కొత్త అల్లుడికి వందల రకాల స్వీట్ల వడ్డింపు: ఇది ఆతిథ్యమా? పోటీ నిండిన ఆర్భాటమా?

స్వీట్లు, అతిథి మర్యాదలు, గోదావరి అల్లుళ్లు, సంక్రాంతి

ఫొటో సోర్స్, ugc

ఫొటో క్యాప్షన్, శ్రీ హర్ష, లక్ష్మీ నవ్య
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

సంక్రాంతి సీజన్‌లో...కొత్త అల్లుడికి రికార్డు సంఖ్యలో స్వీట్లు వడ్డించే వార్తలు రావడం ట్రెండ్‌గా మారింది.

ఈ ఏడాది అనకాపల్లి జిల్లాలో కొత్త అల్లుడి కోసం 290 రకాల స్వీట్లు సిద్ధం చేశారన్న వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొట్టింది.

గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, అనకాపల్లి, విశాఖ వంటి అనేక జిల్లాల్లోనూ ఇదే దృశ్యం కనిపించింది.

అల్లుళ్ల కోసం వందల రకాల స్వీట్లు సిద్ధం చేస్తున్నారు. అన్ని రకాల స్వీట్లు ఒకేసారి ఎలా సిద్ధం చేస్తున్నారు?

అవన్నీ ఇంట్లోనే వండుతారా, లేక బయట కొనుగోలు చేస్తారా? నిజంగా అల్లుళ్లు వాటిని తినేయగలరా? అల్లుళ్లకు పెట్టే వంటకాలన్నీ స్వీట్లేనా...అసలు దేనిని స్వీట్ అని అంటారు? దీనికి ఏమైనా ప్రామాణికత ఉందా? వంటి విషయాలు తెలుసుకుందాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
స్వీట్లు, అతిథి మర్యాదలు, గోదావరి అల్లుళ్లు, సంక్రాంతి

ఫొటో సోర్స్, ugc

ఫొటో క్యాప్షన్, సంక్రాంతి సీజన్‌లో స్వీట్ల వీడియోలు ట్రెండ్‌గా మారాయి.

‘అల్లుడికి మర్యాద’

ప్రతి సంక్రాంతి వేళ ఈ స్వీట్ల విందుల వీడియోలు మీడియాలో కనిపించడం సాధారణమైపోయింది. ఇది కేవలం కుటుంబ ఆతిథ్యానికి పరిమితమా లేక సంప్రదాయం పేరుతో సామాజిక ప్రదర్శనగా మారుతోందా అన్న ప్రశ్న కూడా వస్తోంది.

కొత్త అల్లుడిని ఘనంగా సత్కరించడం తెలుగు ప్రాంతాల్లో చాలాకాలంగా కనిపిస్తున్న ఆచారం. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఈ అతిథి మర్యాదలకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

ఈ మర్యాదని స్వీట్లు, పిండి వంటల రూపంలో చూపించడం ఇక్కడి కుటుంబాల్లో సాధారణంగా కనిపిస్తుంటుంది. అయితే గతంలో ఈ సత్కారాలు పదుల సంఖ్యలో వంటకాలకే పరిమితమయ్యేవి.

ఇటీవలి కాలంలో మాత్రం ఈ వంటకాల సంఖ్య గణనీయంగా పెరిగింది. సంక్రాంతి రోజున కొత్త అల్లుడితో పాటు కుమార్తెను కూర్చోబెట్టి వరుసగా వంటకాలను వడ్డించడం ఇప్పుడు ఒక ప్రత్యేక కార్యక్రమంలా మారింది.

ఈ దృశ్యాలు ఫోటోలు, వీడియోల రూపంలో సోషల్ మీడియాలో పంచుకుంటుండటంతో ఇవి ప్రతి ఏటా వార్తలుగా మారుతున్నాయి.

ఈ ఆచారాన్ని సమర్థిస్తూ...అమలాపురానికి చెందిన సోమశేఖర్ బీబీసీతో ఏమన్నారంటే....

"మా అల్లుడిపై ప్రేమతో చేసేది ఇది. ఎవరికీ ఇబ్బంది లేదు, పైగా మాకు సరదా" అని అన్నారు.

