మంకీ మ్యాన్: బర్త్ డే పార్టీలు, పెళ్లిళ్లలో కోతి వేషంతో అలరిస్తున్న యువకుడు

వీడియో క్యాప్షన్, మంకీ మ్యాన్: ‘ఒక ప్రోగ్రాంకు 5 వేల నుంచి 6 వేలు తీసుకుంటాను’
మంకీ మ్యాన్: బర్త్ డే పార్టీలు, పెళ్లిళ్లలో కోతి వేషంతో అలరిస్తున్న యువకుడు

‘‘చాలా మంది మంకీ మ్యాన్‌లను చూశాను. కానీ సహజ టాలెంట్ ఉన్నవాళ్లు మాత్రమే ఇందులో నిలదొక్కుకోగలరు’’ అంటున్నారు జాకీ వాధ్వానీ.

అతడి అసలు పేరు హితేష్ వాధ్వానీ. ‘‘నేను మంకీ మ్యాన్‌లా వినోదం పంచుతుంటాను. పార్టీలు, పుట్టిన రోజులు, పెళ్లిళ్లలో అందరినీ సంతోషపెడుతుంటాను. మంకీ మాన్ అంటే ఇక్కడ ప్రతి ఒక్కరికీ తెలుసు. పదేళ్లుగా నేను ఈ పని చేస్తున్నా’’ అని తన ప్రత్యేకత గురించి చెప్పారు.

‘‘మా నాన్న కూలీ పని చేస్తారు. 8వ తరగతి వరకు చదివుకున్నాను. మా ఆర్థిక పరిస్థితి సరిగా లేక ఆ తర్వాత చదువుకోలేదు. నేను కూలీ పనికి కూడా వెళ్లాను. తర్వాత బండి మీద పండ్లు అమ్మాను. కానీ రోజుకు 200 కూడా వచ్చేవి కాదు’’ అని తెలిపారు.

మంకీ మ్యాన్

‘‘కోతిలా చేయమని నా ఫ్రెండ్ రవి పొపట్ నాకు చెప్పాడు. ‘జనాలను నవ్వించే టాలెంట్ నీ దగ్గర ఉంది. ఆ పనికి అవసరమైన అన్ని ఏర్పాట్లూ నేను చేస్తా. ఇందులో సాయంగా ఉంటా’నని చెప్పాడు. తర్వాత మేమిద్దరం వెళ్లి నేను మంకీ మాన్ కావడానికి అవసరమైన వస్తువులు అన్నీ కొనుక్కొచ్చాం. ఐదు రోజుల తర్వాత భావ్‌నగర్‌లో రథయాత్ర జరిగినప్పుడు అక్కడకు వెళ్లి మంకీ మాన్‌లా ప్రదర్శన ఇచ్చాను’’ అంటూ తను ఈ పని ఎలా మొదలు పెట్టిందీ వివరించారు.

‘‘మొదట మా ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. కానీ తర్వాత అంగీకరించారు. ఇప్పుడు కుటుంబ బాధ్యత అంతా నామీదే ఉంది’’ అని చెప్పారు.

మంకీ మ్యాన్

‘‘మొదట జనం నన్ను జాకీ అని పిలుచేవాళ్లు. కానీ ఇప్పుడు నన్ను మంకీ మాన్ అని పిలుస్తుంటారు. ఇప్పుడు నా గురించి చాలా మందికి తెలుసు. నా గురించి తెలియని వాళ్లు కూడా ఇప్పుడు నాకు గౌరవం ఇస్తున్నారు’’ అని జాకీ వాధ్వానీ తెలిపారు.

‘‘నేను ఏదైనా వేడుకలో మంకీ మాన్‌లా ఉన్నప్పుడు, అక్కడ పిల్లలు ఏదైనా అల్లరి చేస్తుంటే వాళ్ల అమ్మనాన్నలు నన్ను పిలుస్తారు. మొదట పిల్లలు నా వేషం చూసి భయపడతారు. తర్వాత మేం ఫ్రెండ్స్ అయిపోతాం. నా చేష్టలు చూసి అందరి ముఖాలపై చిరునవ్వు వస్తుంది.’’

జనం నా టాలెంట్‌ను గౌరవిస్తారు. గుజరాత్‌లో ప్రదర్శన ఇవ్వాలంటే నేను ఒక ప్రోగ్రాంకు 5 వేలు నుంచి 6 వేలు తీసుకుంటాను. బయట ప్రోగ్రామ్స్ అయితే దానికి డబుల్ తీసుకుంటాను. నేను ఒక సెలబ్రిటీ కావాలనుకుంటున్నా. ఏదో ఒక రోజు ఆ స్థాయికి చేరుకుంటానని అనిపిస్తోంది’’ అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)