధనం వృథా అవడం తప్ప సత్ఫలితాలు రావడం లేదని అన్నారు. ఆ పరిస్థితిని మార్చేందుకు ప్రణాళిక రూపొందించానని... తన ప్రయత్నానికి ప్రభుత్వం అంగీకరించకపోయినా ఒరిగేదేమీ ఉండదన్నారు.
రాజాబహుదూర్ వెంకట్రామిరెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీ (టీఎస్పీఏ) సంచాలకుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు.
విధుల్లో పోలీసులు చనిపోతున్నా ప్రజల నుంచి సానుభూతి రావడం లేదని, ఇందుకు కారణం శిక్షణ సంస్థలేనని ఆయన అన్నారు.
శిక్షణ నుంచి వెళ్లాక పోలీసులు సామాజిక కార్యకర్తల్లా పనిచేయాలని అన్నారని ఈనాడు పేర్కొంది.

ఫొటో సోర్స్, TDP/FB
‘మా వాళ్లను కొడుతున్నారు.. ఇదేం అరాచకం?"
ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛని ఆంధ్రప్రదేశ్ సీఎం, డీజీపీ హరిస్తున్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారని ఆంధ్రజ్యోతి పేర్కొంది.
‘‘సామాజిక మాధ్యమాల్లో వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోస్టులు పెట్టడాన్ని పెద్ద నేరంగా చిత్రీకరిస్తున్నారు. సెక్షన్ 153ఏ, ఐపీసీ 505ఏ, బీ, 2, 7, 509, 66డీ, 67 వంటి మత కల్లోల సమయంలో మోపే సెక్షన్ల కింద కేసులు పెట్టి, అరెస్టులు చేసి జైలుకు పంపడం దారుణం'' అని బాబు పేర్కొన్నారు.
వైసీపీలోకి వెళ్లడానికి నిరాకరించిన వ్యక్తిని చిలకలూరుపేట సీఐ పోలీస్ స్టేషన్‌లో కొడుతూ, ఆ దృశ్యాలను స్థానిక ఎమ్మెల్యేకు వీడియో కాల్ ద్వారా చూపించడం అమానుషమని ఆగ్రహించారు.
‘‘సీఎం ఇష్టానుసారం చేయడానికి ఇది పులివెందుల కాదు. తోక కట్ చేసి పులివెందుల పంపిస్తాం'' అని హెచ్చరించారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్‌మీడియాలో స్పందిస్తున్నవారిపై కేసులు పెట్టి వేధిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు గురువారం సాయంత్రం గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశమయ్యారు.
బాధితుల గోడుని వారి మాటల్లోనే తెలుసుకొన్నారు. ''బాధితులకు అండగా ఉంటాం. సోషల్ మీడియా కేసుల కోసమే పార్టీ ఆఫీసులో ఒక కంట్రోల్ రూమ్ తెరిచి ఫిర్యాదులు స్వీకరిస్తాం. ఇకపై ఎక్కడ ఇలాంటి కేసులు పెట్టినా వెంటనే మా అడ్వకేట్లు, పార్టీ నాయకులు వచ్చి నిలదీస్తారు'' అని భరోసా ఇచ్చారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణలో కొత్త మద్యం పాలసీ
తెలంగాణ ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని ప్రకటించిందని సాక్షి తెలిపింది. నూతన మద్యం విధానానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను గురువారం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ విడుదల చేశారు.
నవంబర్ 1 నుంచి 2021 అక్టోబర్ వరకు కొత్త మద్యం విధానం అమలులో ఉంటుంది. జనాభా ప్రాతిపదికన లైసెన్స్ ఫీజులు ఖరారు చేయనుంది.
గతంలో ఉన్న 4 స్లాబులను 6 స్లాబులకు పెంచింది. లాటరీ విధానం ద్వారా మద్యం షాపుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజును రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, ఇతర ప్రాంతాలలో రాత్రి 10 గంటల వరకు మద్యం షాపులు తెరచి ఉంటాయి.
ఈ నెలాఖరులోగా లాటరీ విధానం ద్వారా మద్యం లైసెన్స్ దారుల ఎంపిక ఉంటుందని సోమేష్ కుమార్ పేర్కొన్నారని సాక్షి వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
- కశ్మీర్, గో రక్షణ, మూకదాడులు, మతాంతర వివాహాలపై గాంధీ అభిప్రాయాలేంటి?
- చైనా అభివృద్ధిలో విజేతలెవరు... అక్కడి పాఠ్య పుస్తకాల్లో కనిపించని చరిత్ర ఏంటి?
- మోదీ Vs. ఇమ్రాన్ ఖాన్: ఐరాస వేదికపై ఎవరిది విజయం
- ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎవరు.. ఆయన చరిత్ర ఏంటి?
- చమురు వరమా, శాపమా?.. ప్రపంచాన్ని అది ఎలా మార్చింది
- వృద్ధురాలి వంటగదిలో దొరికిన రూ.46 కోట్ల విలువైన కళాఖండం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