"ఇప్పుడు వంటలకన్నా వాటి సంఖ్యే ముఖ్యం అవుతోంది. ఇది సంప్రదాయం కన్నా ప్రదర్శనగా మారుతోందన్న భావన కలుగుతోంది" అని ఏయూ జర్నలిజం విభాగం ప్రొఫెసర్ చల్లా రామకృష్ణ బీబీసీతో అన్నారు.

ఈ స్వీట్ల రికార్డుల తంతు కొత్తగా ఉండటంతో ఆసక్తికరమైన చర్చ పెరుగుతోంది.

"ఇంతకుముందు మా ప్రాంతంలో ఇలా ఉండేది కాదు. ఇప్పుడు ఇతర జిల్లాలను చూసి మనమూ అదే చేయాలన్న ఆలోచనలు పెరుగుతున్నాయి. ఇది ఓ రకమైన ఒత్తిడిలాంటిదే" అని అనకాపల్లికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ గణేశ్ అన్నారు.

స్వీట్లు, అతిథి మర్యాదలు, గోదావరి అల్లుళ్లు, సంక్రాంతి

ఫొటో సోర్స్, ugc

ఫొటో క్యాప్షన్, కొత్త అల్లుళ్లకు రకరకాల వంటకాలతో వడ్డించడం తెలుగు సంస్కృతిలో భాగం.

సోషల్ మీడియా ప్రభావం...

ఈ మార్పుకు సోషల్ మీడియా కూడా ఒక కారణమని కొందరు భావిస్తున్నారు.

"ఫోటో కోసం వంట చేయడం కొత్తగా మొదలైంది. తినే వాళ్లకన్నా చూసే వాళ్లే ఎక్కువయ్యారు" అని పాయకరావుపేటకు చెందిన ఫోటోగ్రాఫర్ గోవింద్ అన్నారు.

అల్లుడి కోసం వందల రకాల స్వీట్లు కాన్సెప్ట్ కోసం...ఫోటో, వీడియోలను తాను రెండుసార్లు తీశానని బీబీసీకి తెలిపారు.

సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రధాన మీడియా సంస్థలలో కూడా ఈ వార్తలకు ప్రాధాన్యత దక్కుతోంది.

దీంతో సంక్రాంతి సీజన్ వచ్చిందంటే 'అల్లుడి కోసం వందల సంఖ్యల స్వీట్లు, అదిరిపోయిన ఫలానా జిల్లా అతిధి మర్యాదలు' అనే వార్తలు పెరుగుతున్నాయి.

"సంక్రాంతి ఆతిథ్యం తెలుగు సంస్కృతిలో కీలకమైన భాగమే. అయితే వందలాది రకాల వంటలు, మీడియా వార్తలు...ఇవి కూడా సంక్రాంతి పండుగలో భాగమైపోతున్నాయి. ఈ ఒత్తిళ్లు తగ్గాల్సిన అవసరం ఉంది" అని సామాజిక అంశాల విశ్లేషకురాలు ఊహా మహంతి బీబీసీతో అన్నారు.

స్వీట్లు, అతిథి మర్యాదలు, గోదావరి అల్లుళ్లు, సంక్రాంతి

ఫొటో సోర్స్, ugc

ఫొటో క్యాప్షన్, వందల రకాల స్వీట్ల వడ్డింపు వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

ఈ సంప్రదాయం ఎక్కడిది?

ఇది గ్రామీణ–వ్యవసాయ సంస్కృతిలో పుట్టిన ఆచారమనే చెప్పాలని సామాజికవేత్త ఎం.రంగబాబు బీబీసీతో అన్నారు.

"గతంలో 10 నుంచి 20 రకాలు స్వీట్లు లేదా వంటకాలు వడ్డిస్తే గొప్పగా భావించేవారు. అలా ఆ సంఖ్య కాస్త పెరిగేసరికి "భలే మర్యాద" అనేవారు. గత 15, 20 ఏళ్లలో ప్రజల ఆర్థిక స్థితి మెరుగుపడింది. ప్రతిష్ట భావన పెరిగింది. అందులో భాగమే ఈ వందల స్వీట్ల ఆతిధ్యం అని భావించవచ్చు. అయితే సోషల్ మీడియా ప్రభావంతో ఇది మరింత ఎక్కువగా కనిపిస్తోంది" అని రంగబాబు అన్నారు.

