రిపబ్లిక్ డే-రెడ్ కార్పెట్: వచ్చే అతిథులే భారత విదేశాంగ విధానానికి సూచికలా?

రిపబ్లిక్ డే

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, నిఖితా యాదవ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత్ తన 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది.

బ్రిటీష్ వలస పాలన నుంచి భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం రాగా, ఆ తర్వాత 1950 జనవరి 26న దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.

దీని ప్రకారం ప్రజాస్వామ్య, సర్వసత్తాక, గణతంత్ర రాజ్యంగా భారత్ ఆవిర్భవించింది. అందుకే, ప్రతి ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుకుంటారు.

దిల్లీలో కర్తవ్యపథ్ చుట్టూ ప్రతేడాది ఈ రోజు గ్రాండ్‌గా పరేడ్ జరుగుతుంది. వేలాది మంది వీక్షిస్తుండగా.. సైనికుల ట్యాంకులు కవాతు చేస్తూ ముందుకు సాగుతుంటే, యుద్ధ విమానాలు ఆకాశంలో గర్జిస్తూ అబ్బురపరుస్తుంటాయి.

ఈ పరేడ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే, ఈ వేడుకల్లో అత్యంత ముఖ్యమైన కుర్చీల్లో ఎవరు కూర్చుంటారన్న దానిపైనే ప్రధాన దృష్టంతా ఉంటుంది. ఎందుకంటే అతిథులుగా అక్కడ కూర్చున్న విదేశీ రాజ్యాల ప్రతినిధులు, భారత విదేశాంగ విధానానికి ప్రతీకలు.

గణతంత్ర వేడుకలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( ఫైల్ ఫోటో)

యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెండ్ ఆంటోనియో లూయిస్ శాంటోస్ డా కోస్టా, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్‌లు ఈ ఏడాది గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథులు.

దేశంలో జరిగే అత్యంత ముఖ్యమైన కార్యక్రమాల్లో ఒకటైన గణతంత్ర వేడుకల్లో ఈసారి యూరోపియన్ యూనియన్‌కు అత్యున్నత ప్రాధాన్యతను ఇచ్చింది కేంద్రం.

ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరైన వారు రాష్ట్రపతికి పక్కనే ఆసీనులవుతారు. ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి అధికారుల కంటే కూడా వీరి కుర్చీలే రాష్ట్రపతి కుర్చీకి దగ్గరగా ఉంటాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

భారత రాష్ట్రపతికి పక్కన ఎవరు కూర్చుంటున్నారన్నది ప్రొటోకాల్ కంటే కూడా అత్యంత ముఖ్యమైన విషయంగా పరిగణిస్తుంటారు.

''దశాబ్దాలుగా ఈ వేడుకల ముఖ్య అతిథి ఎంపికను చాలా నిశితంగా పరిశీలిస్తుంటారు. ఎందుకంటే, భారత విదేశాంగ విధాన ప్రాధాన్యతలను ఇది సూచిస్తుంది. అంతేకాక, ఏ దేశాలతో తన సంబంధాలను దిల్లీ కోరుకుంటుందో ఈ ప్రత్యేక సందర్భంలో ప్రతిబింబించేలా చేస్తుంది'' అని నిపుణులు చెప్పారు.

1950లో అప్పటి ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్ణో భారత తొలి గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొన్నప్పటి నుంచి ఈ విధానం మొదలైంది.

భారత్ గణతంత్ర దేశంగా ఆవిర్భవించిన తొలినాళ్లల్లో.. కొత్తగా ఏర్పడిన ఇతర స్వతంత్ర దేశాలతో సంబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చింది. ఈ విధానం ముఖ్య అతిథుల ఎంపికలో స్పష్టంగా కనిపించేది.

అప్పటి నుంచి ఈ పరేడ్‌ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల అధినేతలకు ఆతిథ్యం ఇచ్చింది. ఇది భారత అంతర్జాతీయ సంబంధాల, వ్యూహాత్మక ప్రాధాన్యతల మార్పులను ప్రతిబింబిస్తుంది.

గణతంత్ర వేడుకలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఫైల్ ఫోటో

భారత గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ముఖ్య అతిథుల్లో భూటాన్, శ్రీలంక వంటి పొరుగు దేశాల నేతల నుంచి యూఎస్, యూకే వంటి ప్రముఖ దేశాల అధినేతల వరకు ఉన్నారు.

యూకే ఇప్పటి వరకు ఐదుసార్లు ముఖ్య అతిథిగా భారత రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొంది. ఈ వేడుకలకు క్వీన్ ఎలిజబెత్ 2, ప్రిన్స్ ఫిలిప్ వంటి వారు పాల్గొన్నారు. రెండు దేశాల మధ్యనున్న సుదీర్ఘ, క్లిష్టమైన చరిత్రను ఇది ప్రతిబింబించింది.

రష్యా (అప్పటి సోవియట్ యూనియన్), ఫ్రాన్స్‌లకు చెందిన నేతలను కూడా 1950 నుంచి సుమారు ఐదుసార్లు ఈ వేడుకలకు ఆహ్వానించింది భారత్. ఇది రెండు దేశాలతో భారత్‌కు ఉన్న సుదీర్ఘమైన వ్యూహాత్మక సంబంధాలను తెలియజేస్తోంది.