"సంక్రాంతి అనేది పంటల పండుగ. గోదావరి జిల్లాల్లో కోతలు పూర్తయిన తర్వాత ఇంట్లో ధాన్యం, బియ్యం, బెల్లం, కొబ్బరి, పాలు సమృద్ధిగా ఉండే కాలం. అందుకే ఇక్కడ వంటకాల వైవిధ్యం ఎక్కువైంది. అదే కాలక్రమేణా 'పిండి వంటల సంప్రదాయం'గా స్థిరపడింది" అని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కె. ప్రసాద్ బీబీసీతో అన్నారు. ప్రసాద్ ఆరెకరాల రైతు.

'తొలి సంక్రాంతికి అల్లుడిని ఘనంగా సత్కరించడం ద్వారా…కూతురు ఇంటి బంధం, అల్లుడు ఇంటి గౌరవం వంటి భావన కలిగించే చర్యగా భావించవచ్చు. ఇవి మన తెలుగు రాష్ట్రాల్లో బలంగానే కనిపిస్తాయి. ఇక అతిధి దేవోభవ ఉండనే ఉంది" అని అన్నారు ప్రసాద్.

"ఒకప్పుడు ఈ సంప్రదాయం ప్రేమాభిమానాల వ్యక్తీకరణగా ఉండేది. కానీ కాలక్రమేణా ఆతిథ్యం నుంచి ఆర్భాటం వైపు మళ్లింది. సంప్రదాయాలు కూడా ప్రదర్శనగా మారుతున్నాయి. సంక్రాంతి విందులు ఇప్పుడు కుటుంబ పరిధిని దాటి, వైరల్ కంటెంట్‌గా మారడం ఈ ఆచారానికి కొత్త మలుపు" అని ప్రొఫెసర్ రామకృష్ణ చెప్పారు.

స్వీట్లు, అతిథి మర్యాదలు, గోదావరి అల్లుళ్లు, సంక్రాంతి
ఫొటో క్యాప్షన్, సామాజిక అంశాల విశ్లేషకురాలు ఉషా మహంతి

సంక్రాంతి స్పెషల్

'తిండి పెట్టి చంపేస్తార్రా బాబు' అని గోదావరి జిల్లాల అతిధి మర్యాదల గురించి చెప్పుకోవడం చూస్తుంటాం. ఇప్పుడు వందల స్వీట్ల సంప్రదాయం మొదలయ్యాక....'ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా' అనే సినిమా డైలాగ్ అల్లుళ్లు చెప్పే పరిస్థితి వచ్చిందని అనిపిస్తుంది.

సంక్రాంతి రోజున అల్లుడితో పాటు కూతురిని కూర్చోబెట్టి ఆరగించమని వందల స్వీట్లు వడ్డిస్తారు. అల్లుడు తినలేకపోతుంటే...తినాల్సిందే అంటూ ప్రేమతో పట్టుబడతారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతారు.

"ఇది మా ఊరోళ్ల మర్యాద", ఎంతైనా అదృష్టవంతుడివి బాస్", "ఇన్నీ స్వీట్లు తినగలవా"'...ఇలా ఆ పోస్టులకు రకరకాల కామెంట్లు వస్తుంటాయి.

"ఈ స్వీట్లు తినే కార్యక్రమంలో "తినకపోతే అవమానంగా భావిస్తారేమో" అనే మానసిక ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది. ఆరోగ్య సమస్యలు ఉన్నా తినాల్సిన పరిస్థితికి అవకాశం ఉంది. దీనితో పాటు కేవలం వీడియోలు తీసుకుని వదిలేస్తున్నారా? వందల రకాల స్వీట్లు అంటే అసలు ఎంత ఖర్చు? ఇలాంటి ప్రశ్నలు వస్తాయి" అని మానసికశాస్త్ర నిపుణులు ప్రొఫెసర్ ఎంవీఆర్ రాజు అన్నారు.

"ఎవరెక్కువ స్వీట్స్ పెట్టారు… ఎవరు తక్కువ పెట్టారు" అనే లెక్కలు వద్దు. పండుగలు అంకెల కోసం కాదు..ఆనందం కోసం" అని జాయ్ కోచ్ బి. రామకృష్ణ బీబీసీతో అన్నారు.

మనిషి ఆనందంగా ఎలా జీవించాలనే అంశంపై ఈయన కౌన్సిలింగ్ నిర్వహిస్తుంటారు.

స్వీట్లు, అతిథి మర్యాదలు, గోదావరి అల్లుళ్లు, సంక్రాంతి

ఫొటో సోర్స్, Getty Images

సంప్రదాయం వెర్సస్ ప్రదర్శన

"మాకు ఆనందం, అల్లుడు కూడా ఎంజాయ్ చేశాడు. ఇది మా కుటుంబ గర్వం. ఈ వీడియోలు కూడా వైరల్ గా మారి...మాకు జ్ఞాపకాలుగా ఉంటున్నాయి" అని పాయకరావుపేటకు చెందిన కిశోర్ అన్నారు.

2023లో అనకాపల్లి అల్లుడు మురళీధర్ కోసం పశ్చిమ గోదావరి జిల్లాలో 379 రకాల స్వీట్లు తయారు చేశారు. అప్పుడు వైరల్‌గా మారిన ఆ జంటతో బీబీసీ మాట్లాడింది.

"గోదారోళ్లు అల్లుడికి సంక్రాంతి మర్యాదలు బాగా చేస్తారని విన్నాను. నేను పడుకుని లేచే సరికి నా ముందు 379 రకాల స్వీట్లు ప్రత్యక్షమయ్యాయి. కానీ, ఇన్ని స్వీట్లు చేస్తారని నాకు అసలు ఐడియా లేదు" అని అల్లుడు మురళీధర్ అన్నారు.

మరి అన్నీ తిన్నారా అంటే... "పది రకాలు తినేసరికి...నా వల్ల కాదని నాకు అర్థమైంది" అంటూ మురళీధర్ నవ్వేశారు.

"వీటిని ప్లాన్ వేసుకుని...ఒక మెనూ కార్డులా తయారు చేశాం. వాటిలోని ఒక్కొక్క ఐటమ్ తయారు చేయించడం, కొన్నింటిని కొనడం, లేదా మేమే చేయడం ఇలా మొత్తంగా తయారు చేసి సంక్రాంతిని గుర్తుండిపోయేలా చేయాలనుకున్నాం" అని మురళీధర్ భార్య కుసుమ చెప్పారు.

మరి ఇవన్ని స్వీట్లేనా అని అడిగితే...స్వీట్లకి చిన్న చిన్న మార్పులతో కొత్త స్వీట్ తయారు చేయవచ్చు. మేం చేసిన వాటిలో కొన్ని అలాంటివే అన్నారు కుసుమ.

స్వీట్లు, అతిథి మర్యాదలు, గోదావరి అల్లుళ్లు, సంక్రాంతి

ఫొటో సోర్స్, ugc

ఫొటో క్యాప్షన్, సతీశ్, తనూజ

ఇంతకీ ఏది స్వీట్?

వందల రకాల స్వీట్ల అతిధ్యం అంటూ చూస్తూనే ఉన్నాం. ఇన్ని రకాల స్వీట్లు మనకి అందుబాటులో ఉన్నాయా? అసలు స్వీటు అని దేనిని అంటారు? దీనికి ఏదైనా ప్రమాణం ఉందా? ఈ విషయాలను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఏఏఐ) అధికారులతో బీబీసీ మాట్లాడింది.

"భారతదేశంలో ఫలానా పదార్థం 'స్వీట్' అని చెప్పే అధికారిక నిర్వచనం లేదు. ఎఫ్ఎస్ఏఏఐ ఫుడ్ కేటగిరీల్లో చక్కెర ఆధారిత/పాలు ఆధారిత/ధాన్యాల ఆధారిత పదార్ధాలు అని మాత్రమే ఉంటుంది. ఎఫ్ఎస్ఏఏఐ దేనికీ "ఇది కొత్త స్వీట్" అని సర్టిఫికేట్ ఇవ్వదు. 'ఇది స్వీట్' అని నిర్ధరించే స్పష్టమైన ప్రమాణం లేదు" అని ఎఫ్ఎస్ఏఏఐ అధికారులు తెలిపారు.

స్వీట్స్ అనేవి తీపి రుచి కలిగిన ఆహార పదార్థాలు. ఇవి క్యాండీ, చాకెట్లు, డెజర్ట్స్, మిఠాయి వంటి రూపాల్లో ఉంటాయి.

ఒక ఉత్పత్తిని "స్వీట్" అని పిలవడానికి ప్రత్యేకమైన ఒక ప్రమాణం లేదు. కానీ ఒక ఉత్పత్తికి నిర్దిష్టమైన పేరు పెట్టాలంటే లేదా ఆ పేరుతో పిలవాలంటే, కొన్ని స్టాండర్డ్స్ మాత్రం ఉంటాయి" అని ఎఫ్ఎస్ఏఏఐ అధికారులు చెప్పారు.