వివిధ దేశాల నుంచి భారత రిపబ్లిక్ డే ఉత్సవాల్లో పాల్గొన్న ముఖ్య అతిథుల జాబితాను చూస్తే.. ఒక నిర్దిష్ట సంవత్సరంలో ఎవరిని ఈ వేడుకలకు ఆహ్వానించాలో భారత్ ఎలా నిర్ణయిస్తుందనే ప్రశ్న తలెత్తుతుంది.

అయితే, ఈ ఎంపిక విధానం చాలా వరకు బయటకు తెలియకుండా చాలా గుంభనంగా జరుగుతూ ఉంటుంది. ఆహ్వనించబోయే ముఖ్య అతిథుల జాబితాను విదేశాంగ మంత్రిత్వ శాఖలోనే షార్ట్‌లిస్ట్ చేస్తారని మాజీ దౌత్యవేత్తలు, మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

''ప్రధానమంత్రి కార్యాలయం దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుంది. ఆ తర్వాత ఎంపిక చేసిన దేశాలతో అధికారిక సంప్రదింపులు జరుపుతారు. కొన్ని నెలల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది'' అని మాజీ దౌత్యవేత్తలు, మీడియా కథనాలు చెబుతున్నాయి.

రిపబ్లిక్ డే వేడుకలు

ఫొటో సోర్స్, Getty Images

విదేశాంగ మంత్రిత్వ శాఖలో పనిచేసిన పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక అధికారి మాట్లాడుతూ, ''వ్యూహాత్మక లక్ష్యాలను, ప్రాంతీయ సమతుల్యతను, అంతకుముందు ఎప్పుడైనా ఈ దేశాన్ని ఆహ్వానించామా? అనే అంశాలన్నింటిన్నీ పరిగణనలోకి తీసుకుంటారు'' అని తెలిపారు.

నిర్ణయం తీసుకునేటప్పుడు ఎన్నో విషయాలపై ఆలోచించాల్సి వస్తుందని అమెరికాకు భారత రాయబారిగా పనిచేసిన నవ్‌తేజ్ సర్నా తెలిపారు.

''ముఖ్యమైన భాగస్వామ్య దేశాలు, పొరుగు దేశాలు, అగ్రదేశాల మధ్య సమతుల్యత పాటించాల్సి ఉంటుంది'' అని అన్నారు. అలాగే, ఈ సమయంలో ఆ దేశాధినేతలు అందుబాటులో ఉండటం కూడా అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుందని తెలిపారు.

''మారుతున్న ముఖ్య అతిథుల జాబితా కూడా ప్రపంచంతో భారత్ మారుతున్న అనుబంధాన్ని ప్రతిబింబిస్తుంది'' అని విదేశాంగ విధాన నిపుణులు హర్ష్ వి. పంత్ అన్నారు.

''ఈ ఏడాది వేడుకలకు వస్తోన్న ఈయూ ప్రతినిధి బృందాన్ని, దాని నాయకత్వాన్ని గమనిస్తే, ఈయూతో మన సంబంధాలు రెట్టింపు చేసుకోవాలని చూస్తున్నట్లు స్పష్టమవుతుంది'' అని తెలిపారు.

ఈ సమయంలో వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించే అవకాశం ఉందని అన్నారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులపరంగా చూసుకుంటే.. భారత్, యూరోపియన్ కూటమి రెండూ ఇప్పుడు ఒకే పరిస్థితిలో ఉన్నాయని సూచిస్తోంది.

రిపబ్లిక్ డే

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత రిపబ్లిక్ వేడుకలకు హాజరైన ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ (ఫైల్ ఫోటో)

అమెరికాతో భారత్ వాణిజ్య ఒప్పందం గురించి చర్చలు జరుపుతోన్న సమయంలో ఈయూతో ఈ పరిణామం చోటు చేసుకోబోతుంది.

ఆసియాలోనే అత్యధికంగా భారత్ ఉత్పత్తులపై అమెరికా 50 శాతం సుంకాలను విధించిన తర్వాత రెండు దేశాల మధ్య ఏడాది కాలంగా చర్చలు కొనసాగుతున్నాయి.

ఈ సమయంలో రెండు దేశాల మధ్య సంబంధాలూ క్షీణించాయి. రష్యా చమురును భారత్ కొంటుందనే నెపంతో అమెరికా టారిఫ్‌లు కూడా విధిస్తోంది.

బరాక్ ఒబామా

ఫొటో సోర్స్, Hindustan Times via Getty Images

ఫొటో క్యాప్షన్, 2015లో రిపబ్లిక్ పరేడ్‌‌కు హాజరైన బరాక్ ఒబామా

''పరేడ్‌లో ముఖ్య అతిథుల ఎంపిక, ఆ నిర్దిష్ట సమయంలో భారత ప్రాధాన్యతలను తెలియజేస్తుంది. ఏ భౌగోళిక ప్రాంతాలపై దృష్టి పెట్టాలనుకుంటుందో దీని ద్వారా అర్థమవుతుంది'' అని హర్ష్ వి. పంత్ అన్నారు.