స్వీట్లు, అతిథి మర్యాదలు, గోదావరి అల్లుళ్లు, సంక్రాంతి

ఫొటో సోర్స్, ugc

ఫొటో క్యాప్షన్, కొన్ని స్వీట్లకు కొద్దిగా మార్పులు చేర్పులు చేసి కొత్త పేర్లు పెడుతున్నారు.

ఆ స్టాండర్డ్స్ ఏమిటి?

"స్వీట్" అనే పదానికి నిర్వచనం లేదు. కానీ ఒక ఉత్పత్తిని లడ్డూ, బర్ఫీ, జిలేబీ, చాక్లెట్ వంటి నిర్దిష్ట పేరుతో అమ్మాలంటే మాత్రం కొన్ని ఆధికారిక ప్రమాణాలు ఉంటాయి. భారతదేశంలో వీటిని ప్రధానంగా ఎఫ్ఎస్ఏఏఐ నిర్ణయిస్తుంది.

ఉదాహరణకు జిలేబీ ఒక చక్కెర సిరప్‌లో ముంచిన/వేయించిన పిండి మిఠాయి. ఇది పారంపర్య భారతీయ స్వీట్ కేటగిరీలోకి వస్తుంది. ఎఫ్ఎస్ఏఏఐ జిలేబీని సాధారణంగా"Sugar-boiled Confectionery/Traditional Sweet" కేటగిరీలో ఉంచుతుంది.

జిలేబీ అని పిలవాలంటే సాధారణంగా ఉండాల్సినవి - మైదా/గోధుమ పిండి, చక్కెర, నూనె లేదా నెయ్యి, ఫర్మెంటేషన్‌కు కొద్దిగా పెరుగు లేదా ఈస్ట్. అలాగే పిండికి బదులుగా ఇతర అనుమతించని పదార్థాలు వాడకూడదు. ఒక వేళ వాడితే దానిని జిలేబీ అని కాకుండా "Sweetened Fried Product" అని పిలవాలి. పదార్థాలు, రంగులు, నూనె....అన్నీ ఎఫ్ఎస్ఏఏఐ నియమాల ప్రకారం ఉండాలి.

స్వీట్లు, అతిథి మర్యాదలు, గోదావరి అల్లుళ్లు, సంక్రాంతి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, స్వీట్ల వడ్డింపు ఆడంబరాల ప్రదర్శనగా మారిందని సామాజిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చిన్న మార్పులతో కొత్త స్వీట్లు?

ఉదాహరణకు కోవా తయారు చేసి...దానికి కాస్త జీడిపప్పు కలిపితే అది జీడిపప్పు కోవా, కొబ్బరి కలిపితే కొబ్బరి కోవా, బెల్లం అయితే బెల్లం కోవా ఇలా ఒక స్వీట్ లో చిన్న మార్పు చేయడం ద్వారా దానిని కొత్త స్వీట్ అనవచ్చా అంటే...

"ఎవరి నిర్ణయం వారిది...దాని ప్రత్యేకంగా గుర్తు పెట్టుకోవడం కోసం పేరుతో పిలుస్తారు. అంతే కానీ...ప్రతిదీ ఒక కొత్త స్వీటు అవుతుందో, అనాలో, లేదో మనం చెప్పలేం" అని ఎఫ్ఎస్ఏఏఐ కార్యాలయం తెలిపింది.

"లడ్డులో నెయ్యి ఎక్కువ ఉంటే ఒక రకం, బెల్లం బదులు పంచదార వేస్తే ఇంకో రకం అంటారు. కాకపోతే ఇలా చెప్తూపోతే...వందల వంటకాలు, స్వీట్లు పుట్టుకొస్తాయి. ఇది వంటల వైవిధ్యమా…లేక లెక్కల కోసం విభజనా అన్నట్టు పరిస్థితి మారిపోతుంది" అని ప్రొఫెసర్ చల్లా రామకృష్ణ అన్నారు.

"అయితే…తమ ప్రేమను ఎలా వ్యక్తపరచాలనేదానిపై ప్రతి కుటుంబానికీ స్వేచ్ఛ ఉంది. వందల స్వీట్లు అన్న మాట వినడానికి బాగుంటుంది" అని అన్నారు ప్రొఫెసర్ చల్లా రామకృష్ణ.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)