గ్లోబల్ సౌత్‌తో భారత్ ఇప్పటికీ సన్నిహితంగా మెలుగుతూ వస్తోందని పంత్ స్పష్టం చేశారు.

ఉదాహరణకు 2018లో ఆగ్నేయాసియా దేశాల కూటమి (ఆసియాన్) నేతలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించింది. ఇలా ఒక ప్రాంతీయ బృందాన్ని ఆహ్వానించడం అదే తొలిసారని పంత్ తెలిపారు. ఈ కూటమితో భారత్‌కున్న 25 ఏళ్ల అనుబంధాన్ని పురస్కరించుకుని వారిని రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథులుగా ఆహ్వానించిందన్నారు.

అదేవిధంగా, ఈ అతిథుల జాబితాలో కొందరు పేర్లు లేకపోవడం వారితో భారత్‌కున్న ఉద్రిక్త సంబంధాలను సూచిస్తుంది.

1965లో భారత్-పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం జరగడానికి ముందు రెండుసార్లు పాకిస్తానీ నేతలు భారత రిపబ్లిక్ డే వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించడంతో పాకిస్తాన్ నేతలను ఆహ్వానించలేదు.

గణతంత్ర దినోత్సవం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రిపబ్లిక్ డే వేడుకల్లో ఒంటెల పరేడ్ ఆకట్టుకుంటుంది.

చైనా ఈ వేడుకకు హాజరైంది ఒకే ఒక్క సందర్భంలో. 1958లో మార్షల్ యే జియాన్యింగ్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. సరిహద్దు విషయంలో రెండు దేశాల మధ్య యుద్ధం జరగడానికి నాలుగేళ్ల ముందు ఈ పర్యటన జరిగింది.

అయితే, రిపబ్లిక్ డే ప్రాముఖ్యత కేవలం దౌత్యం, ముఖ్య అతిథుల జాబితాకే పరిమితం కాలేదు.

ప్రపంచంలోని ఇలాంటి సైనిక కవాతు ప్రదర్శనలతో పోలిస్తే.. భారత రిపబ్లిక్ డే పరేడ్ ఎన్నోకారణాలతో ప్రత్యేకంగా నిలుస్తుందని నిపుణులు అంటున్నారు. భారత్ ప్రతేడాది ఒక విదేశీ నేతను అతిథిగా ఆహ్వానించే సంప్రదాయం ఉండటం కూడా అందులో ఒకటి అని పేర్కొంటున్నారు.

అయితే, అన్ని దేశాలలో కూడా ఈ పరేడ్‌లను సైనిక విజయాలుగా గుర్తుగా నిర్వహిస్తున్నారు. ఉదాహరణకు.. రష్యా విక్టరీ డేను రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీని ఓడించిన గుర్తుగా చేసుకుంటోంది. ప్రాన్స్ బాస్టిల్లె డేను ఫ్రెంచ్ విప్లవ ప్రారంభానికి, రాచరిక వ్యవస్థ అంతం కావడానికి సూచికగా జరుపుకుంటోంది. చైనా మిలటరీ పరేడ్ రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై విజయానికి ప్రతీకగా నిర్వహిస్తోంది.

పుతిన్, మన్మోహన్ సింగ్

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, 2007లో రిపబ్లిక్ డే పరేడ్‌కు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్

అయితే, భారత వేడుకలు వీటికి భిన్నంగా జరుగుతుంటాయి. భారత్ ఈ వేడుకలను రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా నిర్వహిస్తుందని పంత్ తెలిపారు.

''చాలా దేశాలకు ఈ వేడుకలు యుద్ధాల్లో విజయాలకు సంబంధించినవి. కానీ, మనం అలా చేసుకోవడం లేదు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్య దేశంగా భారత్ ఆవిర్భవించిన రోజున మనం ఈ వేడుకలను చేసుకుంటున్నాం'' అని పంత్ చెప్పారు.

చాలా పాశ్చాత్య దేశాలలో జరిగే సైనిక కవాతుల మాదిరిగా కాకుండా.. భారత్ తన గణతంత్ర దినోత్సవాన్ని సాంస్కృతిక ప్రదర్శనలు, రంగురంగుల రాష్ట్రాల శకటాల మేళవింపుతో కలిపి సైనిక సామర్థ్యాలను ప్రదర్శిస్తోంది. ఇది భారత శక్తిని, వైవిధ్యతను ప్రతిబింబిస్తుంది.

వ్యూహాత్మకం, ప్రతీకలకు మించి, ఈ కార్యక్రమానికి విచ్చేసే నేతలకు ఈ పరేడ్‌లు మరింత వ్యక్తిగత అనుభవాలను అందిస్తుంది. ఒబామా దంపతులు ఈ వేడుకలకు హాజరైనప్పుడు, సైనిక ప్రదర్శనలో భాగంగా ఒంటెలపై కవాతు నిర్వహించిన సైనిక దళాలను చూసి ఎంతో సంతోషించారని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక మాజీ అధికారి తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)